దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మన సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్‌ల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి.
వీటి విలువ రూ. 32,000 కోట్లు కాగా ఈ డీల్ కింద భారతదేశంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్‌ఆర్‌ఓ) సదుపాయాన్ని నెలకొల్పడంతో పాటు యూఎస్ నుంచి మొత్తం 31 MQ-9B హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు గత వారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) అనుమతి ఇచ్చింది. మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు.
కాగా డెలావేర్‌లో జరిగిన క్వాడ్ లీడర్స్ సదస్సు సందర్భంగా డ్రోన్‌ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య చర్చలు జరిగిన నెలలోపే ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేగాక ఈ డీల్ మొత్తం విలువ రూ.34,500 కోట్లకు పెరగే అవకాశం ఉంది. చెన్నై సమీపంలోని ఐఎన్‌ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్‌బందర్, ఉత్తరప్రదేశ్‌లోని సర్సావా మరియు గోరఖ్‌పూర్‌తో సహా నాలుగు సాధ్యమైన ప్రదేశాలలో భారతదేశం డ్రోన్‌లను ఉపయోగించనుంది.
అయితే చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఈ డ్రోన్లు అవసరమని భారత్ భావిస్తోంది. ఈ డ్రోన్‌లు గరిష్టంగా గంటకు 442 కిమీ వేగంతో, దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. నాలుగు హెల్‌ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్ వీటిల్లో మరోరకమైన సీగార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్ అటామిక్స్ నుంచి లీజ్‌పై భారత్ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment