
మాస్కో: రష్యా, ఉత్తరికొరియా మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఏన్‌ఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకోనుంది.
రష్యా, ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒప్పందం చేసుకున్నారు. అయితే, పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం, ఆపత్కాల సమయంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇక, అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పుతిన్‌కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు పది వేల మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపించింది.
మరోవైపు.. రష్యా, కొరియా దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో.. కిమ్‌కు అధునాతన టెక్నాలజీ అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి. పైగా యుద్ధభూమిలో పోరాడటం వల్ల కిమ్ సైనికులు రాటుదేలే అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌తో రష్యా పోరులో భాగంగా పుతిన్‌కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్ ప్లాస్ చేసినట్టు సమాచారం.
#BREAKING North Korea, Russia defence treaty has come into force: KCNA pic.twitter.com/3ODW1bg5Bl
— AFP News Agency (@AFP) December 4, 2024