ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు | Army Jawan Varikuntla Subbaiah Funeral Today In Anantapur, YS Jagan Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు

Published Thu, Dec 12 2024 7:55 AM | Last Updated on Thu, Dec 12 2024 12:29 PM

Army Jawan Varikuntla Subbaiah Funeral Today

సాక్షి,అనంతపురం : విధి నిర్వహణలో వీర మరణం పొందిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య (43) అంత్యక్రియలు  అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో ముగిశాయి. తాను ప్రాణాలు వదులుతూ.. ఇతరులను కాపాడి అసలైన వీరుడు అనిపించుకున్న సుబ్బయ్య అంత్యక్రియలు పాల్గొనేందుకు మండల వ్యాప్తంగా ప్రజలు కుల, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చారు. ఆర్మీ అధికారులు సుబ్బయ్య భార్య, తల్లికి సుబ్బయ్య భౌతిక కాయంపై ఉంచిన జాతీయ జెండాను సైనిక లాంచనాలతో సైనిక అధికారులు అందజేశారు.

కంభం మండలం రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో జమ్మూకశ్మీర్‌లోని మినీ కాశ్మీర్‌గా పేరొందని పూంచ్ జిల్లా, పూంచ్‌ సెక్టార్‌ పరిధిలోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంట సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో భూమిలో పాతిపెట్టిన మందుపాతరపై కాలు మోపారు. ఈ విషయాన్ని గుర్తించిన జవాను సుబ్బయ్య సహచరులను అప్రమత్తం చేసి వారిని ప్రమాదం నుంచి కాపాడారు. ఆ మందుపాతరకు మాత్రం తాను బలయ్యారు.

ఎల్‌ఓసీలో అమరుడైన సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో బుధవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లా నార్పలకు తీసుకువచ్చారు. సుబ్బయ్య పార్ధీవ దేహాన్ని చూసి భార్య లీల, తల్లి గాలెమ్మ, పిల్లలు, అన్నదమ్ములు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్ 
వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు. ల్యాండ్‌మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌రం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement