ఆ ప్రాంతంలోని రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయండి
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వినతి
ఎయిర్‌పోర్టులకు అనుమతి ఇవ్వాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో బాపూఘాట్ అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్న 222.27 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని కలిపిన ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఏర్పాటు చేయనున్న బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాతి్వకతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బాపూఘాట్ వద్ద గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్, చేనేత ప్రచార కేంద్రం, ప్రజావినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. ఇందుకోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని కోరారు.
కొత్త విమానాశ్రయాలకు అనుమతివ్వండి
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ప్రజలకు రవాణా వసతులను మెరుగుపర్చడంలో భాగంగా కొత్త విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన ఎన్‌వోసీని రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ నుంచి పొందిందని వివరించారు. 253 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని..
ఈ మేరకు విమానాశ్రయ పనులకు, విమానాలు నడిపేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక కొత్తగూడెం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా అంతర్గాం, ఆదిలాబాద్‌లలోనూ విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో భేటీల్లో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్.రఘురామిరెడ్డి, కడియం కావ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment