హ్యూస్టన్ న్యాయపీఠంపై... తెలుగు ఆశ! | Houston, on the state of the law ...   Telugu hope! | Sakshi
Sakshi News home page

హ్యూస్టన్ న్యాయపీఠంపై... తెలుగు ఆశ!

Published Wed, Jun 18 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

హ్యూస్టన్ న్యాయపీఠంపై...  తెలుగు ఆశ!

హ్యూస్టన్ న్యాయపీఠంపై... తెలుగు ఆశ!

 ఆమె
 
‘‘మనుషులెవ్వరూ పుట్టుకతోనే చెడ్డవారు కారు. పరిస్థితుల ప్రాబల్యం వల్లో, పరిసరాల ప్రభావం వల్లో మాత్రమే తప్పులు చేస్తారు.
 అలాంటి వారికి కేవలం శిక్ష వేస్తే సరిపోదు, వారికి తమ తప్పు దిద్దుకునేఅవకాశాన్ని కూడా ఇవ్వాలి కదా, అందుకే నా క్లయింట్స్ ఏ పరిస్థితుల్లో అలాంటి తప్పులు చేశారో తెలుసుకుని, వారిని వారున్న పరిస్థితి నుండి బయట పడేయటానికి
 నా శాయశక్తులా ప్రయత్నిస్తా!’’ అంటారు ఆశారెడ్డి.
 
ఇంతకీ ఎవరీ ఆశారెడ్డి..? క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పని చేస్తూ హ్యూస్టన్ మునిసిపల్ జడ్జిగా ఎన్నికయిన మొట్టమొదటి భారతీయ వనిత ఆమె. హైదరాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పని చేసిన వింగ్ కమాండర్ ఎస్.వి.ప్రసాద్ ఆమె తండ్రి. తల్లి ఇందిర. చిన్నప్పటినుంచి ఆమెలో అపారమైన ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు ఆమె తల్లితండ్రులు. అందుకే కాబోలు... చదువుతోబాటు, క్రీడారంగంలోనూ టాపర్‌గా నిలిచి, ఎన్నో బహుమతులు గెలుచుకుంది. తండ్రి ఉద్యోగ విరమణ అనంతరం వారి కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయింది. దాంతో ఆమె కళాశాల విద్య పూర్తి చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుండి ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు.1983లో ఆశాకు పెళ్లయింది. ఆ వెంటనే భర్త రామకృష్ణారెడ్డికి అమెరికాలో ఉద్యోగం రావడంతో భర్తతోపాటు హ్యూస్టన్ వచ్చారు. గృహిణిగా ఉంటూనే, అమెరికాలో లా డిగ్రీ చేసి, రెండు వందల మంది విద్యార్థుల్లో రెండవ స్థానంలో నిలిచినా, అది ఆమెకు సంతృప్తినివ్వకపోవడంతో న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి టాపర్‌గా నిలిచారు. దాంతో ఆమెను వెతుక్కుంటూ ఆర్ధర్ అండర్సన్ అనే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉద్యోగ జీవితం బాగానే ఉన్నప్పటికీ, ఆమె మన సు మాత్రం నలుగురిలోకీ వెళ్లాలని, అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగేలా చూడాలని, వారి తరఫున కేసులు వాదించి గెలవాలని ఉవ్విళ్లూరేది. దాంతో భర్త సలహా మేరకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి, స్వంతంగా లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. వృత్తిపట్ల నిబద్ధత, అంకితభావం ఉండటం వల్ల అతి కొద్దికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి, క్రిమినల్ డిఫెన్స్ లా లో దేశం మొత్తంలోనే బిజీ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ రంగంలో ఆమెకు ఎంత మంచి పేరు వచ్చిందంటే అక్కడి న్యాయమూర్తులకు మన ఆచార వ్యవహారాల గురించి నిపుణుల సలహా అవసరం అయినపుడు ఆమెనే సంప్రదించేటంతగా!

 అయితే ఆమె కేవలం లా ప్రాక్టీస్‌కే పరిమితం కాలేదు. స్థానిక రాజకీయాల గురించి తెలుసుకుంటూ, రాజకీయవేత్తలతో మంచి సంబంధాలను నెలకొల్పుకుంటూ వచ్చారు. అంతేకాదు, ఎన్నో లా సంస్థలకు, ఇతర సంస్థలకు వివిధ స్థాయుల్లో పని చేశారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అవే అక్కడివారు ఆమెను మునిసిపల్ జడ్జిగా ఎన్నుకునేలా చేసి, ఆ పదవికి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ పౌరురాలిగా ఆమె పేరును రికార్డులకెక్కించాయి. న్యాయమూర్తి అయినప్పటికీ, ప్రజలతో నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉన్న న్యాయవాద వృత్తిని వదులుకోలేదు ఆశారెడ్డి. దాంతో హెచ్-టెక్సాస్ పత్రిక ఆమెకు నాలుగు సంవత్సరాలుగా హ్యూస్టన్‌లో ఉన్నతమైన లాయర్‌గా రేటింగ్ ఇస్తూ వచ్చింది.

 అంతేకాదు, ఆమె ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండో-అమెరికన్ చారిటీ ఫౌండేషన్ బోర్డ్‌లో 2012-2013 వరకు సభ్యురాలిగా ఉన్నారు. 2003 సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో అసమానమైన ప్రతిభ సాధించినందుకుగాను ‘తానా’ వారు ఆమెను ఉన్నత పురస్కారంతో సత్కరించారు. ఆమె సాధించిన ఎన్నో విజయాలు, అందుకున్న సన్మానాలు, సత్కారాల్లో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే.
ఆశారెడ్డి ప్రతి ఏటా ఇండియా వస్తుంటారు. ఇక్కడ యువతీ, యువకులకు సరైన అవకాశాలు లేని వారికి లా కౌన్సెలింగ్ ఇస్తారు.

అవసరమైతే ఉచిత న్యాయ సలహాలు ఇస్తారు. వృత్తిపరంగా ఆశారెడ్డి ఎంతోమంది నేరస్థులను చూస్తుంటారు. ఈ కారణంగానే హైస్కూల్స్‌కి వెళ్లి అక్కడి విద్యార్థులతో వారు తప్పుదోవ పట్టకుండా, తప్పు నిర్ణయాలు తీసుకోకుండా వారి భవిష్యత్తుని ఎలా దిద్దుకోవాలో సలహాలిస్తూ, మొక్కగా ఉన్నప్పుడే వారి జీవితాలను అందంగా మలుచుకునేందుకు బాటలు వేస్తుంటారు. ఎవరైనా సరే తమకి ఇష్టమైన వృత్తినే ఎన్నుకొని, అందులో కృషి చేస్తే  మంచి ఫలితాలొస్తాయి అని కూడా తరచు చెబుతుంటారామె. ఇది నిజమే కదా!    - అమెరికా నుంచి డి. కనకదుర్గ
 
 ‘‘నాది మొదటి నుండి కలివిడిగా ఉండే స్వభావం. నేను కొత్త వారినెవరినైనా చూస్తే చిరునవ్వు నవ్వుతాను లేదా నా పేరు చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాను. నాకు అందరితో స్నేహంగా ఉండడం అంటే ఇష్టం.’’ అని వివరించారు క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పని చేస్తూ హ్యూస్టన్ మునిసిపల్ జడ్జిగా ఎన్నికయిన మొట్టమొదటి భారతీయ వనిత ఆశారెడ్డి. బహుశా అదే ఆమె విజయ రహస్యం కావచ్చు!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement