గౌరవవందనం స్వీకరిస్తున్న ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా
• ఐఏఎఫ్ చీఫ్ రాహా వ్యాఖ్య ‘వసుధైక కుటుంబకం’ మా నినాదం: రాజ్‌నాథ్
• భద్రతపై సమీక్ష.. సైనికులకు మౌలిక వసతుల కల్పన వేగవంతం
ఘజియాబాద్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి నెలకొన్న రాజకీయ, సైనిక ఉద్రిక్త వాతావరణంపై ఇకపై ఆర్మీ మాట్లాడటమేమీ ఉండదని.. చేతల్లోనే సమాధానం ఉంటుందని వైమానిక దళం చీఫ్ అరుప్ రాహా స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులకైనా సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ జిల్లాలోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో శనివారం ‘వైమానిక దళ 84వ వ్యవస్థాపక దినోత్సవం’ ఆయన మాట్లాడారు.
‘సర్జికల్ దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందరూ అభిప్రాయాలు చెబుతున్నారు. దేశం ఏం కోరుకుంటోందో దాన్ని నిర్వహించటం ఆర్మీ పని. మేం దీని గురించి మాట్లాడదలచుకోవటం లేదు. కేవలం చేతల్లో చూపిస్తాం’ అని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, పరికరాలతో భారత వైమానిక దళం సిద్ధంగా ఉందని.. ఎయిర్ వారియర్స్ విన్యాసాల ద్వారా గగనతలంలో పటిష్టమైన నిఘా ఏర్పాటుచేసుకున్నామన్నారు. ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల చర్యలను ఆర్మీ నిర్వీర్యం చేస్తోందని.. ప్రతి ఘటన తర్వాత గుణపాఠాలు నేర్చుకుంటున్నామని రాహా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారతీయ వైమానిక దళం ఫేస్‌బుక్ పేజీ ‘పవర్ టు పనిష్’ను ఆయన ప్రారంభించారు.
రాజ్‌నాథ్ ‘సరిహద్దు’ సమీక్ష
సర్జికల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో సరిహద్దుల్లో భద్రతను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. రాజస్తాన్‌లోని మునాబావో సరిహద్దు ఔట్‌పోస్టును సందర్శించారు. ‘భారత్ ఎప్పుడూ ఒకరిపై యుద్ధం చేయదు. కానీ, తనపై ఎవరైనా దాడిచేస్తే దీటైన జవాబిస్తుంది’ అని తెలిపారు. సరిహద్దుల్లో భద్రతాపోస్టుల్లో కంచె నిర్మాణం, ఫ్లడ్‌లైట్లు, సైనికులకు సౌకర్యాలతోపాటు ఇతర మౌలికవసతుల కల్పనను ప్రాధాన్యతతో పూర్తిచేస్తామని సైనికులకు తెలిపారు.
‘వసుధైక కుటుంబకం’ అనే సూత్రాన్ని బలంగా విశ్వసించే భారత్.. ఇతరుల భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సరిహద్దుల్లో కాపలా ఉండే సైనికుల త్యాగాలు మరవలేనివన్నారు. సరిహద్దుల్లో సైనికుల కోసం మరిన్ని మొబైల్ టవర్ల ఏర్పాటుతోపాటు.. శాటిలైట్ ఫోన్లను కూడా పెంచనున్నట్లు తెలిపారు. జవాన్లతో కాసేపు ముచ్చటించి వారిలో ధైర్యాన్ని నింపారు.
మళ్లీ భగ్గుమన్న కశ్మీర్
లోయలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తమైంది. పెల్లెట్ గాయాలతో ఓ బాలుడు మృతి చెందటంతో.. ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల కర్ఫ్యూ విధించారు. సఫకదల్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో జునైద్ అఖూన్ అనే బాలుడికి తల, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ.. జునైద్ మరణించటంతో.. ఆందోళనకారులు రెచ్చిపోయారు. అయితే ఘర్షణలోనే బాలుడు మృతిచెందాడని పోలీసులంటుంటే.. పెల్లట్లు తగిలే చనిపోయాడని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్‌లో వ్యాపారాలు, ఆస్తులు లేవు పాక్ ప్రధాని షరీఫ్ కుటుంబ సభ్యులు
లాహోర్: భారత్‌లో తమ కుటుంబానికి ఎటువంటి వ్యాపారాలు, ఆస్తులు లేవని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తమకు భారత్‌లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ఈ మేరకు షరీఫ్ కుటుంబ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రధాని కుమారునికి భారత్‌లో సొంత వ్యాపారాలు కానీ, వ్యాపారాల్లో భాగస్వామ్యం కానీ లేదని తెలిపారు.
మోదీ సర్కారతో సంబంధాల పురోగతికి అవకాశం తక్కువే: అజీజ్
మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వంతో సంబంధాలు మెరుగవుతాయనే నమ్మకం పాకిస్తాన్‌కు లేదని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు.