దేశ భద్రతకు భరోసా | Sakshi interview with Dr Satish Reddy | Sakshi
Sakshi News home page

దేశ భద్రతకు భరోసా

Published Wed, Feb 12 2020 4:13 AM | Last Updated on Wed, Feb 12 2020 4:15 AM

Sakshi interview with Dr Satish Reddy

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి.. డీఆర్‌డీవో చైర్మన్‌గా ఎదిగిన తెలుగుతేజం డాక్టర్‌ గుండ్రా సతీష్‌రెడ్డి.. రక్షణరంగంలో సాగుతున్న పరిశోధనల గురించి ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు..

సాక్షి: డీఆర్‌డీవో చీఫ్‌ అయ్యారు.... రక్షణ శాఖ (పరిశోధన, అభివృద్ధి) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. వృత్తిపరంగా మీ ప్రయాణం చూస్తుంటే... విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జర్నీ గుర్తుకొస్తోంది. శాస్త్రవేత్త నుంచి అత్యున్నత బాధ్యతలు మోస్తూ సాగుతున్న మీ ప్రయాణం ఎలా ఉంది?
సతీష్‌రెడ్డి: డీఆర్‌డీవోకు కలాం గారు డైరెక్టర్‌గా ఉన్నప్పుడే నేను చేరాను. ఆయన నేతృత్వంలో ‘ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం’ కింద పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిసూల్, నాగ్‌ మిస్సైల్స్‌ రూపకల్పనలో నేను పాలుపంచుకోవడం భగవంతుడు ఇచ్చిన వరం. యువశాస్త్రవేత్తలకు కలాం గారి ప్రోత్సాహం అద్భుతం. 

సాక్షి: ‘ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలెప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’ను కలాం ప్రారంభించారు. మీ నేతృత్వంలో ఇంటర్‌ కాంటినెంటల్‌ మిస్సైల్‌ను అభివృద్ధి చేశారు. ఇలాంటి ల్యాండ్‌మార్క్‌ ప్రోగ్రామ్స్‌ ఇంకా ఏమైనా ఉన్నాయా?
సతీష్‌రెడ్డి: ‘మిషన్‌ శక్తి’ అలాంటిది. భూకక్ష్యలో తిరుగుతున్న మన శాటిలైట్ల భద్రతకు అవసరమైన ప్రాజెక్టు చేయమని ప్రధానమంత్రి సూచించారు. అందుకోసం యాంటీ శాటిలైట్‌ మిస్సైల్‌ టెస్ట్‌ విజయవంతంగా పూర్తి చేశాం. ఇలాంటి పరిజ్ఞానం, సామర్థ్యం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ‘గ్లోబల్‌ స్పేస్‌ పవర్‌’గా ఎదిగాం. రక్షణ రంగానికి సంబంధించి స్పేస్, సైబర్‌ రంగంలో విస్తృత పరిశోధనలు అవసరం. ‘ఫ్యూచర్‌ టెక్నాలజీస్‌’ను అభివృద్ధి చేయాలి. అండర్‌ వాటర్‌ వెహికల్స్, అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది 5వ జనరేషన్‌ యుద్ధ విమానం. దీన్ని తయారు చేస్తే.. భారతదేశం యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సుదూరతీరంలోని చిన్న వస్తువును కూడా చూడగలిగిన రాడార్స్‌ తయారు చేయాలి. హైపర్‌ సానిక్‌ మిసైల్స్‌ను తయారు చేయనున్నాం. తేలికపాటి యుద్ధ విమానం మార్క్‌–2 పరిశోధన దశలో ఉంది. ఇవన్నీ ల్యాండ్‌మార్క్‌ కార్యక్రమాలే.

సాక్షి: ‘మిషన్‌ శక్తి’తో దేశానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
సతీష్‌రెడ్డి: ప్రపంచ దేశాల్లో మన పట్ల గౌరవం, ఖ్యాతి పెరుగుతుంది. ఫలితంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించకుండా ఆపుదామనే ప్రయత్నాలు మానుకుంటాయి. అలాగే మన ఉపగ్రహాలకు హాని తలపెట్టేందుకు ఏ దేశమూ సాహసించదు. 

సాక్షి: రక్షణ రంగంలో నూరు శాతం స్వావలంబన జాతి ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దిశగా ప్రయత్నాలు... ప్రత్యేకించి మిస్సైల్‌ రంగంలో ప్రగతిని వివరించండి? 
సతీష్‌రెడ్డి: దిగుమతులు తగ్గించి స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రస్తుతం 45–50 శాతం మాత్రమే దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన వాటిని వాడుతున్నాం. దీన్ని 75–80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. వచ్చే 5–10 ఏళ్లలో ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 

సాక్షి: క్రిటికల్‌ కాంపోనెంట్స్‌కి ఇప్పటికీ విదేశాలపై ఆధారపడుతున్నాం. పూర్తిగా మనదేశంలో తయారయ్యే రోజు ఎప్పుడు వస్తుంది?
సతీష్‌రెడ్డి: ఇప్పుడు మనం పెద్దగా ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. చాలా వరకు మనం ఉత్పత్తి చేస్తున్నాం. సెన్సర్స్, చిప్స్‌ మనం కొంత మేర తయారు చేసుకోగలుగుతున్నాం. అడ్వాన్స్‌డ్‌ సెన్సర్స్, చిప్స్‌ కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అవి కూడా మనమే తయారు చేసుకొనే రోజు దగ్గర్లోనే ఉంది.

