Wing Commander
-
ఎయిర్‌ఫోర్స్‌లో లైంగిక వేధింపులు.. వింగ్ కమాండర్‌పై కేసు
శ్రీనగర్: భారత వైమానిక దళంలో సీనియర్ ర్యాంక్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతోంది. గత రెండేళ్లుగా వింగ్ కమాండర్ అధికారి తనను మానసికంగా వేధిస్తున్నాడని, అత్యాచారాని పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా ఫ్లయింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుద్గామ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.కాగా ఇద్దరు అధికారులు శ్రీనగర్ బేస్‌లోనే పనిచేస్తున్నారు. మహిళ తన ఫిర్యాదులో.. 31 డిసెంబర్ 2023న ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో సీనియర్ అధికారి వింగ్ కమాండర్ పీకే సెహ్రావత్ బహుమతి పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. బహుమతి తీసుకోమని అతని గదిలోకి పిలిచి తనతో అసహ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసినట్లు తెలిపారు. చివరికి తనను తోసేసి అక్కడి నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చారు.ఈ ఘటన అనంతరం తనలో తానే మానసికంగా కుమిలిపోయానని.. ఎంతగానో భయపడ్డానని చెప్పారు. కానీ అతను మాత్రం ఏం జరగనట్లు సాధారణంగా వ్యహరించారని, కనీసం పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. అనంతరం ఇద్దరు మహిళా అధికారులకు ఈ విషయం తెలియజేయగా వారి సాయంతో అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కల్నల్ స్థాయి అధికారిని ఆదేశించారని, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు తనతోపాటు వింగ్ కమాండర్ వాంగ్మూలాలు నమోదు చేయించుకున్నారని చెప్పారు.అనంతరం వింగ్ కమాండర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విచారణను ముగించారని ఆరోపించారు. రెండు నెలల తర్వాత మరోసారి ఫిర్యాదు చేయగా.. అధికారులు పక్షపతంతో నిందితుడికి సహకరించారని, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవనే సాకుతో కేసును నీరుగార్చరని ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని తెలిపింది.అప్పటి నుంచి అనేక సార్లు వింగ్ కమాండర్ చేతిలో వేధింపులకు గురవుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. వీటన్నింటితో మానసిక వేధనకు గురవుతున్నట్లు, ఒకానొక సమయంలో చనిపోదామని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నీసం సెలవులపై వెళ్లడానికి లేదా వేరే చోట పోస్టింగ్ కోసం అభ్యర్థించినా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని నిరంతరం భయంతో జీవిస్తున్నానని తెలిపారు. తన జీవితం మొత్తం నాశనం అయ్యిందని, పూర్తిగా నిస్సహాయకురాలిగా మారినట్లు చెప్పారు.అయితే వింగ్ కమాండర్‌పై వేధింపుల ఆరోపణల వ్యహారంపై భారత వాయుసేన స్పందించింది. ఈ కేసు గురించి తమకు సమాచారం ఉందని వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా శ్రీనగర్‌లోని భారత వైమానిక దళాన్ని బుద్గామ్ పోలీసులు సంప్రదించారని.. వారి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వాయుసేనకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
హెలికాప్టర్ సడన్‌గా పడిపోయి ఉండొచ్చు..బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై
సాక్షి, హైదరాబాద్/కంటోన్మెంట్: ప్రతికూల వాతావరణానికి సాంకేతికలోపం తోడై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణించిన ఎంఐ–17 హెలికాఫ్టర్ సడన్‌గా డ్రాప్ అయి కిందికి వచ్చి ఉంటుందని, దీని వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని రిటైర్డ్ వింగ్ కమాండర్ టీజే రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ ఎన్ఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎంఐ–17 హెలికాప్టర్ గంట ప్రయాణానికి 800 లీటర్ల ఇంధనం అవసరం అవుతుందని, ప్రమాద సమయంలో హెలికాప్టర్లో కనీసం 1,200 లీటర్ల ఇంధనం ఉండే అవకాశముందని, ఎత్తు నుంచి కిందకు పడిపోయిన వెంటనే ఇంధనం వల్ల మంటలు చెలరేగి ఉంటాయన్నారు. హెలికాప్టర్‌లోని ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్ బాక్స్), కాక్ పిట్ వాయిస్ రికార్డర్ విశ్లేషణ తర్వతే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. ఈ విశ్లేషణకు 10 నుంచి 15 రోజుల సమయం పట్టొచ్చన్నారు. టీజే రెడ్డి, ఎన్ఎన్ రెడ్డి గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలపై వీరేమన్నారంటే.. చలికాలం.. పొగ మంచు.. వీఐపీలు ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లను అత్యంత అనువభమున్న పైలెట్లే నడుపుతారు. టేకాఫ్ అవడానికి ముందే వాటిని అనేక రకాలుగా పరీక్షిస్తారు. సీడీఎస్ రావత్ ప్రయాణించిన ఎంఐ–17 హెలికాఫ్టర్లోని వెదర్ రాడార్‌లో ప్రయాణ మార్గంలో వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. అయితే మేఘాలు స్పష్టంగా కనిపించినా పొగమంచు ఆ స్థాయిలో కనిపించదు. రావత్ ప్రయాణించిన మార్గంలో కొండలు, అడవులు ఉన్నాయి. చలికాలంలో కొండలపై భాగంలో పొగమంచు ఎక్కువుంటుంది. ఒక్కోసారి ఊహించిన దానికంటే ఎక్కువగానూ ఉండొచ్చు. అనుకోకుండా పెరిగిపోవచ్చు. గమ్యానికి మరో 10–15 కి.మీ. దూరంలోనే ఉండటంతో పైలెట్ హెలికాఫ్టర్‌ను కిందికి తీసుకువచ్చి ఉంటాడు. ఆ సమయంలో మంచు వల్ల కింద ఏముందో కనిపించకపోవచ్చు. అయినా అనుభవజ్ఞుడైన పైలెట్ కావడంతో ధైర్యంగా కిందికి వచ్చి ఉంటాడు. ఆ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి హెలికాప్టర్ సడన్‌గా డ్రాప్ అయి ఉంటుంది. ఒకేసారి 100 నుంచి 150 అడుగులు కిందికి పడిపోయి ఉంటుంది. దీని వల్ల హెలికాప్టర్‌లోని ఇంధనం నుంచి మంటలు అంటుకొని ఉండొచ్చు. వాతావరణం బాగోలేనప్పుడు.. వాతావరణం బాలేనప్పుడు పైలట్లు సురక్షితమైన ఎత్తును పాటిస్తూ ఉంటారు. గమ్యానికి చేరాక దిగాల్సిన చోట నాలుగైదు రౌండ్లు వేసి హైట్ తగ్గించుకుని ల్యాండ్ చేస్తారు. రావత్ హెలికాప్టర్ విషయంలో ఇలా ఎందుకు జరగలేదో తేలాల్సి ఉంది. హెలికాప్టర్ బయలుదేరినప్పటి నుంచి కూలే వరకు ఎంత ఎత్తులో ప్రయాణించింది, సాంకేతిక సమస్యలు వచ్చాయా లాంటివి ఫ్లైట్ డేటా రికార్డర్లో ఉంటాయి. పైలట్, కోపైలట్ ఏటీసీతో జరిపిన సంభాషణ అందులో ఉంటుంది. వాటిని విశ్లేషిస్తే ప్రమాద కారణాలు తెలుస్తాయి. -
పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ
కరాచీ: భారత్‌పై విషప్రచారం చేయడంలో ఏ అవకాశాన్నీ వదులుకోని పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. కరాచీలోని పాకిస్తాన్ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో భారత వైమానికదళ వింగ్‌కమాండర్ వర్ధమాన్ బొమ్మను ప్రదర్శించింది. వర్ధమాన్ చుట్టూ పాక్‌సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచింది. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెంబడించాడు. ఈ ప్రక్రియలో అతను నడుపుతున్న యుద్ధవిమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. అతను సురక్షితంగా బయటపడినప్పటికీ పాక్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల అనంతరం అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. ఈ ఘటనపై అప్పట్లో సామాజిక మాధ్యమాల్లోనూ పాకిస్తాన్ వ్యంగ్య ప్రచారాన్ని చేసింది. తాజాగా అభినందన్ బొమ్మను మ్యూజియంలో ప్రదర్శించింది. దీనిని పాకిస్తాన్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అన్వర్‌లోధీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘అభినందన్ బొమ్మ చేతిలో ఒక టీ కప్పు ఉంచితే బొమ్మకు మరింత పరిపూర్ణత వచ్చేది’అని లోధీ వ్యాఖ్యానించాడు. అభినందన్ పాకిస్తాన్ అదుపులో ఉన్నప్పుడు పాక్ సైన్యం విడుదల చేసిన ఒక వీడియోలో అభినందన్ టీ తాగుతున్నట్టుగా చూపించడంతో లోధీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
గగనతలంలో అరుదైన ఘట్టం
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌తో కలిసి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మిగ్ 21 సోర్టీ యుద్ధవిమానాన్ని చివరిసారిగా నడిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఇది ధనోవా చివరి గగన విహారం. అంతేకాదు.. ఈ విహారానికో ప్రత్యేకత ఉంది. గతంలో అభినందన్ తండ్రి సింహకుట్టి వర్థమాన్‌తో కలిసి ధనోవా యుద్ధవిమానాన్ని నడిపించారు. ఎయిర్ మార్షల్‌గా సింహకుట్టి రిటైరయ్యారు. ఆయన కొడుకు అయిన అభినందన్ భారత వైమానిక దళంలో పనిచేస్తుండటమే కాదు.. గత ఫిబ్రవరిలో గగనతలంలో పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరి వైమానిక పోరులో దాయాదికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని వీరోచితంగా కూల్చేసిన సంగతి తెలిసిందే. దాయాదితో వీరోచిత పోరులో అసమాన ధైర్యసాహసాలకు మారుపేరుగా నిలిచిన అభినందన్‌తో కలిసి మిగ్ 21 యుద్ధవిమానాన్ని నడిపించిన ధనోవా అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభినందన్‌తో తనకు పలు విషయాల్లో సారూప్యతలు ఉన్నాయని, అందుకే అతనితో కలిసి చివరిసారిగా యుద్ధవిమానాన్ని నడిపించానని తెలిపారు. తాము ఇద్దరం కూలిపోతున్న యుద్ధవిమానం నుంచి తప్పించుకొని కిందకు దిగామని, అదేవిధంగా పాకిస్థానీలతో పోరాడామని ధనోవా వివరించారు. ఇక, అభినందన్ తండ్రి సింహకుట్టితో కలిసి తాను గతంలో యుద్ధ విమానం నడిపించానని, ఇప్పుడు ఆయన కొడుకుతో కలిసి యుద్ధ విమానం నడిపించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. -
విధుల్లో చేరిన వింగ్ కమాండర్ అభినందన్
-
అభినందన్ ఆకాశయానం..!
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విమానాలను నడపడం ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాకిస్తాన్ యుద్ధ విమానాలతో జరిగిన పోరులో వర్ధమాన్ నడుపుతున్న మిగ్–21 విమానం కూలిపోయి ఆయన గాయాలపాలై పాకిస్తాన్లో పడిపోవడం తెలిసిందే. తన విమానం కూలిపోవడానికి ముందే వర్ధమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్లో పడిపోయినా ఎంతో ధైర్యం ప్రదర్శించి అందరి మన్ననలూ అందుకున్నారు. ఇటీవలే కేంద్రం ఆయనకు వీరచక్ర అవార్డును కూడా ప్రకటించింది. మార్చి 1న రాత్రి వర్ధమాన్‌ను పాక్ భారత్‌కు అప్పగించాక, దాదాపు రెండు వారాలపాటు వర్ధమాన్ చికిత్స అందుకుంటూ భద్రతా సంస్థల పర్యవేక్షణలో ఉన్నారు. వారి విచారణను ఎదుర్కొన్నారు. వీలైనంత త్వరగా మళ్లీ యుద్ధ విమానాన్ని నడపాలని తాను కోరుకుంటున్నట్లు అప్పట్లో వర్ధమాన్ చెప్పారు. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ వర్ధమాన్‌కు వైద్య పరీక్షలన్నీ చేసి, ఆయన మళ్లీ విమానం నడిపేందుకు అన్ని రకాలుగా సిద్ధమేనని మూడు వారాల క్రితం వెల్లడించింది. దీంతో వర్ధమాన్ మళ్లీ యుద్ధ విమానాలు నడుపుతున్నారు. ప్రస్తుతం రాజస్తాన్‌లోని వైమానిక స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన శత్రు విమానాన్ని కూల్చేసిన అనంతరం మూడు రోజులపాటు పాక్‌లో బందీగా ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర శౌర్య పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనిక పురస్కారాలను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్‌కు ఆయన మరణానంతరం రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను కేంద్రం ఇచ్చింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌తో భారత్ ఆకాశంలో తలపడినప్పుడు స్క్వాడ్రన్ లీడర్‌గా ఉండి విమానాలను నియంత్రించిన మింటీ అగర్వాల్‌కు యుద్ధ సేవా పతకం దక్కనుంది. వాయుసేనకు 5 యుద్ధ సేవ, 7 వాయుసేన పతకాలు సహా మొత్తం 13 పురస్కారాలు దక్కనున్నాయి. ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఐదుగురు యుద్ధ పైలట్లకు పురస్కారాలు లభించాయి. ఆర్మీకి 8 శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేనా పతకాలు దక్కాయి. నౌకాదళానికి ఒక శౌర్య చక్ర పురస్కారం లభించింది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ శిక్షణా శిబిరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేయడంతో మరుసటి రోజే పాక్ ప్రతిదాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో పాక్‌కు చెందిన ఎఫ్–16 విమానాన్ని వర్ధమాన్ కూల్చేశారు. తాను నడుపుతున్న మిగ్–21 విమానం దాడికి గురవ్వడంతో ఆయన కిందకు దూకేసి ప్రాణాలతో బయటపడినప్పటికీ పాకిస్తాన్లో దిగారు. దీంతో ఆయనను పాకిస్తాన్ మూడురోజులపాటు బందీగా ఉంచుకున్న అనంతరం భారత్‌కు అప్పగించింది. ముంబైలో జాతీయ జెండాతో సినీ నటి నిత్యా మీనన్ -
పైలట్ అభినందన్‌కు అత్యున్నత పురస్కారం?
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను భారత ప్రభుత్వం ఉన్నత మిలిటరీ పురస్కారంతో సత్కరించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో దాయాది పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని తాను నడుపుతున్న మిగ్-21 బిసన్ యుద్ధవిమానం నుంచి అభినందన్ కూల్చేశారు. ఇందుకుగాను ఆయనకు ‘వీరచక్ర’ పురస్కారం దక్కే అవకాశముందని తెలుస్తోంది. పరమవీర చక్ర, మహావీర చక్ర పురస్కారాల తర్వాత అత్యున్నత మిలిటరీ పురస్కారం ‘వీరచక్ర’. బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద శిబిరాలపై బాంబులు జారవిడిచిన ఐదుగురు మిరాజ్ 2000 ఫైటర్ పైలట్లను కూడా కేంద్రం సత్కరించనుంది. వారి సాహసానికి గుర్తింపుగా వాయుసేన మెడల్స్‌ను బహూకరించనుంది. పాక్ యుద్ధవిమానాలతో పోరాడుతూ.. తన మిగ్-21 బిసన్ యుద్ధవిమానం కూలిపోవడంతో అభినందన్ పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. రెండురోజుల పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను.. భారత ప్రభుత్వం తెచ్చిన దౌత్య ఒత్తిడిని తలొగ్గి దాయాది రెండు రోజుల అనంతరం మన దేశానికి అప్పగించింది. గత ఫిబ్రవరి 26న పూల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లో భారత సైన్యం వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. -
ఆకాశం ముద్దాడిన వేళ..
యుద్ధాకాశాన్ని ముద్దాడి, మరణపుటంచులు తాకి వచ్చిన యుద్ధవీరుడు అభినందన్ ఈ దేశ ప్రజల మదిలో శాశ్వత అభినందనీయుడు. మూడు రోజుల అనంతరం మాతృదేశంలోకి అభినందన్ వర్ధమాన్ రాక కోసం యావత్ దేశం సరిహద్దుల్లో కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూసింది. అజరామరమైన అతడి శౌర్యం, త్యాగశీలత ప్రశంసల జల్లులా కురిసింది. సోషల్ మీడియాలో అభినందన్‌ని కృతజ్ఞతాభినందనలతో ముంచెత్తారు. అలాంటి అద్భుతమైన సందర్భంలో ఆయనకు ఆకాశమే స్వయంగా స్వాగతం పలికింది. విశ్వాంతరాళాల్లోని మరో గ్రహం నుంచి అభినందన్‌కు అభినందనలు అందాయి. భారతీయుల సృష్టితో అంగారక గ్రహంపై అడుగుపెట్టిన మంగళ్యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) అభినందన్‌కు నిండైన ఆహ్వనం పలికింది. అది కూడా మన తెలుగు గడ్డపై తయారై, అంగారక గ్రహంలోకి పంపిన మంగళ్యాన్ మిషన్ ఇస్రో అధికారిక ట్విటర్ ‘వింగ్ కమాండర్ అభినందన్! మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం’అని ట్వీట్ చేసింది. బహుశా ఒక వీరుడి జీవితంలో ఇంతటి అరుదైన, అద్భుతమైన అవకాశం ఎవరికీ దక్కకపోవచ్చు. ఎందుకంటే అంతరిక్షం నుంచి మంగళ్యాన్ భూమిపైకి పంపిన రెండో మెసేజ్ ఇది. గత ఏడు నెలల్లో అంగారకుడి నుంచి ఏకైక సందేశం కూడా ఇదే. అంతకుముందు గతేడాది సెప్టెంబర్ 29న అంగారకగ్రహంపై తన నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మంగళ్యాన్ ఓ సందేశాన్ని పంపింది. మంగళ్యాన్ ఆవిష్కరణ ముందు 2013లో ఇస్రో అధికారిక ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లను ప్రారంభించి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంది. అయితే 2014లో మంగళ్యాన్ పేరిట అధికారిక ఖాతా తెరిచింది. -
‘మా చిన్నారి అభినందన్ ఎలా ఉన్నాడు’
న్యూఢిల్లీ : గడిచిన మూడు రోజులు దేశవ్యాప్తంగా అభినందన్ నామస్మరణే. అతనికి సంబంధించిన వార్తలతోనే ఈ మూడు రోజులు తెల్లవారింది.. చీకటి పడింది. శత్రు సైనికులకు చిక్కినప్పడు అతడు చూపిన తెగువ వల్ల ఒక్కసారిగా నేషనల్ హీరో అయ్యారు అభినందన్. ‘ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కర్తవ్యం మరవలేదని.. రియల్ హీరో’ అంటూ అభినందిస్తున్నారు జనాలు. తమ భూభాగంలో దిగిన అభినందన్‌ను పాకిస్తాన్ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది. అయితే ఈ మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో అభినందన్ గురించి వచ్చే మెసేజ్‌ల ప్రవాహానికి అంతే లేకుండా పోయింది. అభినందన్ ధైర్య సాహసాలకు గౌరవంగా.. పుట్టిన బిడ్డలకు అతని పేరు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విటర్ నిండా ఇలాంటి మెసేజ్‌లే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వింగ్ కమాండర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. ‘‘అభినందన్’ అనే ఈ సంస్కృత పదానికి నేడు కొత్త అర్థం రూపొందింది’ అంటూ ప్రశంసించారు. శత్రు దేశానికి చిక్కిన అభినందన్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ అభినందన్‌ను శుక్రవారం వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. -
ట్రెండింగ్‌లో అభినందన్ ‘గన్స్లింగర్’..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌పై పాక్ వైమానిక దాడులను తిప్పికొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్-21 విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్యారాచూట్ సాయంతో పాకిస్తాన్ భూభాగంలో దిగిపోవాల్సి వచ్చింది. అభినందన్ క్షేమంగా తిరిగి భారత్‌కు తిరిగి రావాలని యావత్ భరత ఖండం వేయి కళ్లతో ఎదురు చూసింది. పూజలు, యాగాలు చేసింది. గడిచిన మూడు రోజులుగా దేశమంతా ‘అభినందన’ స్మరణే. ఇక ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కర్తవ్యం మరువలేదని, అభినందన్ ధైర్య సాహసాలపై పాక్ మీడియా కథనం కూడా ప్రచురించింది. శత్రు దేశానికి చిక్కిన అభినందన్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. (అభినందన్ ఆగయా..) మరచిపోలేని మీసం.. ఓవైపు భారత్ వింగ్ హీరో అభినందన్ తిరిగి రావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతోంటే.. మరోవైపు అందంగా, ఒడుపుగా తీర్చిద్దిన అభినందన్ మీసం పట్ల ఆకర్షణ మొదలైంది. తమిళ సంస్కృతిలోని ఆయన కట్టూ బొట్టూను అనుసరిచేందుకు మనోళ్లు రెడీ అయిపోయారు. ఆయనలా ‘గన్స్లింగర్’ మీసం తిప్పేందుకు సిద్ధమైపోయారు. ఇప్పుడీ గన్స్లింగర్ మీసం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందన్ వీరత్వంపై ప్రశంసలు కురిపించాడు. ‘మీ వల్లే మేమేంతా నిశ్చింతగా.. గర్వంగా ఉండగలుగుతున్నాం. మీకు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఇంతకూ గన్స్లింగర్ అంటే..! పురాతన కాలంలో ప్రత్యర్థి ఎత్తులకు చిక్కకుండా.. వారి సైన్యంపై గుళ్ల వర్షం కురిపిస్తూ గన్‌తో తుత్తునియలు చేసేవారిని గన్స్లింగర్ అనేవారు. ధీరత్వం, ఠీవీ కలగలిసిన గన్స్లింగర్ శత్రువుల కంటబడినా చాకచక్యంగా తప్పించుకోవడం అతని నైజం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపున పోరాడిన జనరల్ అలెగ్జాండర్ షాలర్ అభినందన్ మాదిరి గుర్రెపు డెక్క మీసం కలిగి ఉండడం గమనార్హం. అసాధారణ పోరాటపటిమ చూపిన ఈ అమెరికా జనరల్‌కు మిలటరీలో అత్యున్నతమైన మెడల్ ఆఫ్ హానర్ దక్కడం విశేషం. (‘పాక్ జవాన్లే నన్ను రక్షించారు’) (చదవండి : ఎవరీ విక్రమ్ అభినందన్?) How proud we are to have you ! Bow down to your skills and even more your grit and courage 🙏 #WelcomeBackAbhinandan . We love you and are filled with pride because of you.#WeAreSupposedToTellYouThis pic.twitter.com/IfqBFNNa3T — Virender Sehwag (@virendersehwag) 1 March 2019 -
‘పాక్ జవాన్లే నన్ను రక్షించారు’
ఢిల్లీ: తాను కిందపడ్డ సమయంలో అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారని, ఆ గందరళగోళంలో తన పిస్టల్ కింద పడిపోయినట్లు పాక్ చేతికి చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ తెలిపారు. ఈ మేరకు కొత్తగా విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. నన్ను నేను రక్షించుకోవడానికి పరుగులు తీశానని, అల్లరి మూక తన వెంట పడినట్లు పేర్కొన్నారు. వాళ్లు చాలా ఆవేశంలో ఉన్నారని, అదే సమయంలో ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు వచ్చారని, వాళ్లే నన్ను మూక నుంచి రక్షించినట్లు అభినందన్ తెలిపారు. తర్వాత వారు తనను వాళ్ల యూనిట్‌కు తీసుకెళ్లారు.. అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్నారు. అక్కడే వైద్య పరీక్షలు కూడా నిర్వహించారని చెప్పారు. నా విషయంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రొఫెషనల్‌గా వ్యవహరించిందని అభినందన్ వెల్లడించారు. -
అభిమన్యుడు కాదు అతడు అభినందన్
భరతమాత కడుపులో వినిపించే మంత్రం.. జైహింద్!ఒక సోల్జర్‌కి ఆ నినాదమే..పద్మవ్యూహాన్నైనా, పాక్ వ్యూహాన్నైనాఛేదించుకుని రాగలిగిన శక్తిని ఇస్తుంది.మన సైనిక స్థావరాలపై దాడికి వచ్చిన శత్రువునుతరిమికొడుతూ.. కొడుతూ.. తను తూలిపడ్డాడు అభినందన్.శత్రువు గుండెల్లో సింహంలా పడ్డాడు. పాకిస్తాన్‌ది ఎజెండా. అభినందన్‌ది జెండా. జెండాదే పైచేయి అయింది. సోల్జర్.. నీకు స్వాగతం పలుకుతోంది నీ దేశం. యోధుడా.. నిన్ను చూశాం. చెట్ల కొమ్మల్ని విరిచేసుకుంటూ గగనతలం నుంచి జారి ముక్కలైన లోహ విహంగంలా శత్రువుల చేతుల్లోకి నువ్వు జారడం చూశాం. నిన్ను చూస్తే నువ్వే కదా కనిపించాలి. సడలని నీ మనోబలం సాక్షాత్కారమైంది! కొడుతున్నారు నిన్ను. ఈడ్చుకెళుతున్నారు. నీ దేహం రక్తం వోడుతోంది. నువ్వోడి పోలేదు. నిన్నేవో అడుగుతున్నారు దేశ రహస్యాలు చెప్పమని. చెప్పలేనని చెప్పేశావ్! శత్రుదేశానికి చిక్కి ఒంటరిగా, అసహాయంగా ఉన్నా.. మాతృదేశానికి ఇచ్చిన మాటపైనే నిలబడి ఉన్నావ్. ‘ప్రాణాలు పోతున్నా.. పోరాడుతూనే ఉంటానని’ నువ్వు చేసిన వెళ్లిన ప్రతిజ్ఞే నీ కళ్లలో ప్రతిఫలిస్తోంది. ధీశాలీ.. నిన్ను హత్తుకోవాలి. వెయ్యి మాటలు, ఒక్క సెల్యూట్ సరిపోతాయా! గట్టి హృదయాలింగనం ఒకటి కావాలి. ఉప్పొంగుతున్న మనసుతో నిన్ను అభిషేకించుకోవాలి. ఆత్మీయంగా ఒక్క పిలుపు పిలుచుకోవాలి. ఏ పేరుకు ఇమిడిపోతావు? ఏ తీరున అభినందన స్వీకరిస్తావు? నీ ఛాతీ లోపల ఉన్న మందుగుండు సామగ్రి ఎన్ని టన్నుల బరువో.. నీ ఛాతీపైన ఉన్న రంగుల పట్టీ చెబుతోంది. అభినందన్ వర్థమాన్, వింగ్ కమాండర్!ధీరుడా.. శతకోటి పేర్లు నీ నిర్భీతికి సరిపోవు. సహస్ర భుజకీర్తులూ నిన్ను మోయలేవు. ఎన్ని హోదాల్లో నువ్వున్నా.. ఎంతపైకి నువ్వెదిగినా.. లీడర్, కమాండర్, కెప్టెన్, కమడోర్, మార్షల్ .. వీళ్లెవరూ కాదు నువ్వు మాకు. సోదరుడా.. నా దేశ సహోదరుడా.. సైన్యం నీ పోరాట పటిమకు ఎన్ని వర్ణాల ఘనతలైనా ఇవ్వనివ్వు. నువ్వు మాకు సోల్జర్వే. సోల్జర్ అన్న మాటే మాకు పెద్దర్యాంకు. చీఫ్ మార్షల్ కన్నా పెద్ద ర్యాంకు.సోల్జర్.. యుద్ధ విమానం నువ్వు. వందల వార్హెడ్లకు, వేల యుద్ధ టాంకులకు, విధ్వంసక నౌకలకు.. సమానం నువ్వు.నూటా ముప్పై కోట్ల మంది భారతీయులకు కలిపి ఒకే హార్ట్ బీట్.. నువ్వు. సోల్జర్..! బందీగా చిక్కినప్పుడు నిన్ను మేము చూశాం. నీపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. నీ ముఖం చీరేస్తున్నారు. నిన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు. కనిపించకుండా నిన్నెవరో ప్రశ్నిస్తున్నారు. కాన్ఫిడెన్స్ చెదరకుండా నువ్వు సమాధానం ఇస్తున్నావు. ఏది ముందో, ఏదో వెనుకో తెలియడం లేదు. గౌరవించాక నిన్ను హింసించారా? హింసించాక నిన్ను గౌరవించారా? శత్రువుకొక యుద్ధనీతి లేదు. యుద్ధరీతి లేదు. అడగ కూడనివి అడుగుతున్నాడు. చెప్ప తగదని నువ్వంటున్నావ్. ఇక్కడ కూర్చొని అంతా చూస్తూనే ఉన్నాం. ‘నీ వివరాలు చెప్పు’ ‘అభినందన్ వర్థమాన్. వింగ్ కమాండర్. సర్వీస్ నెంబర్ 27981’‘ఏ దేశం?’‘ఇండియా’‘ఇండియాలో ఎక్కడ?’‘దక్షిణ ప్రాంతం’‘నువ్వొచ్చిన ఎయిర్‌క్రాఫ్ట్ ఏమిటి?’‘శకలాలు చూస్తే మీకే తెలుస్తుంది’‘నీ దేశం నీకు అప్పగించిన టాస్క్ ఏమిటి?’‘చెప్పవలసిన అవసరం ఏమిటి?’‘ఏ స్క్వాడ్రన్?’‘చెప్పవలసిన అవసరం ఏమిటి?’ఏం గుండె సోల్జర్ నీది!ఉన్నది శత్రు సైన్యం చేతుల్లో. చెప్పేది లేదంటున్నది నిరాయుధంగా బందిఖానాలో! మ్యాప్‌లో కూడా భారత్‌ని కన్నెత్తి చూడనిచ్చేలా లేవు! ఎక్కడిది నీకా ధీరత్వం. నీ ఊరు ఇచ్చిందా? నీ పూర్వీకులు ఇచ్చినదా? నీ సిపాయి తండ్రి సాహసాలా? నీ తల్లి పట్టిన ఉగ్గుపాలా?మేమున్నాం నీ కోసం, నీ కుటుంబం కోసం అని మేం చెప్పడమేం గొప్ప! విరోధికి బందీ అయి కూడా నువ్వు చెబుతున్నావ్. దేశానికి నేనున్నానని. సోల్జర్.. నీకు పార్టీ లేదు. నీది ఎన్డీయే కాదు, యూపీయే కాదు. స్పెషల్ ఫోర్స్ డీఎన్ఏ నీది. దేశభక్తి డీఎన్యే. దేశమే నీ పార్టీ. ధైర్యవంతుడివి నువ్వు. బోర్డర్ లోపల.. నువ్వున్నావన్న ధైర్యం మాత్రమే మాది. బోర్డర్ అవతల పడిపోయినా, ఇక్కడి మా ధైర్యాన్ని సడలనివ్వని ధీరోదాత్తుడివి నువ్వు. ముఖాముఖి యుద్ధం నీది. తెగించి సైన్యంలోకి వెళ్లేందుకు నువ్వు మాత్రమే ఉవ్విళ్లూరగలవు. పుట్టడమే దేశం కోసం పుట్టినట్లు నువ్వు మాత్రమే బొడ్డు తాడును తెంపుకున్న వెంటనే తుపాకీని భుజానికి తగిలించుకోగలవు.శత్రువుతో తలపడుతూ ముందు వరుసలో నువ్వుంటావ్. ఏమైనా జరగొచ్చు. శత్రువు తల తెగిపడవచ్చు. శత్రువే నిన్ను తునాతునకలు చెయ్యొచ్చు. లెక్కచెయ్యవు నువ్వు. దేశ ప్రజల రక్తం నీలో మరుగుతున్నప్పుడు.. దేశ పరువు ప్రతిష్టలు నీ కండరాలను బండరాళ్లుగా మార్చి సరిహద్దుల్లో కంచెగా నిలబెట్టినప్పుడు నువ్వొక శతఘ్నివి. శత్రువుకు హెచ్చరికవి. సోల్జర్.. మాకు తెలుసు. నీకేదైనా అయితే నీ కుటుంబానికి ఈ దేశం ఉంటుందనే ధీమాతో వెళ్లవు నువ్వు సరిహద్దుకు. దేశమనే కుటుంబానికి ఏమీ కానివ్వననే ధీమాను ఇచ్చేందుకు వెళ్తావు. యుద్ధమంటే నీకు చర్చలు, సమావేశాలు కాదు. పత్రాలు, సంతకాలు కాదు. క్షమాపణలు, మన్నింపులు కాదు. బిగిసిన పిడికిళ్లు, ఎగిసిన నినాదాలు కాదు. యుద్ధమంటే మరణం. మరణమొక్కటేనా! అవయవాలు తెగిపడడం. కుటుంబాలు నిలువునా కూలిపోవడం. తల్లి గుండెలు బాదుకోవడం. భార్య మూర్ఛిల్లి పడిపోవడం. పిల్లలు సొమ్మసిల్లడం. ఊరు నివ్వెరపోవడం. సోల్జర్.. నీకన్నీ తెలిసి నిబ్బరంగా ఉంటావు. నిబ్బరం నీ రెండోగుణం. దుర్భరత్వంలో నిగ్రహమే నీ మొదటి గుణం. శాంతిదూతవు నువ్వు. లేకుంటే యుద్ధంలోకి ఎందుకు వెళతావ్? నిన్నటి నుంచీ దేశం నీకోసం సర్వమతాలలో ప్రార్థనలు జరుపుతోంది. ఆర్మీ స్థావరాల్లో గర్జిస్తోంది. అత్యవసర సమావేశాల్లో ఆలోచనలు చేస్తోంది. ఐక్యరాజ్య సమితికి తన వాదనలు వినిపిస్తోంది.నువ్వూ ప్రార్థిస్తూనే ఉంటావు. నీ కోసం మేము ప్రార్థిస్తుంటే, దేశం కోసం నువ్వు ప్రార్థిస్తావు. నీది మోకరిల్లని ప్రార్థన. కనులు మూయని ప్రార్థన. నింగివైపు చూసి ఎవర్నీ ఏదీ అడగని ప్రార్థన. యుద్ధంలో గాయపడడం నీ ప్రార్థన. గాయాన్ని భరించడం నీ ప్రార్థన. చిత్రహింసలు పెడుతున్నా నోటి నుంచి ఒక్క వివరాన్నైనా రానివ్వక పోవడం నీ ప్రార్థన. సోల్జర్వి నువ్వు. నీకు మాటల్తో పనిలేదు. సమాలోచనలతో పనిలేదు. చర్చలు, సాధ్యాసాధ్యాల విశ్లేషణలతోనూ పని లేదు. యుద్ధమంటే సిద్ధమౌతావ్. సిద్ధమయ్యాక.. నువ్వే ఒక సర్వసత్తాక దేశమౌతావ్. నువ్వే.. రెపరెపలాడే ఒక జాతీయ పతాకం అవుతావ్. సోల్జర్. నీ కోసం ఎదురుచూస్తున్నాం. స్వాగతం చెప్పేందుకు దేశమంతా కళ్లు చేసుకుని చూస్తున్నాం. -
పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైనికులకు బందీగా చిక్కిని భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను చిత్రహింసలకు గురిచేయవద్దని, జెనీవా ఒప్పందానికి కట్టుబడి వ్యవహరించాలని పాక్ సైన్యానికి భారత్‌తోపాటు అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి చేసింది. ఇంతకు జెనీవా ఒప్పందం అంటే ఏమిటీ ? అందులోని అంశాలేమిటీ? అవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయి ? జేనీవా ఒప్పందానికి ఏయే దేశాలు కట్టుబడి ఉండాలి ? ఉల్లంఘిస్తే శిక్షేమిటీ ? జేనీవా ఒప్పందంలో నాలుగు అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్భాగం. ఈ ఒప్పందంపై సంతకం చేసిన ప్రతి దేశం అంతర్జాతీయ మానవతా విలువలకు కట్టుబడి వ్యవహరించాలి. 1929లో మొదటిసారి ఈ ఒప్పందం అమల్లోకి రాగా, రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక రెండో సారి 1949లో ఆధునీకరించారు. జెనీవా ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఓ సైనికుడు పట్టుబడినా, ఓ పౌరుడు పట్టుబడినా వారిని ఎలా చూసుకోవాలో స్పష్టమైన నిబంధనలను రచించారు. ఒక్క యుద్ధం జరిగినప్పుడు మాత్రమే కాకుండా శాంతియుత పరిస్థితుల్లో కూడా దేశాల మధ్య ఈ నిబంధనలు వర్తిస్తాయి. (పైలట్ అభినందన్ తండ్రి భావోద్వేగం) 13వ అధికరణం ఏం చెబుతోంది? పట్టుబడిన సైనికుడికి అవసరమైన వైద్య చికిత్సలు అందించడంతోపాటు ఆయన్ని ఎలా చూసుకోవాలో కూడా జెనీవా ఒప్పందంలోకి 13వ అధికరణం తెలియజేస్తోంది. ‘నిర్బంధంలో ఉన్న సైనికుడిని శారీరకంగా ఎలాంటి హింసకు గురి చేయరాదు. హింస కారణంగా బందీ గాయపడినా, ప్రాణం పోయినా, ప్రాణాపాయానికి గురైన ఒప్పందం ప్రకారం తీవ్రమైన నేరం. ప్రజల నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి, ప్రజా హింస నుంచి పూర్తి రక్షణ కల్పించాలి. బందీపై ఎలాంటి వైద్య, శాస్త్ర ప్రయోగాలు నిర్వహించరాదు’ అని చెబుతోంది. భారత పైలట్ అభినందన స్థానిక ప్రజలకు చిక్కగానే వారు ఆయనపై దాడి చేసిన విషయం తెల్సిందే. (ట్రెండింగ్: వెలకమ్ బ్యాక్ అభినందన్) ఇదే సెక్షన్‌కు రెడ్‌క్రాస్ సొసైటీ అంతర్జాతీయ కమిటీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం పట్టుబడిన బందీ ఫొటోలనుగానీ, వీడియోలనుగానీ విడుదల చేయరాదు. విడుదల చేసినట్లయితే ఆయన ప్రాణాలకు ప్రజల నుంచి లేదా ఇతర శక్తుల నుంచిగా ముప్పు ఉంటుందన్నది రెడ్‌క్రాస్ కమిటీ అభిప్రాయం. ఈ లెక్కన పాక్ సైనికులకు చిక్కిన అభినందన ఫొటోలను, వీడియోలను పాక్ సైనికులు విడుదల చేశారు కనుక వారిపై జెనీవా ఒప్పందం ఉల్లంఘించారని భారత్ అభియోగాలు మోపవచ్చు! (తలొగ్గిన పాక్.. రేపు అభినందన్ విడుదల) జెనీవా ఒప్పందంలో 140 అధికరణలు ఉన్నాయి. ఓ బందీ పట్ల జైలు లోపల, జైలు బయట, కోర్టులో కేసు విచారణ సందర్భంగా ఎలా ప్రవర్తించాలో, వారికి ఎలాంటి భోజనం పెట్టాలో, వారు ఉండేందుకు ఎలాంటి వసతి కల్పించాలో, పట్టుబడిన వెంటనే ఎలాంటి ప్రొటోకాల్స్ పాటించాలో ఈ అధికరణలు స్పష్టం చేస్తున్నాయి. బందీ మత విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఈ ఒప్పందంపై అనేక దేశాలతోపాటు భారత్, పాకిస్థాన్ దేశాలు కూడా సంతకాలు చేశాయి. ఇందులోని నిబంధనలను, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయవచ్చు. అయితే అక్కడ అంత త్వరగా కేసులు పరిష్కారం కావు. రాజీలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో అంతర్జాతీయ ఒత్తిడులే ఎక్కువగా పనిచేస్తాయి. (ఎవరీ అభినందన్?) గతంలో జరిగిన సంఘటనలు 1999లో కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన పైలట్, గ్రూప్ క్యాప్టెన్ కే. నాచికేత విమానం చెడిపోవడంతో పారాషూట్ సాయంతో కిందకు దూకేశాడు. ఆయన్ని పాక్ సైనికులు బంధించారు. భారత్ ఈ విషయమై ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడంతోపాటు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకరావడంతో ఎనిమిది రోజుల అనంతరం ఆయన్ని విడిచిపెట్టారు. అయితే తన నుంచి గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం తనను చిత్ర హింసలకు గురిచేశారని అప్పుడు ఆయన ఆరోపించారు. 1965లో జరిగిన భారత్, పాక్ యుద్ధం సందర్భంగా అనేక మంది భారత సైనికులు పాక్‌కు బంధీలుగా చిక్కారు. 2015, ఆగస్టు నెలలో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కుమారుడు కేసీ కరియప్ప పాక్ సైనికులకు చిక్కారు. ఆయన నాలుగు నెలల అనంతరం విడుదలయ్యారు. పాక్ జైళ్లలో తన నాలుగు నెలల అనుభవాలను ఆయన ‘అవుట్ లుక్’ పత్రికలో సవివరంగా రాశారు. -
అభినందన్ విడుదలపై పాక్ సంకేతాలు
సాక్షి, న్యూఢిల్లీ : తమ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా ఉన్నారని, ఆయనకు మందులు, ఆహారం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. భారత పైలట్‌ను తిరిగి అప్పగించేందుకు, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సమసిపోయేందుకు సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పేర్కొన్నారు. పాకిస్తాన్ బాధ్యతాయుత దేశమనే సందేశం భారత ప్రజలకు పంపాలన్నదే తమ అభిమతమని చెప్పుకొచ్చారు. ‘మీ పైలట్ ఇక్కడ సురక్షితంగా ఉన్నారు.. జెనీవా నిబంధనలపై మాకు అవగాహన ఉంది..మా కస్టడీలో ఉన్న మీ పైలట్ మందులు, ఆహారంపై మేం శ్రద్ధ చూపుతున్నా’మని భారత ప్రజలను ఉద్దేశించి ఖురేషి పేర్కొన్నారు. (అమెరికా కంటే పెద్దన్న ఎవరుంటారు : పాక్ రాయబారి) తమ పైలట్ అభినందన్‌ను సురక్షితంగా సత్వరమే అప్పగించాలని భారత్ కోరుతుండటాన్ని ప్రస్తావిస్తూ దీనిపై పాకిస్తాన్ నిండు మనసుతో ఆలోచిస్తుందని చెప్పారు. పాక్ నిర్భంధంలో ఉన్న తమ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను తక్షణమే అప్పగించాలని భారత్ బుధవారం సాయంత్రం పాకిస్తాన్‌ను డిమాండ్ చేసిన క్రమంలో ఖురేషి ఈ మేరకు స్పందించారు. -
ఎవరీ విక్రమ్ అభినందన్?
సాక్షి, చెన్నై: భారత పైలట్ విక్రమ్ అభినందన్ తమకు పట్టుబడినట్టు పాకిస్థాన్ ప్రకటించింది. భారత యుద్ధ విమానం మిగ్-21 తమ భూభాగంలో కూలినప్పుడు పారాచ్యూట్ సహాయంతో కిందకు దూకిన ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. అభినందన్ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు. (పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్) అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్ మార్షల్‌గా పనిచేశారు. ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్లో అభినందన్ విద్యాభ్యాసం సాగింది. దేశంపైకి దండెత్తిన శత్రు విమానాలను వెంటాడుతూ దాయాది దేశానికి పట్టుబడ్డ ఆయన చిత్రహింసలు ఎదుర్కొంటున్నారు. దౌత్యపరంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అభినందన్‌ను విడిపించుకోవాలన్న ఆలోచనలో భారత్ ఉంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ సయిద్ హైదర్‌ను పిలిపించుకుని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరసన వ్యక్తం చేసింది. (భారత పైలట్‌కు పాక్ చిత్రహింసలు!) క్షేమంగా విడిచిపెట్టాలి: అభినందన్ మేనమామ అభినందన్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని ఆయన మేనమామ గుంగనాధన్ విజ్ఞప్తి చేశారు. మేనల్లుడిని తన చేతులతో పెంచానని.. టీవీల్లో వస్తున్న ఫొటోలు, వీడియోలు అభినందన్వేనని తెలిపారు. అభినందన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వీరు ఢిల్లీలో ఉంటున్నారని చెప్పారు. -
ఎయిర్ఫోర్సును ట్రిబ్యునల్‌కు లాగిన పూజా ఠాకూర్
గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత దేశం వచ్చినప్పుడు ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించే కార్యక్రమానికి ఓ మహిళా వింగ్ కమాండర్ నేతృత్వం వహించారు. ఆమె ఎవరా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఆమే వింగ్ కమాండర్ పూజా ఠాకూర్. అలాంటి పూజ.. ఇప్పుడు తనకు భారత వైమానిక దళం శాశ్వత కమిషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె సైనిక దళాల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. తనకు శాశ్వత కమిషన్ ఇవ్వకపోవడం వివక్షాపూరితమని ఆమె మండిపడింది. ట్రిబ్యునల్ ఈ కేసును విచారణకు స్వీకరించిందని ఠాకూర్ తరఫు న్యాయవాది సుధాంశు పాండే చెప్పారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్ నుంచి మహిళా అధికారులకు కూడా మార్చింగ్ కంటింజెంట్లకు నేతృత్వం వహించే అవకాశం ఇచ్చారు. 2000 సంవత్సరంలో భారత వైమానిక దళంలో చేరిన పూజా ఠాకూర్.. అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచికి చెందిన అధికారిణి. ఆమె ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో ప్రచార విభాగం ‘దిశ’లో పనిచేస్తున్నారు. -
హ్యూస్టన్ న్యాయపీఠంపై... తెలుగు ఆశ!
ఆమె ‘‘మనుషులెవ్వరూ పుట్టుకతోనే చెడ్డవారు కారు. పరిస్థితుల ప్రాబల్యం వల్లో, పరిసరాల ప్రభావం వల్లో మాత్రమే తప్పులు చేస్తారు. అలాంటి వారికి కేవలం శిక్ష వేస్తే సరిపోదు, వారికి తమ తప్పు దిద్దుకునేఅవకాశాన్ని కూడా ఇవ్వాలి కదా, అందుకే నా క్లయింట్స్ ఏ పరిస్థితుల్లో అలాంటి తప్పులు చేశారో తెలుసుకుని, వారిని వారున్న పరిస్థితి నుండి బయట పడేయటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తా!’’ అంటారు ఆశారెడ్డి. ఇంతకీ ఎవరీ ఆశారెడ్డి..? క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పని చేస్తూ హ్యూస్టన్ మునిసిపల్ జడ్జిగా ఎన్నికయిన మొట్టమొదటి భారతీయ వనిత ఆమె. హైదరాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పని చేసిన వింగ్ కమాండర్ ఎస్.వి.ప్రసాద్ ఆమె తండ్రి. తల్లి ఇందిర. చిన్నప్పటినుంచి ఆమెలో అపారమైన ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు ఆమె తల్లితండ్రులు. అందుకే కాబోలు... చదువుతోబాటు, క్రీడారంగంలోనూ టాపర్‌గా నిలిచి, ఎన్నో బహుమతులు గెలుచుకుంది. తండ్రి ఉద్యోగ విరమణ అనంతరం వారి కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయింది. దాంతో ఆమె కళాశాల విద్య పూర్తి చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుండి ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు.1983లో ఆశాకు పెళ్లయింది. ఆ వెంటనే భర్త రామకృష్ణారెడ్డికి అమెరికాలో ఉద్యోగం రావడంతో భర్తతోపాటు హ్యూస్టన్ వచ్చారు. గృహిణిగా ఉంటూనే, అమెరికాలో లా డిగ్రీ చేసి, రెండు వందల మంది విద్యార్థుల్లో రెండవ స్థానంలో నిలిచినా, అది ఆమెకు సంతృప్తినివ్వకపోవడంతో న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసి టాపర్‌గా నిలిచారు. దాంతో ఆమెను వెతుక్కుంటూ ఆర్ధర్ అండర్సన్ అనే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉద్యోగ జీవితం బాగానే ఉన్నప్పటికీ, ఆమె మన సు మాత్రం నలుగురిలోకీ వెళ్లాలని, అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగేలా చూడాలని, వారి తరఫున కేసులు వాదించి గెలవాలని ఉవ్విళ్లూరేది. దాంతో భర్త సలహా మేరకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి, స్వంతంగా లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. వృత్తిపట్ల నిబద్ధత, అంకితభావం ఉండటం వల్ల అతి కొద్దికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి, క్రిమినల్ డిఫెన్స్ లా లో దేశం మొత్తంలోనే బిజీ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ రంగంలో ఆమెకు ఎంత మంచి పేరు వచ్చిందంటే అక్కడి న్యాయమూర్తులకు మన ఆచార వ్యవహారాల గురించి నిపుణుల సలహా అవసరం అయినపుడు ఆమెనే సంప్రదించేటంతగా! అయితే ఆమె కేవలం లా ప్రాక్టీస్‌కే పరిమితం కాలేదు. స్థానిక రాజకీయాల గురించి తెలుసుకుంటూ, రాజకీయవేత్తలతో మంచి సంబంధాలను నెలకొల్పుకుంటూ వచ్చారు. అంతేకాదు, ఎన్నో లా సంస్థలకు, ఇతర సంస్థలకు వివిధ స్థాయుల్లో పని చేశారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అవే అక్కడివారు ఆమెను మునిసిపల్ జడ్జిగా ఎన్నుకునేలా చేసి, ఆ పదవికి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ పౌరురాలిగా ఆమె పేరును రికార్డులకెక్కించాయి. న్యాయమూర్తి అయినప్పటికీ, ప్రజలతో నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉన్న న్యాయవాద వృత్తిని వదులుకోలేదు ఆశారెడ్డి. దాంతో హెచ్-టెక్సాస్ పత్రిక ఆమెకు నాలుగు సంవత్సరాలుగా హ్యూస్టన్‌లో ఉన్నతమైన లాయర్‌గా రేటింగ్ ఇస్తూ వచ్చింది. అంతేకాదు, ఆమె ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండో-అమెరికన్ చారిటీ ఫౌండేషన్ బోర్డ్‌లో 2012-2013 వరకు సభ్యురాలిగా ఉన్నారు. 2003 సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో అసమానమైన ప్రతిభ సాధించినందుకుగాను ‘తానా’ వారు ఆమెను ఉన్నత పురస్కారంతో సత్కరించారు. ఆమె సాధించిన ఎన్నో విజయాలు, అందుకున్న సన్మానాలు, సత్కారాల్లో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఆశారెడ్డి ప్రతి ఏటా ఇండియా వస్తుంటారు. ఇక్కడ యువతీ, యువకులకు సరైన అవకాశాలు లేని వారికి లా కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే ఉచిత న్యాయ సలహాలు ఇస్తారు. వృత్తిపరంగా ఆశారెడ్డి ఎంతోమంది నేరస్థులను చూస్తుంటారు. ఈ కారణంగానే హైస్కూల్స్‌కి వెళ్లి అక్కడి విద్యార్థులతో వారు తప్పుదోవ పట్టకుండా, తప్పు నిర్ణయాలు తీసుకోకుండా వారి భవిష్యత్తుని ఎలా దిద్దుకోవాలో సలహాలిస్తూ, మొక్కగా ఉన్నప్పుడే వారి జీవితాలను అందంగా మలుచుకునేందుకు బాటలు వేస్తుంటారు. ఎవరైనా సరే తమకి ఇష్టమైన వృత్తినే ఎన్నుకొని, అందులో కృషి చేస్తే మంచి ఫలితాలొస్తాయి అని కూడా తరచు చెబుతుంటారామె. ఇది నిజమే కదా! - అమెరికా నుంచి డి. కనకదుర్గ ‘‘నాది మొదటి నుండి కలివిడిగా ఉండే స్వభావం. నేను కొత్త వారినెవరినైనా చూస్తే చిరునవ్వు నవ్వుతాను లేదా నా పేరు చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాను. నాకు అందరితో స్నేహంగా ఉండడం అంటే ఇష్టం.’’ అని వివరించారు క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పని చేస్తూ హ్యూస్టన్ మునిసిపల్ జడ్జిగా ఎన్నికయిన మొట్టమొదటి భారతీయ వనిత ఆశారెడ్డి. బహుశా అదే ఆమె విజయ రహస్యం కావచ్చు! -
వింగ్ కమాండర్ వేణుగోపాల్‌రెడ్డి అదృశ్యం
జైపూర్: వైమానిక దళంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అధికారి రాజస్థాన్‌లో అదృశ్యమయ్యారు. వింగ్ కమాండర్ వేణుగోపాల్‌రెడ్డి ఆచూకీ నెల రోజులుగా తెలియటం లేదని రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. వైమానికదళ అధికారి ఒకరు శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సూరత్‌గఢ్ స్టేషన్లో పనిచేస్తున్న వేణుగోపాల్‌రెడ్డి అదృశ్యం కావటంపై విచారణకు ఆదేశించినట్లు రక్షణశాఖ గోస్వామి తెలిపింది.