న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెరలో చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను రేపు (శుక్రవారం) విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్లమెంట్‌లో ప్రకటించడం పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అభినందన్ విడుదల కానుండటంతో దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటూ, మిఠాయిలు పంచుకుంటున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు, నెటిజన్లు వింగ్ కమాండర్ విడుదలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం భారత్‌లో వెల్‌కమ్ బ్యాక్ అభినందన్ (#welcome back Abhinandan) అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.
అభినందన్ విడుదలపై సెలబ్రెటిల్లో మొట్టమొదటగా హీరోయిన్ తాప్సీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘నిజంగా సంబరాలు చేసుకునే సమయమిది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. రేపటి గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. వెల్‌కమ్ బ్యాక్ అభినందన్’అంటూ తాప్సీ ట్వీట్ చేశారు. అనంతరం పలువురు సెలబ్రెటీలు కూడా అభినందన్‌కు స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. ‘విపత్కర పరిస్థితుల్లోనూ గొప్ప ధైర్యసాహసాలను, హుందాతనాన్ని ప్రదర్శించిన అభినందన్‌కు హ్యాట్సాఫ్’ అంటూ నెటిజన్లు అభినందన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మన హీరో తిరిగి వస్తున్నాడు’ అంటూ కొందరు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక పాక్ ఆర్మీకి చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ మరికొన్ని గంటల్లో ఇండియాకు తిరిగి రాబోతున్నారు. భారత వైమానిక దళం వింగ్ కమాండర్‌గా ఉన్న అభినందన్ మిగ్-21 యుద్ధ విమానం పాకిస్థాన్‌లో కూలిపోవడంతో పాక్ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. అభినందన్ విడుదలపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం మధ్యాహ్నం పాక్ పార్లమెంటులో ప్రకటన చేస్తూ.. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో శుక్రవారం అభినందన్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: ఎవరీ విక్రమ్ అభినందన్?
Comments
Please login to add a commentAdd a comment