
నేషనల్ సైన్స్ డేలో భాగంగా గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్–2025 ఏర్పాటు
నేడు ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్.. పాల్గొననున్న సీఎం రేవంత్
సుమారు 20 వేల మంది విద్యార్థులతో పాటు సామాన్యులు వీక్షించే అవకాశం
హైదరాబాద్‌లో తొలిసారి సైనిక ఆయుధాలు, విడిభాగాల ప్రదర్శన
గచ్చిబౌలి: శత్రు దేశాల్లోని లక్ష్యాలను ఛేదించే అగ్ని, బ్రహ్మోస్ రకం క్షిపణులతోపాటు వివిధ యుద్ధట్యాంకులు, శతఘ్నులు, రాకెట్ లాంచర్లను దగ్గర నుంచి చూసే అవకాశం హైదరాబాద్‌వాసులకు లభించనుంది. నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని విజ్ఞాన్ వైభవ్–2025 పేరిట గచ్చిబౌలి స్టేడియంలో రక్షణరంగ ఆయుధాలు, విడిభాగాల ప్రదర్శన శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం ఉన్నతస్థాయిలో సమీక్షించారు.
త్రివిధ దళాల అవసరాల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన డీఆర్‌డీఎల్, డీఆర్‌డీఓ, ఇస్రో, మిధాని, బీడీఎల్, బీఈఎల్, ఈసీఐఎల్ రూపొందించిన ఆయుధాలు, పరికరాలు, విడిభాగాలను విద్యార్థులు, సామాన్య ప్రజలు మూడు రోజులపాటు తిలకించవచ్చు. ఇందుకోసం 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 20 వేల మంది విద్యార్థులు ఈ వేడుకలను సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు డీఆర్‌ఎడీఎల్ డైరెక్టర్ జనరల్ (మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్) రాజబాబు, డీఆర్‌డీఎల్ డైరెక్టర్æ జీఏ శ్రీనివాసమూర్తి గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. అయితే తొలి రోజైన శుక్రవారం మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంటుందని, మార్చి 1, 2 తేదీల్లో విద్యార్థులతోపాటు సామాన్య ప్రజలు చూడవచ్చని తెలిపారు.
యువతను ఆకర్షించే లక్ష్యంతో..: రక్షణ, ఏరోస్పేస్ టెక్నాలజీ రంగాల వైపు విద్యార్థులు, యువతను ఆకర్షించే లక్ష్యంతో డీఆర్‌డీఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ హైదరాబాద్‌లో తొలిసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి. రక్షణరంగ పరిశ్రమలు ఎలా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయన్న వివరాలను సైన్స్ డే ద్వారా విద్యార్థులకు వివరించనున్నాయి.
ప్రదర్శనలోని క్షిపణులు ఇవే..
అగ్ని–5: అణ్వస్త్ర సామర్థ్యంగల ఖండాంతర క్షిపణి. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
రుద్రం–3 : 550 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడుతుంది.
ప్రళయ్ : ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగించే క్షిపణి. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.
బ్రహ్మోస్ : 10 మీటర్ల నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తూ 290 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌లను నాశనం చేసే సామర్థ్యం ఉంది.
వరుణాస్త్ర : యుద్ధనౌకల నుంచి ప్రయోగించే యాంటీ సబ్‌మెరైన్ టోర్పెడో. సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. వీటితోపాటు ఎంబీటీ అర్జున్, నాగ్ రకానికి చెందిన యుద్ధట్యాంకర్లు, పలు శతఘ్నులు, రాకెట్ లాంచర్లు, తుపాకులు, వాటి విడిభాగాలను ప్రదర్శించనున్నారు.
స్ఫూర్తి కలిగించేందుకే..
కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా సైన్స్‌ను ప్రమోట్ చేస్తోంది. హైదరాబాద్‌లో రక్షణరంగ పరిశోధన సంస్థలు చాలా ఉన్నాయి. వాటిలో తయారయ్యే యుద్ధ సామగ్రిని విద్యార్థులు తిలకిస్తే స్ఫూర్తి పొంది శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు మళ్లుతారని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో భారత్‌ను ఈ రంగంలో లీడర్‌గా తీర్చిదిద్దే ఆవిష్కరణలతో ముందుకొస్తారని భావిస్తున్నాం. అందుకే ఎప్పుడూలేని విధంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. –డాక్టర్ జి. సతీష్‌రెడ్డి, అధ్యక్షుడు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా
వికసిత్ భారత్ కోసం
రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులు పెరిగితేనే వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. అందుకోసం విద్యార్థులు, పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. – యు.రాజబాబు, డైరెక్టర్ జనరల్, డీఆర్‌డీఎల్
క్షిపణుల తయారీకి ఏఐ సాయం
క్షిపణుల తయారీలో ఏఐ టెక్నాలజీని వాడుతున్నాం. ఒకసారి తయారు చేసిన మిసైల్‌ను మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తాం. హైపర్‌సోనిక్ టెక్నాలజీలో రెండు నెలల క్రితం ఒక మిసైల్‌ను తయారు చేశాం. దాదాపు 20 ప్రాజెక్ట్‌లు పురోగతిలో ఉన్నాయి. – జి.ఎ. శ్రీనివాసమూర్తి, డైరెక్టర్, డీఆర్‌డీఎల్
Comments
Please login to add a commentAdd a comment