సాక్షి: మానవ రహిత యుద్ధ విమానం మన సైన్యానికి అందుబాటులోకి రావడానికి ఎంతకాలం పడుతుంది? 
సతీష్‌రెడ్డి: చాలా దేశాలు దీని మీద పరిశోధనలు చేస్తున్నాయి. మనం ఇంకా దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం అనుమతి ఇస్తే.. డీఆర్‌డీవో పరిశోధనలు ప్రారంభిస్తుంది. పరిశోధన మొదలు పెడితే... తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. 

సాక్షి: భవిష్యత్తులో మన సైన్యానికి అందనున్న ఆయుధాలు ఏమిటి?
సతీష్‌రెడ్డి: ప్రపంచంలోనే లాంగెస్ట్‌ రేంజ్‌ గన్‌ మనం తయారు చేశాం. దీన్ని ‘అడ్వాన్స్‌డ్‌ టోడ్‌ ఆర్టిలరీ గన్‌’ అంటారు. 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. 155 ఎంఎం క్లాస్‌ గన్‌లో ఇదే పెద్దది. త్వరలో దీన్ని సైన్యానికి అందిస్తాం. అండర్‌వాటర్‌ వెహికల్స్, తేలికపాటి యుద్ధ విమానాలు, సరికొత్త టెక్నాలజీ ట్యాంకులు, లేజర్‌ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం. 

సాక్షి: ఇప్పటికీ చిన్న, తేలికపాటి ఆయుధాలకు దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. డీఆర్‌డీవో దీనిమీద పనిచేయడం లేదా?
సతీష్‌రెడ్డి: కొరతను త్వరలో అధిగమించనున్నాం. కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మిగతావి ఇక్కడే తయారు చేస్తున్నాం. దిగుమతి చేసుకున్న టెక్నాలజీతో తయారు చేస్తున్నాం.

సాక్షి: సియాచిన్‌ వంటి ప్రతికూల పరిస్థితులుండే ప్రాంతాల్లో సైనికులకు పనికొచ్చే చిన్న చిన్న పరికరాలు, ఆహార పదార్ధాలు, అత్యాధునిక దుస్తులు, బూట్లు... ఒక్కోసారి విజయాన్ని సాధించిపెట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ దిశగా రక్షణరంగంలో పరిశోధనలు జరుగుతున్నాయా?
సతీష్‌రెడ్డి: సైనికులకు ప్రతికూల పరిస్థితుల్లో మనగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్‌డీవో అందిస్తోంది. వారికి అందించాల్సిన ఆహారం, దాన్ని వేడిగా ఉంచడం, ఎముకలు కొరికే చలిలో వేసుకొనే డ్రెస్, చేతి గ్లౌజ్, హెల్మెట్, షూస్‌... అన్ని అంశాల్లోనూ పరిశోధనలు చేశాం.. చేస్తున్నాం. వాతావరణ ప్రతికూల పరిస్థితులను ముందే కనిపెట్టి హెచ్చరించే వ్యవస్థను రూపొందించాం. సైనికులకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చే పానీయాలు, తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారం అందించడం మీద పరిశోధనలు చేశాం. ఇప్పుడు ‘గగన్‌యాన్‌’లో పాల్గొననున్న వ్యోమగాములకు ఈ ఆహారాన్నే ఇవ్వనున్నాం.

పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
సతీష్‌రెడ్డి: రక్షణరంగంలో పనిచేస్తున్న పరిశ్రమలు ఒకప్పుడు మేము ఇచ్చిన డ్రాయింగ్స్‌ ఆధారంగా వస్తువులు తయారు చేసి ఇచ్చేవి. ఇప్పుడు మా పేటెంట్స్‌ను వాడుకోవడానికి అవకాశం ఇచ్చాం. టెక్నాలజీ బదిలీ చేసినప్పుడు గతంలో ఫీజు వసూలు చేసే వాళ్లం. ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నాం. ఆకాశ్‌ మిస్సైల్‌ తయారీకి  రూ. 25 వేల కోట్ల విలువైన ఆర్డర్స్‌ వచ్చాయి. దాంట్లో 87 శాతం ప్రైవేటు పరిశ్రమల నుంచి తీసుకున్నాం.
– మల్లు విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement