సియోల్: ఉత్తరకొరియా శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించింది. గురువారం సాయంత్రం రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరిగిన సైనిక పరేడ్‌లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ వీటిని తిలకించారు. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తరకొరియా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, రష్యాతో బంధం మరింత బలోపేతమైందని చాటేందుకే కిమ్ పరేడ్‌ను వేదికగా మార్చుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాత పేరుతో ప్యాంగాంగ్‌లో ఉన్న కిమ్–2 సంగ్ స్వే్కర్‌లో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి లి హొంగ్‌జోంగ్‌లతో కలిసి ప్రదర్శనను కిమ్ వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. సైనిక కవాతు మధ్య యుద్ధ ట్యాంకులు, భారీ ఖండాంతర క్షిపణు(ఐసీబీఎం)లతో కూడిన ట్రక్కులు కదులుతుండగా ముగ్గురూ చేతులు ఊపుతున్న ఫొటోలను అధికార వార్తాసంస్థ కేసీఎన్‌ఏ శుక్రవారం విడుదల చేసింది. కిమ్ ప్రసంగించిందీ లేనిదీ వెల్లడించలేదు. క్షిపణి వ్యవస్థలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన నిఘా, అటాక్ డ్రోన్లను కూడా ప్రదర్శించారు. ఈ ఐసీబీఎంలన్నీ రష్యా డిజైన్ల ఆధారంగా తయారైనవేనని విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment