దేశ రక్షణలో రాజీలేదు: రాజ్‌నాథ్‌ | Rajnath at Foundation Stone Laying of Damagundam VLF Radar Station | Sakshi
Sakshi News home page

దేశ రక్షణలో రాజీలేదు: రాజ్‌నాథ్‌

Published Wed, Oct 16 2024 3:41 AM | Last Updated on Wed, Oct 16 2024 3:41 AM

Rajnath at Foundation Stone Laying of Damagundam VLF Radar Station

దామగుండం వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌ శంకుస్థాపనలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ 

సకాలంలో అందే సమాచారమే యుద్ధంలో గెలుపోటములను నిర్ణయిస్తుందని వ్యాఖ్య

కచ్చితమైన, వేగవంతమైన సమాచారం చేరవేతలో వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ కేంద్రాలు అత్యంత కీలకం 

దేశ రక్షణ, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావుండొద్దు 

పర్యావరణానికి హాని కలుగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తామని వెల్లడి 

రాడార్‌ కేంద్రాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారన్న సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ రక్షణ విషయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా రాజీపడేది లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అత్యాధునిక పరికరాలు, ఆధునిక సాంకేతికతను సమకూర్చడం ద్వారా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. యుద్ధ రంగానికి సంబంధించిన సవాళ్లలో మార్పుల నేపథ్యంలో కచ్చితమైన, అత్యంత వేగవంతమైన సమాచార వ్యవస్థ ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధంలో బలగాలకు సరైన సమయానికి అందే సమాచారమే గెలుపు, ఓటములను నిర్ణయిస్తుందని అన్నారు. 

యుద్ధ క్షేత్రంలోని వారికి సరైన సమయంలో కచ్చితమైన సమాచారాన్ని చేరవేస్తేనే శత్రువును దెబ్బకొట్టగలుగుతారన్నారు. అందుకు వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్‌ఎఫ్‌) రాడార్‌ కేంద్రాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాల్లో రూ.3,200 కోట్ల నిధులతో భారత నావికాదళం నిర్మిస్తున్న వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌కు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 

సమాచారం, సాంకేతికత కీలకం 
‘దేశ భద్రతలో అత్యంత కీలకమైన వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కానుండటంతో సంతోషంగా ఉంది. మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం కూడా ఆనందించాల్సిన విషయం. భారత రక్షణ రంగంలో డాక్టర్‌ కలాం అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. భారత్‌కు కొత్త సైనిక సాంకేతికతను అందించడంతో పాటు, ఒక తరం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఆయన స్ఫూర్తినిచ్చారు. 

కొత్తగా నిర్మించనున్న రాడార్‌ స్టేషన్‌తో భారత నౌకాదళ సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు సుదూర ప్రాంతాలకు విశ్వసనీయమైన, సురక్షితమైన సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్య, వైద్య రంగాల్లో సాంకేతికత కీలక భూమిక పోషిస్తుంది. కరోనా సమయంలోనూ అత్యవసర సేవలు సాఫీగా నడవడంలో సమాచారం, సాంకేతికత ఎంతో కీలకంగా వ్యవహరించాయి. భారతదేశం తన వాణిజ్య, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవాలంటే, బలమైన సముద్ర దళంగా ఉండాలంటే పటిష్టమైన సమాచార వ్యవస్థను కలిగి ఉండటం అవసరం..’ అని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. 

భవిష్యత్తు కోసం నిర్ణయాలు ఉండాలి 
‘పర్యావరణంపై ప్రాజెక్ట్‌ ప్రభావం లేకుండా చూస్తాం. పర్యావరణానికి హాని కలుగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తాం. దేశ రక్షణ, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండొద్దు. దేశ భద్రతే ప్రధానం. ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఐదేళ్లే అధికారంలో ఉన్నా..భవిష్యత్తు కోసమే నిర్ణయాలు తీసుకోవాలి. వీఎల్‌ఎఫ్‌ సెంటర్‌ ఏర్పాటులో సంపూర్ణ సహకారం అందించిన సీఎం రేవంత్‌రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. దేశం రక్షణ విషయానికి వస్తే అంతా ఏకమవుతామని ఈ రాడార్‌ కేంద్ర శంకుస్థాపనతో నిరూపితమైంది..’ అని రక్షణ మంత్రి అన్నారు.  

దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం  
‘కొత్త రాష్ట్రమైనా తెలంగాణకు వందల ఏళ్ల చరిత్ర ఉంది.  వ్యవసాయంలో అధునిక పద్ధతులు, అభివృద్ధితో దేశంలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తోంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సంస్థలతో పాటు రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు గొప్ప పేరుంది. తాజాగా వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌ ప్రారంభమైతే స్థానిక ప్రజలకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది..’ అని రాజ్‌నాథ్‌ వివరించారు.  

అభివృద్ధి తప్ప ప్రకృతి అనర్ధాలు లేవు: సీఎం 
దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. వీఎల్‌ఎఫ్‌ సెంటర్‌ ఏర్పాటును కొందరు వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ రాడార్‌ కేంద్రం ఏర్పాటుతో దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందని చెప్పారు. ఇప్పటికే అనేక రక్షణ రంగ సంస్థలతో హైదరాబాద్‌ వ్యూహాత్మక ప్రదేశంగా ఉందని గుర్తుచేశారు. 

తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. రెండో వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ కేంద్రం మన ప్రాంతంలో రావడం గర్వకారణం. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దీనికి భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి నిర్ణయాలన్నీ 2017లో గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. 

దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం సమంజసం కాదు. ఇక్కడ రామలింగేశ్వరస్వామి దర్శనానికి దారి వదలండి. విద్యా సంస్థల్లో స్థానికులకు అవకాశం కల్పించండి. వీఎల్‌ఎఫ్‌ కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని రక్షణశాఖ మంత్రికి నేను మాట ఇస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

నౌకాదళ ముఖ్య అధికారి అడ్మిరల్‌ దినేష్‌ కె.త్రిపాఠి మాట్లాడుతూ.. భారత నావికాదళ కమ్యూనికేషన్‌ సామర్థ్యాలలో కొత్త అధ్యాయానికి ఈ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు నాంది పలుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, మండలిలో చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రాజ్‌నాథ్‌కు సీఎం, కేంద్రమంత్రుల స్వాగతం 
వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేటకు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. 

అక్కడి నుంచి శంకుస్థాపనకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో అంతా రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాజ్‌నాథ్‌ సాయంత్రం 4.01 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేటకు చేరుకుని 4.18 గంటలకు విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement