సాగర గర్భం నుంచి అణ్వస్త్రం
దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం మూడు రకాలుగా అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగంలో అగ్రదేశాల సరసన భారత్
గగనతలం, ఉపరితలం నుంచే కాకుండా.. సముద్రగర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగల సత్తాను భారత్ సాధించింది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల దీర్ఘశ్రేణి ‘సబ్‌మెరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్(ఎస్‌ఎల్‌బీఎం)’ను సోమవారం బంగాళాఖాతంలో విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సముద్రంలో నీటి లోపలి నుంచి జలాంతర్గామి ద్వారా బీవో5 అణ్వస్త్ర క్షిపణిని రక్షణ శాఖ ఇదివరకే విజయవంతంగా పరీక్షించినప్పటికీ.. దాని లక్ష్య పరిధి 700 కి.మీ. మాత్రమే. తాజాగా పరీక్షించిన క్షిపణి పరిధి 2 వేల కిలోమీటర్లు.
నీటి లోపలి నుంచి ప్రయోగించేలా భారత్ రూపొందించినవాటిలో ఇదే అత్యధిక పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి కావడం విశేషం.దీంతో గగన, భూతలాలతోపాటు సముద్రగర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యంలో అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి అతికొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలిచింది. ఈ ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన రక్షణ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అభినందించారు. డీఆర్‌డీవో అభివృద్ధిపరుస్తున్న ఎస్‌ఎల్‌బీఎం క్షిపణులను ఐఎన్‌ఎస్ అరిహంత్ జలాంతర్గామితో సహా ఇతర వేదికలపై మోహరించనున్నారు.