
చైనా ఖనిజ ఎగుమతుల నిషేధంపై నిపుణులు
అమెరికా రక్షణ వ్యవస్థపై పెను ప్రభావం
అరుదైన ఖనిజాల ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతం.
కానీ దేశీయ, ముఖ్యంగా రక్షణ అవసరాలను తీర్చేందుకు ఆ నిల్వలు ఏ మూలకూ చాలవు. మలేసియా, జపాన్ సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా అవి 30 శాతం అవసరాలనే తీర్చగలుగుతున్నాయి. దాంతో మరో దారిలేక అగ్ర రాజ్యం ఇంతకాలంగా చైనా దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడుతూ వస్తోంది. తన అరుదైన ఖనిజ అవసరాల్లో 70 శాతం అక్కడినుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా ఇప్పుడు సరిగ్గా గురి చూసి ఆ కీలకమైన సరఫరా లింకును మొత్తానికే తెగ్గొట్టింది.
17 రకాల అరుదైన ఖనిజాల్లో సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం రూపంలో ప్రస్తుతానికి ఏడింటికి ఎగుమతుల నిషేధాన్ని వర్తింపజేసింది. వీటితో పాటు పలు కీలక లోహాలు, అయస్కాంత వస్తువులను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇకపై చైనా కంపెనీలు వీటిని ఎగుమతి చేయాలంటే ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిందే. చైనా నిర్ణయం పలు అమెరికానే గాక చాలా దేశాలనూ ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా యూరప్ దేశాలకైతే పిడుగుపాటే. వాటి అరుదైన ఖనిజాల అవసరాల్లో సగటున 46 శాతం దాకా చైనా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి.
అనుమానమే నిజమైంది
అత్యంత కీలకమైన ఖనిజ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా రక్షణ శాఖ ముందునుంచీ మొత్తుకుంటూనే ఉంది. ఇది జాతీయ భద్రతకే ముప్పని 2024 మార్చి 11న అధ్యక్షునికి పంపిన ఓ నోట్‌లో స్పష్టంగా పేర్కొంది కూడా. ఈ విషయంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలావరకు చైనామీదే ఆధారపడాల్సి రావడంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఆ భయాలే ఇప్పుడు నిజమయ్యాయి. రక్షణ పాటవం పెంచుకోవడంలో అమెరికా, చైనా కొన్నేళ్లుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.
కీలక ఖనిజాలపై ఆంక్షలతో ఈ పోటీలో అగ్ర రాజ్యాన్ని దాటి చైనా దూసుకెళ్లేలా కన్పిస్తోంది. ఈ సమస్యను అధిగమించే మార్గాలపై అమెరికా రక్షణ శాఖ కొంతకాలంగా గట్టిగా దృష్టి సారించింది. దేశీయంగా అరుదైన ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంచుకునేలా ‘మైన్ టు మాగ్నెట్’ పేరిట ఐదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఆలోగా జరిగే అపార నష్టాన్ని భర్తీ చేసుకునే మార్గాంతరాలు కన్పించక ట్రంప్ సర్కారు తలపట్టుకుంటోంది.

అన్నింట్లోనూ అవే కీలకం
ఫైటర్ జెట్లు మొదలుకుని కీలకమైన రక్షణ వ్యవస్థలన్నింట్లోనూ అరుదైన ఖనిజాలది కీలక పాత్ర. ఎఫ్–35 యుద్ధ విమానాలు, వర్జీనియా–కొలంబియా శ్రేణి జలాంతర్గాములు, తోమహాక్ క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, ప్రిడేటర్ శ్రేణి మానవరహిత వైమానిక వాహనాలు, మ్యునిషన్ సిరీస్ స్మార్ట్ బాంబులు... ఇలా దేని తయారీకైనా అవి కావాల్సిందేనని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వివరించింది.
⇒ ఒక ఎఫ్–35 యుద్ధ విమానం తయారీకి 900 పౌండ్ల (400 కిలోల) మేరకు అరుదైన ఖనిజాలు కావాలి.
⇒ అర్లే బ్రూక్ శ్రేణి డీడీజీ–51 డిస్ట్రాయర్ యుద్ధనౌక తయారీకి ఏకంగా 5,200 పౌండ్లు (2,300 కిలోలు) అవసరం.
⇒ అదే వర్జీనియా శ్రేణి జలాంతర్గామి నిర్మాణానికి 9,200 పౌండ్ల (4,173 కిలోల) అరుదైన ఖనిజాలు అవసరం.
ఆందోళనకరమే
⇒ ఖనిజాలపై చైనాతో చర్చిస్తాం
⇒ ట్రంప్ ఆర్థిక సలహాదారు
వాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, కీలక లోహాలు, అయస్కాంత పదార్థాల ఎగుమతులను నిలిపేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశమేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హసెట్ అంగీకరించారు. సోమవారం ఆయన వైట్‌హౌస్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ అరుదైన ఖనిజాల అవసరం రక్షణ, టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు చాలా ఉంటుంది.
చైనా నిర్ణయాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఈ విషయమై మాకు అందుబాటులో ఉన్న అన్ని ఇతర అవకాశాలనూ పరిశీలిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. బహుశా డ్రాగన్ దేశంతో తాము చర్చలు జరిపే అవకాశాలు లేకపోలేదన్నారు. చైనా నిర్ణయంతో పలు యూరప్ దేశాల్లో కూడా ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు తదితర కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుతుందన్న వాదనను హసెట్ తోసిపుచ్చారు. అమెరికా, చైనా మధ్య తీవ్రస్థాయి టారిఫ్‌ల పోరు సాగుతున్న విషయం తెలిసిందే.