దామగుండం.. రాడార్‌ గండం! | Telangana Govt approves construction of Navy radar in reserve forest | Sakshi
Sakshi News home page

దామగుండం.. రాడార్‌ గండం!

Published Thu, Oct 3 2024 4:26 AM | Last Updated on Thu, Oct 3 2024 4:26 AM

Telangana Govt approves construction of Navy radar in reserve forest

వికారాబాద్‌ జిల్లాలోని రిజర్వ్‌ ఫారెస్టులో నేవీ రాడార్‌ నిర్మాణానికి సర్కారు అనుమతి

ఈ నెల 15న శంకుస్థాపన?.. 2,900 ఎకరాలను స్వా«దీనం చేసుకోనున్న తూర్పు నావికాదళం 

12 లక్షల చెట్లను నరికివేస్తారంటూ ప్రచారం 

తమ ప్రాంతంలోనే తాము పరాయివారిగా మారిపోతామంటున్న స్థానికులు 

పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతుందంటున్న పర్యావరణవేత్తలు 

చుట్టుపక్కల గ్రామాలతో పాటు హైదరాబాద్‌పైనా ప్రభావం! 

వ్యూహాత్మకంగా చాలా అనువైన ప్రాంతం అంటున్న నేవీ.. ఎవరికీ నష్టం వాటిల్లబోదని వెల్లడి 

1.5 లక్షల చెట్లు తొలగించే అవకాశం ఉందని అటవీ శాఖ అంచనా.. ప్రత్యామ్నాయంగా 17.5 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక  

సాక్షి, హైదరాబాద్‌: దామగుండం.. అడవుల్లో నేవీ రాడార్‌ నిర్మాణం ప్రతిపాదనతో ఈ ప్రాంతం వార్తలకెక్కింది. తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందని, అడవుల విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీనే దామగుండంలో రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని సమాచారం.  

ఔషధ మొక్కలకు నిలయం.. వందల ఏళ్ల ఆలయం 
వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్‌ ఫారెస్టు పచ్చని చెట్లతో జీవవైవిధ్యానికి మారుపేరుగా ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలకు జీవనాధారంగా, జంతు జాతులు, పక్షులకు ఆలవాలంగా ఉంది. దాదాపు 206 రకాల జాతుల పక్షులకు ఈ అడవులు నెలవుగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలకు ఈ అడవి నిలయం. 

ఈ అడవుల మధ్యలోనే 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇలవేల్పుగా రామలింగేశ్వరుని కొలుస్తున్నారు. అడవి మధ్యలో దేవాలయానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. కాగా రాడార్‌ నిర్మాణం కోసం.. ఈ అడవుల్లోని 2,900 ఎకరాల భూమిని నావికాదళం అధికారులు స్వా«దీనం చేసుకోనున్నారు. 

అయితే ఈ క్రమంలో 12 లక్షల చెట్లను నరికివేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీపంలో ఉన్న హైదరాబాద్‌కూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. 

పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, పశు పక్షాదులకు నిలువ నీడ లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇక రాడార్‌ చుట్టూ కంచె వేస్తే తాము ఆలయానికి వెళ్లి పూజలు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. తమ అడవిలో తాము పరాయివారిగా మారుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

అసలేమిటీ నేవీ రాడార్‌? 
నౌకలు, జలాంతర్గాముల (సబ్‌మెరైన్ల)తో సమాచార మార్పిడిని (కమ్యూనికేషన్‌) మెరుగుపరుచుకునేందుకు నావికాదళం వెరీ లోఫ్రీక్వెన్సీ రాడార్‌ స్టేషన్లను నిర్మిస్తుంది. దామగుండం సముద్రమట్టానికి 460 మీటర్ల ఎత్తులో ఉన్నందున శత్రు దేశాల కళ్లు కప్పి సమాచార మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుందని, వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం ఎంతో అనుకూలమైనదని నేవీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో తమిళనాడులోని తిరునల్వేలిలో కట్ట»ొమ్మన్‌ రాడార్‌ స్టేషన్‌ మాత్రమే ఉంది. దీన్ని 1990లో నిర్మించారు. 

వాస్తవానికి దామగుండంలో రెండో స్టేషన్‌ నిర్మించాలని ఏళ్ల క్రితమే నిర్ణయించినా ముందుకుసాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే కాకుండా ఇందుకోసం తూర్పు నావికాదళానికి కావాల్సిన 2,900 ఎకరాల భూమిని బదలాయించేందుకు అంగీకరించింది. ఈ స్టేషన్‌ను 2027 నాటికి పూర్తి చేయాలని నేవీ భావిస్తోంది. రాడార్‌ నిర్మాణంతో పాటు ఇక్కడ దాదాపు 3 వేల మంది నివాసం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. 

రేడియేషన్‌ ముప్పు ఉండదంటున్న శాస్త్రవేత్తలు 
సాధారణంగా రాడార్‌ వ్యవస్థ చాలా తక్కువ (3– 30 కిలోహెడ్జ్‌) రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. పైగా ఇక్కడ దాదాపు 450 మీటర్ల ఎత్తు టవర్లు ఉంటాయని, వీటివల్ల చుట్టుపక్కల ఉండే ఏ వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని రక్షణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర జలాల గుండా చొచ్చుకుపోయే ఫ్రీక్వెన్సీ తరంగాల ఆధారంగా సబ్‌ మెరైన్లలోని సిబ్బందితో సమాచార మార్పిడి జరుగుతుందని పేర్కొంటున్నారు. 
 
12 లక్షల చెట్లు తొలగింపు అవాస్తవం! 
ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆటవీ శాఖ అధికారులు మాత్రం ఇది అవాస్తవం అంటున్నారు. నేవీకి అప్పగించే భూమిలో చాలావరకు చిన్న పొదలు, ఖాళీ ప్రదేశం మాత్రమే ఉందని, దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోరని చెబుతున్నారు. కేవలం 1.5 లక్షల చెట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు ఫారెస్టు శాఖ అంచనా వేస్తోంది. రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసే ప్రాంతం, ఇతర నిర్మాణాలు చేపట్టే ప్రదేశాల్లో మాత్రమే చెట్లను తొలగిస్తారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా 17.5 లక్షల మొక్కలు నాటేందుకు ఆటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 

అరుదైన జాతులు కనుమరుగు 
దామగుండం రాడార్‌ స్టేషన్‌ నిర్మాణంతో అడవుల్లో పచ్చదనం పోతుంది. అరుదైన జంతు జాతులు కనుమరుగవుతాయి. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. చెట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో లక్షలాది చెట్లను నరికేయడం చాలా దారుణం. సమీపంలోని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వాతావరణం కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలించాలి.  
– రుచిత్‌ ఆశ కమల్, క్లైమేట్‌ ఫ్రంట్‌ ఇండియా 

ఏం చేయలేని స్థితిలో ఉన్నాం 
రాడార్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మాకెవరూ సహకరించడం లేదు. అసలు రాడార్‌ స్టేషన్‌తో ఎలాంటి పరిణామాలు ఉంటాయో సరిగ్గా అవగాహన కల్పించే వాళ్లు కూడా లేరు. దీంతో అది నిర్మించిన తర్వాత నిజంగా ఏం జరుగుతుందో తెలియట్లేదు.  
– పి.వెంకట్‌రెడ్డి, పూడూరు గ్రామవాసి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement