Department of Defense
-
దామగుండం.. రాడార్ గండం!
సాక్షి, హైదరాబాద్: దామగుండం.. అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణం ప్రతిపాదనతో ఈ ప్రాంతం వార్తలకెక్కింది. తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందని, అడవుల విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీనే దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని సమాచారం. ఔషధ మొక్కలకు నిలయం.. వందల ఏళ్ల ఆలయం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్టు పచ్చని చెట్లతో జీవవైవిధ్యానికి మారుపేరుగా ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలకు జీవనాధారంగా, జంతు జాతులు, పక్షులకు ఆలవాలంగా ఉంది. దాదాపు 206 రకాల జాతుల పక్షులకు ఈ అడవులు నెలవుగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలకు ఈ అడవి నిలయం. ఈ అడవుల మధ్యలోనే 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇలవేల్పుగా రామలింగేశ్వరుని కొలుస్తున్నారు. అడవి మధ్యలో దేవాలయానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. కాగా రాడార్ నిర్మాణం కోసం.. ఈ అడవుల్లోని 2,900 ఎకరాల భూమిని నావికాదళం అధికారులు స్వా«దీనం చేసుకోనున్నారు. అయితే ఈ క్రమంలో 12 లక్షల చెట్లను నరికివేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీపంలో ఉన్న హైదరాబాద్‌కూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, పశు పక్షాదులకు నిలువ నీడ లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇక రాడార్ చుట్టూ కంచె వేస్తే తాము ఆలయానికి వెళ్లి పూజలు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. తమ అడవిలో తాము పరాయివారిగా మారుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేమిటీ నేవీ రాడార్? నౌకలు, జలాంతర్గాముల (సబ్మెరైన్ల)తో సమాచార మార్పిడిని (కమ్యూనికేషన్) మెరుగుపరుచుకునేందుకు నావికాదళం వెరీ లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్లను నిర్మిస్తుంది. దామగుండం సముద్రమట్టానికి 460 మీటర్ల ఎత్తులో ఉన్నందున శత్రు దేశాల కళ్లు కప్పి సమాచార మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుందని, వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం ఎంతో అనుకూలమైనదని నేవీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో తమిళనాడులోని తిరునల్వేలిలో కట్ట»ొమ్మన్ రాడార్ స్టేషన్ మాత్రమే ఉంది. దీన్ని 1990లో నిర్మించారు. వాస్తవానికి దామగుండంలో రెండో స్టేషన్ నిర్మించాలని ఏళ్ల క్రితమే నిర్ణయించినా ముందుకుసాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే కాకుండా ఇందుకోసం తూర్పు నావికాదళానికి కావాల్సిన 2,900 ఎకరాల భూమిని బదలాయించేందుకు అంగీకరించింది. ఈ స్టేషన్‌ను 2027 నాటికి పూర్తి చేయాలని నేవీ భావిస్తోంది. రాడార్ నిర్మాణంతో పాటు ఇక్కడ దాదాపు 3 వేల మంది నివాసం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. రేడియేషన్ ముప్పు ఉండదంటున్న శాస్త్రవేత్తలు సాధారణంగా రాడార్ వ్యవస్థ చాలా తక్కువ (3– 30 కిలోహెడ్జ్) రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. పైగా ఇక్కడ దాదాపు 450 మీటర్ల ఎత్తు టవర్లు ఉంటాయని, వీటివల్ల చుట్టుపక్కల ఉండే ఏ వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని రక్షణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర జలాల గుండా చొచ్చుకుపోయే ఫ్రీక్వెన్సీ తరంగాల ఆధారంగా సబ్ మెరైన్లలోని సిబ్బందితో సమాచార మార్పిడి జరుగుతుందని పేర్కొంటున్నారు. 12 లక్షల చెట్లు తొలగింపు అవాస్తవం! ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆటవీ శాఖ అధికారులు మాత్రం ఇది అవాస్తవం అంటున్నారు. నేవీకి అప్పగించే భూమిలో చాలావరకు చిన్న పొదలు, ఖాళీ ప్రదేశం మాత్రమే ఉందని, దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోరని చెబుతున్నారు. కేవలం 1.5 లక్షల చెట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు ఫారెస్టు శాఖ అంచనా వేస్తోంది. రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రాంతం, ఇతర నిర్మాణాలు చేపట్టే ప్రదేశాల్లో మాత్రమే చెట్లను తొలగిస్తారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా 17.5 లక్షల మొక్కలు నాటేందుకు ఆటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అరుదైన జాతులు కనుమరుగు దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంతో అడవుల్లో పచ్చదనం పోతుంది. అరుదైన జంతు జాతులు కనుమరుగవుతాయి. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. చెట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో లక్షలాది చెట్లను నరికేయడం చాలా దారుణం. సమీపంలోని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వాతావరణం కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలించాలి. – రుచిత్ ఆశ కమల్, క్లైమేట్ ఫ్రంట్ ఇండియా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మాకెవరూ సహకరించడం లేదు. అసలు రాడార్ స్టేషన్‌తో ఎలాంటి పరిణామాలు ఉంటాయో సరిగ్గా అవగాహన కల్పించే వాళ్లు కూడా లేరు. దీంతో అది నిర్మించిన తర్వాత నిజంగా ఏం జరుగుతుందో తెలియట్లేదు. – పి.వెంకట్‌రెడ్డి, పూడూరు గ్రామవాసి -
‘ఐఎన్ఎస్ సంధాయక్’ జాతికి అంకితం
సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్‌గా భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుకోవడంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ సంధాయక్ సహాయపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐఎన్ఎస్ సంధాయక్’ను శనివారం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్‌తో కలిసి రాజ్‌నాథ్ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘దేశీయంగా తయారు చేస్తున్న నాలుగు భారీ సర్వే వెసల్స్‌లో సంధాయక్ మొదటిది. భారత నౌకాదళానికి ఇదొక చరిత్రాత్మక దినం. దేశీయంగా యుద్ధనౌకల తయారీలో చరిత్ర సృష్టించాం. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సంధాయక్ ఉపయోగపడుతుంది. ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్రపు దొంగల బారి నుంచి కాపాడిన ఘనత భారత నౌకాదళం సొంతం. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు మన నౌకాదళం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఒకప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి.. నేడు ప్రపంచ దేశాలకు రక్షణ కల్పించేస్థాయికి భారత్ ఎదిగింది. స్నేహపూర్వక దేశాలను కూడా రక్షించుకునే సామర్థ్యం భారత్ సొంతం. హిందూ మహా సముద్రంలో పెద్ద మొత్తంలో అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతున్న నేపథ్యంలో సముద్రపు దొంగల బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. సముద్రపు దొంగలను ఎట్టి పరిస్థితిలోనూ సహించం. భారత సముద్ర జలాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఇటీవల పలువురు మత్స్యకారులు, మెరైన్లను రక్షించడంతో పాటు దాడులకు గురైన నౌకలకు సాయం అందించిన భారత నౌకాదళాన్ని రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్, కలెక్టర్ డా.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సంధాయక్ షిప్ విశేషాలు ► నాలుగు భారీ సర్వే వెసల్స్ నిర్మాణంలో భాగంగా 2019లో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ)లో ఐఎన్ఎస్ సంధాయక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ► 2021 నాటికి నౌక నిర్మాణం పూర్తయింది. 2023 డిసెంబర్ 4న భారత నౌకాదళానికి షిప్‌ని అప్పగించారు. ► దీని పొడవు 110 మీటర్లు. వెడల్పు 16 మీటర్లు. బరువు 4,130 టన్నులు. ప్రయాణ వేగం గంటకు 18 నాటికల్ మైళ్లు. ► 3.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంది. ► 80 శాతానికి పైగా దేశీయ సాంకేతిక సామర్థ్యంతో రూపుదిద్దుకున్న యుద్ధనౌక ఇది. ► సముద్ర జలాలు, అంతర్జాతీయ ప్రాదేశిక సరిహద్దులు నిర్ణయించేందుకు ఈ నౌకను వినియోగించనున్నారు. ► ఇతర దేశాల నౌకల మ్యాపింగ్‌లో కీలకపాత్ర పోషించనుంది. ► అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, సర్వే మోటర్ బోట్స్, డిజిటల్ సైడ్ స్కానర్ సోనార్, రిమోట్ ఆపరేటింగ్ వెహికల్స్ ఇందులో ఉంటాయి. ► సముద్రగర్భంలో వెయ్యి మీటర్ల లోతులో అతి సున్నితమైన, కీలకమైన సూక్ష్మ సమాచారాన్ని గ్రహించగల సామర్థ్యంగల పరికరాలు అమర్చారు. ► అండర్ వాటర్ వెహికల్స్, వెపన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ► సముద్రజలాల సర్వే మ్యాప్ కోసం అవసరమైన మల్టీ బీమ్ ఎకో సౌండర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ► అత్యవసర సమయాల్లో పరిమిత సౌకర్యాలతో హాస్పిటల్ షిప్గాను సేవలందించగలదు. ► పరిశోధన, రెస్క్యూ, డిజాస్టర్ రిలీఫ్ పాత్రల్ని కూడా సంధాయక్ సులువుగా నిర్వర్తించగలదు. ► సంధాయక్ నౌకకు మొదటి కమాండింగ్ అధికారి కెప్టెన్ ఆర్.ఎం.థామస్. దేశీయంగానే సబ్మెరైన్ల తయారీ అంతర్జాతీయ, దేశీయ జలాల మ్యాపింగ్‌లో సంధాయక్ కీలక పాత్ర పోషించనుంది. హైడ్రోగ్రాఫిక్ సహాయకారిగా అంతర్జాతీయ నౌకలకు కూడా ఇది ఉపయోగపడాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం. హిందూ మహాసముద్రంలో శాంతి పరిరక్షణే మన ప్రధానమైన లక్ష్యం. 66 షిప్‌లు, సబ్మెరైన్లలో దేశీయంగానే 64 తయారు చేస్తున్నాం.– అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఇండియన్ నేవీ చీఫ్ -
రష్యా రక్షణ శాఖ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వంలోని మరో ఉద్యోగిని అనుమానాస్పదంగా మృతి చెందారు. రక్షణ శాఖలో పని చేస్తున్న 58 ఏళ్ల మరీనా యాంకినా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అపార్ట్మెంట్లో 16వ అంతస్తులో ఉన్న తన నివాసం కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రమాదవశాత్తూ పడిపోయారా, ఆత్మహత్య చేసుకున్నారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. 160 అడుగుల ఎత్తు నుంచి కిండ పడిపోవడంతో ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయారు. రక్తపు మడుగులో ఉన్న మరీనాను ఆ మార్గం నుంచి వెళుతున్న వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌పై జరిపే యుద్ధంలో నిధుల సేకరణలో మరీనా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
కంటోన్మెంట్ విలీనంపై కమిటీ
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతిపాదన దశలోనే ఉన్న ప్రతిపాదన విధి, విధానాల రూపకల్పనకు ఎనిమిది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విలీన ప్రక్రియ కొనసాగనుంది. రక్షణ శాఖ జాయింట్ సెక్రెటరీ, అడిషనల్ పైనాన్షియల్ అడ్వైజర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ సెక్రెటరీ, డిఫెన్స్ ఎస్టేట్స్ అడిషనల్ డీజీ, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ డీజీ, డిఫెన్స్ ఎస్టేట్స్ సదరన్ కమాండ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఫిబ్రవరి 4వ తేదీలోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఎంఓడీ ప్రతిపాదనకు అనుగుణంగా.. కంటోన్మెంట్ పరిధిలోని సివిల్ ఏరియాలను ఆర్మీ నుంచి విడదీసి సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసుకోవాల్సిందిగా కోరుతూ గతేడాది మే 23న రక్షణ మంత్రిత్వ శాఖకు ఆర్మీ ప్రతిపాదన పంపింది. తదనుగుణంగా రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా, సివిల్ ఏరియాలను తమ పరిధిలోనికి తీసుకునేందుకు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ తన అంగీకారం తెలుపుతూ గత నెల 14న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 9న తొలి సమావేశం విలీనంపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం ఈ నెల9న వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరగనుంది. కంటోన్మెంట్ పరిధిలోని భూములు, స్థిర, చరాస్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కంటోన్మెంట్ నిధులు, పౌర సేవలు, రోడ్లు, ట్రాఫిక్, రికార్డులు, స్టోర్ తదితర అన్ని రకాల బదలాయింపుపై రోడ్‌మ్యాప్ రూపొందించనుంది. కమిటీ తొలి భేటీకి ముందే రక్షణ మంత్రిత్వ శాఖ ఓ కీలక ఆదేశాన్ని కమిటీ ముందు ఉంచనున్నట్లు తెలిసింది. ఇప్పటికంటే కూడా కఠినమైన నిబంధనలు? మిలటరీ శిక్షణ కేంద్రాలు, కార్యాలయాలు, స్థలాలకు 500 మీటర్ల పరిధిలో నిర్మాణాలకు సంబంధించి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ పరిధిలోని నిర్మాణాల విషయంలో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. కంటోన్మెంట్లో మాత్రం మినహాయింపు ఉంది. తాజాగా కంటోన్మెంట్‌లోని సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలపనుండటంతో 500 మీటర్ల నిబంధనను ఇక్కడ కూడా అమలు చేస్తామంటూ ఆర్మీ ముందస్తుగానే ప్రకటించింది. దీనికి తోడు ఆర్మీ స్థావరాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలను అనుమతించబోమని కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికంటే కూడా కఠినమైన నిబంధనలు అమలయ్యే అవకాశముంది. వికాస్ మంచ్ హర్షం.. బాణసంచా కాల్చి సంబురాలు కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల కంటోన్మెంట్ వికాస్ మంచ్ (సీవీఎం) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీవీఎం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం ఏబెల్, సంకి రవీందర్ ఆధ్వర్యంలో పికెట్ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీవీఎం సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. -
2న నేవీలోకి ఐఏసీ విక్రాంత్
కొచ్చి: మొట్టమొదటిసారిగా దేశీయంగా నిర్మించిన విమానవాహక నౌక(ఐఏసీ)ని సెప్టెంబర్ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్(సీఎస్ఎల్)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధాని మోదీ నావికాదళంలోకి విక్రాంత్‌ను అధికారికంగా ప్రవేశపెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రథమ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ రిటైర్డు సిబ్బంది, నౌకా నిర్మాణ, రక్షణ శాఖల అధికారులు మొత్తం 2,000 మంది వరకు పాల్గొంటారని చెప్పారు. రూ.20వేల కోట్లతో నిర్మించిన ఈ నౌకను జూలై 28న సీఎస్ఎల్ నేవీకి అప్పగించిన విషయం తెలిసిందే. -
Predator drone deal: అమెరికా నుంచి అత్యాధునిక డ్రోన్లు
న్యూఢిల్లీ: అమెరికా నుంచి అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం రూ.300 కోట్ల విలువైన 30 ఎంక్యూ–9బీ డ్రోన్లు అందితే వీటిని చైనా సరిహద్దులతోపాటు హిందూమహా సముద్రం ప్రాంతంపై నిఘాకు వినియోగించనున్నట్లు వెల్లడించాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ ఆధునిక వెర్షనే ఎంక్యూ–9బీ. గత నెలలో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఇంట్లో ఉన్న అల్‌ఖైదా నేత అల్ జవహరిని హతమార్చేందుకు వాడింది ఎంక్యూ–9 రీపర్ డ్రోన్‌నే కావడం గమనార్హం. జనరల్ ఆటమిక్స్ అభివృద్ధి చేసిన ఎంక్యూ–9 బీ ప్రిడేటర్ల కోసం రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు తుది దశకు వచ్చాయన్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రస్తుతం చర్చలు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశాయి. వీటి ఖరీదు,, ఆయుధాల ప్యాకేజీ, సాంకేతికత భాగస్వామ్యానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలు నడుస్తున్నాయని తెలిపాయి. ఇదే విషయాన్ని జనరల్ ఆటమిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ వివేక్ లాల్ కూడా ధ్రువీకరించారు. చర్చల వివరాలను రెండు దేశాల ప్రభుత్వాలే వెల్లడిస్తాయన్నారు. ఎంక్యూ–9బీ గార్డియన్ రకం రెండు డ్రోన్లను 2020 నుంచి భారత్ తమ నుంచి లీజుకు తీసుకుని భూ సరిహద్దులు, హిందూ మహాసముద్రంపై నిఘాకు వినియోగిస్తోందన్నారు. ఈ హంటర్–కిల్లర్ డ్రోన్లు 450 కిలోల బరువైన బాంబులతోపాటు నాలుగు హెల్ఫైర్ క్షిపణులను మోసుకెళ్లగలవు. -
ఆత్మనిర్భర్ భారత్‌కు ఐఐసీటీ సాయం
