సాక్షి, హైదరాబాద్: రక్షణరంగ అవసరాల కోసం దేశంలోనే తొలిసారిగా నాలుగు కాళ్ల రోబో, సైనికులు ధరించగల ఎక్సోస్కెలిటన్ నమూనాలు సిద్ధమయ్యాయి. డీఆర్‌డీవో అనుబంధ సంస్థలైన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, డిఫెన్స్ బయో–ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీల సహాయ సహకారాలతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్వయ రొబోటిక్స్ వీటిని రూపొందించింది.
ఈ నమూనాలను రక్షణశాఖ సలహాదారు, డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి సోమవారం ఆయన పరిశీలించారు. రక్షణ, డీఆర్‌డీవో వర్గాలతో కలసి రోబో తయారీ అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో రానున్న కాలంలో రోబోలదే కీలకపాత్రని స్పష్టం చేశారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితులను అధిగమించి నిఘా పనులు చేసేందుకు, సైనికుల మోతబరువును తగ్గించడంలోనూ రోబోల సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
‘‘అతితక్కువ కాలంలో స్వయ రోబోటిక్స్ వీటిని (రోబో, ఎక్సోస్కెలిటన్లను) రూపొందించడం హర్షణీయం. దేశ రొబోటిక్స్ రంగం పురోగతికి ఇలాంటి భాగస్వామ్యాలు ఎంతో ఉపయోగపడతాయి. క్షేత్ర పరీక్షలు వేగంగా పూర్తి చేసి అటు రక్షణ, ఇటు పరిశ్రమ వర్గాలకు ఉపయోగపడే ఈ రకమైన రోబోలను వేగంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం’’అని సతీశ్‌రెడ్డి చెప్పారు.
డీఆర్‌డీవో ‘మేకిన్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా స్వయ రోబోటిక్స్ వంటి ప్రైవేటు సంస్థలతో రోబోలను తయారు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇలాంటి సైనిక రోబోలను అమెరికా, స్విట్జర్లాండ్‌ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా లేహ్, లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో అవి పనిచేయలేవు. ఎందుకంటే వాటిని నిర్దిష్ట పరిసరాల్లోనే పనిచేసేలా రూపొందించారు. పైగా వాటిల్లో ఫీచర్లు కూడా తక్కువ. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు స్వయ రోబోలు ఉపయోగపడతాయని అంచనా.
రెండేళ్లలో మిలటరీకి: విజయ్ శీలం
రక్షణ శాఖ అవసరాలకోసం సిద్ధం చేసిన రోబో నమూనా తొలి తరానిదని.. మరిన్ని ఫీచర్లు, సామర్థ్యాలను జోడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయ రోబోటిక్స్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ ఆర్.శీలం తెలిపారు. అమెరికాలో బోస్టన్ డైనమిక్స్‌తో పాటు ఇతర దేశాల్లోని కొన్ని సంస్థలు కూడా ఇలాంటి రోబోలు తయారు చేస్తున్నా... మిలటరీ అవసరాల కోసం తామే తొలిసారి తయారు చేశామని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
సైనికులు వాడే ఆయుధాలు, సమాచార పరికరాలను ఈ రోబో సునాయాసంగా మోసుకెళ్లగలదని, ప్రమాదకర పరిస్థితుల్లోనూ శత్రు స్థావరాలను పరిశీలించి రాగలదని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ సరిహద్దులపై నిఘా ఉంచే రోబోలను ఇతర ప్రాంతాల నుంచి కూడా నియంత్రించొచ్చని వివరించారు. తొలితరం నమూనాలో నడక మాత్రమే సాధ్యమవుతుందని, సమీప భవిష్యత్తులోనే వాటికి చూపును కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో ఈ రోబో సైన్యానికి సేవలందించే అవకాశం ఉందన్నారు. పాదాల్లో ఏర్పాటు చేసిన సెన్స ర్లు, ఇతర పరికరాల ద్వారా ఈ రోబో నేల, కాంక్రీట్, రాయిల మధ్య తేడాలను గుర్తించి నడకను నియంత్రించుకోగలదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment