న్యూఢిల్లీ: భారత వైమానిక దళ(ఐఏఎఫ్) నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అరుప్ రహా (59) నియమితులు కానున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత లేదా ఆయన పదవి చేపట్టే నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఐఏఎఫ్ ప్రస్తుత చీఫ్ ఎయిర్ మార్షల్ ఎన్‌ఏకే బ్రౌన్ ఈ ఏడాది డిసెంబర్ 31న రిటైర్ కానున్న నేపథ్యంలో రక్షణ శాఖ రహా నియామకాన్ని మంగళవారం ఖరారు చేసింది. ప్రస్తుతం ఐఏఎఫ్ ఉప ప్రధానాధికారిగా విధులు నిర్వహిస్తున్న రహా 1974 డిసెంబర్ 14న యుద్ధ విమానాల విభాగంలోకి ప్రవేశించారు. అందులో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన రహా సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పరమ విశిష్ట సేవ, అతి విశిష్ట సేవ, వాయు మెడల్స్‌తో సత్కరించింది.