Arup Raha
-
'36 కాదు 250 జెట్లు కావాలి'
న్యూఢిల్లీ: భారతదేశ రక్షణకు 36 రఫెల్ జెట్లు సరిపోవని అందుకు 200-250 జెట్లు కనీసం అవసరమవుతాయని ప్రస్తుత వాయుదళ చీఫ్ అరూప్ రాహా బుధవారం పేర్కొన్నారు. ఈ నెల 31వతేదిన రాహా పదవీకాలం పూర్తవుతుంది. ఏ దేశ వాయుదళానికైనా దాని వద్ద ఉన్న ఫ్లీట్లే ఆయువుపట్టు అని వ్యాఖ్యానించారు. గాలిలోనే ఇంధనాన్ని నింపగల ఫోర్స్ మల్టీప్లేయర్ల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. వాటిని వేగంగా సమీకరించడానికి కొత్త టెండర్లు పలవనున్నట్లు తెలిపారు. స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్న తేజస్ కు తోడు మరో జెట్ భారత వాయుసేనకు అవసరమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం మొత్తం 42 స్క్వాడ్రన్లకు అనుమతినిచ్చిందని.. కేవలం స్క్వాడ్రన్లు ఉంటే చాలదని.. తగిన శక్తిసామర్ధ్యాలు కలిగిన ఫైటర్లు కూడా వాటిలో ఉండాలని అన్నారు. భారత్ వద్ద మరో 40ఏళ్ల పాటు ఉపయోగపడే హెవీ వెయిట్ ఫైటర్లు(ఎస్ యూ30-ఎంకేఐ)లు ఉన్నట్లు చెప్పారు. లైట్ వెయిట్ ఫైటర్ల కొరతను తేజస్ లు తీరుస్తాయని చెప్పారు. కాగా, మిడిల్ వెయిట్ కేటగిరీలో రఫెల్ యుద్ధవిమానాలు అద్భుతంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అయితే, కేవలం 36 రఫెల్ లు మాత్రమే ఉండటం వింగ్ సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని చెప్పారు. మరిన్ని రఫెల్ లను వింగ్ లోకి తీసుకురావడం ద్వారా ఫ్లీట్ కు బలం చేర్చినట్లవుతుందని తెలిపారు. భారతీయ వాయుసేనలో ప్రస్తుతం 33 ఫైటర్ల స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి, ఏఎన్32 విమానం కూలిపోవడం తన కెరీర్ లో మాయని మచ్చలని అన్నారు. -
ఆర్మీ కొత్త చీఫ్‌గా బిపిన్ రావత్
-
ఆర్మీ కొత్త చీఫ్‌గా బిపిన్ రావత్
వాయుసేనకు బీఎస్ ధనోవా ► ఐబీ, ‘రా’ లకూ కొత్త అధిపతులు న్యూఢిల్లీ: ఆర్మీ , వాయుసేనకు ప్రభుత్వం శనివారం కొత్త అధిపతులను ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను ఆర్మీ చీఫ్‌గా, ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవాను ఐఏఎఫ్ చీఫ్‌గా నియమించింది. ప్రస్తుత అధిపతులు జనరల్ దల్బీర్ సింగ్, అరూప్ రాహాల స్థానాల్లో వీరు నియమితులయ్యారు. డిసెంబర్ 31న ఇద్దరూ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. ఆర్మీ తదుపరి చీఫ్‌గా రేసులో ఉన్న సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షిని తోసిరాజని రావత్ ఈ పదవికి ఎంపికవడం ఆశ్చర్యకరమే. రావత్‌కు 30 ఏళ్లుగా భారత సైన్యంలో వివిధ హోదాల్లో, యుద్ధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ప్రస్తుతం నలువైపుల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో సైన్యాన్ని నడిపించేందుకు అతనే తగిన వ్యక్తని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐబీ అధిపతిగా రాజీవ్ జైన్: అలాగే నిఘా సంస్థలు ఐబీ, ‘రా’లకు కూడా నూతన చీఫ్‌లను నియమించారు. జార్ఖండ్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ జైన్ ను ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి, అనిల్ ధస్మానాను రా(రీసెర్చీ అండ్ అనాలిసిస్ వింగ్)కు అధిపతులుగా ఎంపికయ్యారు. రాజీవ్, అనిల్ ఈ పదవుల్లో రెండేళ్లు ఉంటారు. ఐబీలో ప్రత్యేక డైరెక్టర్‌గా పనిచేస్తున్న జైన్ జనవరి 1న దినేశ్వర్ శర్మ స్థానంలో బాధ్యతలు చేపడుతారు. 1980 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జైన్ రాష్ట్రపతి పోలీసు మెడల్ గెల్చుకున్నారు. ఐబీలో కీలక కశ్మీర్ డెస్కు సహా పలు విభాగాల్లో పనిచేశారు. ఎన్డీఏ హయాంలో కశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరిపిన మధ్యవర్తి కేసీ పంత్‌కు సలహాదారుగా వ్యవహరించారు. ‘రా’ చీఫ్‌గా ఈ నెలాఖరున వైదొలగనున్న రాజిందర్ ఖన్నా స్థానంలో అనిల్ పగ్గాలు చేపడుతారు. ఆయన 1981 ఐపీఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ అధికారి. గత 23 ఏళ్లుగా ‘రా’లో పాకిస్తాన్ డెస్కు సహా పలు కీలక విభాగాల్లో పనిచేశారు. -
మాటల్లేవ్.. ఇక చేతలే!
• ఐఏఎఫ్ చీఫ్ రాహా వ్యాఖ్య ‘వసుధైక కుటుంబకం’ మా నినాదం: రాజ్‌నాథ్ • భద్రతపై సమీక్ష.. సైనికులకు మౌలిక వసతుల కల్పన వేగవంతం ఘజియాబాద్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి నెలకొన్న రాజకీయ, సైనిక ఉద్రిక్త వాతావరణంపై ఇకపై ఆర్మీ మాట్లాడటమేమీ ఉండదని.. చేతల్లోనే సమాధానం ఉంటుందని వైమానిక దళం చీఫ్ అరుప్ రాహా స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులకైనా సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ జిల్లాలోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శనివారం ‘వైమానిక దళ 84వ వ్యవస్థాపక దినోత్సవం’ ఆయన మాట్లాడారు. ‘సర్జికల్ దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందరూ అభిప్రాయాలు చెబుతున్నారు. దేశం ఏం కోరుకుంటోందో దాన్ని నిర్వహించటం ఆర్మీ పని. మేం దీని గురించి మాట్లాడదలచుకోవటం లేదు. కేవలం చేతల్లో చూపిస్తాం’ అని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, పరికరాలతో భారత వైమానిక దళం సిద్ధంగా ఉందని.. ఎయిర్ వారియర్స్ విన్యాసాల ద్వారా గగనతలంలో పటిష్టమైన నిఘా ఏర్పాటుచేసుకున్నామన్నారు. ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల చర్యలను ఆర్మీ నిర్వీర్యం చేస్తోందని.. ప్రతి ఘటన తర్వాత గుణపాఠాలు నేర్చుకుంటున్నామని రాహా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారతీయ వైమానిక దళం ఫేస్బుక్ పేజీ ‘పవర్ టు పనిష్’ను ఆయన ప్రారంభించారు. రాజ్‌నాథ్ ‘సరిహద్దు’ సమీక్ష సర్జికల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో సరిహద్దుల్లో భద్రతను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. రాజస్తాన్‌లోని మునాబావో సరిహద్దు ఔట్‌పోస్టును సందర్శించారు. ‘భారత్ ఎప్పుడూ ఒకరిపై యుద్ధం చేయదు. కానీ, తనపై ఎవరైనా దాడిచేస్తే దీటైన జవాబిస్తుంది’ అని తెలిపారు. సరిహద్దుల్లో భద్రతాపోస్టుల్లో కంచె నిర్మాణం, ఫ్లడ్‌లైట్లు, సైనికులకు సౌకర్యాలతోపాటు ఇతర మౌలికవసతుల కల్పనను ప్రాధాన్యతతో పూర్తిచేస్తామని సైనికులకు తెలిపారు. ‘వసుధైక కుటుంబకం’ అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత్.. ఇతరుల భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సరిహద్దుల్లో కాపలా ఉండే సైనికుల త్యాగాలు మరవలేనివన్నారు. సరిహద్దుల్లో సైనికుల కోసం మరిన్ని మొబైల్ టవర్ల ఏర్పాటుతోపాటు.. శాటిలైట్ ఫోన్లను కూడా పెంచనున్నట్లు తెలిపారు. జవాన్లతో కాసేపు ముచ్చటించి వారిలో ధైర్యాన్ని నింపారు. మళ్లీ భగ్గుమన్న కశ్మీర్ లోయలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తమైంది. పెల్లెట్ గాయాలతో ఓ బాలుడు మృతి చెందటంతో.. ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల కర్ఫ్యూ విధించారు. సఫకదల్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో జునైద్ అఖూన్ అనే బాలుడికి తల, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ.. జునైద్ మరణించటంతో.. ఆందోళనకారులు రెచ్చిపోయారు. అయితే ఘర్షణలోనే బాలుడు మృతిచెందాడని పోలీసులంటుంటే.. పెల్లట్లు తగిలే చనిపోయాడని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో వ్యాపారాలు, ఆస్తులు లేవు పాక్ ప్రధాని షరీఫ్ కుటుంబ సభ్యులు లాహోర్: భారత్‌లో తమ కుటుంబానికి ఎటువంటి వ్యాపారాలు, ఆస్తులు లేవని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తమకు