Defense Department lands
-
బాపూఘాట్ అభివృద్ధికి.. 222.27 ఎకరాలు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో బాపూఘాట్ అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్న 222.27 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని కలిపిన ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఏర్పాటు చేయనున్న బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాతి్వకతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బాపూఘాట్ వద్ద గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్, చేనేత ప్రచార కేంద్రం, ప్రజావినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి తెలిపారు. ఇందుకోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని కోరారు. కొత్త విమానాశ్రయాలకు అనుమతివ్వండి తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ప్రజలకు రవాణా వసతులను మెరుగుపర్చడంలో భాగంగా కొత్త విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన ఎన్వోసీని రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ నుంచి పొందిందని వివరించారు. 253 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని..ఈ మేరకు విమానాశ్రయ పనులకు, విమానాలు నడిపేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక కొత్తగూడెం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా అంతర్గాం, ఆదిలాబాద్‌లలోనూ విమానాశ్రయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో భేటీల్లో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్.రఘురామిరెడ్డి, కడియం కావ్య తదితరులు ఉన్నారు. -
బీఆర్ఎస్ స్కైవేల కల నెరవేరింది
సాక్షి, హైదరాబాద్: రక్షణ శాఖ ఎలివేటెడ్ స్కైవేల నిర్మాణానికి పచ్చజెండా ఊపడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కల నెరవేరిందని, దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే వీటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటి వల్ల హైదరాబాద్ నలుదిశలా విస్తరించేందుకు, ప్రగతిపథంలో దూసుకుపోవడానికి మార్గం సుగమం అయ్యిందని తెలిపారు. వీటి కోసం రక్షణ శాఖ భూములు కేటాయించాలని కోరుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత పదేళ్ల కాలంగా అనేకమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. గత జూలై 31వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్–కరీంనగర్, హైదరాబాద్–నాగ్‌పూర్ జాతీయ రహదారులకు సంబంధించిన ఎలివేటెడ్ స్కైవేల నిర్మాణంతో ఇంతకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వాస్తవానికి గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రణాళికలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అనేక కీలక ప్రణాళికలు రూపొందించామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నిరంతర సంప్రదింపులు జరిపామని కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌తో పాటు తాను, ఇతర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ పెద్దలను కలిసి వినతిపత్రాలు అంద జేశామని గుర్తు చేశారు. ప్రతిసారీ వారు సాను కూలంగా స్పందించారని తెలిపారు. కేంద్ర ప్రభు త్వాన్ని ఒప్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు చేసిన పోరాటంలో భాగస్వాములైన అధికారులు, యంత్రాంగానికి కేటీఆర్ ధన్యవాదా లు తెలిపారు. ఇది ఏ ఒక్కరితోనో సాధ్యం కాలేదని, సమష్టి విజయమని స్పష్టం చేశారు. ఎల్బీనగర్తో పాటు ఇతర రూట్లలో ఇలాంటి అడ్డంకులు లేకపోవడంతో అనేక ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి చేయగలిగామని గుర్తుచేశారు. జేబీఎస్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ రూట్లలో రెండు ఫ్లైఓవర్లకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పనులు చేపట్టాలని కోరారు. -
‘ఎలివేటెడ్’కు రక్షణ శాఖ భూములు
♦ ఆ శాఖాధికారులతో చర్చించేందుకు నేడు ఢిల్లీ వెళ్లనున్న సునీల్‌శర్మ ♦ బైసన్‌పోలో అంశంపై చర్చకు వచ్చే నెల హస్తినకు సీఎస్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్ రహదారులకు చేరుకునేలా నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం భూసేకరణ మార్గం సుగమమైంది. కారిడార్ల కోసం సేకరించాల్సిన రక్షణ శాఖ భూముల విషయమై ఆ శాఖ చర్చలకు ఆహ్వానించింది. ప్యారడైజ్ కూడలి నుంచి శామీర్‌పేట వరకు, ప్యాట్నీ కూడలి నుంచి నిజామాబాద్ జాతీయ రహదారిపై సుచిత్ర కూడలి వరకు రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ కారిడార్లకు రక్షణ శాఖ భూములు సేకరించాల్సి ఉంది. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరటంతో ఆ శాఖ సానుకూలంగా స్పందించింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా మంజూరీ రాలేదు. దీంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రక్షణ శాఖను భూముల విషయమై కోరడంతో ఆ శాఖ చర్చలకు ఆహ్వానించింది. సికింద్రాబాద్–సఫిల్‌గూడ, సికింద్రాబాద్–రామకృష్ణాపురంలను అనుసంధానిస్తూ కంటోన్మెంట్‌లోని ఏఓసీ గుండా ఉన్న రోడ్డును మూసేయనున్నట్టు ఇదివరకే రక్షణ శాఖ ప్రకటించింది. దీనికి ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణానికి కూడా రక్షణ శాఖ భూములు సేకరించాల్సి ఉంది. ఈ మూడు రహదారులకు సంబంధించి చర్చించేందుకు రక్షణ శాఖ ఆహ్వానించటంతో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రక్షణ శాఖ అధికారులతో జరిగే ఈ చర్చల్లో భూసేకరణ వ్యవహారం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. బైసన్‌పోలో గ్రౌండ్ కేటాయింపుపై.. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనం నిర్మాణానికి రక్షణ శాఖ ఆధీనంలోని బైసన్‌పోలో మైదానం తీసుకోని అందుకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ విషయాన్ని ఆ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. సీఎం ఢిల్లీ పర్యటనలోనూ చర్చలు జరిగాయి. అయితే స్థానిక కంటోన్మెంట్ అధికారులు సానుకూలంగా లేకపోవటంతో నేరుగా ఢిల్లీ అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కానీ ఇప్పటివరకు రక్షణ శాఖ నుంచి పూర్తి సానుకూలత రాలేదు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అధికారులతో చర్చించేందుకు వచ్చే నెల మొదటి వారంలో సీఎస్ ఎస్పీ సింగ్ ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఢిల్లీ పర్యటనలోనూ దీని ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్నా ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మైదానాన్ని కేటాయించేందుకు రక్షణ శాఖ అంతర్గత మాటల్లో సానుకూలత వ్యక్తం చేసిందంటున్నారు.