సాక్షి, న్యూఢిల్లీ : తమ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా ఉన్నారని, ఆయనకు మందులు, ఆహారం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. భారత పైలట్‌ను తిరిగి అప్పగించేందుకు, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సమసిపోయేందుకు సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పేర్కొన్నారు.
పాకిస్తాన్ బాధ్యతాయుత దేశమనే సందేశం భారత ప్రజలకు పంపాలన్నదే తమ అభిమతమని చెప్పుకొచ్చారు. ‘మీ పైలట్ ఇక్కడ సురక్షితంగా ఉన్నారు.. జెనీవా నిబంధనలపై మాకు అవగాహన ఉంది..మా కస్టడీలో ఉన్న మీ పైలట్ మందులు, ఆహారంపై మేం శ్రద్ధ చూపుతున్నా’మని భారత ప్రజలను ఉద్దేశించి ఖురేషి పేర్కొన్నారు. (అమెరికా కంటే పెద్దన్న ఎవరుంటారు : పాక్ రాయబారి)
తమ పైలట్ అభినందన్‌ను సురక్షితంగా సత్వరమే అప్పగించాలని భారత్ కోరుతుండటాన్ని ప్రస్తావిస్తూ దీనిపై పాకిస్తాన్ నిండు మనసుతో ఆలోచిస్తుందని చెప్పారు. పాక్ నిర్భంధంలో ఉన్న తమ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను తక్షణమే అప్పగించాలని భారత్ బుధవారం సాయంత్రం పాకిస్తాన్‌ను డిమాండ్ చేసిన క్రమంలో ఖురేషి ఈ మేరకు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment