శ్రీనగర్: భారత వైమానిక దళంలో సీనియర్ ర్యాంక్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా వింగ్ కమాండర్ అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని, అత్యాచారాని పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా ఫ్లయింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుద్గామ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.
కాగా ఇద్దరు అధికారులు శ్రీనగర్ బేస్‌లోనే పనిచేస్తున్నారు. మహిళ తన ఫిర్యాదులో.. 31 డిసెంబర్ 2023న ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో సీనియర్ అధికారి వింగ్ కమాండర్ పీకే సెహ్రావత్ బహుమతి పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. బహుమతి తీసుకోమని అతని గదిలోకి పిలిచి తనతో అసహ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసినట్లు తెలిపారు. చివరికి తనను తోసేసి అక్కడి నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చారు.
ఈ ఘటన అనంతరం తనలో తానే మానసికంగా కుమిలిపోయానని.. ఎంతగానో భయపడ్డానని చెప్పారు. కానీ అతను మాత్రం ఏం జరగనట్లు సాధారణంగా వ్యహరించారని, కనీసం పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. అనంతరం ఇద్దరు మహిళా అధికారులకు ఈ విషయం తెలియజేయగా వారి సాయంతో అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కల్నల్ స్థాయి అధికారిని ఆదేశించారని, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు తనతోపాటు వింగ్ కమాండర్ వాంగ్మూలాలు నమోదు చేయించుకున్నారని చెప్పారు.
అనంతరం వింగ్ కమాండర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. రెండు నెలల తర్వాత మరోసారి ఫిర్యాదు చేయగా.. అధికారులు పక్షపతంతో నిందితుడికి సహకరించారని, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవనే సాకుతో కేసును నీరుగార్చరని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని తెలిపింది.
అప్పటి నుంచి అనేక సార్లు వింగ్ కమాండర్ చేతిలో వేధింపులకు గురవుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. వీటన్నింటితో మానసిక వేధనకు గురవుతున్నట్లు, ఒకానొక సమయంలో చనిపోదామని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
నీసం సెలవులపై వెళ్లడానికి లేదా వేరే చోట పోస్టింగ్ కోసం అభ్యర్థించినా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని నిరంతరం భయంతో జీవిస్తున్నానని తెలిపారు. తన జీవితం మొత్తం నాశనం అయ్యిందని, పూర్తిగా నిస్సహాయకురాలిగా మారినట్లు చెప్పారు.
అయితే వింగ్ కమాండర్‌పై వేధింపుల ఆరోపణల వ్యహారంపై భారత వాయుసేన స్పందించింది. ఈ కేసు గురించి తమకు సమాచారం ఉందని వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా శ్రీనగర్‌లోని భారత వైమానిక దళాన్ని బుద్గామ్ పోలీసులు సంప్రదించారని.. వారి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వాయుసేనకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment