'36 కాదు 250 జెట్లు కావాలి'
న్యూఢిల్లీ: భారతదేశ రక్షణకు 36 రఫెల్ జెట్లు సరిపోవని అందుకు 200-250 జెట్లు కనీసం అవసరమవుతాయని ప్రస్తుత వాయుదళ చీఫ్ అరూప్ రాహా బుధవారం పేర్కొన్నారు. ఈ నెల 31వతేదిన రాహా పదవీకాలం పూర్తవుతుంది. ఏ దేశ వాయుదళానికైనా దాని వద్ద ఉన్న ఫ్లీట్లే ఆయువుపట్టు అని వ్యాఖ్యానించారు. గాలిలోనే ఇంధనాన్ని నింపగల ఫోర్స్ మల్టీప్లేయర్ల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. వాటిని వేగంగా సమీకరించడానికి కొత్త టెండర్లు పలవనున్నట్లు తెలిపారు.
స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్న తేజస్ కు తోడు మరో జెట్ భారత వాయుసేనకు అవసరమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం మొత్తం 42 స్క్వాడ్రన్లకు అనుమతినిచ్చిందని.. కేవలం స్క్వాడ్రన్లు ఉంటే చాలదని.. తగిన శక్తిసామర్ధ్యాలు కలిగిన ఫైటర్లు కూడా వాటిలో ఉండాలని అన్నారు. భారత్ వద్ద మరో 40ఏళ్ల పాటు ఉపయోగపడే హెవీ వెయిట్ ఫైటర్లు(ఎస్ యూ30-ఎంకేఐ)లు ఉన్నట్లు చెప్పారు. లైట్ వెయిట్ ఫైటర్ల కొరతను తేజస్ లు తీరుస్తాయని చెప్పారు. కాగా, మిడిల్ వెయిట్ కేటగిరీలో రఫెల్ యుద్ధవిమానాలు అద్భుతంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అయితే, కేవలం 36 రఫెల్ లు మాత్రమే ఉండటం వింగ్ సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని చెప్పారు. మరిన్ని రఫెల్ లను వింగ్ లోకి తీసుకురావడం ద్వారా ఫ్లీట్ కు బలం చేర్చినట్లవుతుందని తెలిపారు. భారతీయ వాయుసేనలో ప్రస్తుతం 33 ఫైటర్ల స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి, ఏఎన్32 విమానం కూలిపోవడం తన కెరీర్ లో మాయని మచ్చలని అన్నారు.