భారత్‌లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ఈ మేరకు షరీఫ్ కుటుంబ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రధాని కుమారునికి భారత్‌లో సొంత వ్యాపారాలు కానీ, వ్యాపారాల్లో భాగస్వామ్యం కానీ లేదని తెలిపారు. మోదీ సర్కారతో సంబంధాల పురోగతికి అవకాశం తక్కువే: అజీజ్ మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వంతో సంబంధాలు మెరుగవుతాయనే నమ్మకం పాకిస్తాన్‌కు లేదని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. -
ప్రధాని మోడీ వద్దకు ఎయిర్‌ఫోర్స్ చీఫ్
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆరూప్ రాహా సోమవారం నాడు కలిశారు. ప్రధానిగా ఎవరు కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించినా.. ఆ తర్వాత మర్యాదపూర్వకంగా త్రివిధ దళాల అధినేతలు ఆయనను కలవడం సంప్రదాయం. అందులో భాగంగానే నరేంద్రమోడీ ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ ఆయన వద్దకు వెళ్లారు. సౌత్ బ్లాక్ లోని ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఈ సమావేశం జరిగింది. భారత వైమానిక దళం ఎంత సన్నద్ధంగా ఉంటుందన్న విషయాన్ని ప్రధానమంత్రితో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. తమకు ఏవేం అవసరాలున్నయన్న విషయాన్ని కొత్త ప్రధానికి వివరించేందుకు ముందుగానే వైమానిక దళం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసుకుని ఉంది. వివిధ రకాల యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కొత్తగా తీసుకోవాల్సి ఉండటం, ఇప్పటికి ఉన్నవి బాగా పాతబడిపోయి ఉండటంతో ఈ అవసరాలన్నింటినీ మోడీకి వివరించినట్లు సమాచారం. -
ఐఏఎఫ్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అరుప్ రహా
న్యూఢిల్లీ: భారత వైమానిక దళ(ఐఏఎఫ్) నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అరుప్ రహా (59) నియమితులు కానున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత లేదా ఆయన పదవి చేపట్టే నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఐఏఎఫ్ ప్రస్తుత చీఫ్ ఎయిర్ మార్షల్ ఎన్ఏకే బ్రౌన్ ఈ ఏడాది డిసెంబర్ 31న రిటైర్ కానున్న నేపథ్యంలో రక్షణ శాఖ రహా నియామకాన్ని మంగళవారం ఖరారు చేసింది. ప్రస్తుతం ఐఏఎఫ్ ఉప ప్రధానాధికారిగా విధులు నిర్వహిస్తున్న రహా 1974 డిసెంబర్ 14న యుద్ధ విమానాల విభాగంలోకి ప్రవేశించారు. అందులో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన రహా సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పరమ విశిష్ట సేవ, అతి విశిష్ట సేవ, వాయు మెడల్స్‌తో సత్కరించింది. -
భారత వైమానిక దళ ప్రధానాధికారిగా అరుప్ రాహ
భారత వైమానిక దళ (ఐఏఎఫ్) ప్రధానాధికారిగా ఎయిర్ మార్షల్ అరుప్ రాహ పేరును కేంద్రంప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది. ప్రస్తుత వైమానిక దళ ప్రధానాధికారి ఎన్ఏకే బ్రౌనీ డిసెంబర్ 31న పదవి విరమణ చేయనున్నారు. దాంతో ఐఏఎఫ్ ప్రధానాధికారిగా అరుప్ డిసెంబర్ 31న బాధ్యతలు స్వీకరిస్తారు. అరుప్ ప్రస్తుతం ఐఏఎఫ్ ఉప ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1974, డిసెంబర్ 14న అరుప్ రాహ వైమానిక దళంలో ప్రవేశించారు. దాదాపు 39 ఏళ్లపాటు ఐఏఎఫ్‌లో పలు కీలక పదవుల్లో అరుప్ రాహ పని చేశారు. అలాగే ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఎయిర్ అటాచ్చీగా కూడా విధులు నిర్వర్తించారు.