సాక్షి, హైదరాబాద్: దేశం ఆత్మనిర్భరత సాధించే విషయంలో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) గణనీయమైన సాయం చేస్తోందని డీఆర్డీవో చైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ టీకాలకు అవసరమైన కీలక రసాయనాలు మొదలుకొని అనేక ఇతర అంశాల్లోనూ విదేశాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని ఐఐసీటీ తప్పించిందని ఆయన అన్నారు. ఐఐసీటీ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సతీశ్‌రెడ్డి దేశం ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరాన్ని... అందుకు చేస్తున్న ప్రయత్నాలను సోదాహరణంగా వివరించారు. ప్రభుత్వం ప్రకటించక ముందు కూడా ఐఐసీటీ పలు అంశాల్లో రక్షణ శాఖ అవసరాలను తీర్చిందని ఆయన గుర్తుచేశారు. నావిగేషనల్ వ్యవస్థల్లో కీలకమైన సెన్సర్ల విషయంలో దేశం స్వావలంబన సాధించడం ఐఐసీటీ ఘనతేనని కొనియాడారు. ప్రస్తుతం అత్యాధునిక బ్యాటరీలు, ఎలక్ట్రోడ్లు, ఎలక్ట్రోలైట్ల విషయంలోనూ ఇరు సంస్థలు కలసికట్టుగా పనిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌కు ముందు దేశంలో ఏడాదికి 47 వేల పీపీఈ కిట్లు మాత్రమే తయారయ్యేవని.. ఆ తరువాత కేవలం నెల వ్యవధిలోనే ఇది రోజుకు 6 లక్షలకు పెరిగిందని చెప్పారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ తయారీ విషయాల్లోనూ ఇదే జరిగిందని, అనేక సృజనాత్మక ఆవిష్కరణల కారణంగా దేశం వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతోపాటు ఉత్పత్తి చౌకగా జరిగేలా కూడా చేశామని వివరించారు. డిజైన్‌తో మొదలుపెట్టి... ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారం కావాలంటే దేశానికి అవసరమైనవన్నీ ఇక్కడే తయారు కావాలని డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ ఉత్పత్తుల డిజైనింగ్ మొదలుకొని అభివృద్ధి వరకు అవసరాలకు తగ్గట్టుగా భారీ మోతాదుల్లో వాటిని తయారు చేయగలగడం, ఆధునీకరణకు కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడం కూడా ఆత్మనిర్భర భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. అతితక్కువ ఖర్చు, మెరుగైన నాణ్యత కూడా అవసరమన్నారు. అదే సమయంలో దేశం కోసం తయారయ్యేవి ప్రపంచం మొత్తమ్మీద అమ్ముడుపోయేలా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం కారణంగా ఇప్పుడు దేశంలోని యువత రాకెట్లకు అవసరమైన ప్రొపల్షన్ టెక్నాలజీలు, గ్రహగతులపై పరిశోధనలు చేస్తున్నాయని... స్టార్టప్ కంపెనీలిప్పుడు దేశంలో ఓ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయని ప్రశంసించారు. సృజనాత్మక ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద అన్ని రకాల మద్దతు లభిస్తోందన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, మాజీ డైరెక్టర్లకు ఏవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఐఐసీటీలో ప్రతిభ కనపరిచిన సిబ్బంది, శాస్త్రవేత్తలకు మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అవార్డులు అందజేశారు. -
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. దాదాపు నెల రోజుల యుద్ధంలో ప్రధానంగా ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్ తాజాగా రష్యా దళాలపై ఎదురుదాడికి దిగుతోంది! మంగళవారం హోరాహోరీ పోరులో రాజధాని కీవ్ శివార్లలో వ్యూహాత్మకంగా కీలకమైన మకరీవ్ నుంచి రష్యా సేనలను వెనక్కు తరిమి దాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో కీలకమైన స్థానిక హైవేపై ఉక్రెయిన్ సైన్యానికి తిరిగి పట్టు చిక్కింది. వాయవ్య దిక్కు నుంచి కీవ్‌ను చుట్టముట్టకుండా రష్యా సైన్యాన్ని అడ్డుకునే వెసులుబాటు కూడా దొరికింది. అయితే బుచా, హోస్టొమెల్, ఇర్పిన్ తదితర శివారు ప్రాంతాలను మాత్రం రష్యా సైన్యం కొంతమేరకు ఆక్రమించగలిగిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ పేర్కొంది. ఎలాగోలా కీవ్‌ను చేజిక్కించుకునేందుకు యుద్ధం మొదలైనప్పటి నుంచీ రష్యా విశ్వప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం కూడా బాంబు, క్షిపణి దాడులతో కీవ్, శివార్లు, పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూను బుధవారం దాకా పొడిగించారు. మారియుపోల్‌లో వినాశనం కీలక రేవు పట్టణం మరియుపోల్‌లో రష్యా గస్తీ బోటును, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. నగరాన్ని ఆక్రమించేందుకు రష్యా సైన్యాలు చేస్తున్న ప్రయత్నాలను నిరంతరం తిప్పికొడుతున్నట్టు చెప్పింది. నగర వీధుల్లో శవాలు గుట్టలుగా పడున్నాయని నగరం నుంచి బయటపడ్డ వాళ్లు చెప్తున్నారు. మారియుపోల్‌లోనే కనీసం 10 వేల మందికి పైగా పౌరులు మరణించి ఉంటారని భావిస్తున్నారు! మూడో వంతుకు పైగా ప్రజలు ఇప్పటికే నగరం వదిలి పారిపోయారు. ప్రధానంగా నగరాలే లక్ష్యంగా రష్యా సేనలు వైమానిక, భూతల దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. అయితే రష్యా సేనలకు ఎక్కడికక్కడ తీవ్ర ప్రతిఘటనే ఎదురవుతోంది. ఉక్రెయిన్ సేనలు మెరుపుదాడులతో వాటిని నిలువరిస్తున్నాయి. యుద్ధం వల్ల ఇప్పటికే కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. దేశ జనాభాలో ఇది దాదాపు నాలుగో వంతు. వీరిలో కనీసం 40 లక్షలకు పైగా దేశం వీడారు. యుద్ధాన్ని నివారించేందుకు తమతో కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. తాజా పరిస్థితిపై నేతలిద్దరూ ఫోన్లో చర్చించారు. రష్యా గెలుపు అసాధ్యమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఈ సమస్యకు చర్చలతో మాత్రమే పరిష్కారం సాధ్యమన్నారు. ఉక్రేనియన్లు నరకం చవిచూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రష్యా గ్యాస్ వదులుకోలేం: జర్మనీ రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నా, ఆ దేశం నుంచి ఇంధన సరఫరాలను వదులుకోలేమని జర్మనీ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ వైఖరిలో ఏ మార్పూ లేదని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మంగళవారం చెప్పారు. పలు యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌పై తమకంటే ఎక్కువగా ఆధారపడ్డాయన్నారు. తమ ఇంధన అవసరాలను ఇతర మార్గాల్లో తీర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశామని చెప్పారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో కలిసి రష్యాను కఠినాతి కఠినమైన ఆంక్షలతో ఇప్పటికే కుంగదీస్తున్నామని గుర్తు చేశారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో దాదాపు సగం రష్యానే తీరుస్తున్న విషయం తెలిసిందే. -
కేంద్రం అనుమతి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రక్షణ శాఖకు చెందిన భూముల్లో కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా వాటి జోలికి వెళ్లడానికి వీల్లేదని, నిర్మాణాలు చేపట్టరాదని తేల్చిచెప్పింది. సికింద్రాబాద్ బైసన్ పోలో, జింఖానా మైదానంలో సచివాలయం, ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ డీజీపీ ఎంవీ భాస్కర్‌రావుతో పాటు మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. అయితే ప్రస్తుతం సచివాలయం ఉన్న ప్రాంతంలోనే నూతన సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, బైసన్ పోలో, జింఖానా మైదానంలో నిర్మాణాలు చేపట్టాలన్న ప్రతిపాదనను ఉపసంహరించు కుందని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది. హైకోర్టు భవనాలకు మాత్రం నిధుల్లేవా? ‘సచివాలయం నిర్మాణానికి నిధులుంటాయి. హైకోర్టులో అదనపు భవనాల నిర్మాణానికి మాత్రం నిధులు లేవా? నూతనంగా వస్తున్న న్యాయమూ ర్తులకు కోర్టు హాళ్లు, చాంబర్లు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏజీ, బార్ కౌన్సిల్ కార్యాలయాలను కూడా ఖాళీ చేయించాల్సి ఉంటుంది..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో 100 ఎకరాల భూమి కేటాయించిందని, అయితే అక్కడ నిర్మాణాలకు హైకోర్టు సుముఖంగా లేదని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. -
నేవీ కొత్త చీఫ్‌గా హరికుమార్
న్యూఢిల్లీ: భారత నావికాదళం కొత్త అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ మంగళవారం తెలిపింది. హరికుమార్ ప్రస్తుతం వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్‌గా ఉన్నారు. ఈనెల 30వ తేదీన రిటైర్ కానున్న నేవీ ప్రస్తుత అధిపతి, అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి అదే రోజు మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. కేరళకు చెందిన హరికుమార్కు కమాండ్, స్టాఫ్, ఇన్స్ట్రక్షనల్ సంబంధ విధుల్లో దాదాపు 39 ఏళ్ల అనుభవం ఉంది. -
భోగాపురానికి విశాఖ ఎయిర్‌పోర్టు
సాక్షి, విశాఖపట్నం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమయ్యాక విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయాన్ని అక్కడకు తరలిస్తామని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్టును తరలించిన అనంతరం ఆ స్థలాన్ని తిరిగి రక్షణ శాఖకు అప్పగిస్తామన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. సీ పోర్టు నుంచి భీమిలి వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలోనూ, భీమిలి నుంచి భోగాపురం వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) పర్యవేక్షణలో రహదారి నిర్మాణం చేపడతామన్నారు. రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ భూముల్నే ఎక్కువగా వినియోగించుకుంటామని.. అవసరమైతే తప్ప ప్రైవేట్ భూములు సేకరించకూడదని భావిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో గరిష్ట వేగం తగ్గేలా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక నగర పరిధిలో 70 మీటర్లు, నగరం దాటిన తర్వాత 70కి పైగా రహదారి వెడల్పు ఉంటుందని వివరించారు. రహదారి నిర్మాణంలో భాగంగా వాకింగ్, సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. న్యాయస్థానంలో కేసులు కొలిక్కి రాగానే ఎయిర్‌పోర్టు, రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
Agni-Prime: భారత దేశ సరికొత్త ఆయుధం ఇదే!
‘‘పిట్ట కొంచెం.. కూత ఘనం’’ ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ద్వీపంలో సోమవారం... నిప్పులు చిమ్ముకుంటూ పైకెగసిన క్షిపణి ‘‘అగ్ని–ప్రైమ్’’... ఈ సామెతకు ప్రత్యక్ష ఉదాహరణ. చిన్న సైజులో ఉండటం మాత్రమే దీని విశేషం కాదు... అత్యాధునిక టెక్నాలజీలు నింపుకుని... తొలి అగ్ని క్షిపణికి రెట్టింపు దూరపు లక్ష్యాలనూ తుత్తునియలు చేయగలదు!! భారత రక్షణ తూణీరపు సరికొత్త ఆయుధం కూడా ఇదే!! భారతదేశం తనకంటూ సొంతంగా క్షిపణులు ఉండాలని 1980లలోనే భావించి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మాజీ రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలామ్ నేతృత్వంలో మొదలైన ఈ కార్యక్రమం తొలి ఫలం ‘‘అగ్ని’’. సుమారు 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి తరువాత దశల వారీగా మరిన్ని అగ్ని శ్రేణి క్షిపణుల తయారీ జరిగింది. అయితే, ఆ కాలం నాటి టెక్నాలజీలతో పనిచేసే క్షిపణులను ఈ 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్చుకోవాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఐదేళ్ల క్రితం చెప్పుకున్న సంకల్పానికి అనుగుణంగానే సరికొత్త అగ్ని–ప్రైమ్ సిద్ధమైంది. ఇరుగుపొరుగు దేశాలతో ముప్పు ఏటికేడు పెరిగిపోతున్న నేపథ్యంలో అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల అగ్ని–ప్రైమ్ మన అమ్ముల పొదిలోకి చేరడం విశేషం. తొలి తరం అగ్ని పరిధి 1,000 కిలోమీటర్ల లోపు కాగా.. అగ్ని–ప్రైమ్ సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో మట్టుబెట్టగలదు. ఇంకోలా చెప్పాలంటే తొలి తరం అగ్ని క్షిపణి పాకిస్తాన్‌ను దృష్టిలో ఉంచుకుని తయారైతే.. అగ్ని–ప్రైమ్ కొత్త శత్రువు కోసం సిద్ధం చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే.. 2,000 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటే.. చైనా మధ్యలో ఉండే లక్ష్యాన్ని కూడా ఢీకొట్టవచ్చు. కొంగొత్త టెక్నాలజీలు... అగ్ని శ్రేణి క్షిపణుల ఆధునీకరణకు 2016లోనే బీజం పడింది. ఇందులో భాగంగా సిద్ధమైన అగ్ని–ప్రైమ్‌లో అగ్ని–4, అగ్ని–5 క్షిపణుల్లో వాడిన టెక్నాలజీలను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈ స్థాయి క్షిపణుల్లో ఈ టెక్నాలజీల వాడకం ప్రపంచంలో మరెక్కడా జరగలేదని డీఆర్డీవో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. రెండు దశల అగ్ని–ప్రైమ్‌లో పూర్తిస్థాయిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దాదాపు వెయ్యి కిలోల అణ్వస్త్రాలను సులువుగా మోసుకెళ్లగలదు. రెండు దశల్లోనూ మిశ్రధాతువులతో తయారైన రాకెట్ మోటార్లను ఉపయోగిస్తున్నారు. క్షిపణిని లక్ష్యం వైపునకు తీసుకెళ్లే గైడెన్స్ వ్యవస్థలో ప్రత్యేకమైన ఎలక్ట్రో మెకానికల్ ఆక్చుయేటర్స్ వినియోగించారు. కచ్చితత్వాన్ని సాధించేందుకు అత్యాధునిక రింగ్ లేజర్ జైరోస్కోపులు ఉంటాయి దీంట్లో. ఉక్కుతో చేసిన మోటార్ల స్థానంలో మిశ్రధాతువులను వాడటం ద్వారా సైజు, బరువు తగ్గడం, మరింత ఎక్కువ దూరం ప్రయాణించడం సాధ్యమైంది. ఎలక్ట్రో మెకానికల్ ఆక్చుయేటర్స్ కారణంగా గతంలో మాదిరిగా క్షిపణుల్లో లీకేజీల్లాంటివి ఉండవు. నావిగేషన్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా లక్ష్యాన్ని ఢీకొట్టే అవకాశాలు పెరుగుతాయి. గతంలో మాదిరిగా వేర్వేరు వైమానిక వ్యవస్థల స్థానంలో పవర్ పీసీ ప్లాట్ఫార్మ్పై ఒకే ఒక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా క్షిపణిని మరింత శక్తిమంతంగా మార్చడం సాధ్యమైంది. ఈ టెక్నాలజీలన్నింటినీ 2011లో అభివృద్ధి చేసిన అగ్ని–4లో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసినవే. అగ్ని–2.... 2004లో అందుబాటు లోకి వచ్చింది. మధ్య శ్రేణి క్షిపణి. 20 మీటర్ల పొడవు, 2.3 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రయోగించే సమయంలో దీని బరువు 16 వేల కిలోలు. వెయ్యి కిలోల అణ్వస్త్రాన్ని క్షిపణిని మోసుకెళ్లగలదు. దీని పేలుడు హిరోషిమా, నాగసాకీ అణు బాంబుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని అంచనా. లక్ష్యాన్ని కేవలం 40 మీటర్ల తేడాలో ఢీకొట్టగలదు. పేలుడు పదార్థం బరువును తగ్గిస్తే ఈ క్షిపణి పరిధిని మరింతగా పెంచవచ్చు. అగ్ని –3... మూడు వేల నుంచి ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు అభివృద్ధి చేసిన క్షిపణి ఇది. బీజింగ్, షాంఘైలనూ ఢీకొట్టగలదు. దాదాపు 16.7 మీటర్ల పొడవు, 1.85 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రయోగించే సమయంలో బరువు 48,000 కిలోలు. రెండు వేల కిలోల బరువున్న అణ్వాస్త్రాన్ని మోసుకెళ్లగలదు. కొన్నింటిలో ఒకే రాకెట్ ద్వారా వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టగల మల్టిపుల్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్స్ టెక్నాలజీని అమర్చుకోవచ్చు. ఈ టెక్నాలజీతో ఒకే రాకెట్‌ను ఉపయోగించి వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టవచ్చు నన్నమాట. 2011 నుంచి దేశసేవకు అందుబాటులో ఉంది. అగ్ని–4... నుంచి అందుబాటులో ఉన్న అగ్ని–4 పరిధి 3,500– 4,000 కిలోమీటర్లు. ఇరవై నుంచి 45 కిలోటన్నుల పేలుడు సామర్థ్యమున్న ఫిషన్ అణ్వాయుధాన్ని, 200– 300 కిలోటన్నుల సామర్థ్యం ఉన్న ఫ్యూజన్ బాంబును మోసుకెళ్లగలదు. ఇరవై మీటర్ల పొడవుండే రెండు దశల ఘన ఇంధనపు క్షిపణి ప్రయోగ సమయంలో 17,000 కిలోల బరువు ఉంటుంది. అగ్ని – 5 2018 డిసెంబర్లో విజయవంతంగా ఏడో పరీక్ష ముగించుకున్న అగ్ని –5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా పది మీటర్ల తేడాతో ఢీకొట్టగలదు. దీని పరిధి అనధికారికంగా 8 వేల కిలోమీటర్లపై మాటే అని అంచనా. వేర్వేరు లక్ష్యాలను ఛేదించేందుకు ఎంఆర్ఐవీ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు దీంట్లో. అవసరాన్ని బట్టి రెండు నుంచి పది వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. దాదాపు 1,500 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. – సాక్షి, హైదరాబాద్. -
చరిత్రలో మరో ఘట్టం.. ఫలించిన ఎంపీ ప్రయత్నాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. విశాఖ నుంచి కార్గో విమానం రాకపోకలు సాగించడానికి ఎట్టకేలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. విశాఖ నుంచి ఈనెల 25 నాడు తొలిసారిగా కార్గో విమానం నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా విశాఖ నుంచి కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూరత్ తదితర ప్రాంతాలకు నడపడానికి స్పైస్ జెట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు ఆ సంస్థ కార్గో విమానాలు కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 15 నుంచి కార్గో విమానాలు విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడవవలసి ఉంది. కాని రక్షణ శాఖ మోకాలడ్డడంతో కార్గో విమాన సర్వీసుల ప్రతిపాదనకు ఆటంకం ఎదురైంది. విశాఖ నుంచి కార్గో విమాన సర్వీసులు ప్రారంభం కావాలని కొంతమంది వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం వివిధ విమాన సంస్థల ప్రతినిధులతో చర్చించి ఒప్పించింది. అందులో భాగంగా ఈనెల 15 నుంచి స్పైస్ జెట్ ఆధ్వర్యంలో కార్గో విమానాల సర్వీసుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే విశాఖలోని రక్షణ శాఖ అధికారుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో కార్గో విమాన సర్వీసుకు బ్రేక్ పడింది. దాంతో కార్గో సర్వీసుల నిర్వహణపై స్పైస్ జెట్ సంస్థ రక్షణశాఖ అధికారులకు లేఖ లేఖ రాసింది. స్పైస్ జెట్ కోరిన సమయాలను కేటాయించలేమని రక్షణ శాఖ అధికారులు స్పైస్ జెట్‌కు లేఖ రాసినట్టు విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 21న “సాక్షి’ పత్రికలో కార్గో సర్వీసుల ప్రతిపాదన నిలిచిపోయినట్టు వార్త వచ్చింది. దాంతో సమస్యను సంఘ ప్రతినిధులు కొందరు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దృష్టికి తీసుకొని వెళ్లారు. కల నిజమాయెగా.. ప్రస్తుతం కార్గో విమానాలు లేక వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ,రైల్వే రవాణా ద్వారా సరకులు నడుపుతున్నారు. కార్గో విమానాల కోసం ఫార్మాకంపెనీల దృష్టీ కేంద్రీకృతమైంది. కార్గో విమానాల రాకపోకల వల్ల ఆదాయం పెరుగుతుందని, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి సరకులు విశాఖకు తరలివచ్చే వీలుందన్న వాస్తవం కనిపిస్తోంది. విదేశీ మారక ద్రవ్యం కూడ వచ్చేఅవకాశం ఉందని, కార్గో విమానాల వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి కార్గో విమానాలు రావాల్సిన అవసరం వుందని చెబుతున్నారు.. కాని ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కె.కుమార్ రాజా, డి.ఎస్.వర్మ, ఒ.నరేష్కుమార్ పట్టువదలని విక్రమార్కుడి స్పూర్తితో అంతా కృషి చేశారు. ఈ విమానం నడపడానికి సహకారం అందించిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఇతర విమాన సంస్థలకు నరేష్కుమార్ కృతజ్ఙతలు తెలిపారు. ఫలించిన ఎంపీ ప్రయత్నం విశాఖ నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు కార్గో విమానాలు నడపాలని విశాఖ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఎంవివి సత్యనారాయణ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి గతంలో లేఖ రాశారు. అనంతరం కేంద్రమంత్రులను ఆయన కలిసి విమానాల కోసం చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా కార్యనిర్వహక రాజధాని ఏర్పాట్లు చేయడానికి పలు చర్యలు చేపట్టిందని, అలాగే దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఎయిర్ ట్రాఫిక్ 50 శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో తప్ప ఇతర సమయాల్లో విమానాలు రాకపోకలకు రక్షణ శాఖ అభ్యంతరం చెబుతుందని, దీనివల్ల అనేక విమాన సంస్ధలు సర్వీసులు నడపడానికి ఆసక్తి చూపడం లేదని ఎంపి లేఖలో పేర్కొన్నారు. సమాంతర టాక్సీ ట్రాక్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని,అలాగే కొత్తగా నిర్మించిన ఎన్5 టాక్సీ ట్రాక్‌ను అందుబాటులోకి తేవాలనికోరారు. ఇవీ వేళలు కార్గో విమానాలు విశాఖ నుంచి దేశంలో ముఖ్యమైన పట్టాణాలకు నడుపుతున్నారు. చెన్నై, కోల్‌కతా, సూరత్ తదితర ప్రాంతాలకు ఈనెల 25 నుంచి నడుపుతున్నారు. రోజు తప్పించి రోజు ఈ విమానాలు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11.50 గంటలకు విశాఖ వచ్చే విమానం, విశాఖ నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు బయలు దేరుతుంది. చెన్నై–వైజాగ్– కోల్‌కతా ఒక రూటు, చెన్నై– విశాఖ–సూరత్‌కు విమానాలు నడుపుతున్నట్టు సంఘం ప్రతినిధి నరేష్కుమార్ తెలిపారు. -
దేశ భద్రతకు భరోసా
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి.. డీఆర్డీవో చైర్మన్‌గా ఎదిగిన తెలుగుతేజం డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి.. రక్షణరంగంలో సాగుతున్న పరిశోధనల గురించి ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు.. సాక్షి: డీఆర్డీవో చీఫ్ అయ్యారు.... రక్షణ శాఖ (పరిశోధన, అభివృద్ధి) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. వృత్తిపరంగా మీ ప్రయాణం చూస్తుంటే... విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జర్నీ గుర్తుకొస్తోంది. శాస్త్రవేత్త నుంచి అత్యున్నత బాధ్యతలు మోస్తూ సాగుతున్న మీ ప్రయాణం ఎలా ఉంది? సతీష్‌రెడ్డి: డీఆర్డీవోకు కలాం గారు డైరెక్టర్‌గా ఉన్నప్పుడే నేను చేరాను. ఆయన నేతృత్వంలో ‘ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ కింద పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిసూల్, నాగ్ మిస్సైల్స్ రూపకల్పనలో నేను పాలుపంచుకోవడం భగవంతుడు ఇచ్చిన వరం. యువశాస్త్రవేత్తలకు కలాం గారి ప్రోత్సాహం అద్భుతం. సాక్షి: ‘ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలెప్మెంట్ ప్రోగ్రామ్’ను కలాం ప్రారంభించారు. మీ నేతృత్వంలో ఇంటర్ కాంటినెంటల్ మిస్సైల్‌ను అభివృద్ధి చేశారు. ఇలాంటి ల్యాండ్‌మార్క్ ప్రోగ్రామ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? సతీష్‌రెడ్డి: ‘మిషన్ శక్తి’ అలాంటిది. భూకక్ష్యలో తిరుగుతున్న మన శాటిలైట్ల భద్రతకు అవసరమైన ప్రాజెక్టు చేయమని ప్రధానమంత్రి సూచించారు. అందుకోసం యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేశాం. ఇలాంటి పరిజ్ఞానం, సామర్థ్యం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ‘గ్లోబల్ స్పేస్ పవర్’గా ఎదిగాం. రక్షణ రంగానికి సంబంధించి స్పేస్, సైబర్ రంగంలో విస్తృత పరిశోధనలు అవసరం. ‘ఫ్యూచర్ టెక్నాలజీస్’ను అభివృద్ధి చేయాలి. అండర్ వాటర్ వెహికల్స్, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది 5వ జనరేషన్ యుద్ధ విమానం. దీన్ని తయారు చేస్తే.. భారతదేశం యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సుదూరతీరంలోని చిన్న వస్తువును కూడా చూడగలిగిన రాడార్స్ తయారు చేయాలి. హైపర్ సానిక్ మిసైల్స్‌ను తయారు చేయనున్నాం. తేలికపాటి యుద్ధ విమానం మార్క్–2 పరిశోధన దశలో ఉంది. ఇవన్నీ ల్యాండ్‌మార్క్ కార్యక్రమాలే. సాక్షి: ‘మిషన్ శక్తి’తో దేశానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? సతీష్‌రెడ్డి: ప్రపంచ దేశాల్లో మన పట్ల గౌరవం, ఖ్యాతి పెరుగుతుంది. ఫలితంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించకుండా ఆపుదామనే ప్రయత్నాలు మానుకుంటాయి. అలాగే మన ఉపగ్రహాలకు హాని తలపెట్టేందుకు ఏ దేశమూ సాహసించదు. సాక్షి: రక్షణ రంగంలో నూరు శాతం స్వావలంబన జాతి ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దిశగా ప్రయత్నాలు... ప్రత్యేకించి మిస్సైల్ రంగంలో ప్రగతిని వివరించండి? సతీష్‌రెడ్డి: దిగుమతులు తగ్గించి స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రస్తుతం 45–50 శాతం మాత్రమే దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన వాటిని వాడుతున్నాం. దీన్ని 75–80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. వచ్చే 5–10 ఏళ్లలో ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సాక్షి: క్రిటికల్ కాంపోనెంట్స్‌కి ఇప్పటికీ విదేశాలపై ఆధారపడుతున్నాం. పూర్తిగా మనదేశంలో తయారయ్యే రోజు ఎప్పుడు వస్తుంది? సతీష్‌రెడ్డి: ఇప్పుడు మనం పెద్దగా ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. చాలా వరకు మనం ఉత్పత్తి చేస్తున్నాం. సెన్సర్స్, చిప్స్ మనం కొంత మేర తయారు చేసుకోగలుగుతున్నాం. అడ్వాన్స్డ్ సెన్సర్స్, చిప్స్ కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అవి కూడా మనమే తయారు చేసుకొనే రోజు దగ్గర్లోనే ఉంది. సాక్షి: మానవ రహిత యుద్ధ విమానం మన సైన్యానికి అందుబాటులోకి రావడానికి ఎంతకాలం పడుతుంది? సతీష్‌రెడ్డి: చాలా దేశాలు దీని మీద పరిశోధనలు చేస్తున్నాయి. మనం ఇంకా దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం అనుమతి ఇస్తే.. డీఆర్డీవో పరిశోధనలు ప్రారంభిస్తుంది. పరిశోధన మొదలు పెడితే... తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సాక్షి: భవిష్యత్తులో మన సైన్యానికి అందనున్న ఆయుధాలు ఏమిటి? సతీష్‌రెడ్డి: ప్రపంచంలోనే లాంగెస్ట్ రేంజ్ గన్ మనం తయారు చేశాం. దీన్ని ‘అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్’ అంటారు. 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. 155 ఎంఎం క్లాస్ గన్‌లో ఇదే పెద్దది. త్వరలో దీన్ని సైన్యానికి అందిస్తాం. అండర్‌వాటర్ వెహికల్స్, తేలికపాటి యుద్ధ విమానాలు, సరికొత్త టెక్నాలజీ ట్యాంకులు, లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం. సాక్షి: ఇప్పటికీ చిన్న, తేలికపాటి ఆయుధాలకు దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. డీఆర్డీవో దీనిమీద పనిచేయడం లేదా? సతీష్‌రెడ్డి: కొరతను త్వరలో అధిగమించనున్నాం. కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మిగతావి ఇక్కడే తయారు చేస్తున్నాం. దిగుమతి చేసుకున్న టెక్నాలజీతో తయారు చేస్తున్నాం. సాక్షి: సియాచిన్ వంటి ప్రతికూల పరిస్థితులుండే ప్రాంతాల్లో సైనికులకు పనికొచ్చే చిన్న చిన్న పరికరాలు, ఆహార పదార్ధాలు, అత్యాధునిక దుస్తులు, బూట్లు... ఒక్కోసారి విజయాన్ని సాధించిపెట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ దిశగా రక్షణరంగంలో పరిశోధనలు జరుగుతున్నాయా? సతీష్‌రెడ్డి: సైనికులకు ప్రతికూల పరిస్థితుల్లో మనగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్డీవో అందిస్తోంది. వారికి అందించాల్సిన ఆహారం, దాన్ని వేడిగా ఉంచడం, ఎముకలు కొరికే చలిలో వేసుకొనే డ్రెస్, చేతి గ్లౌజ్, హెల్మెట్, షూస్... అన్ని అంశాల్లోనూ పరిశోధనలు చేశాం.. చేస్తున్నాం. వాతావరణ ప్రతికూల పరిస్థితులను ముందే కనిపెట్టి హెచ్చరించే వ్యవస్థను రూపొందించాం. సైనికులకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చే పానీయాలు, తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారం అందించడం మీద పరిశోధనలు చేశాం. ఇప్పుడు ‘గగన్‌యాన్’లో పాల్గొననున్న వ్యోమగాములకు ఈ ఆహారాన్నే ఇవ్వనున్నాం. పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సతీష్‌రెడ్డి: రక్షణరంగంలో పనిచేస్తున్న పరిశ్రమలు ఒకప్పుడు మేము ఇచ్చిన డ్రాయింగ్స్ ఆధారంగా వస్తువులు తయారు చేసి ఇచ్చేవి. ఇప్పుడు మా పేటెంట్స్‌ను వాడుకోవడానికి అవకాశం ఇచ్చాం. టెక్నాలజీ బదిలీ చేసినప్పుడు గతంలో ఫీజు వసూలు చేసే వాళ్లం. ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నాం. ఆకాశ్ మిస్సైల్ తయారీకి రూ. 25 వేల కోట్ల విలువైన ఆర్డర్స్ వచ్చాయి. దాంట్లో 87 శాతం ప్రైవేటు పరిశ్రమల నుంచి తీసుకున్నాం. – మల్లు విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి -
సీడీఎస్ గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు
న్యూఢిల్లీ: రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్రం 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు–1954లో మార్పులు చేస్తూ రక్షణ శాఖ ఆదివారం నోటిఫికేషన్ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా సీడీఎస్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ భేటీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కాగా, దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను ప్రభుత్వం మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కాగా, సీడీఎస్‌గా చేపట్టే వ్యక్తే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్ పర్సన్‌గానూ కొనసాగుతారు. -
కేంద్రం తీరువల్లే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: వివిధ అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర రక్షణ శాఖ అవలంబిస్తున్న వైఖరివల్లే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినా.. బోర్డు, రక్షణ శాఖ ఆంక్షలతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఎమ్మెల్యే సాయన్నతో పాటు, కంటోన్మెంట్ బోర్డులో టీఆర్ఎస్ సభ్యులతో తెలంగాణ భవన్ లో బుధవారం కేటీఆర్ సమావేశమయ్యారు. జంటనగరాల పరిధిలో స్కైవేల నిర్మాణానికి కేం ద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీరడం లేదన్నారు. స్కైవేల నిర్మాణ అనుమతుల కోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పలు మార్లు కేంద్రానికి వినతులు సమర్పించినా స్పందన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కంటోన్మెంట్ బోర్డు నుంచి సహకారం లభించడం లేదని, బోర్డు లోని టీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. రామన్నకుంట చెరువులోకి మురికినీరు చేరకుండా రూ. రెండున్నర కోట్లతో రాష్ట్ర పురపాలక శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఒకట్రెండు రోజుల్లో అనుమతులు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం కంటోన్మెంట్ బోర్డుకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బోర్డు పాలక మండలి ఎన్నికలను పార్టీ చిహ్నాలతో నిర్వహించేలా కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మెల్యే సాయన్న కేటీఆర్‌ను కోరారు. సమావేశంలో టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ చిరుమిల్ల రాకేశ్, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నౌకాదళం పటిష్టతకు కలసి పనిచేద్దాం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి,అమరావతి: నౌకాదళ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలీయమైన శక్తిగా రూపుదిద్దుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. భారత నౌకాదళం, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కోరారు. తూర్పు నౌకాదళ అభివృద్ధికి కావాల్సిన పూర్తి సహకారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. భారత నావికాదళం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించి విశాఖపట్నంలో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని స్వర్ణజ్యోతి ఆడిటోరియంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్, జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. భారత నౌకాదళ వ్యవస్థను శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నౌకాదళ అధికారులకు రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు. తీర ప్రాంతంలో భద్రతపై జగన్ సమీక్ష భారత నౌకాదళం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. నావికా దళంలో తలెత్తే సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నౌకాదళం చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్‌ను అడిగి తెలుసుకున్నారు. తీర ప్రాంతంలో భద్రతపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. దాదాపు అరగంటకు పైగా ఈ సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం నౌకాదళ ప్రధాన కేంద్రంలోని కల్వరీ డైనింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మర్యాదపూర్వక విందులో రాజ్‌నాథ్‌సింగ్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, నావికాదళ ప్రధాన అధికారులు పాల్గొన్నారు. అనంతరం రక్షణ మంత్రితో సీఎం జగన్ మాట్లాడారు. ఆ తర్వాత నౌకాదళ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జగన్ తిలకించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో స్వయంగా రాజ్‌నాథ్‌సింగ్ వాహనం వరకూ వచ్చి వీడ్కోలు పలికారు. అంతకుముందు నావికాదళం అధికారులు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి గార్డ్ ఆఫ్ హానర్‌తో వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట డీజీపీ గౌతమ్ సవాంగ్, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాసరావు, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. తాడేపల్లి చేరుకున్న సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ పర్యటన ముగించుకొని శనివారం రాత్రి తాడేపల్లికి చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కోసం గురువారం మధ్యాహ్నం ఆయన తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రతిపాదన కోసం శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కేసీఆర్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. 7.10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం ఆవరణలో వైఎస్సార్సీపీ శ్రేణులను కలుసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరకున్నారు. అక్కడ ఈస్ట్రన్ నేవల్ కమాండ్(ఈఎన్సీ) సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాత్రి 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి జగన్మోహన్రెడ్డి వచ్చారు. -
సముద్రాల నుంచి ఆకాశం వరకు..
సాక్షి, చెన్నై/తిరుపూరు: కాంగ్రెస్ పార్టీకి రక్షణ రంగమంటే బ్రోకర్లతో ఒప్పందాలేనని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘సముద్రాల నుంచి ఆకాశం వరకు.. రక్షణ రంగంలో జరిగిన అనేక కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది. బ్రోకర్లతో బేరసారాల్లో పడి ఆ పార్టీ అధికారంలో ఉండగా రక్షణ బలగాల ఆధునీకరణ గురించి కూడా పట్టించుకోలేదు’ అని మోదీ ఆరోపించారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అంశంలో రక్షణ శాఖతోపాటు ప్రధాని కార్యాలయం కూడా సమాంతర చర్చలు జరిపిందంటూ ఇటీవల ఓ వార్తా కథనం రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రఫేల్ విషయంలో మోదీ ప్రభుత్వంపై ఆరోపణల వాడిని మరింత పెంచారు. రాహుల్ వ్యాఖ్యలకు తమిళనాడులోని తిరుపూరు సమీపంలోని పెరుమనళ్లూరు సభలో మోదీ స్పందిస్తూ ‘దశాబ్దాల తరబడి అధికారంలో ఉండే అవకాశం దక్కినవారు భారత రక్షణ రంగం గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. వారికి ఈ రంగం అంటే కేవలం బ్రోకర్లతో చర్చలు జరిపి తమ మిత్రులకు మేలు జరిగేలా చూడటమే. దేశ భద్రత కోసం మేం అనుసరిస్తున్న విధానాలు వేరు. రక్షణకు అవసరమైన అన్ని ఆయుధాలు, పరికరాలను మన దేశంలోనే తయారు చేసుకోవాలనేది మా ప్రభుత్వ కల. అందుకోసమే రెండు రక్షణ కారిడార్లను నిర్మిస్తున్నాం. వాటిలో ఒకటి మీ రాష్ట్రంలోనే వస్తోంది. దీని ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని వివరించారు. ప్రతిపక్ష నాయకులు తనను దూషిస్తే వారు ఇప్పుడు టీవీలు, పత్రికల్లో కనిపిస్తారేమో కానీ, ఎన్నికల్లో వారి గెలుపునకు అది సరిపోదనీ, అందుకు కావాల్సింది దార్శనికత తప్ప దుర్భాషలు, దాడులు కాదని అన్నారు. తిరుపూరు నుంచే మా ప్రచార దుస్తులు పెరుమనళ్లూరులో తన ప్రసంగాన్ని మోదీ ‘వణక్కం’ అంటూ తమిళంలో ప్రారంభించారు. కాంగ్రెస్‌లో నాటి అగ్రనేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కె. కామరాజార్ గొప్ప నాయకుడని మోదీ కొనియాడారు. ఎన్నికల్లో తమ ప్రచార దుస్తులైన ‘నమో’ టీ–షర్టులు తిరుపూరులో తయారైనవేనని మోదీ తెలిపారు. కాగా, కావేరీ నదీ జలాలు సహా అనేక అంశాల్లో తమిళనాడు ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారంటూ తిరుపూరులో డీఎండీకే చీఫ్ వైగో నేతృత్వంలో నిరసనలు జరిగాయి. ఒకానొక సమయంలో వైగో ప్రసంగిస్తుండగా అక్కడి జనంలోకి బీజేపీకి చెందిన మహిళ వచ్చి మోదీ అనుకూల నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమెను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. చెన్నై, తిరుచ్చిల్లో వివిధ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. సీఎం అయినందుకు కుమారస్వామి విలాపం సాక్షి, బెంగళూరు: తమిళనాడు నుంచి మోదీ కర్ణాటకలోని హుబ్లీకి చేరుకుని ఆ రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హుబ్లీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కర్ణాటకలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలని మోదీ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాధినేత ఎవరో ప్రజలకు తెలియడం లేదని, తాను ఎందుకు ముఖ్యమంత్రిని అయ్యానో అనుకుంటూ కుమారస్వామి రాత్రులు ఏడుస్తూ కూర్చుంటుంటే మరికొందరు నేతలు ఢిల్లీలో చక్కర్లు కొడుతూ కనిపిస్తారని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌లో అంతర్గత వివాదాలకు కుమారస్వామి ఒక పంచింగ్ బ్యాగ్ అవుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. కుమారస్వామి అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రి అని, సంకీర్ణ ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం నిత్యం కోట్లాట జరుగుతోందని విమర్శించారు. -
రక్షణ మంత్రిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సచివాలయ నిర్మాణం, రహదారుల విస్తరణకు వీలుగా రక్షణ శాఖ పరిధిలోని బైసన్ పోలో భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రక్షణ శాఖ భూముల బదలాయింపుపై ఇప్పటికే అనేక మార్లు ప్రధాని మోదీని కలిశాం. బైసన్‌పోలో స్థల వివాదం కేసు హైకోర్టులో ఉందని గతంలో ప్రధాని చెప్పారు. తాజాగా హైకోర్టు బైసన్ పోలో స్థలం కేంద్రానిదే అని స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర మంత్రిని కలిసి ఈ అంశంపై చర్చిం చాం. బైసన్‌పోలో స్థలానికి బదులు స్థలం, కొంత శాతం పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించాం. మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ రాసిన లేఖను కేంద్ర మంత్రికి ఎంపీ వినోద్‌కుమార్ అందజేశారు. రక్షణ మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు కవిత, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జోగినిపల్లి సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. -
అంతరిక్షంలో ఆధిపత్య పోరు
‘అంతరిక్ష రంగంలోనూ అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలి. ఇందుకోసం మిలటరీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. ఇప్పటికే ఉన్న ఐదు విభాగాలతో సమాన హోదా ఉంటూనే ఈ ‘స్పేస్ ఫోర్స్’ ప్రత్యేక విభాగంగా పనిచేస్తుంది’.. అంతరిక్ష విధానానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలివి. రష్యా, చైనా మిలటరీ అవసరాల కోసం అంతరిక్ష రంగాన్ని వాడుకునేందుకు అనేక టెక్నాలజీలు రూపొందించుకుంటున్న నేపథ్యంలో అంతరిక్ష దళం ఏర్పాటు చాలా ముఖ్యమని ట్రంప్ అన్నారు. రేపటి యుద్ధరంగం అంతరిక్షం... భవిష్యత్తులో యుద్ధమంటూ జరిగితే అది అంతరిక్షమే వేదికగా జరుగుతుందని మిలటరీ నిపుణుల అంచనా. శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులను అంతరిక్షం నుంచే నాశనం చేయడం.. ప్రతిదాడులకూ తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ఇందుకు కీలకమవుతుంది. స్టార్‌వార్స్ పేరుతో గతంలో అమెరికా ఈ దిశగా ప్రయత్నాలు చేసింది కూడా. ట్రంప్ ప్రతిపాదిస్తున్న అంతరిక్ష దళం స్టార్‌వార్స్ తరహాలోనే అంతరిక్షంలో రక్షణ, ప్రతిదాడుల కోసం వ్యవస్థలను ఏర్పాటు చేస్తుందా? లేదా? అన్నది ప్రస్తుతానికి స్పష్టం కానప్పటికీ వీటిల్లో ఏది జరిగినా వివాదాస్పదం అవుతుందన్నది సుస్పష్టం. ఎందుకంటే అమెరికాతోపాటు రష్యా, ఇంకో వంద దేశాలు 1967లో చేసుకున్న అంతరిక్ష పరిరక్షణ ఒప్పందానికి ఇది విరుద్ధం. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం మరో ప్రచ్ఛన్నయుద్ధానికి నాంది పలకడమేనని పలువురు పేర్కొంటున్నారు. రష్యా, చైనాల ముందంజ ఆయుధ వ్యవస్థల ఏర్పాటుపై నిషేధం ఉన్నప్పటికీ రష్యా, చైనాలు ఇటీవలి కాలంలో అంతరిక్షాన్ని మిలటరీ అవసరాల కోసం వాడుకునేందుకు కొన్ని టెక్నాలజీలను అభివృద్ధి చేసినట్లు వార్తలున్నాయి. ‘హైపర్ సోనిక్ గ్లైడెడ్ వెహికల్’ పేరుతో రష్యా తయారు చేసుకున్న సరికొత్త ఆయుధ వ్యవస్థను అంతరిక్షంలోకి ప్రయోగిస్తే చాలు...రాడార్ వ్యవస్థల కళ్లుగప్పి శత్రుదేశాలపై దాడులు చేయగలదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రకటించారు. ఇంకోవైపు చైనా కూడా ఒక ఉపగ్రహం సాయంతో ఇతర ఉపగ్రహాలను, క్షిపణులను పేల్చివేసేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి, పరీక్షలు నిర్వహించింది. ఈ రెండు పరిణామాలు తమ దేశ భద్రతకు చేటు తెచ్చేవని అమెరికా భావిస్తోంది. ప్రస్తుతం అంతరిక్ష యుద్ధం విషయంలో మూడు రకాల ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. భూమిపై నుంచే లేజర్ల సాయంతో ఉపగ్రహాలు పనిచేయకుండా చేయడం ఒకటైతే.. అంతరిక్షంలోనే ఉంటూ ఈ పనులు చేయడం రెండో రకం. అంతరిక్షం నుంచి భూమ్మీది లక్ష్యాలను ఛేదించే వ్యవస్థలు మూడో రకం. అమెరికాతోపాటు రష్యా, చైనాలు మూడింటికీ ఈ రకమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఓ వ్యవస్థ: అమెరికాలో ఇప్పటికే స్పేస్ ఫోర్స్ లాంటి వ్యవస్థ ఇప్పటికే ఉంది. ఎయిర్‌ఫోర్స్ స్పేస్ కమాండ్ పేరుతో 1982 నుంచి నడుస్తున్న ఈ వ్యవస్థ అటు వైమానిక దశం, ఇటు నేవీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తూంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహాలపై నిఘా పెట్టడం, క్షిపణి ప్రయోగాలపై ఓ కన్నేయడం ఈ వ్యవస్థ ప్రధానమైన విధులు. – సాక్షి, హైదరాబాద్ -
సహనాన్ని పరీక్షిస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణకు, స్కైవేల నిర్మాణానికి రక్షణ అడ్డుగా నిలుస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ భూములు ఇచ్చే విషయంలో రక్షణ శాఖ నగర ప్రజల సహనాన్ని పరీక్షిస్తోందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల సమస్య లేని చోట కూడా రోడ్లు మూసివేస్తోందని, జీహెచ్ఎంసీని సతాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం శాసనమండలిలో హైదరాబాద్ రోడ్ల అభివృద్ధిపై సభ్యులు ఎంఎస్ ప్రభాకర్‌రావు, భూపతిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రోడ్ల విస్తరణ, స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్ ప్రాంతంలో 160 ఎకరాల రక్షణ శాఖ భూములు అవసరమున్నాయని తెలిపారు. కేంద్రం వాటిని కేటాయిస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. ముగ్గురు రక్షణ మంత్రులకు చెప్పినా.. 100 ఎకరాలు కేటాయిస్తే 600 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని చెప్పినా ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. కొత్తగా ఆ భూముల్లో భవన నిర్మాణాలు చేపడితే తమకు ప్రతి నెలా రూ.30 కోట్ల ఆదాయం వచ్చేదని, ఆ దృష్ట్యా శాశ్వత ప్రాతిపదికన ప్రతి నెల రూ.30 కోట్లు ఇవ్వాలంటూ రక్షణ శాఖ లేఖ రాసిందని మండలి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల విషయంలో రక్షణ శాఖ ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంబించడం లేదని విమర్శించారు. కేంద్రం భూములు ఇవ్వనందునే రహదారుల విస్తరణలో జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై బీజేపీ సభ్యుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ, ఇటీవల రక్షణ మంత్రి నిర్మల సీతారామన్‌తో మాట్లాడానని, ఆమె సానుకూలంగా ఉన్నారని తెలిపారు. కేటీఆర్ బదులిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ముగ్గురు రక్షణ మంత్రులతో మాట్లాడినా సమస్యకు పరిష్కారం దొరకలేదని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఎవరైనా అనుమతులు తెప్పిస్తే వారితోనే కొబ్బరికాయ కొట్టిస్తామన్నారు. మరోవైపు నగరంలో నాలుగు రకాల బస్టాపులను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గ్రేడ్–1లో అత్యున్నత ప్రమాణాలతో వసతులు ఏర్పాటు చేస్తా మని ప్రకటించారు. ఏసీ, వైఫై సౌకర్యం, టికెటింగ్ మిషన్ ఏర్పాటు, డస్ట్ బిన్, టాయిలెట్స్ ఉంటాయని పేర్కొన్నారు. టెన్త్ వరకు తప్పనిసరి: కడియం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మొదట్లో ఇంటర్ వరకు అమలు చేయాలని భావించినా.. మొదటి దశలో పదో తరగతి వరకు అమలు చేస్తున్నామని చెప్పారు. సభ్యులు పాతూరి సుధాకర్ రెడ్డి, నారదాసు, పూల రవీందర్ రెడ్డి.. మాతృ భాష అమలుపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పదో తరగతి వరకు రాష్ట్ర సిలబస్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ ఉన్న పాఠశాలల్లో ‘తెలుగు తప్పనిసరి’ని ఏ విధంగా అమలు చేయాలో అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంపై నిరంతరం నిఘా పెట్టామని, ఇందుకోసం విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశం మొత్తంలో మధ్యాహ్న భోజన పథకం 8వ తరగతి వరకే అమలవుతుంటే.. తెలంగాణలో మాత్రమే 9, 10వ తరగతులకు కూడా రాష్ట్ర నిధులతో అమలు చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు 7,080 వంటశాలలు రూ.146 కోట్లతో నిర్మిస్తున్నామని, అవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అందులో రిజర్వేషన్లు కుదరవు: జగదీశ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్లాంట్ల నిర్మాణాల్లో ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలు, రిజర్వేషన్లు వర్తింపజేయడం సాధ్యం కాదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సభ్యులు రాజేశ్వర్‌రావు, రాములునాయక్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 1,617 సోలార్ ప్లాంట్లలో 3,046.88 మెగావాట్లు, ఇళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో రూఫ్ టాప్ ద్వారా 26.92 మెగావాట్లు, యన్.పి.టి.సి ద్వారా 449.81 మెగావాట్లు, పోటీ టెండర్ల ద్వారా 121 కేంద్రాల్లో 2,375 మెగావాట్లు, ఓపెన్ ఆఫర్ ద్వారా 43 కేంద్రాల్లో 189.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిపారు. -
ఆర్మీస్థావరాలకు 1,487 కోట్లు
న్యూఢిల్లీ: కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ స్థావరాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రక్షణశాఖ రూ.1,487 కోట్లను మంజూరుచేసింది. ఈ ప్రాజెక్టును 10 నెలల్లోగా పూర్తిచేయాలని రక్షణ మంత్రి సీతారామన్ ఆదేశించినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. కశ్మీర్లో నియంత్రణ రేఖ, కొన్ని చోట్ల ఆర్మీ స్థావరాలపై ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పఠాన్‌కోట్ ఉగ్రదాడి తర్వాత భద్రతను కట్టుదిట్టం చేయడానికి లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కాంపోస్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఆడిట్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటి ఆధారంగా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసేందుకు వీలుగా ప్రామాణిక నిర్వహణ విధానాలను(ఎస్వోపీ) త్రివిధ దళాలకు అందజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన 600 అత్యంత సున్నితమైన, 3 వేల సున్నితమైన స్థావరాలను గుర్తించినట్లు వెల్లడించాయి. -
‘షహీద్’ పదం మా డిక్షనరీలో లేదు
న్యూఢిల్లీ: ఆర్మీ లేదా పోలీసు శాఖలో ‘అమర వీరుడు’లేదా ‘షహీద్’అనే పదాలే లేవని రక్షణ శాఖ, హోంశాఖలు తేల్చిచెప్పాయి. ఏదైనా ఘటనలో ఆర్మీ అధికారి చనిపోతే ‘యుద్ధంలో మరణించినవారు’, పోలీసులు చనిపోతే ‘పోలీస్ చర్యల్లో మరణించినవారు’ అని పేర్కొంటారని తమ నివేదికలో కేంద్ర సమాచార కమిషన్‌కు తెలిపాయి. ‘షహీద్’ లేదా ‘అమరవీరుడు’ పదాలకు న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా అర్థం చెప్పాలంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త హోం శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పదాల వాడుకపై పరిమితులు.. అలాగే తప్పుగా వాడితే ఎలాంటి శిక్ష విధిస్తారో తెలియజేయాలని కోరాడు. ఈ దరఖాస్తుకు హోం, రక్షణ శాఖల్లో స్పందన రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు. -
‘అస్త్ర’ పరీక్ష విజయవంతం
బాలాసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర (గగనతలంలో సుదూర లక్ష్యాలను సైతం ఛేదించే–బీవీఆర్‌ఏఏఎమ్) క్షిపణిపై వివిధ దశల్లో నిర్వహించిన పరీక్ష విజయవంతంగా పూర్తయింది. నాలుగురోజులుగా జరుగుతున్న ఈ క్షిపణి ట్రయల్స్ సఫలీకృతమయ్యాయని రక్షణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘బంగాళాఖాతంలో అస్త్ర క్షిపణి (బీవీఆర్‌ఏఏఎమ్) చివరి దశ పరీక్ష విజయవంతమైంది. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి ఈ పరీక్షలు జరిగాయి’ అని ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రయోగం సఫలీకృతం కావటంతో త్వరలోనే భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగంలో పాలుపంచుకున్న డీఆర్డీవో, ఏఐఎఫ్‌లతో పాటుగా పలు డీపీఎస్‌యూలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థ డైరెక్టర్ జనరల్ జి. సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన సాంకేతికత ద్వారా గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను, భూమిపైనుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మరిన్ని విభిన్నమైన క్షిపణులను రూపొందించవచ్చని తెలిపారు. -
స్కైవేకు సైసై!
- ‘జూబ్లీ’ నుంచి లోతుకుంట వరకు - పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ఆసక్తి - అంచనా వ్యయం రూ.1,400 కోట్లు సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చే ప్రక్రియలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కీలకపాత్ర పోషించబోతోంది. నగరవాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ వెతలపై అధ్యయనం చేసిన హెచ్ఎండీఏకు చెందిన కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ స్టడీ(సీటీఎస్) సూచనల మేరకు నగరంలో నూతన ఫ్లైఓవర్లు, స్కైవే పనులను చేపట్టడంపై దృష్టి సారించింది. బాలానగర్‌లోని నర్సాపూర్ చౌరస్తాపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ పనులకు ఇటీవల భూమిపూజ చేసింది. ఇప్పుడు జూబ్లీ బస్టాండ్ నుంచి లోతుకుంట వరకు ఆరు కి.మీ మేర స్కైవే నిర్మాణ పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ఆసక్తి చూపుతోంది. స్కైవే నిర్మాణం, భూ సేకరణకు రూ.1,400 కోట్లు అంచనా వ్యయం అవుతుండగా ఇప్పటికే హెచ్ఎండీఏ వద్ద జైకా నుంచి తీసుకున్న రుణంలో రూ.600 కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ.800 కోట్లు ప్రభుత్వం సమకూరిస్తే స్కైవే పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. అద్భుత రీతిలో స్కైవే.. నగరానికే తలమానికమైన 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హెచ్ఎండీఏ.. అవకాశం వస్తే ఈ స్కైవేను అంతకుమించి అద్భుత రీతిలో నిర్మించాలని యోచిస్తోంది. ఈ స్కైవే నిర్మాణం వల్ల ఓఆర్ఆర్కు అనుసంధానం కావడంతో పాటు కరీంనగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. స్కైవే నిర్మాణం చేపట్టాలనుకుంటున్న ప్రాంతంలో రక్షణ శాఖ భూములు ఉండటంతో వాటిని ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం కోరింది. దీనికి రక్షణ శాఖ అంగీకారం తెలిపినా.. అధికారికంగా ఆదేశాలు రాలేదు. అవి రాగానే స్కైవే నిర్మాణానికి అడుగు పడనుంది. అలాగే ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న స్కైవేకు నిధులు మంజూరు చేస్తే ఆ పనులు కూడా హెచ్ఎండీఏ చేపట్టేందుకు రెడీగా ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. హెచ్ఎండీఏ భూముల వేలం.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించిన పదేళ్ల తర్వాత హెచ్ఎండీఏ రూ.369.53 కోట్లతో బాలానగర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల ఫ్లైఓవర్ పనులను చేపట్టింది. ఈ నిధుల కోసం హెచ్ఎండీఏకు చెందిన భూములను వేలం వేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపింది. ఉప్పల్ భగాయత్ లే అవుట్‌తో పాటు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఉన్న స్ట్రేబీట్స్ను వేలం వేయడం ద్వారా రూ.400 కోట్లు సమీకరించి బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు వెచ్చించాలని యోచిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వేలం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్లాట్లను విక్రయించడం ద్వారానే రూ.250 కోట్లు వస్తాయని హెచ్ఎండీఏ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. -
500 ఎకరాలు.. రూ.96 కోట్లు
- రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి పరిహారం - రాష్ట్ర ప్రభుత్వం ముందు రక్షణ శాఖ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న వాహనదారులకు ఊరట కల్పించేందుకు ఉద్దేశించిన రెండు ఎలివేటెడ్ కారిడార్లకు అవసరమైన 100 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ పెద్ద డిమాండ్‌నే రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ కూడలి నుంచి రాజీవ్ రహదారిపై శామీర్‌పేట వరకు, ప్యాట్నీ కూడలి నుంచి నిజామాబాద్ హైవేపై సుచిత్ర కూడలి వరకు రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రహదారుల నిర్మాణానికి కచ్చితంగా రక్షణ శాఖ భూములు సమీకరించాల్సి ఉంది. ఇందుకు అంగీకరిస్తే దాదాపు 100 ఎకరాల భూమిని రక్షణ శాఖ కోల్పోవాల్సి వస్తుంది. ఈ భూమికి ప్రతిగా హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్ పరిధిలో 500 ఎకరాల భూమి, రూ.96 కోట్ల నగదు ఇవ్వాలని తాజాగా రక్షణ శాఖ ప్రతిపాదించింది. రెండు రోజుల కింద ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో రోడ్లు, భవనాల శాఖ అధికారి సునీల్‌శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ భూమిపై దాదాపు కొలిక్కి తెచ్చారు. ఫైరింగ్ రేంజ్ కోసం.. రక్షణ శాఖ చాలాకాలం నుంచి రాష్ట్రంలో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు యత్నిస్తోంది. ఇందుకు రంగారెడ్డి జిల్లా, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో పలు ప్రాంతాల్లో భూమిని పరిశీలించింది. జవహర్‌నగర్ పరిధిలోకి వచ్చే యాప్రాల్ వద్ద తాత్కాలిక పద్ధతిలో ఫైరింగ్ రేంజ్ నిర్వహిస్తోంది. 503 ఎకరాల భూమిని 1995లో లీజు పద్ధతిలో ప్రభుత్వం నుంచి పొంది ఫైరింగ్ రేంజ్‌గా వాడుకుంటోంది. 2011లో లీజు గడువు పూర్తయింది. దీంతో ఆ స్థలాన్ని వెనక్కు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు లేఖలు రాసింది. అయితే దాన్ని తమకే అమ్మాలని కోరుతున్న రక్షణ శాఖ ఆ భూమిని ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించలేదు. ఇప్పుడు కంటోన్మెంట్లో 100 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా ఈ భూమి ఇవ్వాలని లింకు పెట్టింది. కంటోన్మెంట్ భూములు అతి ఖరీదైనవి అయినందున ఈ 503 ఎకరాలతో పాటు మరో రూ.96 కోట్లు కూడా ఇవ్వాలని అడిగింది. దీనిపై రాష్ట్ర అధికారులు ప్రభుత్వంతో సంప్రదించి సూత్రప్రాయ అంగీకారం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు రాష్ట్రానికి నివేదిక సమర్పించారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. -
బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు రక్షా మంత్రి అవార్డులు
ఢిల్లీలో అందజేసిన రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ శాఖ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ సంస్థ (డీపీఎస్‌యూ)లకు రక్షణ శాఖ అందించే రక్షా మంత్రి అవార్డులు హైదరాబాద్‌లోని పలు సంస్థలకు దక్కాయి. 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను మంగళవారం కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో అందజేశారు. 2014–15 సంవత్సరానికి సంస్థల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఎగుమతుల్లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గోవాకు చెందిన గోవా షిప్‌యార్డ్ రక్షా మంత్రి అవార్డులు అందుకున్నాయి. డివిజన్, ఫ్యాక్టరీ, షిప్‌యార్డు విభాగంలో ఉత్తమ డీపీఎస్‌యూ డివిజన్ కేటగిరీలో హైదరాబాద్‌కు చెందిన హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, ఉత్తమ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విభాగంలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయి. బృందం, వ్యక్తిగత విభాగంలో సృజనాత్మక కేటగిరీలో హైదరాబాద్‌కు చెందిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లోని డిజైన్ అండ్ ఇంజనీరింగ్ డివిజన్ ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయి. 2015–16 సంవత్సరానికి: 2015–16 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ డివిజన్, ఫ్యాక్టరీ విభాగంలో మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి అవార్డు దక్కింది. బృందం, వ్యక్తిగత విభాగంలో సృజనాత్మక కేటగిరీలో విశాఖపట్నంలోని హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు చెందిన షిప్‌బిల్డింగ్ డివిజన్, ఇంజనీరింగ్ షిప్ రిపేర్ కాంప్లెక్స్, ఇంజనీరింగ్ విభాగం సంయుక్తంగా అవార్డు దక్కించుకున్నాయి. మెదక్ జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నెలకొల్పిన 16 మెగా వాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టును వీడియో లింక్ ద్వారా జైట్లీ ప్రారంభించారు. -
బ్రిడ్జిలైతేనే.. బాగుబాగు
వంతెనలతో ట్రాఫిక్‌కు చెక్.. రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక - రాష్ట్ర ఖజానాపై భారం లేకుండా నిర్మాణానికి కసరత్తు - అంబర్‌పేటలో భారీ వంతెనకు కేంద్రం పచ్చజెండా - ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్‌ల ప్రతిపాదనలు పరిళీలిస్తున్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ చిక్కులకు ప్రధాన కారణంగా ఉన్న మతపరపమైన కట్టడాలున్న చోట భారీ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జాతీయ రహదారులుగా ఉన్న రోడ్లపై నిర్మించే వంతెనలన్నింటికీ కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని ప్రణాళిక రూపొందించుకుంది. గతంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో వంతెనల కోసం రూపొందించిన ప్రణాళికలను ప్రస్తుతానికి అటకెక్కించిన ప్రభుత్వం, వ్యూహం మార్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.11 వేల కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నందున, నగరంలో వంతెనలకు అయ్యే భారీ వ్యయాన్ని భరించటం పెద్ద సమస్యగా మారింది. దీంతో వీలైనన్ని చోట్ల జాతీయ రహదారులపై వంతెనలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. మరికొన్ని కీలక రోడ్లను జాతీయ రహదారులుగా మార్చి, వాటిమీద నిర్మించే వంతెనలను కలిపి మొత్తంగా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందాలని నిర్ణయించింది. అంబర్‌పేట ఫ్లైఓవర్‌కు రూ.254 కోట్లు ఇక వీటితోపాటు వరంగల్ జాతీయ రహదారిపై అంబర్‌పేట కూడలి వద్ద ఫ్లైవోవర్ నిర్మించబోతోంది. దీనికి కేంద్రం నుంచి నిధులు పొందేందుకు తాజాగా అనుమతి రావడం విశేషం. చే నంబర్ శ్రీరమణ సినిమాహాల్ కూడలికి వచ్చే మార్గంలో రోడ్డుకు రెండు వైపులా శ్మశానవాటికలు ఉన్నాయి. గతంలో విస్తరణకు ప్రయత్నం చేయగా మతపెద్దల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో అక్కడ పొడవాటి వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి దాదాపు రూ.300 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేయడంతో అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు దాన్ని కేంద్రం ఖాతాలోకి వేయటంలో విజయం సాధించింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.245 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. 1.1 కి.మీ. పొడవుతో సాగే ఈ వంతెన దాదాపు 4 బాటిల్ నెక్ సమస్యలను పరిష్కరిస్తుంది. ఇందుకోసం అక్కడక్కడా కొంత భూసేకరణ జరపాలి. ఇందుకు రూ.80 కోట్ల వరకు వ్యయం అవుతోంది. ఈ మొత్తాన్ని భరించాలని రాష్ట్రప్రభుత్వం కోరగా, కేంద్రం తిరస్కరించింది. దాన్ని జీహెచ్ఎంసీ ఖజానా నుంచి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే... రాజేంద్రనగర్ వద్ద ఆరాంఘర్ కూడలి, ఉప్పల్ నుంచి ఘట్కేసర్, ఎల్బీనగర్ వద్ద మరో మూడు వంతెనలకు నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. ప్యాట్నీ–శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్ రాష్ట్ర రహదారిగా ఉన్న రాజీవ్ రహదారిని జాతీయ రహదారుల ఖాతాలోకి మార్చాలని తాజాగా ప్రతిపాదన పంపింది. ఈ రోడ్డుపై నగరంలో ప్యాట్నీ చౌరస్తా నుంచి శామీర్‌పేట వరకు భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతోంది. అవసరమైన స్థలాన్ని ఇవ్వాల్సిందిగా రక్షణ శాఖను కోరింది. దీనికి దాదాపు రూ.750 కోట్లకు పైగా వ్యయం కానుంది. అలాగే ప్యారడైజ్ నుంచి నిజామాబాద్ హైవేలో సుచిత్ర కూడలి వరకు మరో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించింది. దీనికి కూడా రక్షణ శాఖ నుంచి స్థల సేకరణ చోయబోతోంది. దీనికి కూడా భారీ వ్యయం అవుతున్నందున దీన్ని కూడా కేంద్రం నుంచి పొందేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
మాజీ రక్షణ సిబ్బంది పెన్షన్‌కు ఆధార్ ఉండాల్సిందే
న్యూఢిల్లీ: పెన్షన్ పొందేందుకు మాజీ రక్షణ సిబ్బంది, కుటుంబీకులకు ఆధార్‌ను తప్పనిసరిచేస్తూ రక్షణమంత్రిత్వ శాఖ నిర్ణయంతీసుకుంది. వీరంతా జూన్ 30లోపు ఆధార్‌కు నమోదుచేసుకోవాలని రక్షణ శాఖ ప్రకటించింది. 25 లక్షల మంది పెన్షన్ లబ్దిదారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని బుధవారం విడుదలచేసిన ఓ నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. ఇంతవరకు ఆధార్ నంబర్ సమర్పించని, ఆధార్ కార్డు లేనివారు ఇకపై తప్పకుండా ఆధార్ కోసం నమోదు చేసుకోవాలని ఆదేశించింది. -
‘అగ్ని–5’ విజయవంతం
• అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి • పరిధి 5–6 వేల కిలోమీటర్ల పైనే • ఒడిశాలోని అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి ప్రయోగం • దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీతోనే రూపకల్పన • త్వరలోనే భారత రక్షణ వ్యవస్థలోకి ప్రవేశం బాలాసోర్: రక్షణ శాఖ అమ్ములపొదిలోకి త్వరలోనే అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర విధ్వంసక క్షిపణి అగ్ని–5 చేరనుంది. ఒడిశాలోని బాలాసోర్‌లో అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సోమవారం అగ్ని–5ను విజయవంతంగా పరీక్షించారు. ఈ బాలిస్టిక్ క్షిపణి పరిధి 5–6 వేల కిలోమీటర్లు. అగ్ని–5 పరిధిలో చైనా, రష్యా దేశాలు పూర్తిగా.. సగానికిపైగా యూరప్, ఆఫ్రికా ఖండాలున్నాయి. అగ్ని–5ను నాలుగు విడతల్లో విజయవంతంగా పరీక్షించటం వల్ల వ్యూహాత్మక బలగాల కమాండ్ (ఎస్ఎఫ్సీ)లోకి దీన్ని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని రక్షణశాఖ స్పష్టం చేసింది. మూడు దశల్లో పనిచేసే భూఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యమున్న అగ్ని–5ను ఉదయం 11.05 గంటలకు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో మొబైల్ లాం చర్ నుంచి ప్రయోగించారు. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసార్థంమున్న ఈ క్షిపణికి 3 దశల్లో పనిచేసే ఇంజన్లను అమర్చారు. 1,500 కిలోల అణ్వాయుధాలను ఈ క్షిపణి మోసుకెళ్లగలదు. అవసరమైతే చాలా తక్కువ సమయంలోనే దీన్ని లాంచింగ్ కోసం సిద్ధం చేయొచ్చు. అత్యాధునిక అగ్ని–5 2012లో అగ్ని–5 సిద్ధమైనప్పటికీ నాలుగు విడతల్లో విజయవంతంగా పరీక్షించాకే అగ్ని–5 సామర్థ్యాన్ని అధికారికంగా సోమవారం ధ్రువీకరించారు. ఇప్పటివరకున్న అగ్ని క్షిపణుల్లో అగ్ని–5 చాలా ప్రత్యేకమైంది. 5వేల కి.మీ.కు మించిన పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉండటంతోపాటు.. దీని నేవిగేషన్, గైడెన్స్ వ్యవస్థ, ఇంజన్, వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం అన్నీ అత్యాధునిక సాంకేతికతో కూర్పుచేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని ట్రయల్స్‌లో విజయవంతంగా పరీక్షించారు. అత్యంత కచ్చితత్వం కలిగిన రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నేవిగేషన్సిస్టమ్ (ఆర్ఐఎన్ఎస్), అధునాతనమైన మైక్రోనేవిగేషన్ వ్యవ స్థ (ఎమ్‌ఐఎన్‌ఎస్) ఉన్నాయి. హైస్పీడ్ కంప్యూటర్, లోపాల్లేని సాఫ్ట్వేర్, నమ్మకమైన బస్.. అగ్ని–5ను దోషరహిత క్షిపణిగా మార్చాయని డీఆర్డీవో అధికారులు తెలిపారు. 2011 కల్లా ఇది సిద్ధమవుతుందని భావించినప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యమైంది. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు అగ్ని–5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ అభినందించారు. దేశ వ్యూహాత్మక రక్షణ వ్యవస్థను మరో అడుగు ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. మన వ్యూహాత్మక, నియంత్రణ సామర్థ్యాన్ని బలోపేతం చేశారని ప్రణబ్ ట్వీట్ చేశా రు. ‘అగ్ని–5 సక్సెస్ భారతీయుందరికీ గర్వకారణం. వ్యూహాత్మక రక్షణ వ్యవస్థకు బ్రహ్మాండమైన బలాన్నందించారు’ అని మోదీ అభినందించారు. వైఎస్ జగన్ అభినందనలు: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని–5 క్షిపణి ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. క్షిపణి ప్రయోగం సక్సెస్‌పై ఆయన ట్టిట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. ఎలా పనిచేస్తుంది? విక్షేపక మార్గంలో అత్యున్నత ఎత్తుకు చేరుకున్న తర్వాత ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ ద్వారా, ఆన్‌బోర్డు కంప్యూటర్ మార్గదర్శకత్వంలో రెట్టించిన వేగంతో (క్షిపణి వేగం, భూమ్యాకర్షణ శక్తి కలిపి) నిర్దేశిత లక్ష్యం వైపు అగ్ని–5 దూసుకెళ్తుంది. ఈ సమయంలో క్షిపణి ఉష్ణోగ్రత 4 వేల డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోతుంది. అందుకోసం స్వదేశీ తయారీ కార్బన్–కార్బన్ కంపోజిట్ రక్షణ కవచం.. ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు మించకుండా లక్ష్యం చేరేవరకు పేలోడ్‌ను కాపాడుతుంది. ఆర్ఐఎన్ఎస్, ఎమ్‌ఐఎన్‌ఎస్S కమాండ్‌తో టార్గెట్‌ను ఢీ కొంటుంది. సోమవారం ప్రయోగం సందర్భంగా మధ్య దార్లో, లక్ష్యిత స్థానంలో ఏర్పాటు చేసిన రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థ మిసైల్ కచ్చితత్వాన్ని ధ్రువీకరించినట్లు తెలిసింది. తొలిరెండు దశల ప్రయోగంతోనే ఈ మిసైల్ సామర్థ్యం ప్రపంచానికి అర్థమైంది. -
నిఘా నిద్రపోతోందా..?
- వరుస ఉగ్ర దాడులు జరుగుతున్నా మేల్కోని రక్షణ వర్గాలు - భద్రతా లోపాలే కొంపముంచుతున్నాయంటున్న నిపుణులు న్యూఢిల్లీ: మొన్న పఠాన్‌కోట్.. నిన్న ఉడీ.. నేడు నగ్రోటా..! ఒకే ఏడాదిలో ఒకదాని వెంట ఒకటి ఉగ్రదాడులు!! ఎంత అప్రమత్తంగా ఉన్నా ముష్కర మూకలు ఎలా దాడులకు తెగబడుతున్నాయి? ఏకంగా పోలీసు దుస్తుల్లోనే వచ్చి రక్తపుటేర్లు ఎలా పారిస్తున్నాయి? ఇప్పుడు రక్షణ వర్గాలను, ఆ రంగ నిపుణుల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఉగ్రవాదుల ఈ వరుస దాడులు భద్రతాపరమైన లోపాలను తేటతెల్లం చేస్తున్నాయని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్మీ యూనిట్లు, శిబిరాలపై దాడులు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టడంలో రక్షణ శాఖతోపాటు భద్రతా బలగాలు విఫలమవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. చొరబాట్లను కట్టుదిట్టంగా నియంత్రించడంతోపాటు యూనిట్లకు కాపలాగా ఉండే సెంట్రీ వ్యవస్థనూ ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పఠాన్‌కోట్‌లో ఏడుగురు, సెప్టెంబర్‌లో ఉడీ దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. ఇవి మరవకముందే తాజాగా నగ్రోటాలో ముష్కరులు మరోసారి దాడికి తెగబడి ఇద్దరు అధికారులతోపాటు ఏడుగురు జవాన్లను బలిగొన్న సంగతి తెలిసిందే. ఆ సిఫారసుల అమలు ఏది? జనవరి 2న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో ఉగ్ర దాడి తర్వాత కేంద్రం ఒక కమిటీ నియమించింది. భద్రతాపరమైన లోపాలపై ఈ కమిటీ పలు సిఫారసులు చేసింది. అయితే అవి ఇప్పటికీ పూర్తిస్థారుులో అమలుకావడం లేదు. మాజీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కాంపోజ్ గత మేలో రక్షణమంత్రికి నివేదిక సమర్పించారు. అయినా భద్రతా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచడం లేదు. ఇది మరిన్ని దాడులకు ఆస్కారమిస్తోంది. బలగాలపై ఒత్తిడి ఉందా? రక్షణ బలగాల్లో దీర్ఘకాలంగా ఒత్తిడి ఉంటోందని, దీనివల్ల వారు పూర్తిస్థారుులో భద్రత కల్పించేందుకు అవకాశం ఉండట్లేదని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ముష్కర మూకలకు కళ్లెం వేయాలంటే వైఫల్యాలను తక్షణమే అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పర్యవేక్షక వ్యవస్థపై సందేహాలు నగ్రోటా దాడి ఆపరేషన్‌కు వారం క్రితమే ముష్కరులు పక్కా రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ‘‘ఆర్మీ యూనిట్లోకి చొరబడిన ఉగ్రవాదులు ధరించిన పోలీసు దుస్తులను భారత్‌లోనే కుట్టించారు. ఇది ఒక రోజులో జరిగే పని ఎంతమాత్రం కాదు. దీన్నిబట్టి చూస్తే ఉగ్రవాదులు ఇక్కడే కొంతకాలం మకాం పెట్టినట్లు తెలుస్తోంది’’ అని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇదే నిజమైతే మన ఇంటెలిజెన్స, పర్యవేక్షక వ్యవస్థపై కొన్ని సందేహాలు కలగకపోవన్నారు. ఉగ్రవాదులు ఇక్కడ తిష్ట వేస్తే వారి అనుపానులు గుర్తిస్తూ ఇంటెలిజెన్స ఎప్పటికప్పుడు బలగాలను అప్రమత్తం చేయాలి. కానీ ఇక్కడ అదేదీ జరగలేదని చెబుతున్నారు. -
ఏడుగురు పాక్ రేంజర్ల హతం
-
ఏడుగురు పాక్ రేంజర్ల హతం
జమ్మూ సరిహద్దులో ఓ ఉగ్రవాది కూడా.. బీఎస్ఎఫ్ జవానుకు గాయాలు పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ బలగాలు - సరిహద్దుల్లో రెండు చోట్ల కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాక్ జమ్మూ: దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత బలగాలు దీటైన సమాధానం చెప్పాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడటంతో బీఎస్ఎఫ్ దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. జమ్మూలోని కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాను కూడా గాయపడ్డాడు. శుక్రవారం ఉదయం 9.35 గంటల సమయంలో కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో భారత ఔట్‌పోస్ట్‌లపై పాక్ రేంజర్లు స్నైపర్ దాడులు జరిపారని బీఎస్ఎఫ్ తెలిపింది. దీంతో భారత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, ఏడుగురు పాక్ రేంజర్లు, ఓ ఉగ్రవాది మరణించారని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఇదే ప్రాంతంలో అంతకుముందు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. గుర్నామ్ సింగ్‌ను జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికి త్స అందజేస్తున్నట్టు చెప్పారు. కథువా జిల్లాలోనే గురువారం ఆరుగురు ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేసిన కొద్ది గంటలకే పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడటం గమనార్హం. కాగా, సరిహద్దుల్లోని జమ్మూ జిల్లా అక్నూర్ సెక్టార్‌లోని పర్గ్వాల్ బెల్ట్‌లోనూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినట్టు శుక్రవారం ఉదయం బీఎస్ఎఫ్ ఐజీ(జమ్మూ) డీకే ఉపాధ్యాయ వెల్లడించారు. తాము పాక్ బలగాలకు దీటుగా సమాధానం చెప్పామని, వారికి భారీ నష్టాన్ని చేకూర్చామని చెప్పారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, చొరబాటు యత్నాలను ఎదుర్కొనేందుకు బలగాలను సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, వారికి సాయం చేసేందుకే పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారని ఆరోపించారు. చొరబాటు కుట్ర భగ్నం మరోవైపు.. వాస్తవాధీన రేఖకు సమీపంలోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. భారీగా ఆయుధాలతో ఉగ్రవాదులు పూంచ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించారని, దానిని భద్రతా బలగాలు సమర్థంగా భగ్నం చేశాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దీంతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారన్నారు. ‘సర్జికల్’ తర్వాత 31వ సారి భారత్ సర్జికల్ దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం ఇది 31వ సారి. గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పులకు తెగబడటం ఇది ఐదోసారి. కాగా, శుక్రవారం భారత, పాక్ దళాల మధ్య కాల్పులు జరిగాయని, పంజాబ్ ప్రావిన్స్‌లోని షకార్‌గఢ్ సెక్టార్లో ఈ ఘటన చోటు చేసుకుందని పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కాల్పులు సుమారు అర గంట పాటు కొనసాగాయని తెలిపింది. అయితే పాక్ మీడియా మాత్రం భారత బలగాల కాల్పుల్లో ఐదుగురు పాక్ రేంజర్లు హతమైనట్టు పేర్కొనడం గమనార్హం. -
వారు వెనక్కిరాక తప్పదు
- టీఆర్ఎస్లో చేరిన వారిపై రక్షణ శాఖ మంత్రి పరీకర్ - రాష్ట్రంలో బీజేపీ ఎదగడానికి చాలా అవకాశాలు - బీజేపీ పదాధికారులు, కార్యవర్గ సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, కానీ ఆ పార్టీలో చేరుతున్నవారంతా తిరుగుముఖం పట్టక తప్పదని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో పార్టీ పదాధికారులు, కార్యవర్గ సభ్యుల సమావేశం ఓ హోటల్లో జరిగింది. కేంద్రమంత్రి మనోహర్ పరీకర్ ప్రారంభోపన్యాసం చేస్తూ తెలంగాణలో వాస్తుపాలన కొనసాగుతున్నదన్నారు. స్వంతగా బలపడాలే తప్ప పార్టీ ఫిరాయింపులు ఎక్కువ కాలం పనికిరావని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగితే అధికారం అదే సాధ్యమవుతుందన్నారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో కొంత వెనకబడ్డామన్నారు. జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర శాఖతో కొంత సమాచారలోపం ఉన్నట్టుగా కనిపిస్తోందని, భవిష్యత్తులో అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పరీకర్ చెప్పారు. కాగా, పరీకర్ ప్రసంగంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అని సంబోధించడంతో పార్టీ నేతలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. టీఆర్ఎస్ పాలన దారి తప్పింది: లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన దారి తప్పిందన్నారు. అభద్రతాభావంతో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శిం చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, పార్టీ ఫిరాయింపులతోనే సమ యం గడిపేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం 80 వేల ఇళ్లను మంజూరుచేసినా రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌తో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మేలు చేస్తోందని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రూ.700 కోట్లు ఇస్తే వాటిని రైతులకు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం నిద్రపోతున్నదన్నారు. భూసేకరణ చట్టాన్ని అమలుచేయకుండా తూట్లు పొడిచేవిధంగా జీఓ 123 తెచ్చిం దని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా, అబద్ధాలు మాట్లాడుతున్నారని లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనడం ఎంపీ కవిత అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ దుష్ర్పచారం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. పార్టీ శాసనసభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి, అగ్రనేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ఎన్.రామచందర్‌రావు, వెదిరె శ్రీరాం, ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఐటీకి కేంద్రమంత్రి అభినందన
ఐటీ మంత్రి కేటీఆర్ కు లేఖరాసిన రక్షణ శాఖ మంత్రి పారికర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రశంసించారు. ఈ మేర కు రాష్ట్ర ఐటీ శాఖను నిర్వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు కృషిని అభినందిస్తూ తాజాగా లేఖ రాశారు. ప్రధానంగా టీ-హబ్ ద్వారా స్టార్టప్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించడాన్ని లేఖలో కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్రం కలసి పనిచేస్తుందని మనోహర్ పారికర్ పేర్కొన్నారు. టీ-హబ్‌తో రక్షణ శాఖ భాగస్వామ్యం ద్వారా డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్ ఇకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని, ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీఆర్డీవోను ఆదేశించినట్లు కేంద్రమంత్రి ఆ లేఖలో వివరించారు. కాగా, ఐటీశాఖ పనితీరును ప్రశంసిస్తూ రక్షణ మంత్రి లేఖరాయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో డిఫెన్స్/ ఏరోస్పేస్ ఇంక్యుబేటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు కేటీఆర్ తెలిపారు. మలేషియా మంత్రి నుంచి మరో లేఖ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మలేషియా ప్రభుత్వం తరఫున పరిశ్రమల మంత్రి ముస్తఫా మహమ్మద్ నుంచి మరోలేఖ అందింది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఆయన మలేషియన్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖరాశారు. భవిష్యత్‌లోనూ మలేషియా, తెలంగాణ మధ్య ఇదేరకమైన సుహృద్భావ సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. మరిన్ని వ్యాపార సంబంధాలను పెంపొందించుకునేందుకు మలేషియాకు రావాల్సిందిగా, మంత్రి కేటీఆర్‌ను ముస్తఫా ఆహ్వానించారు. -
రక్షణ శాఖలోనూ సృజనకు ప్రాధాన్యం
- ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు యత్నాలు - రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీశ్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రక్షణ మంత్రిత్వ శాఖలో సృజనకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కొత్త కొత్త ఆలోచనలను వస్తు, సేవల స్థాయికి తీసుకువచ్చేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం నుంచి కూడా పెట్టుబడులు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగంలో ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్ సెమీ కండక్టర్లు, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్ఎస్ఐ) డిజైనింగ్‌లోనూ దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందన్నారు. వచ్చే ఏడాది జనవరి 7-11 వరకు జరిగే వీఎల్ఎస్ఐ డిజైన్ 2017 వంటి అంతర్జాతీయ సదస్సు ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ రంగంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని, దేశానికి ఉపయోగపడే మరిన్ని కొత్త ఆలోచనలు, సృ జనను ప్రోత్సహించాలని ఆయన సదస్సు నిర్వాహకులకు సూచించారు. విద్యా, పరిశోధన, పరిశ్రమ రంగాలు కలిసికట్టుగా పనిచేస్తే ఇది సాధ్యమేనన్నారు. దాదాపు 400 మంది విదేశీ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొంటారని వీఎల్‌ఎస్‌ఐడీ 2017 సదస్సు జనరల్ చెయిర్ జి.దశరథ్ తెలిపారు. హైదరాబాద్‌లో వీఎల్‌ఐఎస్‌ఐ అకాడమీ: జయేశ్‌రంజన్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను టెక్నాలజీ రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే క్రమంలో భాగంగా త్వరలోనే నగరంలో వీఎల్ఎస్ఐ డిజైన్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. దీనికి అవసరమైన స్థలం గుర్తించామని, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగానికి అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేయడం ఈ డిజైన్ అకాడమీ లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. మైక్రో ప్రాసెసర్ తయారీ సంస్థ ఏఎండీ సహా అనేక కంపెనీలు ఈ అకాడమీ ఏర్పాటులో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలసి తాను ఇటీవల అమెరికాలో పర్యటించానని, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఐటీ, ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ పాలసీకి అక్కడి ఐటీ దిగ్గజాలు మద్దతు తెలిపాయని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇన్క్యుబేటర్ టీ-హబ్ ఆధారంగా హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోనూ ముందడుగు వేసేందుకు టీ-వర్క్స్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్, సెమీకండక్టర్ రంగంలో ప్రొటోటైపింగ్ మొదలుకొని అనేక టెక్నాలజీల అభివృద్ధికి పనికొచ్చే టీ-వర్క్స్‌తో కలసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న ప్రొటోటైపింగ్ ల్యాబ్ ఒకటి ఆసక్తి చూపిందన్నారు. -
అగస్టా తీర్పులో ‘కాగ్’
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌ల్యాండ్ స్కాంకు సంబంధించి.. ఇటలీ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో పేర్కొన్న అనుమానాలనూ ఆధారంగా తీసుకుంది. అగస్టా మాతృసంస్థ ఫిన్మెకానికా అధిపతిని కోర్టు గత నెల దోషిగా ప్రకటించడం తెలిసిందే. 2013లో కాగ్ వినోద్‌రాయ్ ఇచ్చిన నివేదికలో.. ప్రభుత్వానికి అవసరమైన హెలికాప్టర్లు 19వేల అడుగుల ఎత్తులో ఎగరగలిగాలని రక్షణ శాఖ తొలుత నిర్ణయించిందని.. దాని ప్రకారం అగస్టా సంస్థకు అర్హత ఉండదని పేర్కొంది. ఆ సంస్థ హెలికాప్టర్లు ఎగరగలిగే ఎత్తు 15 వేల అడుగుల వరకే ఉందని తెలిపింది. అయితే.. పర్వతమయమైన ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో విహరించేందుకోసం కొనాల్సిన హెలికాప్టర్లు ఎగరగలిగే ఎత్తు పరిమితిని తగ్గించారంది. కాగ్ పేర్కొన్న ఈ అంశాలను.. అప్పటి భారత వైమానిక దళ చీఫ్ త్యాగి అగస్టా సంస్థతో కుమ్మక్కయ్యారనేందుకు ఆధారాల్లో ఒకటి అని ఇటలీ కోర్టు ఉటంకించింది. హెలికాప్టర్లు ఎంతవరకూ ఎగరగలగాలి అనే సమాచారం ఆయనకు ముందస్తుగా తెలుసంది. త్యాగి, గుజ్రాల్‌లను మళ్లీ ప్రశ్నించనున్న సీబీఐ: ఈ స్కాంలో వైమానిక దళ మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ ఎస్.పి.త్యాగి, మాజీ డిప్యూటీ ఎయిర్ చీఫ్ జె.ఎస్.గుజ్రాల్‌లను సీబీఐ మళ్లీ ప్రశ్నించనుంది. గుజ్రాల్‌ను శనివారం, త్యాగిని సోమవారం సీబీఐ ఎదుట హాజరు కావాల్సిందిగా వారికి తెలిపినట్లు సమాచారం. -
అఫ్గాన్ పార్లమెంటుపై రాకెట్ దాడి
కాబుల్: అఫ్గానిస్తాన్ పార్లమెంటుపై తాలిబన్ ఉగ్రవాదులు సోమవారం నాలుగు రాకెట్లతో దాడి చేశారు. ఒక రాకెట్ పార్లమెంటు భవనాన్ని తాకడంతో కొంతమేర నష్టం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు రాకెట్లు భవనం పరిసర ప్రాంతాల్లో పడగా, మరొకటి దగ్గర్లోని ఆర్మీ బేస్‌లోకి దూసుకెళ్లింది. దేశ భద్రతపై పార్లమెంట్‌కు వివరించేందుకు హోం, రక్షణ శాఖ అధికారులతో పాటు జాతీయ భద్రతా విభాగం డెరైక్టర్లు భవనంలోకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరూ గాయపడలేదని, అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఎంపీ ఒకరు తెలిపారు. దాడి జరిగినా పార్లమెంటు సమావేశాలు యథావిధిగా కొనసాగాయి. భారత్ సహకారంతో నిర్మితమైన ఈ పార్లమెంట్ భవనం కోసం రూ.600 కోట్లు ఖర్చుపెట్టారు. -
అసాధారణం.. మన పాటవం..
కళ్లు చెదిరేలా యుద్ధ విమానాల విన్యాసాలు ♦ రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో వైమానిక దళ శక్తి ప్రదర్శన ♦ సుఖోయ్, జాగ్వర్, మిరేజ్ల సందడి పోఖ్రాన్: మన వైమానిక దళ పాటవమేంటో మరోసారి ప్రపంచం కళ్లారా వీక్షించింది. శత్రుదేశాలకు గుబులు పుట్టించే రీతిలో భారత వైమానిక దళం తన శక్తి సామర్థ్యాలు ఏపాటివో అత్యద్భుతంగా, అబ్బుర పరిచేవిధంగా ప్రదర్శించింది. భారతదేశ సర్వసైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం శాఖ, రక్షణ శాఖ మంత్రులు ఇతర అతిరథమహారథులు వీక్షిస్తుండగా అణ్వస్త్ర ప్రయోగ భూమి రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో శుక్రవారం భారత వైమానిక విన్యాసాలు జరిగాయి. థార్ ఎడారిలో భారత్ అణ్వస్త్రాలను రెండు సార్లు విజయవంతంగా ప్రయోగించిన పోఖ్రాన్ యుద్ధ విమానాల విన్యాసాలతో రణభూమిగా మార్మోగిపోయింది. ‘ఐరన్ ఫిస్ట్-2016’ పేరిట పొఖ్రాన్‌లో నిర్వహించిన ఈ షోలో ఎయిర్‌క్రాఫ్ట్‌లు కళ్లుచెదిరే విన్యాసాలతో కట్టిపడేశాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ విన్యాసాలను ప్రారంభించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 22 రకాల యుద్ధ వైమానిక వేదికల నుంచి ఆయుధ వ్యవస్థలు తమ పాటవాన్ని ప్రదర్శించాయి. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ద్వారా గాలిలో నుంచి గాలిలో క్షిపణిని ఛేదించడం అబ్బురపరిచింది. భూమి నుంచి గాలిలో క్షిపణిని ఛేదించే ఆకాశ్ క్షిపణిని కూడా ఇందులో ప్రదర్శించారు. త్వరలో సైన్యంలోకి చేరనున్న తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ రాకెట్లను ప్రయోగించింది. ఫైటర్ జెట్లు- సుఖోయ్ 30, మిరేజ్-2000, మిగ్-27, జాగ్వర్లు ఆకాశంలో సందడి చేశాయి. రాత్రిపూట నిర్వహించిన ప్రదర్శనలో 180 యుద్ధవిమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. నిశ్శబ్దంగా ఉన్న నీలి ఆకాశం మండితున్నట్లు భ్రమ కలిగించేలా ఈ ప్రదర్శన సాగింది. ఇందులో పలు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. భారతీయ వాయుసేన సామర్థ్యం తెలియచెప్పడమేనని విన్యాసాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఎక్సర్సైజ్ ఐరన్ ఫిస్ట్‌ను 2013లో మొదటిసారి నిర్వహించారు. -
శాఖల మధ్య సమన్వయమేదీ?
పఠాన్‌కోట్ దాడిలో కేంద్రం తీరుపై లోక్‌సభలో విపక్షాల ధ్వజం న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును లోక్‌సభలో ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఆ ఆపరేషన్‌ను ఎన్ఎస్జీకి అప్పగించాలని నిర్ణయం తీసుకోవటం తీవ్ర పొరపాటని అభివర్ణించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాహోర్‌లో ఆగి పాక్ ప్రధానమంత్రిని కలిసి వచ్చిన కొద్ది రోజులకే పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి జరిగిందని, మోదీ లాహర్లో పర్యటన ఏం సాధించిందని ప్రశ్నించాయి. బుధవారం లోక్‌సభలో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఉగ్రదాడి విషయంలో నిర్ణయాధికారాలను జాతీయ భద్రతా సలహాదారు సొంతం చేసుకున్నారని బీజేడీ సభ్యుడు కైలాస్ సింగ్ దేవ్ మండిపడ్డారు. పఠాన్‌కోట్‌లోనే 50 వేల సైన్యం ఉంటే.. ఉగ్రదాడిని తిప్పికొట్టే పనిని సైన్యానికే ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. పఠాన్‌కోట్ దాడి సందర్భంలో రక్షణశాఖకు, హోంశాఖకు సమన్వయం లేదని, భధ్రతపై కేబినెట్ కమిటీ భేటీ నిర్వహించలేదని కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింథియా తప్పుపట్టారు. ఉగ్రవాదులు ఉన్నట్లు వారు దాడి చేయటానికి 48 గంటల ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ.. వారిని అంతసేపు స్వేచ్ఛగా తిరిగేలా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ఆరేళ్ల పాటు చేసిన కృషిని.. ప్రధాని మోదీ ఒక కప్పు కాఫీ కోసం లాహోర్ వెళ్లి వృథా చేశారని విమర్శించారు. -
మాజీ సైనికుల ‘మెడల్స్ నిరసన’
♦ తిరిగిచ్చేసిన 2 వేల మంది ♦ ఓఆర్ఓపీ నోటిఫికేషన్‌పై నిరసన చండీగఢ్/వాస్కోడాగామా: ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ (ఓఆర్ఓపీ)పై ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను నిరసిస్తూ చాలామంది మాజీ సైనికులు మంగళవారం తమ మెడల్స్‌ను తిరిగి ఇచ్చేశారు. దేశానికి తాము అందించిన వీరోచిత సేవలకు గుర్తుగా ఇచ్చిన మెడల్స్‌ను ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌లలో మాజీ సైనికులు తిరిగి ఇచ్చేశారు. ఓఆర్ఓపీ పథకంపై ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కి తగ్గడాన్ని నిరసిస్తూ ‘బ్లాక్ దివాళీ’ని పాటిస్తామని మాజీ సైనికులు చెప్పారు. గతవారం ఓఆర్ఓపీపై ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం అంబాలా, మోగ, జలంధర్, గురుదాస్‌పూర్‌లలో మాజీ సైనికులు మెడల్స్‌ను ఇచ్చేశారని, తదుపరి ముంబై, పుణే, బెంగళూరు, వడోదరాలలో ఇచ్చేస్తారని నిరసనకారుల ప్రతినిధి కల్నల్ అనిల్ కౌల్ ఢిల్లీలో చెప్పారు. ఢిల్లీలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెడల్స్‌ను వాపస్ చేశారు. మెడల్స్‌ను వెనక్కితీసుకోకుంటే రోడ్డుపైనే వదిలేస్తామని చెప్పారని, అందుకే వాటిని తీసుకోవాల్సి వచ్చిందని కలెక్టర్ సంజయ్ కుమార్ విలేకరులకు చెప్పారు. ఈ వ్యవహారంపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ తీవ్రంగా స్పందించారు. వీరి చర్య సైనికుల మాదిరి లేదని మండిపడ్డారు. మాజీ సైనికులు ఇలాంటి చర్యలకు దిగడం కలచివేసిందన్నారు. వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆర్థికపరమైన డిమాండ్లకు మెడల్స్‌కు ముడిపెట్టవద్దని వాస్కోడాగామాలో సూచించారు. సైనికుల మాదిరి ప్రవర్తించలేదన్న పరీకర్ వ్యాఖ్యలపై కల్నల్ అనిల్ కౌల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శైలి రక్షణ మంత్రి మాదిరి లేదని నిప్పులు చెరిగారు. ఓఆర్ఓపీపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందంటూ కాంగ్రెస్ మండిపడింది. -
ఆకాశ యుద్ధానికి మహిళలు
యుద్ధ విమానాల పైలట్లుగా నియమించేందుకు కేంద్రం ఓకే ♦ నేరుగా యుద్ధక్షేత్రంలో పనిచేసే దళాల్లో తొలిసారిగా చోటు ♦ ఇప్పటికే వైమానిక దళ అకాడమీలో శిక్షణ ప్రారంభం ♦ 2017 జూన్ నాటికి పూర్తిస్థాయిలో పైలట్ బాధ్యతలు న్యూఢిల్లీ: వాయుసేనలో మహిళా పైలట్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దేశంలోని సైనిక దళాల్లో నేరుగా యుద్ధ క్షేత్రంలో పనిచేసే విభాగాల్లో మహిళలు నియామకం కానుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్‌లోంచి తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లను ఎంపికచేయనున్నట్లు రక్షణశాఖ శనివారం ప్రకటించింది. తొలి మహిళా పైలట్ల బ్యాచ్ 2016 జూన్ నాటికి వాయుసేనలో నియామకం అవుతుందని, ఒక సంవత్సరంపాటు అడ్వాన్స్డ్ శిక్షణ అనంతరం 2017 జూన్ నాటికి వారు నేరుగా యుద్ధవిమానాలు నడుపుతారని వెల్లడించింది. భారతీయ మహిళల ఆకాంక్షలను, అభివృద్ధి చెందిన దేశాల సైనిక దళాల ధోరణికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వాయుసేనలో హెలికాప్టర్లు, రవాణా విభాగాల్లో ఇప్పటికే నియామకమైన మహిళా ఉద్యోగులు.. వారి సహచర పురుషుల కంటే బాగా పనిచేస్తున్నారని ప్రశంసించింది. తాజాగా యుద్ధ విమానాల పైలట్లుగా అవకాశం కల్పించడం... యుద్ధరంగంలోనూ వారి సామర్థ్యాన్ని చూపేందుకు అవకాశమని రక్షణశాఖ పేర్కొంది. అయితే త్రివిధ దళాల్లో నేరుగా యుద్ధంలో పాల్గొనే విభాగాలు మినహా మిగతా విభాగాల్లో ఇప్పటికే మహిళలు పనిచేస్తున్నారు. సిగ్నల్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్ డిఫెన్స్, ఇంటలిజెన్స్ కార్ప్స్, ఎడ్యుకేషన్ కార్ప్స్, లాజిస్టిక్స్, అబ్జర్వర్. నావల్ కన్స్ట్రక్టర్స్ వంటి పలు విభాగాల్లో మహిళలను నియమిస్తుండగా... తాజాగా యుద్ధ విమానాల పైలట్లుగా అవకాశం కల్పిస్తున్నారు. వాయుసేనలో ప్రస్తుతం 1,500 మహిళలు పనిచేస్తుండగా... అందులో 94 మంది పైలట్లు, 14 మంది నావిగేటర్లు. కానీ వీరు రవాణా, హెలికాప్టర్ విభాగాల్లో ఉన్నారు. -
లైడార్ సర్వే వివరాలు సెన్సార్!
ప్రాణహితపై సర్వే అంశాలు యథాతథంగా ఇవ్వలేమంటున్న సర్వే ఆఫ్ ఇండియా సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పులో భాగంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీ పరివాహక ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో నిర్వహించిన లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లైడార్) సర్వే వివరాలను యథాతథంగా ఇచ్చేందుకు సర్వే ఆఫ్ ఇండియా కొర్రీలు పెడుతోంది. సర్వే ద్వారా తీసిన త్రీడీ, టోఫోగ్రఫిక్ చిత్రాలను అన్నింటినీ ఇవ్వడం కుదరదని, ఏ వివరాలు, ఎందుకు కావాలో కోరితే ఆ వివరాలే సమర్పిస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా ప్రభుత్వం చెక్లిస్ట్ని సర్వే ఆఫ్ ఇండియాకు పంపినట్లుగా తెలిసింది. గోదావరి నీటిని తీసుకునేందుకు ప్రతిపాదించిన కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఇచ్ఛంపల్లి మార్గాల వద్ద గత నెలలో మొదటి విడత లైడార్ సర్వే జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిడ్‌మానేరు నుంచి తడ్కపల్లి, పాములపర్తి, నిజాంసాగర్ల మధ్య రెండో విడత సర్వే కొనసాగుతోంది. సర్వేలో భాగంగా హెలికాప్టర్ ద్వారా లేజర్ కిరాణాలు పంపి దూరాలు, లోతును కొలిచే పనిని పూర్తిచేశారు. దీనిద్వారా సర్వే చేసిన ప్రాంతంలో రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంతో త్రీడీ చిత్రాలను తీయవచ్చు. తొలి విడత సర్వేలో ఈ ప్రక్రియంతా పూర్తయింది. అయితే ఈ వివరాలను పూర్తిగా ఇవ్వడానికి సర్వే ఆఫ్ ఇండియా ఒప్పుకోవడం లేదు. దీంతో అధికారులు తమ అవసరాలను పేర్కొంటూ సర్వే ఆఫ్ ఇండియాకు జాబితా పంపారు. వీటిని పరిశీలించాక సర్వే ఆఫ్ ఇండియా ఒక బ్యాచ్ నంబర్‌ను రాష్ట్రానికి ఇస్తుంది. నంబర్‌ను తీసుకొని కేంద్ర రక్షణ శాఖ వద్దకు వెళితే ఏయే వివరాలు కావాలో వాటిని మాత్రమే రాష్ట్రానికి ఇస్తారని తెలుస్తోంది. -
మాజీ జవాన్లపై పోలీసు జులుం
- ఢిల్లీలో ధర్నాచేస్తున్న వారిపై ఖాకీల బలప్రయోగం - ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ కోసం 62 రోజులుగా నిరసన - టెంట్లు తీసేసి, బలవంతంగా ఖాళీ చేయించిన పోలీసులు - ఖండించిన రాహుల్, మాజీ సైనికులకు సంఘీభావం - ‘ఓఆర్ఓపీ’అమలు తేదీ చెప్పాలని ప్రధానికి డిమాండ్ న్యూఢిల్లీ: రక్షణ శాఖలో ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ)’ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 62 రోజులుగా ధర్నా చేస్తున్న మాజీ సైనికులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దేశం కోసం ప్రాణాలను అడ్డుపెట్టినవారిని భద్రతకు ముప్పంటూ బలవంతంగా ఖాళీ చేయించా రు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు స్వాతంత్య్ర దిన భద్రతా ఏర్పాట్లలో భాగంగా మాజీ సైనికులను జంతర్ మంతర్ వద్ద నుంచి ఢిల్లీ పోలీసులు శుక్రవారం బలవంతంగా తరలించారు. ధర్నా వేదిక వద్ద టెంట్లను తొలగించారు. భద్రత పేరుతో పోలీసులు ఇలా మాజీ సైనికులపై బలప్రయోగం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం తర్వాత వెనక్కి తగ్గింది. ఘటనపై విచారం తెలిపింది. జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు ధర్నా కొనసాగించేందుకు అనుమతించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ సైనికులకు తెలిపారు. కేంద్రం అనుమతించినందున తొలగించిన టెంట్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకి మాజీ సైనికులు విజ్ఞప్తిచేశారు. కాగా, ఓఆర్ఓపీ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మాజీ సైనికులపై పోలీసులు బలప్రయోగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ధర్నా స్థలికి చేరుకుని మాజీ జవాన్లకు సంఘీభావం ప్రకటించారు. ప్రధాని సులభంగా హామీలిస్తారని, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమవుతుంటారన్నారు. ‘యువతకు ఉద్యోగాల హామీనిచ్చారు. మేక్ ఇన్ ఇండియా విఫలమైంది. స్వచ్ఛ భారత్ ఫలప్రదం కాలేదు. తన కార్పొరేట్ మిత్రులకు భూ బిల్లును తెస్తానని హామీనిచ్చినా, సాధ్యం కాలేదు. ఓఆర్ఓపీనీ నెరవేర్చలేదు’ అని విమర్శించారు. అయితే, రాహుల్‌కు మాజీ సైనికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లుగా రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్దకు రావడం కంటే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రస్తావిస్తే బాగుండేదన్నారు. దీన్నిప్పుడు రాజకీయం చేయొద్దన్నారు. ఢిల్లీ సీఎంకేజ్రీవాల్ కూడా మాజీ సైనికులకు సంఘీభావం ప్రకటించారు. ఓఆర్ఓపీ అమలు గురించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రకటించాలని కోరారు. హామీని నెరవేరుస్తాం.. ఓఆర్ఓపీపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ డెహ్రాడూన్‌లో మాట్లాడుతూ.. ఈ విధానం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, అయినా హామీని నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వ పదవీకాలంలోపు ఈ హామీని నెరవేరుస్తామన్నామని, వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. ఓఆర్ఓపీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అరుణ్ జైట్లీ కూడా తెలిపారు. ఈ విధానం అమలుకు కసరత్తు జరుగుతోందన్నారు. రక్షణశాఖలో ఒకే ర్యాంకు, ఒకే సర్వీస్‌తో రిటైర్ అయ్యే సిబ్బందికి ఓఆర్ఓపీ విధానం అమలుచేయాలని మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం అమలైతే తక్షణం 22 లక్షల మంది మాజీ సైనికులు, 6 లక్షలకు పైగా అమరసైనికుల భార్యలు లబ్ధి పొందనున్నారు. అయితే, ఓఆర్ఓపీ త్వరలోనే అమలు కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జైపూర్‌లో విలేకరులకు తెలిపారు. మేం దేశ భద్రతకు ముప్పా? దేశం కోసం ఒకప్పుడు ప్రాణాలను అడ్డుపెట్టిన తాము ఇప్పుడు దేశ భద్రతకు ముప్పుగా కనిపిస్తున్నామా? అంటూ పోలీసుల తీరుపై మాజీ సైనికులు మండిపడ్డారు. ‘మమ్మల్ని ఎలా అనుమానిస్తారు? దేశాన్ని రక్షించిన మేం ఇప్పుడు ముప్పుగా మారామా?’ అని ఒకరన్నారు. ‘భద్రతా కారణాల రీత్యా మమ్మల్ని ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. కానీ నన్ను తోసేశారు. చొక్కా చిరిగింది’ అంటూ 82 ఏళ్ల మాజీ సైనికుడు తప్పుట్టారు. పంద్రా గస్టుకు ఒక రోజు ముందు తమ స్వాతంత్య్రాన్ని హరించడం ఆటవికమన్నారు. -
ఆర్మీ, రెవెన్యూ ‘ఫైరింగ్’ రేంజ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రక్షణశాఖ ఆధీనంలో ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కిచ్చేందుకు మొండికేసింది. గడువు ముగియడంతో స్థల స్వాధీనానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై తిరగబడింది. శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో సర్వే నంబర్ 502-937 వరకు గల 617 ఎకరాలను ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అవసరాల కోసం 1968లో రాష్ట్ర సర్కారు కేటాయించింది. క్షిపణుల ప్రయోగం, ఆయుధాల పరీక్షలకు ఈ భూమిని రక్షణ శాఖ వాడుకుంటోంది. రెండేళ్ల క్రితం కాలపరిమితి ముగియడంతో స్థలాన్ని ఖాళీ చేయాలని జిల్లా యంత్రాంగం కోరింది. అయితే, నిర్దేశిత ఫైరింగ్ రేంజ్ పరిసరాల్లో ఇబ్బడిముబ్బడిగా జనావాసాలు రావడం, నగరీకరణ నేపథ్యంలో లీజు పొడగింపునకు అభ్యంతరం వ్యక్తంచేసింది. దీనికితోడు ఫైరింగ్ రేంజ్ సమీపాన ఔటర్ రింగ్‌రోడ్డు కూడా ఉండడంతో ప్రమాదకరమని భావించిన హెచ్ఎండీఏ కూడా లీజు పొడిగించకూడదని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ అంశాలను పరిగణనలో తీసుకున్న కలెక్టర్ రఘునందన్‌రావు మార్చిలో లీజును రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన స్థానిక తహసీల్దార్ దేవుజాకు ఆర్మీ అధికారుల నుంచి చుక్కెదురైంది. ‘సర్కారు స్థలం’గా పేర్కొంటూ బోర్డులు పాతేందుకు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ అధికారులు అడ్డుకున్నారు. ఈ భూమిపై రెవెన్యూశాఖకు ఎలాంటి హక్కులు లేవ ని.. ఇది పూర్తిగా తమకే చెందుతుందని వాదనకు దిగారు. అంతేగాకుండా బోర్డులు ఏర్పాటు చేస్తే.. చర్యలు తీసుకుంటామని తమదైన శైలిలో హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. భూమిని స్వాధీనం చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడితే ఖాళీ చేస్తాం తప్ప.. వాదనలు అనవసరమని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక రెవెన్యూ గణం వెనుదిరిగింది. ఇదిలావుండగా, సర్కారు భూమిలో పాగా వేయడమేగాకుండా.. ఖాళీ చేయించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను ఆర్మీ జవాన్లు అడ్డుకున్న సంఘటనను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. దీంతో జరిగిన పరిణామాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారంపై రక్షణశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
రాచమార్గాల్లో రక్షణ అడ్డంకులు!
- ఎలివేటెడ్ కారిడార్లకు 250 ఎకరాలు అవసరం - రక్షణశాఖ పరిధిలో 75 ఎకరాలు - భూసేకరణపై దృష్టి సారించిన సర్కార్ - ఆకాశమార్గాలపై తుది దశకు చేరిన అధ్యయనం - త్వరలో సమగ్ర నివేదిక సాక్షి, సిటీబ్యూరో: ఆకాశ మార్గాలపై అధ్యయనం తుది దశకు చేరుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు జిల్లా కేంద్రాలకు మధ్య దూరభారాన్ని తగ్గించే లక్ష్యంతో మూడు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్యారడైజ్ నుంచి కంటోన్మెంట్ మీదుగా శామీర్‌పేట్ ఔటర్ రింగురోడ్డు వరకు, బాలానగర్ నుంచి జీడిమెట్ల మీదుగా నర్సాపూర్ ఔటర్ రింగురోడ్డు వరకు, ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి ఘట్కేసర్ ఔటర్ రింగురోడ్డు మార్గాల్లో ఆకాశ రహదారులను నిర్మిస్తారు. ప్యారడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాలను ఆర్వీ అసోసియేట్స్ అధ్యయనం చేస్తుండగా, ఉప్పల్- ఘట్కేసర్ మార్గాన్ని తాజాగా వాడియా టెక్నాలజీస్‌కు అప్పగించారు. ఈ మూడు మార్గాల్లో సదరు కన్సెల్టెన్సీలు సమగ్రమైన నివేదికలు అందజేయవలసి ఉంది. అయితే గత ఏప్రిల్‌లోనే అధ్యయనం ప్రారంభించిన ఆర్వీ అసోసియేట్స్ ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల్లో త్వరలో తుది నివేదికను అందజేసే పనిలో ఉంది. ఆ సంస్థ అధ్యయనం మేరకు ఈ రెండు మార్గాల్లో రోడ్ల విస్తరణకు 250 ఎకరాల భూమి అవసరం. 20 కిలోమీటర్ల వరకు నిర్మించనున్న శామీర్‌పేట్ ఎలివేటెడ్ మార్గంలో 150 ఎకరాలు, 18 కిలోమీటర్ల నర్సాపూర్ ఎలివేటెడ్ మార్గంలో 100 ఎకరాలు సేకరించవలసి ఉంది. శామీర్‌పేట్ మార్గంలో 75 ఎకరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ రక్షణశాఖ పరిధిలో ఉన్న మరో 75 ఎకరాల భూసేకరణ ఇబ్బందిగా మారింది. రక్షణశాఖ నుంచి అనుమతి లభిస్తే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు. కేంద్రానికి లేఖ రాసిన సర్కార్ బాలానగర్-నర్సాపూర్ మార్గంలో భూ సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మార్గంలోని వంద ఎకరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రెవిన్యూ శాఖ నుంచి భూమిని సేకరించేందుకు జాతీయ రహదారుల సంస్థ దృష్టి సారించింది. శామీర్‌పేట్ మార్గంలో సేకరించవలసిన 75 ఎకరాల రక్షణ శాఖ భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఈ లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లభించలేదు. ‘ప్రభుత్వం మరింత గట్టిగా చొరవ తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరిపితే తప్ప ఈ మార్గంలో భూ సేకరణ సాధ్యం కాదు. అదంతా ఒక కొలిక్కి వ స్తే తప్ప పనులు ప్రారంభం కాబోవు.’ అని నేషనల్ హైవేస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఆరు లైన్ల ఫ్లైఓవర్... సుమారు రూ.1600 కోట్లతో నిర్మించతలపెట్టిన శామీర్‌పేట్ ఎలివేటెడ్ మార్గంలో రోడ్డు మార్గాన్ని 4 లైన్లకు విస్తరిస్తారు. ఆకాశమార్గంలో 6 లైన్ల రహదారులు నిర్మిస్తారు. దీంతో ఎక్కడా వాహనాల రద్దీ లేకుండా సాగిపోతాయి. బాలానగర్-నర్సా పూర్, ఉప్పల్ - ఘట్కేసర్ మార్గాల్లోనూ 10 నుంచి 14 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ మార్గాలు నిర్మితమవుతాయి. దీనివల్ల వాహనాల ఫ్రీ ఫ్లో సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ మూడు మార్గాల్లో ప్రతి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎన్‌హెచ్-202 మార్గంలో ఉన్న ఉప్పల్- ఘట్కేసర్ మార్గంలో వాహనాల రద్దీ నరకప్రాయంగా మారింది. వరంగల్ నుంచి ఘట్కేసర్ వరకు కేవలం గంటన్నర వ్యవధిలో చేరుకొంటే అక్కడి నుంచి ఉప్పల్ రింగురోడ్డుకు వచ్చేందుకే మరో గంటన్నరకు పైగా సమయం పడుతుంది. ఉప్పల్-ఘట్‌కేసర్‌పై తాజా అధ్యయనం ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల అధ్యయనం ఆర్వీ అసోసియేట్స్ చేపట్టగా ఉప్పల్- ఘట్కేసర్ మార్గం ప్రాజెక్టును వాడియా టెక్నాలజీస్‌కు అప్పగించారు. 20 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో 10 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ హైవే నిర్మించే అవకాశం ఉంది. -
ధనుష్ శతఘ్నికి ధ్రువీకరణ పరీక్షలు
న్యూఢిల్లీ: బోఫోర్స్ శతఘ్నిని ఆధునీకరించి భారత్ అభివృద్ధిపరుస్తున్న ‘ధను ష్’ శతఘ్ని అభివృద్ధి ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇదివరకే ప్రాథమిక పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఫిరంగి ప్రస్తుతం కీలకమైన ధ్రువీకరణ పరీక్షలు ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాది వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ధ్రువీకరణ పరీక్షల్లో కూడా సత్తా చాటితే ఇక స్వదేశీ శతఘు్నల ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టేందుకు మార్గం సుగమం కానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉత్పత్తికి ఆమోదం లభించాక సైన్యం తొలి దశలో 114 ధనుష్ శతఘు్నల తయారీ కోసం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డు(ఓఎఫ్‌బీ)కు రూ. 1,200 కోట్ల ఆర్డర్‌ను ఇవ్వనుంది. ప్రస్తుత పరీక్షలకు ఉపయోగించే ధనుష్ శతఘు్నలను ఓఎఫ్‌బీకి చెందిన జబల్పూర్లోని గన్ క్యారియేజ్ ఫ్యాక్టరీ తయారు చేస్తోంది. -
తదుపరి ఆర్మీచీఫ్‌గా దల్బీర్‌సింగ్ సుహాగ్
-
తదుపరి ఆర్మీచీఫ్‌గా దల్బీర్‌సింగ్ సుహాగ్
బీజేపీ నిరసనలను పట్టించుకోకుండా నియమించిన ప్రభుత్వం జూలై 31న రిటైరవనున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్ న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్‌ను తదుపరి ఆర్మీ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఆర్మీచీఫ్ నియామకంపై బీజేపీ నుంచి ఎదురవుతున్న నిరసనలను పట్టించుకోకుండా, ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ సుహాగ్ నియామకంపై రక్షణ శాఖ సిఫారసును మంగళవారం ఆమోదించింది. ప్రస్తుత ఆర్మీచీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ జూలై 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సుహాగ్ ఆర్మీచీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్స్‌లో గూర్ఖా అధికారి అయిన దల్బీర్‌సింగ్ సుహాగ్ (59) అందరి కంటే సీనియర్. చిత్తోర్‌గఢ్ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం చేసిన సుహాగ్, 1970లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది, 1974 జూన్‌లో 4/5 గూర్ఖా రెజిమెంట్‌లో చేరారు. సైనిక శిక్షణకు సంబంధించి దేశ విదేశాల్లో పలు కోర్సులు పూర్తిచేసిన సుహాగ్, శ్రీలంకలో చేపట్టిన ‘ఆపరేషన్ పవన్’లో కంపెనీ కమాండర్‌గా కీలక పాత్ర పోషించారు. కాశ్మీర్ లోయలో 2003 జూలై నుంచి 2005 మార్చి వరకు చేపట్టిన చొరబాటు నిరోధక ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. కార్గిల్ యుద్ధంలో 2007 అక్టోబర్ నుంచి 2008 డిసెంబర్ వరకు 8 మౌంటైన్ డివిజన్‌ను విజయవంతంగా నడిపించారు. జనరల్ వీకే సింగ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న సమయంలో తలెత్తిన వివాదం అనంతరం 2012 జూన్ 16న ఈస్టర్న్ ఆర్మీ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. వీకే సింగ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన సుహాగ్‌పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నిషేధం విధించారు. వీకే సింగ్ పదవీ విరమణ తర్వాత బిక్రమ్ సింగ్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సుహాగ్‌పై నిషేధాన్ని తొలగించారు. ఆర్మీ చీఫ్‌గా దల్బీర్ ఎంపికపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొద్దిరోజుల్లోనే కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానున్నందున ఇప్పటికిప్పుడే ఈ నియామకాన్ని చేపట్టేందుకు తొందరేమొచ్చిందని ప్రశ్నించింది. -
విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష
బాలాసోర్: అణ్వాయుధాలను మోసుకుపోగల పృథ్వీ-2 క్షిపణిని శుక్రవారం రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంపై 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒడిశాలోని చాందీపూర్ కేంద్రం నుంచి దీన్ని పరీక్షించి చూశారు. పృథ్వీ-2 క్షిపణి 1,000 కేజీల వరకు వార్హెడ్లను మోసుకుపోగలదని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్‌రేంజ్(ఐటీఆర్) డెరైక్టర్ ప్రసాద్ తెలిపారు. దీన్ని పూర్తిస్థాయిలో పరీక్షించామని, నిర్ణీత లక్ష్యాలను చేరినట్లు చెప్పారు. ఉదయం 9.45గంటలకు మొబైల్ లాంచర్ నుంచి క్షిపణిని ప్రయోగించగా.. దాని ప్రయాణ మార్గాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రాడార్లు, ఒడిశా తీరం వెంబడి ఏర్పాటు చేసిన ఎలక్ట్రో ట్రాకింగ్ సిస్టం, టెలిమెట్రీ స్టేషన్లు అనుక్షణం పరిశీలించాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. పృథ్వీ-2ను 2003లో సైన్యంలోకి ప్రవేశపెట్టారు. క్షిపణి సన్నద్ధతను తెలుసుకోవడంతోపాటు, వ్యూహాత్మక పోరాట దళం(ఎస్ఎఫ్సీ) శిక్షణలో భాగంగా అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలను నిర్వహిస్తూ ఉంటారు. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 4న పృథ్వి-2 పరీక్ష జరిగింది. -
సాగర గర్భం నుంచి అణ్వస్త్రం
దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం మూడు రకాలుగా అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగంలో అగ్రదేశాల సరసన భారత్ గగనతలం, ఉపరితలం నుంచే కాకుండా.. సముద్రగర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగల సత్తాను భారత్ సాధించింది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల దీర్ఘశ్రేణి ‘సబ్‌మెరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్(ఎస్ఎల్బీఎం)’ను సోమవారం బంగాళాఖాతంలో విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సముద్రంలో నీటి లోపలి నుంచి జలాంతర్గామి ద్వారా బీవో5 అణ్వస్త్ర క్షిపణిని రక్షణ శాఖ ఇదివరకే విజయవంతంగా పరీక్షించినప్పటికీ.. దాని లక్ష్య పరిధి 700 కి.మీ. మాత్రమే. తాజాగా పరీక్షించిన క్షిపణి పరిధి 2 వేల కిలోమీటర్లు. నీటి లోపలి నుంచి ప్రయోగించేలా భారత్ రూపొందించినవాటిలో ఇదే అత్యధిక పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి కావడం విశేషం.దీంతో గగన, భూతలాలతోపాటు సముద్రగర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యంలో అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి అతికొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలిచింది. ఈ ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన రక్షణ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అభినందించారు. డీఆర్డీవో అభివృద్ధిపరుస్తున్న ఎస్ఎల్బీఎం క్షిపణులను ఐఎన్ఎస్ అరిహంత్ జలాంతర్గామితో సహా ఇతర వేదికలపై మోహరించనున్నారు. -
యెమెన్‌లో ఆత్మాహుతి దాడి; 25 మంది మృతి
సనా: యెమెన్ రక్షణశాఖ ప్రాంగణంపై గురువారం ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలు నిండిన కారులో వచ్చిన మిలిటెంట్లు రక్షణ శాఖ ప్రాంగణంలోకి దూసుకుపోయి, దాడికి పాల్పడ్డారు. దీంతో రక్షణశాఖ కాల్పులకు ఆదేశించిం ది. ఈ ఘటనలో ముగ్గురు విదేశీ వైద్యులు సహా 25 మంది మరణించారు. తరచూ దాడులకు పాల్పడుతున్న అల్కాయిదానే దీనికీ కారణమని భావిస్తున్నారు. -
రక్షణ బడ్జెట్‌కు కోత?
న్యూఢిల్లీ: రక్షణ శాఖ బడ్జెట్‌కు మరింతగా కోత పడవచ్చని ప్రధాని మన్మోహన్సింగ్ సంకేతాలిచ్చారు. ‘‘రక్షణ అవసరాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాల్సిందే. కాకపోతే రక్షణ పరికరాలు, సాయుధ సంపత్తి తదితరాల కొనుగోళ్ల సందర్భంగా ఆర్థిక మందగమనాన్ని, మనకందుబాటులో ఉన్న పరిమిత వనరులను దృష్టిలో ఉంచుకోవాలి. ‘గుడ్డ కొద్దీ చొక్కా’ తరహాలో వ్యవహరించాలి’’ అని సూచించారు. అంతేగాక రక్షణ కొనుగోళ్లలో ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామిని చేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం త్రివిధ దళాలకు చెందిన సైనిక ఉన్నతాధికారుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆర్థిక మందగమనాన్ని పొంచి ఉన్న పెను ప్రమాదంగా అభివర్ణించారు. రక్షణ ఆధునీకీకరణలో భాగంగా వచ్చే పదేళ్లలో ఏకంగా రూ.6 లక్షల కోట్లను సైనిక కొనుగోళ్లపై వెచ్చించాలన్న భారీ ప్రతిపాదనల నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్లో కేంద్రం రూ.14,000 కోట్లు కోత విధించడం తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్లో రక్షణ శాఖకు రూ.2.06 లక్షల కోట్లు కేటాయించినా, కోత కూడా గతేడాది కంటే ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఇక విధాన నిర్ణయాలు తదితరాల్లో పౌర నాయకత్వం-సైన్యం మధ్య సమతుల్యం అవశ్యమంటూ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దిశగా మున్ముందు తీసుకోవాల్సిన చర్యలపై బ్లూప్రింట్ తయారు చేయాల్సిందిగా సైనికాధికారులను కోరారు. వాటిని కేంద్రం అత్యంత ప్రాధాన్యమిచ్చి పరిశీలిస్తుందని చెప్పుకొచ్చారు. దేశ రాజకీయ నాయకత్వానికి సైన్యంపై పూర్తి విశ్వాసముందని కూడా మన్మోహన్ చెప్పారు. రాజకీయాలతో నిమిత్తం లేని మన సైన్యం వ్యవహార శైలి, వృత్తి నిబద్ధత ప్రపంచ దేశాలన్నింటికీ ఈర్ష్య కలిగించే అంశమంటూ ప్రస్తుతించారు. కేంద్రంతో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వివాదాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. సదస్సులో రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. -
ఐఏఎఫ్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అరుప్ రహా
న్యూఢిల్లీ: భారత వైమానిక దళ(ఐఏఎఫ్) నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అరుప్ రహా (59) నియమితులు కానున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత లేదా ఆయన పదవి చేపట్టే నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఐఏఎఫ్ ప్రస్తుత చీఫ్ ఎయిర్ మార్షల్ ఎన్ఏకే బ్రౌన్ ఈ ఏడాది డిసెంబర్ 31న రిటైర్ కానున్న నేపథ్యంలో రక్షణ శాఖ రహా నియామకాన్ని మంగళవారం ఖరారు చేసింది. ప్రస్తుతం ఐఏఎఫ్ ఉప ప్రధానాధికారిగా విధులు నిర్వహిస్తున్న రహా 1974 డిసెంబర్ 14న యుద్ధ విమానాల విభాగంలోకి ప్రవేశించారు. అందులో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన రహా సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పరమ విశిష్ట సేవ, అతి విశిష్ట సేవ, వాయు మెడల్స్‌తో సత్కరించింది.