ఎయిర్ఫోర్సును ట్రిబ్యునల్కు లాగిన పూజా ఠాకూర్
గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత దేశం వచ్చినప్పుడు ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించే కార్యక్రమానికి ఓ మహిళా వింగ్ కమాండర్ నేతృత్వం వహించారు. ఆమె ఎవరా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఆమే వింగ్ కమాండర్ పూజా ఠాకూర్. అలాంటి పూజ.. ఇప్పుడు తనకు భారత వైమానిక దళం శాశ్వత కమిషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె సైనిక దళాల ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. తనకు శాశ్వత కమిషన్ ఇవ్వకపోవడం వివక్షాపూరితమని ఆమె మండిపడింది.
ట్రిబ్యునల్ ఈ కేసును విచారణకు స్వీకరించిందని ఠాకూర్ తరఫు న్యాయవాది సుధాంశు పాండే చెప్పారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్ నుంచి మహిళా అధికారులకు కూడా మార్చింగ్ కంటింజెంట్లకు నేతృత్వం వహించే అవకాశం ఇచ్చారు. 2000 సంవత్సరంలో భారత వైమానిక దళంలో చేరిన పూజా ఠాకూర్.. అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచికి చెందిన అధికారిణి. ఆమె ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో ప్రచార విభాగం ‘దిశ’లో పనిచేస్తున్నారు.