బ్రిడ్జిలైతేనే.. బాగుబాగు
వంతెనలతో ట్రాఫిక్‌కు చెక్.. రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక
- రాష్ట్ర ఖజానాపై భారం లేకుండా నిర్మాణానికి కసరత్తు
- అంబర్‌పేటలో భారీ వంతెనకు కేంద్రం పచ్చజెండా
- ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్‌ల ప్రతిపాదనలు పరిళీలిస్తున్న కేంద్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ చిక్కులకు ప్రధాన కారణంగా ఉన్న మతపరపమైన కట్టడాలున్న చోట భారీ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జాతీయ రహదారులుగా ఉన్న రోడ్లపై నిర్మించే వంతెనలన్నింటికీ కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని ప్రణాళిక రూపొందించుకుంది. గతంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో వంతెనల కోసం రూపొందించిన ప్రణాళికలను ప్రస్తుతానికి అటకెక్కించిన ప్రభుత్వం, వ్యూహం మార్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.11 వేల కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నందున, నగరంలో వంతెనలకు అయ్యే భారీ వ్యయాన్ని భరించటం పెద్ద సమస్యగా మారింది. దీంతో వీలైనన్ని చోట్ల జాతీయ రహదారులపై వంతెనలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. మరికొన్ని కీలక రోడ్లను జాతీయ రహదారులుగా మార్చి, వాటిమీద నిర్మించే వంతెనలను కలిపి మొత్తంగా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందాలని నిర్ణయించింది.
అంబర్‌పేట ఫ్లైఓవర్‌కు రూ.254 కోట్లు
ఇక వీటితోపాటు వరంగల్ జాతీయ రహదారిపై అంబర్‌పేట కూడలి వద్ద ఫ్లైవోవర్ నిర్మించబోతోంది. దీనికి కేంద్రం నుంచి నిధులు పొందేందుకు తాజాగా అనుమతి రావడం విశేషం. చే నంబర్ శ్రీరమణ సినిమాహాల్ కూడలికి వచ్చే మార్గంలో రోడ్డుకు రెండు వైపులా శ్మశానవాటికలు ఉన్నాయి. గతంలో విస్తరణకు ప్రయత్నం చేయగా మతపెద్దల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో అక్కడ పొడవాటి వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి దాదాపు రూ.300 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేయడంతో అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు దాన్ని కేంద్రం ఖాతాలోకి వేయటంలో విజయం సాధించింది.
ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.245 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. 1.1 కి.మీ. పొడవుతో సాగే ఈ వంతెన దాదాపు 4 బాటిల్ నెక్ సమస్యలను పరిష్కరిస్తుంది. ఇందుకోసం అక్కడక్కడా కొంత భూసేకరణ జరపాలి. ఇందుకు రూ.80 కోట్ల వరకు వ్యయం అవుతోంది. ఈ మొత్తాన్ని భరించాలని రాష్ట్రప్రభుత్వం కోరగా, కేంద్రం తిరస్కరించింది. దాన్ని జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే... రాజేంద్రనగర్ వద్ద ఆరాంఘర్ కూడలి, ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్, ఎల్‌బీనగర్ వద్ద మరో మూడు వంతెనలకు నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది.
ప్యాట్నీ–శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్
రాష్ట్ర రహదారిగా ఉన్న రాజీవ్ రహదారిని జాతీయ రహదారుల ఖాతాలోకి మార్చాలని తాజాగా ప్రతిపాదన పంపింది. ఈ రోడ్డుపై నగరంలో ప్యాట్నీ చౌరస్తా నుంచి శామీర్‌పేట వరకు భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతోంది. అవసరమైన స్థలాన్ని ఇవ్వాల్సిందిగా రక్షణ శాఖను కోరింది. దీనికి దాదాపు రూ.750 కోట్లకు పైగా వ్యయం కానుంది. అలాగే ప్యారడైజ్ నుంచి నిజామాబాద్ హైవేలో సుచిత్ర కూడలి వరకు మరో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించింది. దీనికి కూడా రక్షణ శాఖ నుంచి స్థల సేకరణ చోయబోతోంది. దీనికి కూడా భారీ వ్యయం అవుతున్నందున దీన్ని కూడా కేంద్రం నుంచి పొందేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.