భరతమాత కడుపులో వినిపించే మంత్రం.. జైహింద్!ఒక సోల్జర్‌కి ఆ నినాదమే..పద్మవ్యూహాన్నైనా, పాక్ వ్యూహాన్నైనాఛేదించుకుని రాగలిగిన శక్తిని ఇస్తుంది.మన సైనిక స్థావరాలపై దాడికి వచ్చిన శత్రువునుతరిమికొడుతూ.. కొడుతూ.. తను తూలిపడ్డాడు అభినందన్.శత్రువు గుండెల్లో సింహంలా పడ్డాడు. పాకిస్తాన్‌ది ఎజెండా. అభినందన్‌ది జెండా. జెండాదే పైచేయి అయింది. సోల్జర్.. నీకు స్వాగతం పలుకుతోంది నీ దేశం.
యోధుడా.. నిన్ను చూశాం. చెట్ల కొమ్మల్ని విరిచేసుకుంటూ గగనతలం నుంచి జారి ముక్కలైన లోహ విహంగంలా శత్రువుల చేతుల్లోకి నువ్వు జారడం చూశాం. నిన్ను చూస్తే నువ్వే కదా కనిపించాలి. సడలని నీ మనోబలం సాక్షాత్కారమైంది! కొడుతున్నారు నిన్ను. ఈడ్చుకెళుతున్నారు. నీ దేహం రక్తం వోడుతోంది. నువ్వోడి పోలేదు. నిన్నేవో అడుగుతున్నారు దేశ రహస్యాలు చెప్పమని. చెప్పలేనని చెప్పేశావ్! శత్రుదేశానికి చిక్కి ఒంటరిగా, అసహాయంగా ఉన్నా.. మాతృదేశానికి ఇచ్చిన మాటపైనే నిలబడి ఉన్నావ్. ‘ప్రాణాలు పోతున్నా.. పోరాడుతూనే ఉంటానని’ నువ్వు చేసిన వెళ్లిన ప్రతిజ్ఞే నీ కళ్లలో ప్రతిఫలిస్తోంది. ధీశాలీ.. నిన్ను హత్తుకోవాలి. వెయ్యి మాటలు, ఒక్క సెల్యూట్ సరిపోతాయా! గట్టి హృదయాలింగనం ఒకటి కావాలి. ఉప్పొంగుతున్న మనసుతో నిన్ను అభిషేకించుకోవాలి. ఆత్మీయంగా ఒక్క పిలుపు పిలుచుకోవాలి.
ఏ పేరుకు ఇమిడిపోతావు? ఏ తీరున అభినందన స్వీకరిస్తావు? నీ ఛాతీ లోపల ఉన్న మందుగుండు సామగ్రి ఎన్ని టన్నుల బరువో.. నీ ఛాతీపైన ఉన్న రంగుల పట్టీ చెబుతోంది. అభినందన్ వర్థమాన్, వింగ్ కమాండర్!ధీరుడా.. శతకోటి పేర్లు నీ నిర్భీతికి సరిపోవు. సహస్ర భుజకీర్తులూ నిన్ను మోయలేవు. ఎన్ని హోదాల్లో నువ్వున్నా.. ఎంతపైకి నువ్వెదిగినా.. లీడర్, కమాండర్, కెప్టెన్, కమడోర్, మార్షల్ .. వీళ్లెవరూ కాదు నువ్వు మాకు. సోదరుడా.. నా దేశ సహోదరుడా.. సైన్యం నీ పోరాట పటిమకు ఎన్ని వర్ణాల ఘనతలైనా ఇవ్వనివ్వు. నువ్వు మాకు సోల్జర్‌వే. సోల్జర్ అన్న మాటే మాకు పెద్దర్యాంకు. చీఫ్ మార్షల్ కన్నా పెద్ద ర్యాంకు.సోల్జర్.. యుద్ధ విమానం నువ్వు. వందల వార్‌హెడ్‌లకు, వేల యుద్ధ టాంకులకు, విధ్వంసక నౌకలకు.. సమానం నువ్వు.నూటా ముప్పై కోట్ల మంది భారతీయులకు కలిపి ఒకే హార్ట్ బీట్.. నువ్వు.
సోల్జర్..!
బందీగా చిక్కినప్పుడు నిన్ను మేము చూశాం. నీపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. నీ ముఖం చీరేస్తున్నారు. నిన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు. కనిపించకుండా నిన్నెవరో ప్రశ్నిస్తున్నారు. కాన్ఫిడెన్స్ చెదరకుండా నువ్వు సమాధానం ఇస్తున్నావు. ఏది ముందో, ఏదో వెనుకో తెలియడం లేదు. గౌరవించాక నిన్ను హింసించారా? హింసించాక నిన్ను గౌరవించారా? శత్రువుకొక యుద్ధనీతి లేదు. యుద్ధరీతి లేదు. అడగ కూడనివి అడుగుతున్నాడు. చెప్ప తగదని నువ్వంటున్నావ్. ఇక్కడ కూర్చొని అంతా చూస్తూనే ఉన్నాం. ‘నీ వివరాలు చెప్పు’ ‘అభినందన్ వర్థమాన్. వింగ్ కమాండర్.
సర్వీస్ నెంబర్ 27981’‘ఏ దేశం?’‘ఇండియా’‘ఇండియాలో ఎక్కడ?’‘దక్షిణ ప్రాంతం’‘నువ్వొచ్చిన ఎయిర్‌క్రాఫ్ట్ ఏమిటి?’‘శకలాలు చూస్తే మీకే తెలుస్తుంది’‘నీ దేశం నీకు అప్పగించిన టాస్క్ ఏమిటి?’‘చెప్పవలసిన అవసరం ఏమిటి?’‘ఏ స్క్వాడ్రన్?’‘చెప్పవలసిన అవసరం ఏమిటి?’ఏం గుండె సోల్జర్ నీది!ఉన్నది శత్రు సైన్యం చేతుల్లో. చెప్పేది లేదంటున్నది నిరాయుధంగా బందిఖానాలో! మ్యాప్‌లో కూడా భారత్‌ని కన్నెత్తి చూడనిచ్చేలా లేవు! ఎక్కడిది నీకా ధీరత్వం. నీ ఊరు ఇచ్చిందా? నీ పూర్వీకులు ఇచ్చినదా? నీ సిపాయి తండ్రి సాహసాలా? నీ తల్లి పట్టిన ఉగ్గుపాలా?మేమున్నాం నీ కోసం, నీ కుటుంబం కోసం అని మేం చెప్పడమేం గొప్ప! విరోధికి బందీ అయి కూడా నువ్వు చెబుతున్నావ్. దేశానికి నేనున్నానని.
సోల్జర్..
నీకు పార్టీ లేదు. నీది ఎన్డీయే కాదు, యూపీయే కాదు. స్పెషల్ ఫోర్స్ డీఎన్‌ఏ నీది. దేశభక్తి డీఎన్‌యే. దేశమే నీ పార్టీ. ధైర్యవంతుడివి నువ్వు. బోర్డర్ లోపల.. నువ్వున్నావన్న ధైర్యం మాత్రమే మాది. బోర్డర్ అవతల పడిపోయినా, ఇక్కడి మా ధైర్యాన్ని సడలనివ్వని ధీరోదాత్తుడివి నువ్వు. ముఖాముఖి యుద్ధం నీది. తెగించి సైన్యంలోకి వెళ్లేందుకు నువ్వు మాత్రమే ఉవ్విళ్లూరగలవు. పుట్టడమే దేశం కోసం పుట్టినట్లు నువ్వు మాత్రమే బొడ్డు తాడును తెంపుకున్న వెంటనే తుపాకీని భుజానికి తగిలించుకోగలవు.శత్రువుతో తలపడుతూ ముందు వరుసలో నువ్వుంటావ్. ఏమైనా జరగొచ్చు. శత్రువు తల తెగిపడవచ్చు. శత్రువే నిన్ను తునాతునకలు చెయ్యొచ్చు. లెక్కచెయ్యవు నువ్వు. దేశ ప్రజల రక్తం నీలో మరుగుతున్నప్పుడు.. దేశ పరువు ప్రతిష్టలు నీ కండరాలను బండరాళ్లుగా మార్చి సరిహద్దుల్లో కంచెగా నిలబెట్టినప్పుడు నువ్వొక శతఘ్నివి. శత్రువుకు హెచ్చరికవి.
సోల్జర్..
మాకు తెలుసు. నీకేదైనా అయితే నీ కుటుంబానికి ఈ దేశం ఉంటుందనే ధీమాతో వెళ్లవు నువ్వు సరిహద్దుకు. దేశమనే కుటుంబానికి ఏమీ కానివ్వననే ధీమాను ఇచ్చేందుకు వెళ్తావు. యుద్ధమంటే నీకు చర్చలు, సమావేశాలు కాదు. పత్రాలు, సంతకాలు కాదు. క్షమాపణలు, మన్నింపులు కాదు. బిగిసిన పిడికిళ్లు, ఎగిసిన నినాదాలు కాదు. యుద్ధమంటే మరణం. మరణమొక్కటేనా! అవయవాలు తెగిపడడం. కుటుంబాలు నిలువునా కూలిపోవడం. తల్లి గుండెలు బాదుకోవడం. భార్య మూర్ఛిల్లి పడిపోవడం. పిల్లలు సొమ్మసిల్లడం. ఊరు నివ్వెరపోవడం.
సోల్జర్..
నీకన్నీ తెలిసి నిబ్బరంగా ఉంటావు. నిబ్బరం నీ రెండోగుణం. దుర్భరత్వంలో నిగ్రహమే నీ మొదటి గుణం. శాంతిదూతవు నువ్వు. లేకుంటే యుద్ధంలోకి ఎందుకు వెళతావ్? నిన్నటి నుంచీ దేశం నీకోసం సర్వమతాలలో ప్రార్థనలు జరుపుతోంది. ఆర్మీ స్థావరాల్లో గర్జిస్తోంది. అత్యవసర సమావేశాల్లో ఆలోచనలు చేస్తోంది. ఐక్యరాజ్య సమితికి తన వాదనలు వినిపిస్తోంది.నువ్వూ ప్రార్థిస్తూనే ఉంటావు. నీ కోసం మేము ప్రార్థిస్తుంటే, దేశం కోసం నువ్వు ప్రార్థిస్తావు. నీది మోకరిల్లని ప్రార్థన. కనులు మూయని ప్రార్థన. నింగివైపు చూసి ఎవర్నీ ఏదీ అడగని ప్రార్థన. యుద్ధంలో గాయపడడం నీ ప్రార్థన. గాయాన్ని భరించడం నీ ప్రార్థన. చిత్రహింసలు పెడుతున్నా నోటి నుంచి ఒక్క వివరాన్నైనా రానివ్వక పోవడం నీ ప్రార్థన. సోల్జర్‌వి నువ్వు. నీకు మాటల్తో పనిలేదు. సమాలోచనలతో పనిలేదు. చర్చలు, సాధ్యాసాధ్యాల విశ్లేషణలతోనూ పని లేదు. యుద్ధమంటే సిద్ధమౌతావ్. సిద్ధమయ్యాక.. నువ్వే ఒక సర్వసత్తాక దేశమౌతావ్. నువ్వే.. రెపరెపలాడే ఒక జాతీయ పతాకం అవుతావ్.
సోల్జర్.
నీ కోసం ఎదురుచూస్తున్నాం. స్వాగతం చెప్పేందుకు దేశమంతా కళ్లు చేసుకుని చూస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment