
యుద్ధాకాశాన్ని ముద్దాడి, మరణపుటంచులు తాకి వచ్చిన యుద్ధవీరుడు అభినందన్ ఈ దేశ ప్రజల మదిలో శాశ్వత అభినందనీయుడు. మూడు రోజుల అనంతరం మాతృదేశంలోకి అభినందన్ వర్ధమాన్ రాక కోసం యావత్ దేశం సరిహద్దుల్లో కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూసింది. అజరామరమైన అతడి శౌర్యం, త్యాగశీలత ప్రశంసల జల్లులా కురిసింది. సోషల్ మీడియాలో అభినందన్‌ని కృతజ్ఞతాభినందనలతో ముంచెత్తారు. అలాంటి అద్భుతమైన సందర్భంలో ఆయనకు ఆకాశమే స్వయంగా స్వాగతం పలికింది. విశ్వాంతరాళాల్లోని మరో గ్రహం నుంచి అభినందన్‌కు అభినందనలు అందాయి. భారతీయుల సృష్టితో అంగారక గ్రహంపై అడుగుపెట్టిన మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) అభినందన్‌కు నిండైన ఆహ్వనం పలికింది.
అది కూడా మన తెలుగు గడ్డపై తయారై, అంగారక గ్రహంలోకి పంపిన మంగళ్‌యాన్ మిషన్ ఇస్రో అధికారిక ట్విటర్ ‘వింగ్ కమాండర్ అభినందన్! మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం’అని ట్వీట్ చేసింది. బహుశా ఒక వీరుడి జీవితంలో ఇంతటి అరుదైన, అద్భుతమైన అవకాశం ఎవరికీ దక్కకపోవచ్చు. ఎందుకంటే అంతరిక్షం నుంచి మంగళ్‌యాన్ భూమిపైకి పంపిన రెండో మెసేజ్ ఇది. గత ఏడు నెలల్లో అంగారకుడి నుంచి ఏకైక సందేశం కూడా ఇదే. అంతకుముందు గతేడాది సెప్టెంబర్ 29న అంగారకగ్రహంపై తన నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మంగళ్‌యాన్ ఓ సందేశాన్ని పంపింది. మంగళ్‌యాన్ ఆవిష్కరణ ముందు 2013లో ఇస్రో అధికారిక ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లను ప్రారంభించి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంది. అయితే 2014లో మంగళ్‌యాన్ పేరిట అధికారిక ఖాతా తెరిచింది.
Comments
Please login to add a commentAdd a comment