సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైనికులకు బందీగా చిక్కిని భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను చిత్రహింసలకు గురిచేయవద్దని, జెనీవా ఒప్పందానికి కట్టుబడి వ్యవహరించాలని పాక్ సైన్యానికి భారత్‌తోపాటు అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి చేసింది. ఇంతకు జెనీవా ఒప్పందం అంటే ఏమిటీ ? అందులోని అంశాలేమిటీ? అవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయి ? జేనీవా ఒప్పందానికి ఏయే దేశాలు కట్టుబడి ఉండాలి ? ఉల్లంఘిస్తే శిక్షేమిటీ ?
జేనీవా ఒప్పందంలో నాలుగు అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్భాగం. ఈ ఒప్పందంపై సంతకం చేసిన ప్రతి దేశం అంతర్జాతీయ మానవతా విలువలకు కట్టుబడి వ్యవహరించాలి. 1929లో మొదటిసారి ఈ ఒప్పందం అమల్లోకి రాగా, రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక రెండో సారి 1949లో ఆధునీకరించారు. జెనీవా ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఓ సైనికుడు పట్టుబడినా, ఓ పౌరుడు పట్టుబడినా వారిని ఎలా చూసుకోవాలో స్పష్టమైన నిబంధనలను రచించారు. ఒక్క యుద్ధం జరిగినప్పుడు మాత్రమే కాకుండా శాంతియుత పరిస్థితుల్లో కూడా దేశాల మధ్య ఈ నిబంధనలు వర్తిస్తాయి. (పైలట్ అభినందన్ తండ్రి భావోద్వేగం)
13వ అధికరణం ఏం చెబుతోంది?
పట్టుబడిన సైనికుడికి అవసరమైన వైద్య చికిత్సలు అందించడంతోపాటు ఆయన్ని ఎలా చూసుకోవాలో కూడా జెనీవా ఒప్పందంలోకి 13వ అధికరణం తెలియజేస్తోంది. ‘నిర్బంధంలో ఉన్న సైనికుడిని శారీరకంగా ఎలాంటి హింసకు గురి చేయరాదు. హింస కారణంగా బందీ గాయపడినా, ప్రాణం పోయినా, ప్రాణాపాయానికి గురైన ఒప్పందం ప్రకారం తీవ్రమైన నేరం. ప్రజల నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి, ప్రజా హింస నుంచి పూర్తి రక్షణ కల్పించాలి. బందీపై ఎలాంటి వైద్య, శాస్త్ర ప్రయోగాలు నిర్వహించరాదు’ అని చెబుతోంది. భారత పైలట్ అభినందన స్థానిక ప్రజలకు చిక్కగానే వారు ఆయనపై దాడి చేసిన విషయం తెల్సిందే. (ట్రెండింగ్: వెలకమ్ బ్యాక్ అభినందన్)
ఇదే సెక్షన్‌కు రెడ్‌క్రాస్ సొసైటీ అంతర్జాతీయ కమిటీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం పట్టుబడిన బందీ ఫొటోలనుగానీ, వీడియోలనుగానీ విడుదల చేయరాదు. విడుదల చేసినట్లయితే ఆయన ప్రాణాలకు ప్రజల నుంచి లేదా ఇతర శక్తుల నుంచిగా ముప్పు ఉంటుందన్నది రెడ్‌క్రాస్ కమిటీ అభిప్రాయం. ఈ లెక్కన పాక్ సైనికులకు చిక్కిన అభినందన ఫొటోలను, వీడియోలను పాక్ సైనికులు విడుదల చేశారు కనుక వారిపై జెనీవా ఒప్పందం ఉల్లంఘించారని భారత్ అభియోగాలు మోపవచ్చు! (తలొగ్గిన పాక్.. రేపు అభినందన్ విడుదల)
జెనీవా ఒప్పందంలో 140 అధికరణలు ఉన్నాయి. ఓ బందీ పట్ల జైలు లోపల, జైలు బయట, కోర్టులో కేసు విచారణ సందర్భంగా ఎలా ప్రవర్తించాలో, వారికి ఎలాంటి భోజనం పెట్టాలో, వారు ఉండేందుకు ఎలాంటి వసతి కల్పించాలో, పట్టుబడిన వెంటనే ఎలాంటి ప్రొటోకాల్స్ పాటించాలో ఈ అధికరణలు స్పష్టం చేస్తున్నాయి. బందీ మత విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఈ ఒప్పందంపై అనేక దేశాలతోపాటు భారత్, పాకిస్థాన్ దేశాలు కూడా సంతకాలు చేశాయి. ఇందులోని నిబంధనలను, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయవచ్చు. అయితే అక్కడ అంత త్వరగా కేసులు పరిష్కారం కావు. రాజీలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో అంతర్జాతీయ ఒత్తిడులే ఎక్కువగా పనిచేస్తాయి. (ఎవరీ అభినందన్?)
గతంలో జరిగిన సంఘటనలు
1999లో కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన పైలట్, గ్రూప్ క్యాప్టెన్ కే. నాచికేత విమానం చెడిపోవడంతో పారాషూట్ సాయంతో కిందకు దూకేశాడు. ఆయన్ని పాక్ సైనికులు బంధించారు. భారత్ ఈ విషయమై ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడంతోపాటు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకరావడంతో ఎనిమిది రోజుల అనంతరం ఆయన్ని విడిచిపెట్టారు. అయితే తన నుంచి గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం తనను చిత్ర హింసలకు గురిచేశారని అప్పుడు ఆయన ఆరోపించారు. 1965లో జరిగిన భారత్, పాక్ యుద్ధం సందర్భంగా అనేక మంది భారత సైనికులు పాక్‌కు బంధీలుగా చిక్కారు. 2015, ఆగస్టు నెలలో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కుమారుడు కేసీ కరియప్ప పాక్ సైనికులకు చిక్కారు. ఆయన నాలుగు నెలల అనంతరం విడుదలయ్యారు. పాక్ జైళ్లలో తన నాలుగు నెలల అనుభవాలను ఆయన ‘అవుట్ లుక్’ పత్రికలో సవివరంగా రాశారు.
Comments
Please login to add a commentAdd a comment