ఆర్మీ కొత్త చీఫ్‌గా బిపిన్ రావత్
వాయుసేనకు బీఎస్ ధనోవా
► ఐబీ, ‘రా’ లకూ కొత్త అధిపతులు
న్యూఢిల్లీ: ఆర్మీ , వాయుసేనకు ప్రభుత్వం శనివారం కొత్త అధిపతులను ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను ఆర్మీ చీఫ్‌గా, ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవాను ఐఏఎఫ్ చీఫ్‌గా నియమించింది. ప్రస్తుత అధిపతులు జనరల్ దల్బీర్ సింగ్, అరూప్ రాహాల స్థానాల్లో వీరు నియమితులయ్యారు. డిసెంబర్ 31న ఇద్దరూ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. ఆర్మీ తదుపరి చీఫ్‌గా రేసులో ఉన్న సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షిని తోసిరాజని రావత్ ఈ పదవికి ఎంపికవడం ఆశ్చర్యకరమే. రావత్‌కు 30 ఏళ్లుగా భారత సైన్యంలో వివిధ హోదాల్లో, యుద్ధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ప్రస్తుతం నలువైపుల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో సైన్యాన్ని నడిపించేందుకు అతనే తగిన వ్యక్తని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఐబీ అధిపతిగా రాజీవ్ జైన్: అలాగే నిఘా సంస్థలు ఐబీ, ‘రా’లకు కూడా నూతన చీఫ్‌లను నియమించారు. జార్ఖండ్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ జైన్ ను ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి, అనిల్ ధస్మానాను రా(రీసెర్చీ అండ్ అనాలిసిస్ వింగ్)కు అధిపతులుగా ఎంపికయ్యారు. రాజీవ్, అనిల్ ఈ పదవుల్లో రెండేళ్లు ఉంటారు. ఐబీలో ప్రత్యేక డైరెక్టర్‌గా పనిచేస్తున్న జైన్ జనవరి 1న దినేశ్వర్ శర్మ స్థానంలో బాధ్యతలు చేపడుతారు. 1980 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జైన్ రాష్ట్రపతి పోలీసు మెడల్ గెల్చుకున్నారు. ఐబీలో కీలక కశ్మీర్ డెస్కు సహా పలు విభాగాల్లో పనిచేశారు. ఎన్డీఏ హయాంలో కశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరిపిన మధ్యవర్తి కేసీ పంత్‌కు సలహాదారుగా వ్యవహరించారు. ‘రా’ చీఫ్‌గా ఈ నెలాఖరున వైదొలగనున్న రాజిందర్ ఖన్నా స్థానంలో అనిల్ పగ్గాలు చేపడుతారు. ఆయన 1981 ఐపీఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ అధికారి. గత 23 ఏళ్లుగా ‘రా’లో పాకిస్తాన్ డెస్కు సహా పలు కీలక విభాగాల్లో పనిచేశారు.