
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విమానాలను నడపడం ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాకిస్తాన్ యుద్ధ విమానాలతో జరిగిన పోరులో వర్ధమాన్ నడుపుతున్న మిగ్–21 విమానం కూలిపోయి ఆయన గాయాలపాలై పాకిస్తాన్‌లో పడిపోవడం తెలిసిందే. తన విమానం కూలిపోవడానికి ముందే వర్ధమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్‌లో పడిపోయినా ఎంతో ధైర్యం ప్రదర్శించి అందరి మన్ననలూ అందుకున్నారు. ఇటీవలే కేంద్రం ఆయనకు వీరచక్ర అవార్డును కూడా ప్రకటించింది.
మార్చి 1న రాత్రి వర్ధమాన్‌ను పాక్ భారత్‌కు అప్పగించాక, దాదాపు రెండు వారాలపాటు వర్ధమాన్ చికిత్స అందుకుంటూ భద్రతా సంస్థల పర్యవేక్షణలో ఉన్నారు. వారి విచారణను ఎదుర్కొన్నారు. వీలైనంత త్వరగా మళ్లీ యుద్ధ విమానాన్ని నడపాలని తాను కోరుకుంటున్నట్లు అప్పట్లో వర్ధమాన్ చెప్పారు. బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ వర్ధమాన్‌కు వైద్య పరీక్షలన్నీ చేసి, ఆయన మళ్లీ విమానం నడిపేందుకు అన్ని రకాలుగా సిద్ధమేనని మూడు వారాల క్రితం వెల్లడించింది. దీంతో వర్ధమాన్ మళ్లీ యుద్ధ విమానాలు నడుపుతున్నారు. ప్రస్తుతం రాజస్తాన్‌లోని వైమానిక స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment