National science day
-
ఐఐటీహెచ్‌లో డార్క్ స్కై అబ్జర్వేటరీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళశాస్త్రంలో ఉన్నతస్థాయి పరిశోధనలకు ఉపయోగపడే అడ్వాన్స్డ్ డార్క్ స్కై అబ్జర్వేటరీని హైదరాబాద్ ఐఐటీలో ఏర్పాటు చేశారు. నేషనల్ సైన్స్ డే మంగళవారం ఐఐటీలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇస్రో మాజీ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.రాధాకృష్ణన్ ఈ అబ్జర్వేటరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖగోళ శాస్త్ర పరిశోధనలకు ఈ అబ్జర్వేటరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్.మూర్తి, ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం పహారి, విద్యార్థులు పాల్గొన్నారు. -
హైడ్రోజన్‌తో స్వావలంబన దిశగా..
సాక్షి, హైదరాబాద్: ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన సాధించేందుకు హైడ్రోజన్ ఉపయోగపడుతుందని, ఈ దిశగా పరిశోధనలూ వేగంగా సాగుతున్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) హైడ్రోజన్ విభాగం జనరల్ మేనేజర్ డీఎంఆర్ పాండా వెల్లడించారు. జాతీయ సైన్స్ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డీఎంఆర్ పాండా ‘గ్రీన్ హైడ్రోజన్ ఎమర్జింగ్ ట్రెండ్స్’’అన్న అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలమైన విధానాల్లో హైడ్రోజన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా లేహ్, ఢిల్లీల్లో హైడ్రోజన్ బస్సులు ఇప్పటికే నడుస్తుండగా, సౌర విద్యుత్ సాయంతో హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వలకు కూడా పైలెట్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గింది.. దేశంలో సౌర, పవన విద్యుదుత్పత్తులకు అపార అవకాశాలున్నాయని, ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో వేర్వేరు పద్ధతులను ఉపయోగించుకుని హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశం పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని పాండా వివరించారు. అలాగే కర్బన ఉద్గారాల తగ్గింపూ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువైనప్పటికీ, ఐఐసీటీ, ఇతర విద్యా, పరిశోధన సంస్థల సహకారంతో దాన్ని తగ్గించి విస్తృత వినియోగంలోకి తేవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గిందని గుర్తు చేశారు. ఎలక్ట్రలైజర్లు, ఒత్తిడిని తట్టుకోగల సిలిండర్లు, హైడ్రోజన్‌ను చిన్న చిన్న సిలిండర్లలోకి పంపేందుకు అవసరమైన కంప్రెషర్ల విషయంలో దేశం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతోందని, ఫలితంగా ఈ ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సమీర్ దవే, డాక్టర్ నెట్టెం వి.చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగంపై జరుగుతున్న ప్రయత్నాలను క్లుప్తంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్ హబ్ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగాలను పెంచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్ హబ్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (హైడ్రోజన్ విభాగం) డీఎంఆర్ పాండా తెలిపారు. విశాఖపట్నంలోని ఎన్టీపీసీ కేంద్రానికి దగ్గరగా ఈ హబ్ ఏర్పాటు కానుందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే హైడ్రోజన్ హబ్‌లో హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు దానికి సంబంధించిన టెక్నాలజీలు, రవాణా వ్యవస్థలపై విస్తృతమైన పరిశోధనలు జరగనున్నాయని, సౌర శక్తి కోసం పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, అన్నీ సవ్యంగా సాగితే ఇంకో వారం రోజుల్లో ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం కూడా జరగనుందని వివరించారు. రానున్న పదేళ్లలో ఈ హబ్ ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పాండా తెలిపారు. ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’ ఈ నెల ఏడు నుంచి! కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలల కార్యకలాపాలను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐసీటీలో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నామని చెప్పారు. పరిశోధకులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజిస్టులు, స్టార్టప్‌లు, సాధారణ ప్రజలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని సూచించారు. -
సైన్స్ డే సైతం అమృతమయం!
సీవీ రామన్ 1888 జనవరి 7న జన్మించారు. అయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్సీఎస్టీసీ) ఆయన పుట్టిన రోజును కాకుండా, రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టిన రోజును ‘నేషనల్ సైన్స్ డే’గా స్వీకరించడంతో ఫిబ్రవరి 28 ‘భారత జాతీయ సైన్స్’ దినోత్సవం అయింది. అమృత మహోత్సవాల నేపథ్యంలో వచ్చిన సైన్స్ డే కనుక 1947 నుంచి ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడం సందర్భోచితమే అయినప్పటికీ... సైన్స్ వేడుకలకు ‘విజ్ఞాన్ సర్వత్ర పూజ్యతే’ అనే సంస్కృత తగిలింపును ఇవ్వడం సమంజ మేనా అనే ప్రశ్న వస్తుంది. ఈ తగిలింపు వల్ల శాస్త్ర సాంకేతిక కృషి స్వదేశీ సంప్రదాయాల్లోని ఒక భాగం అయిందే తప్ప, ప్రత్యేకంగా ఒక భాగం అయినట్లనిపించడం లేదు. ‘విజ్ఞాన్ సర్వత్ర పూజ్యతే’ అంటే ‘విజ్ఞానం అన్నిచోట్లా గౌరవం పొందుతుంది’ అని. ఈ మాట, ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అనే సంస్కృత శ్లోకభాగానికి అనుకరణ. ఆ శ్లోకంలోని విద్వాన్ అనే మాట స్థానంలో విజ్ఞాన్ అనే మాటను పెట్టి సైన్స్ డేకి ఉప శీర్షికగా తగిలించిన కారణంగా సైన్స్‌కు సంస్కృతి రంగును వేసినట్లయింది. డెబ్బై ఐదేళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు ఒక గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతి దాన్నీ 75తో బ్రాండింగ్ చేస్తోంది. 75 కార్యక్రమాలు, 75 పోస్టర్లు, 75 చిత్రాలు... ఇలా! ఆఖరికి సైన్స్ డేని కూడా ‘అమృత’మయం చేయడంతో ఆ రోజును ఎందుకైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశాన్ని తక్కువ చేసినట్లుగా అయింది. సైన్స్‌కి ప్రజాదరణ కల్పించడం అన్నది భారత్ సాధిం చిన శాస్త్ర పురోగతి, విజయాలు, మైలురాళ్లు... వీటికే పరిమితం అవకూడదు. శాస్త్రీయ విధానాలను ప్రజల నిత్యజీవితంలో భాగం చేయడం, ప్రజల్లోని మూఢనమ్మకాలను, అపోహలను తొలగిం చడం వంటి ప్రయత్నాలు కూడా ముఖ్యమైనవే. ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజాల భాగస్వామ్యంతో ఈ పని చేయవచ్చు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత ప్రజల్లో విషవాయువుల పట్ల జాగరూకత కల్పించి, వారిలో చైతన్యం తెచ్చేందుకు ఎన్సీఎస్టీసీ... తన ఆవిర్భావ సంవత్సరాలలో ఉండి కూడా... ‘ఆలిండియా పీపుల్స్ సైన్స్ మూవ్మెంట్’ అనే ఛత్రం కిందికి స్వచ్ఛంద సేవా సమూహాలన్నీ వచ్చేందుకు ఒక ఉత్ప్రేరకంగా పని చేయ గలిగింది! అదే సమయంలో ‘కేరళ శాస్త్ర, సాహిత్య పరిషత్’ తన జాతీయ సాక్షరతా మిషన్‌తో దేశవ్యాప్తంగా, భారత జన విజ్ఞాన యాత్రలు జరిపి, ప్రజల్ని మేల్కొలిపే ఒక మహా యజ్ఞాన్ని ప్రారంభించింది. సైన్స్‌ని ప్రజలకు చేరువగా తీసుకెళ్లేందుకు తొలిసారిగా ఎన్సీఎస్టీసీ దేశంలోని ప్రభుత్వ, పాక్షిక–ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొంటూ ఒక యంత్రాంగాన్ని సంస్థాగత పరి చింది. ఎన్సీఎస్టీసీ సహకారంతో శాస్త్రబృందాలు గ్రామాల్లో పర్యటించి దొంగ స్వాముల అసలు స్వరూపాలను, వారి మాయ మాటల్ని బట్టబయలు చేశాయి. అలాగే సూర్యగ్రహణంతో లంకె ఉన్న అనేక మూఢ నమ్మకాలను పటాపంచలు చేయగలిగాయి. విచిత్రం ఏమిటంటే, సైన్స్‌ను ప్రోత్సహించాలనీ, ప్రజల్లోకి తీసు కెళ్లాలనీ, సమాజంతో అనుసంధానం చేయాలనీ ప్రవచించే ప్రభుత్వ సంస్థలు ఇలాంటి జాగృతి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వకపోవడం, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని వెళ్లకపోవడం! దేశంలోని సైన్స్, టెక్నాలజీ సంస్థలు... సైన్సుకు ప్రజల్లో ఆదరణ కల్పించేందుకు తమ పాత్రపై పునరాలోచన చేసుకోవాలి. జాతీయ ప్రయోగశాలలు, విశ్వ విద్యాలయాలు, ఐఐటీలు ప్రజ లకు సహాయకారిగా ఉండే వనరుల కేంద్రాలు అవాలి. శాస్త్రీయ సంస్థలు తమ నైపుణ్యాలు, ప్రసంగాలతో తమ చుట్టూ ఉన్న ప్రజల్లో సామాజిక చైతన్యం తెచ్చేందుకు కృషి చేయాలి. ఉదా: ఉన్నత విద్యాసంస్థల్లోని శాస్త్రవేత్తలు, సైన్స్‌లో సీనియర్ విద్యా ర్థులు... విద్యా సంస్థలకు వెళ్లి సైన్స్ బోధన మెరుగయ్యేందుకు సహాయపడవచ్చు. పిల్లలు పాఠశాల స్థాయిలోనే సైన్స్ రంగంపై ఆసక్తి ఏర్పడేందుకు ఈ ‘సహాయక చర్యలు’ తోడ్పడతాయి. బయటి నుంచి వచ్చిన వాళ్లంటే పిల్లలూ ఉత్సాహంగా వింటారు. వాతావరణ మార్పులు, ఇంధనం, ఆహార భద్రత, జల సంరక్షణ, రీసైక్లింగ్, ఇ–వ్యర్థాలు, వన్య ప్రాణుల రక్షణ వంటి శాస్త్ర, సాంకేతిక అంశాలపై ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం ఎప్పుడూ అవసరమే. అందుకు వారిని సైన్స్ సన్నద్ధం చేస్తుం డాలి. ప్రభుత్వం కూడా ఆర్భాటపు పథకాలు, ప్రణాళికలపై డబ్బును వృ«థా చేయకుండా సైన్స్ అభివృద్ధి రంగంలో ఉన్న సంస్థలకు ఆర్థిక వనరులను సమృద్ధిగా సమకూర్చాలి. అప్పుడే సైన్స్ వర్ధిల్లుతుంది. సైన్స్ డే ఉద్దేశం నెరవేరుతుంది. దినేశ్ సి. శర్మ, సైన్స్ వ్యాఖ్యాత (రేపు జాతీయ సైన్స్ దినోత్సవం) -
సైన్స్ ఈస్ట్‌మన్ కలర్లో..
సైన్సు క్లాసు పిల్లలకు విజ్ఞానం. సినిమా వాళ్లకు వినోదం. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సైన్సు ఆధారంగా తయారైన తెలుగు సినిమాలెన్నో. నేడు నేషనల్ సైన్స్ డే సందర్భంగా... ఆదివారం ప్రత్యేకం హాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ తీయడం క్షణాల్లో పని. వారు కథలు ఎలా ఆలోచిస్తారో ఆ ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు. ఆత్రేయ ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని రాశారు. హాలీవుడ్ వాళ్లు కలల్లోకి వెళ్లడాన్ని కూడా తీసుకుని సినిమాలు తీశారు. ‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్’ అనే ఒక సినిమాలో హీరో హీరోయిన్ ఇక మన మధ్య ప్రేమ వద్దు అనుకుంటారు. బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ అయిపోయినా పాత జ్ఞాపకాలు మాత్రం ఉంటాయి కదా. ఆ జ్ఞాపకాలు మాత్రం ఎందుకు అనుకుని ఒక టెక్నాలజీ ద్వారా ఆ జ్ఞాపకాలన్నీ ఇద్దరూ చెరిపేసుకుంటారు. ఆ తర్వాత ఏమయ్యింది అనేది కథ. చూడండి ఎంత బాగా ఆలోచించారో. తెలుగులో ఈ స్థాయి ఆలోచన రావడానికి చాలా కాలం పడుతుంది. కాని తెలుగు ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తమిళ భాషల్లో సైన్స్‌ని కమర్షియల్ సినిమాకు బాగానే ఉపయోగించుకున్నారు. తెలుగులో జేమ్స్‌బాండ్ తరహా క్రైమ్ సినిమాలు మొదలయ్యాక సైన్సు, సైంటిస్టు అనే మాటలు ప్రేక్షకులకు ఎక్కువగా వినిపించడం మొదలయ్యాయి. ఒక సైంటిస్ట్ ఏదో ఫార్ములా కనిపెడతాడు. దాని కోసం విలన్ వెంటపడతాడు. ఆ సైంటిస్ట్ కూతురు తండ్రి కోసం వెతుకుతుంటుంది. హీరో సాయం చేస్తాడు. మనకు సైన్స్ అంటే ఒక ల్యాబ్, బుడగలు తేలే బీకర్లు మాత్రంగా చాలా కాలం సినిమాలు నడిచాయి. కాని సైన్స్‌ను లేశమాత్రంగా కథల్లో ప్రవేశ పెట్టడం మెల్లగా మొదలైంది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ నటించిన ‘దొరికితే దొంగలు’ దాదాపుగా సైన్స్ ఫిక్షన్‌గా చెప్పే వీలైన తొలి తెలుగు సినిమా అనుకోవచ్చు. ఇందులో రాజనాల, సత్యనారాయణ, అల్లురామలింగయ్యలు తెర వెనుక సైంటిఫిక్ పవర్స్‌ను అడ్డుపెట్టుకొని నానా అఘాయిత్యాలు చేస్తుంటారు. చివరకు ఎన్.టి.ఆర్ వారి ఆట కట్టిస్తాడు. ఆ తర్వాతి రోజుల్లో కృష్ణ ‘రహస్య గూఢచారి’ సినిమా వచ్చింది. ఇందులో విలన్ సత్యనారాయణ విజ్ఞాన శాస్త్రాన్ని ఔపోసన పట్టి అణు రాకెట్లు తయారు చేస్తాడు. ‘ఒక మీట నొక్కితే కుంభవృష్టి కురుస్తుంది.. ఒక మీట నొక్కితే సముద్రం ఆవిరవుతుంది’ అని చెబుతాడు. అయితే సహజంగానే కృష్ణ అతణ్ణి మట్టి కరిపిస్తాడు. కాని రహస్య గూఢచారిలో విలన్ చేసిన పని మనిషి త్వరలోనే చేస్తాడనిపిస్తుంది. దర్శకుడు గీతాకృష్ణ ‘కోకిల’ అనే సినిమా తీశారు. ఇందులో ప్రమాదరీత్యా కళ్లు పోయిన హీరోకు వేరొకరి కళ్లు అమరుస్తారు. అయితే అతడు కళ్లు తెరిచినప్పటి నుంచి ఒక హత్య జరిగిన దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఎవరి కళ్లయితే నరేశ్‌కు పెట్టారో ఆ కళ్లు ఆఖరిసారిగా ఆ హత్యను చూశాయి. ఆ కళ్లకు ఆ మెమొరి అలా ఉండిపోయి ఆ దృశ్యం ఇప్పుడు నరేశ్‌కు కనిపిస్తూ ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారం లేకపోయినా జనం ఓకే చేశారు. సినిమా హిట్ అయ్యింది. ∙∙ అయితే తెలుగువాళ్లు ఈనాటికీ గొప్పగా చెప్పుకోదగ్గ సైన్స్ ఫిక్షన్ మాత్రం ‘ఆదిత్యా 369’ సినిమాయే. టైమ్ మిషన్ ఆధారంగా అల్లుకున్న ఈ కథ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇందులో హీరో బాలకృష్ణ హీరోయిన్ను తోడు చేసుకుని టైమ్ మిషన్‌లో రాయలవారి కాలానికి వెళతాడు. ఆ తర్వాత అత్యంత రేడియేషన్ ఉండే భవిష్యత్ కాలానికి కూడా వెళతాడు. ఆ సినిమా లో వీడియో కాల్స్, సెల్‌ఫోన్ కాల్స్ లాంటివి ఊహించారు. ఆ సినిమాలో సైంటిస్ట్‌గా టిన్నూ ఆనంద్ నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా తీసినందుకు గాను దర్శకుడు సింగీతం శ్రీనివాస్ చాలా మంది ప్రేక్షకులకు మరింత ఇష్టులు అయ్యారు. దీని సీక్వెల్ గురించి ఎన్నో ప్రయత్నాలు సాగాయి కాని జరగలేదు. సైన్స్ ఫిక్షన్‌ను పెద్ద హీరోల మీద భారీగా ఉపయోగించాలి కాని కామెడీగా కాదని సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘నాని’ నిరూపించింది. ఇందులో కూడా ఒక పిచ్చి సైంటిస్ట్ చేసిన ఒక ప్రయోగం వికటించి చిన్న పిల్లాడు పెద్దవాడిగా మారడం ఆ పెద్దగా ఉన్న సమయంలో వివాహం కూడా జరిగిపోవడం ఇవన్నీ ఫన్నీగా ఉన్నా జనం మెచ్చలేదు. మహేశ్ బాబు అభినయం, ఏ.ఆర్.రెహమాన్, అమీషా పటేల్ అల్లరి సినిమాను కాపాడలేకపోయాయి. ∙∙ అదే సమయంలో తమిళం నుంచి డబ్ అయిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు తెలుగువే అన్నంత బాగా ఇక్కడ హిట్ అయ్యాయి. శంకర్ తీసిన ‘రోబో’ పెద్ద సంచలనం రేపింది. శాస్త్రం శృతి మించితే మనిషికి బానిసగా ఉండటం కాక మనిషినే బానిసగా చేసుకుంటుందని చెప్పిన ఈ సినిమా కలెక్షన్ల దుమారం రేపింది. రజనీకాంత్‌కు భారీ హిట్‌ను ఇచ్చింది. దీని కొనసాగింపుగా సెల్ టవర్ల దుష్ఫలితాలను తీసుకుని ‘రోబో2’ తీశారు కాని జనం మెచ్చలేదు. స్పష్టత కరువై ఎవరు హీరోనో ఎవరు విలనో తెలియకుండా పోయింది. హీరో సూర్య దర్శకుడు మురగదాస్‌తో కలిసి చేసిన ‘సెవెన్త్ సెన్స్’ భారతీయ సనాతన శక్తులను, శాస్త్రీయ శక్తులను చర్చించింది. ఇందులో వైరస్ చైనా నుంచి దిగుమతి అయినట్టు చూపడం మొన్న కరోనా సమయంలో చర్చకు వచ్చింది. సూర్య దర్శకుడు విక్రమ్ కుమార్‌తో తీసిన ‘24’ కూడా హిట్ అయ్యింది. ఈ సినిమా సమయాన్ని బంధించడం గురించి అందమైన ఊహ చేసింది. అలాంటి రోజులు వస్తాయేమో తెలియదు. అలాగే అంతరిక్షం కథాంశంగా వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ కూడా మంచి మార్కులే సంపాదించింది. ∙∙ సైన్స్ ఫిక్షన్ మీద తెలుగు సినిమా పెట్టుకున్న నమ్మకం అన్నిసార్లు సక్సెస్ ఇవ్వలేదు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అంతరిక్షం’ తొలి తెలుగు అంతరిక్ష నేపథ్య సినిమాగా నమోదైనా విజయం సాధించలేదు. హీరో వరుణ్‌తేజ్‌ను ఇది నిరాశ పరిచింది. ఇక విజయేంద్ర ప్రసాద్ కథతో వచ్చిన ‘శ్రీవల్లి’ సినిమా బ్రైన్ వేవ్‌ను కంట్రోల్లోకి తెచ్చుకోవడం వల్ల ఎదుటివారిని తమ అదుపులోకి తేవడం అనే అంశాన్ని చర్చించినా జనానికి కనెక్ట్ కాలేదు. పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో, రవితేజా ‘డిస్కో రాజా’లో శాస్త్రీయ అంశం కనిపించింది. సైన్స్ ఒక సముద్రం. దాని నుంచి ఎన్ని కథలైనా అల్లవచ్చు. అయితే విజ్ఞానం, వినోదం సమపాళ్లలో కలిపినప్పుడు ఆ జానర్ హిట్ అయ్యింది. భవిష్యత్తులో మంచి సైన్స్ ఫిక్షన్ చిత్రాలు వస్తాయని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
మార్స్‌పై మహిళా శక్తి
‘పెర్సీ’ రోవర్ మార్స్ పైన దిగి వారం అయింది. ఇప్పుడేం చేస్తూ ఉంటుంది? ఏం చేయడం లేదు. ఉన్న చోటే ఉండి భూమి పైకి ఫొటోలు పంపుతూ ఉంది. పెర్సీ ఒక్కటే లేదు అక్కడ. తల్లి ఒడిలో బిడ్డలా (కంగారూ తల్లీబిడ్డల్ని ఊహించండి) పెర్సీ పొదుగు కింద ‘ఇంజిన్యూటీ’ అనే హెలికాఫ్టర్ కూడా ఉంది. ఆ బిడ్డకు తల్లి పాలిస్తూ ఉంది. 30 పర్సెంట్ ఛార్జింగ్ అయింది ఇప్పటికి. పాలివ్వడం పూర్తవగానే బిడ్డకు రెక్కలొచ్చి మార్స్ పై ఎగురుకుంటూ తిరుగుతుంది. అదలా ఎగరగానే పెర్సీ కూడా మెల్లిగా కదలడం, ముందుకీ వెనక్కూ అడుగులు వేయడం మొదలు పెడుతుంది. మార్స్ పై నున్న తల్లీబిడ్డల్ని యాక్టివేట్ చేయించే పని.. కింద కన్సోల్ లో ఉన్న ‘నాసా’ టీమ్ ది. టీమ్ లో 12 మంది భారత సంతతి సైంటిస్టులుగా కాగా.. వారిలో 8 మంది మహిళలే! నాసా పంపిన ‘పెర్సీ’ రోవర్ ఈ నెల 18 న అంగారకుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. అక్కడే ఏడాది పాటు ఉండి మానవ నివాస యోగ్యమైన వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నదీ లేనిదీ పెర్సీ కనిపెట్టి చెబుతుంది. భూమికి, అంగారకుడికి మధ్య దూరం సుమారు 21 కోట్ల 80 లక్షల కిలోమీటర్లు. పెర్సీ అంతదూరం నిరంతరాయంగా ప్రయాణించి మార్స్ పైకి చేరడమే గొప్ప ‘భూవిశేషం’ అని చెప్పాలి! మానవ నిర్మితం కనుక. యూఎస్‌లోని ఫ్లోరిడా నుంచి ‘అట్లాస్’ అనే రాకెట్ ‘పెర్సీ’ రోవర్‌ని, పెర్సీకి తగిలించిన ‘ఇన్‌జెన్యూటీ’ హెలికాప్టర్ని భద్రంగా మోసుకెళ్లి పైన వదిలి పెట్టింది. ఇక తర్వాతిదంతా భూమి మీద ఫ్లారిడాలోని పెర్సీ ప్రాజెక్ట్ నాసా శాస్త్రవేత్తల పనే. పెర్సీని రాకెట్లో ఉంచి మార్స్ పైకి పంపిన ఈ బృందం చేతుల్లోనే.. పెర్సీ అక్కడ తన పని ప్రారంభించడానికి, కొనసాగించడానికి, పూర్తి చేయడానికి ఆదేశాలిచ్చే ముఖ్యమైన మీటలన్నీ ఉంటాయి. టీమ్ మొత్తంలో కనీసం 12 మంది భారత సంతతి శాస్త్రవేత్తలు ఉన్నారు. వారిలో 8 మంది మహిళలే. నేడు భారత్ ‘నేషనల్ సైన్స్ డే’ కనుక.. ఈ సందర్భంగా పెర్సీ ‘కన్సోల్’ రూమ్‌లో కూర్చొని ఉన్న మన సైంటిస్టులు ఎవరెవరు ఏయే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో తెలుసుకుందాం. మొదట బాబ్ బలరామ్ గురించైతే తప్పక చెప్పుకోవాలి. ఈ క్షణాన అంగారక గ్రహంలో రోవర్ పొదుగున చార్జ్ అవుతున్న ‘ఇన్‌జెన్యూటీ’ అనే ఆ హెలికాప్టర్ని కనిపెట్టింది ఆయనే. బాబ్ 1990 లలోనే ఇలాంటి మార్స్ హెలికాప్టర్ ఆలోచన చేశారు. అయితే అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు. ‘అసాధ్యం’ అన్నారంతా. బాబ్ మెడ్రాస్ ఐ.ఐ.టి విద్యార్థి. నాసాలో అధ్యయనం చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం మళ్లీ మార్స్ హెలికాప్టర్ టాపిక్ వచ్చింది. నాసా ‘జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ’ (జె.పి.ఎల్) డైరెక్టర్ తన ప్రసంగంలో.. మార్స్‌పై ఎగిరే హెలికాప్టర్‌ను తయారు చేయలేమా? అనే ప్రశ్న సంధించినప్పుడు సమావేశంలో ఉన్న కొందరు అప్పటికి దశాబ్దం క్రితమే జరిగిన బాబ్ బలరామ్ ప్రయత్నాల గురించి చెప్పారు. వెంటనే ఆ డైరెక్టర్ నుంచి బాబ్‌కు పిలుపు వెళ్లింది. బాబ్, ఆయన బృందం ఎనిమిది వారాలు కష్టించి మార్స్ హెలికాప్టర్‌ను కనిపెట్టేందుకు పట్టే సమయం, అయ్యే ఖర్చుపై అంచనాలు వేసి ఇచ్చారు. ఆ క్రమంలో ఏడేళ్ల నిర్విరామ కృషితో తయారైనదే ఇప్పుడు మార్స్ పైన ఛార్జింగ్ అవుతూ ఉన్న ‘ఇన్‌జెన్యూటీ’ హెలికాప్టర్. అంటే నాసా తొలి మార్స్ హెలికాప్టర్ ఆలోచన కర్త, సృష్టికర్త మన భారతీయుడే. అందుకే ఈ ఏడాది నేషనల్ డే మనకు ప్రత్యేకమైనది. ఈ ప్రతిష్టాత్మకమైన ‘మార్స్ 2020 మిషన్’ లో బాబ్ బలరామ్‌తో పాటు మహిళా సైంటిస్టులు స్వాతి మోహన్, వందనా వర్మ, నాగిన్ కాక్స్, యోగితా షా, ఉషా గూడూరి, కవితా కౌర్, ప్రియాంక శ్రీవాత్సవ, శివాలీ రెడ్డి; మిగతా సైంటిస్టులు విష్ణుశ్రీధర్, సౌమ్యోదత్తా, నీల్ పటేల్ పాలు పంచుకున్నారు. పెర్సీ ప్రాజెక్టులో ప్రతిదీ కీలకమైన ప్రాజెక్టే అయినప్పటికీ.. ప్రధానమైన బాధ్యతలన్నిటినీ స్వాతీ మోహన్ నిర్వర్తిస్తున్నారు. రోవర్‌కి గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ లీడ్ ఆమె విధులు. రోవర్‌ని కదిలించే బాధ్యత వందనా వర్మది. అంగారకుడిపై ఉన్న రోవర్ ప్రస్తుతం ‘వామింగ్ అప్’ మోడ్‌లో స్థిరంగా ఉంది. ఇకపై ఆమే రోవర్‌కి నడకలు నేర్పించాలి. నాగిన్ కాక్స్ డిప్యూటీ టీమ్ చీఫ్. ఆమె ఆధ్వర్యంలోనే పెర్సీ ఇంజినీరింగ్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. నాగిన్ బెంగళూరు అమ్మాయి. గతంలో యు.ఎస్. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పని చేశారు. ఆమె పెరిగిందంతా మలేషియా, అమెరికాలలో. నాగిన్కు నాసా, నాసా వారి జె.పి.ఎల్.లో స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్ ఇంజినీర్ గా 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇక యోగితా షా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరు. కమ్యూనికేషన్, నేవిగేషన్లకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. ఆమెది మహారాష్ట్రలోని ఔరంగాబాద్. జె.పి.ఎల్.లో ఫ్లయిట్ సిస్టమ్స్ ఇంజినీరుగా శిక్షణ పొందారు. ఉషా గూడూరి సాఫ్ట్వేర్ ఇంజినీరు. యాక్టివిటీ ప్లానింగ్, సబ్‌సిస్టమ్ సీక్వెన్సింగ్లకు సాఫ్ట్‌వేర్‌ను కనిపెట్టడం ఆమె వంతు. బిట్స్ పిలానీలో చదివారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉషకు 18 ఏళ్ల అనుభవం ఉంది. ‘కాస్సినీ’ ప్రాజెక్టులోనూ కీలక పాత్ర పోషించారు. శనిగ్రహంపై పరిశోధనలకు నాసా రూపొందించిన నాలుగో ప్రాజెక్టే కాస్సినీ. అలాగే ‘డాన్’ అనే మరొక ఉపగ్రహ పరిశోధన ప్రాజక్టుకు కూడా. ఇక కవితా కౌర్ గ్రౌండ్ డేటా సిస్టమ్స్ నిపుణురాలు. ఆమెది చండీఘడ్. ప్రియాంక శ్రీవాత్సవ సిస్టమ్స్ ఇంజినీరు. లక్నో, పంజాబ్‌లలో చదువుకున్నారు. నాసా ఫ్లయిట్ మిషన్లలో పని చేశారు. ఇప్పుడీ మార్స్ మిషన్‌లో మోటార్ కంట్రోల్ అసెంబ్లీలో బాధ్యత ప్రియాంకదే. ఆమెకు సహాయంగా శివాలీ రెడ్డి ఉంటారు. వీరు కాక.. మిగిలిన ముగ్గురిలో విష్ణు శ్రీధర్ అంగారకుడిపై రాళ్లు, రప్పల్ని విశ్లేషిస్తారు. సౌమ్యోదత్తా రోవర్ కదలికల్ని స్టడీ చేస్తారు. నీల్ పటేల్ అంతరిక్ష పదార్థాలను సేకరించేందుకు రోవర్‌కి ఆటోమేటెడ్ సిస్టమ్‌ని అందజేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలు మహిళలవి కావు అన్నట్లు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మహిళలు లేకుండా సైన్స్ ముందుకు సాగలేని పరిస్థితి! ప్రతిభకు, నైపుణ్యానికీ స్త్రీ, పురుష భేదం ఉండదని అనేక మిషన్లు నిరూపించాయి. ఇప్పుడీ మార్స్ 2020 మిషన్ కూడా. నేటి ‘నేషనల్ సైన్స్ డే’ని భారత్ సగర్వంగా జరుపుకోడానికి కారణమైన మన ‘అంగారక’ సైంటిస్టులకు, ముఖ్యంగా మహిళా సైంటిస్టులకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే అభినందనలు. -
మన శాస్త్రవేత్తల నైపుణ్యం గొప్పది
న్యూఢిల్లీ: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ భారతీయ శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని ప్రశంసించారు. ‘మన శాస్త్రవేత్తల వినూత్న ఆలోచనలు, పరిశోధనల పట్ల వారి మార్గదర్శకాలు దేశానితోపాటు ప్రపంచానికి ఎనలేని కీర్తిని తెస్తాయి’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో భారత్ శాస్త్ర, సాంకేతిక రంగం వృద్ధిలో కొనసాగడమే కాక.. యువతకు సైన్స్ పట్ల ఉత్సుకతను పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ‘మన శాస్త్రవేత్తలను గౌరవించుకునేందుకు జాతీయ సైన్స్ దినోత్సవం ఒక మంచి సందర్భం’అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్‌లో పరిశోధన, ఆవిష్కరణల్లో అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు. పరిశోధనల్లో మహిళలు 15 శాతమే: కోవింద్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మహిళలు 15 శాతానికే పరిమితం అయ్యారని పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో లింగ సమానత్వం, అభివృద్ధికి సంబంధించి మూడు కార్యక్రమాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. -
రూ. 200 ప్రయోగానికి నోబెల్ ప్రైజ్
ఎందరో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది ప్రపంచానికి అద్భుతాలు అందించింది. అటువంటి వారిలో భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత దేశ ఖ్యాతిని నలుదిశలు చాటి చెప్పిన ఘనుడు సర్ సివి రామన్. భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగి నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియా వాసిగా కీర్తిగడించారు. సైన్స్ డే సందర్భంగా సివి రామన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. -
ఈ భారత మహిళల గురించి మీకు తెలుసా?
శాస్త్ర సాంకేతిక రంగాలే ప్రపంచ పురోగతికి ఆధారాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి మాత్రం జనాభా నిష్పత్తికి తగినంతగా ఉండటం లేదు. నవ సహస్రాబ్దిలో శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం కొంత పుంజుకున్నా, ఇదివరకటి శతాబ్దాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. మన దేశంలోనైతే మహిళా శాస్త్రవేత్తల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉండేది. మహిళలు చదువుకోవడమే అరుదైన ఆ కాలంలో సైతం కొందరు మహిళలు పరిస్థితులకు ఎదురీది మరీ శాస్త్రవేత్తలుగా తమ సత్తా చాటుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో వారు మైలురాళ్లలా నిలిచిపోయే విజయాలను సాధించారు. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన దేశానికి చెందిన కొందరు తొలితరం మహిళా శాస్త్రవేత్తల గురించి... ఈ ఏడాది థీమ్ విమెన్ ఇన్ సైన్స్ వైద్యంలో పట్టా సాధించిన తొలి భారతీయురాలు ఆనందీబాయి జోషి మన దేశంలో పాశ్చాత్య విద్య ప్రాచుర్యంలోకి వస్తున్న తొలి రోజుల్లోనే వైద్యశాస్త్రంలో పట్టా సాధించిన తొలి మహిళ ఆనందీబాయి జోషి. అప్పటి బాంబే ప్రెసిడెన్సీలోని (ఇప్పటి మహారాష్ట్ర) కల్యాణ్ పట్టణంలో 1865 మార్చి 31న బతికి చెడిన భూస్వాముల కుటుంబంలో జన్మించారామె. ఆనాటి పద్ధతుల ప్రకారం ఆమెకు తొమ్మిదేళ్ల వయసులోనే తపాలా గుమస్తాగా పనిచేసే గోపాలరావు జోషితో పెళ్లి జరిగింది. గోపాలరావు జోషి మొదటి భార్య అప్పటికే మరణించింది. ఇద్దరికీ వయసులో ఇరవయ్యేళ్లకు పైనే తేడా. గోపాలరావు జోషి కొంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి కావడంతో భార్యకు చదువు చెప్పించారు. గోపాలరావు జోషికి కలకత్తా బదిలీ కావడంతో కుటుంబం అక్కడకు చేరుకుంది. పద్నాలుగేళ్ల వయసులో ఆనందీబాయి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. తగిన వైద్యం అందనందున ఆ బిడ్డ పట్టుమని పదిరోజుల్లోనే కన్నుమూయడం ఆనందీబాయిని తీవ్రంగా కలచివేసింది. మహిళలకు ఇలాంటి దుస్థితి నుంచి తప్పించడానికి తానే స్వయంగా వైద్యశాస్త్రం అభ్యసించాలని నిశ్చయించుకుంది. ఆ కృతనిశ్చయమే ఆమెను వైద్యశాస్త్రంలో పట్టభద్రురాలైన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిపింది. ఆనందీబాయి నిశ్చయానికి భర్త ప్రోత్సాహం తోడైంది. తన భార్య వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటోందని, అందుకు తగిన సహాయం చేయమని కోరుతూ ప్రముఖ అమెరికన్ మిషనరీ రాయల్ వైల్డర్‌కు గోపాలరావు జోషి లేఖ రాశారు. వైల్డర్ ఆ లేఖను తాను నడిపే ‘ప్రిన్స్టన్స్ మిషనరీ రివ్యూ’ పత్రికలో ప్రచురించారు. దానిని చూసిన థియోడిషియా కార్పెంటర్ అనే సంపన్నురాలు ఆనందీబాయికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చింది. కలకత్తాలో ఉంటున్న ఆనందీబాయికి నేరుగా లేఖ రాసింది. అప్పటికి ఆనందీబాయి అనారోగ్యంతో బాధపడుతుండేది. థియోడిషియా ఆమెకు అమెరికా నుంచి మందులు కూడా పంపేది. ఈలోగా గోపాలరావుకు బెంగాల్‌లోని సీరమ్‌పూర్ బదిలీ అయింది. పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజీకి దరఖాస్తు చేసుకోమని థియోడిషియా సూచించడంతో ఆనందీబాయి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఒక సందర్భంలో ఆనందీబాయి సీరమ్‌పూర్ కాలేజీలో ప్రసంగం చేసింది. అమెరికాలో వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటున్నానంటూ ఆమె చేసిన ప్రసంగానికి విపరీతమైన ప్రచారం వచ్చింది. ఆమె చదువు కోసం సంపన్నుల నుంచి విరాళాలు వచ్చాయి. పెన్సిల్వేనియా లోని విమెన్స్ మెడికల్ కాలేజీలో సీటు కూడా వచ్చింది. కలకత్తా నుంచి ఆనందీబాయి ఓడలో ప్రయాణించి అమెరికా చేరుకుంది. పెన్సిల్వేనియా విమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి 1886లో విజయవంతంగా ఎండీ పూర్తి చేసింది. అకుంఠిత దీక్షలో చదువులో మునిగి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఆనందీబాయికి క్షయ సోకింది. పట్టాపుచ్చుకుని ఏడాదైనా గడవక ముందే 1886 ఫిబ్రవరి 26న కన్నుమూసింది. అమెరికా నుంచి వృక్షశాస్త్రంలో పీహెచ్డీ పొందిన తొలి మహిళ జానకి అమ్మాళ్ వృక్షశాస్త్రంలో చిరస్మరణీయమైన పరిశోధనలు సాగించిన జానకి అమ్మాళ్ 1897 నవంబరు 4న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలిచెర్రిలో జన్మించారు. ఆమె తండ్రి దివాన్ బహదూర్ ఇ.కె.కృష్ణన్ సబ్జడ్జిగా పనిచేసేవారు. తండ్రి ప్రోత్సాహంతో ఆమె ఉన్నత చదువులను కొనసాగించగలిగారు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1924లో బోటనీలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం మిషిగాన్ వెళ్లారు. అక్కడ బార్బర్ స్కాలర్షిప్ పొంది 1926లో బోటనీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి, మద్రాసులోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకురాలిగా పనిచేసి, పరిశోధనల కోసం మళ్లీ మిషిగాన్ చేరుకున్నారు. మిషిగాన్ వర్సిటీ నుంచి 1931లో పీహెచ్డీ పొందారు. అమెరికాలోనే వృక్షశాస్త్రంలో పీహెచ్డీ సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. చెరకు, వంకాయలు వంటి పంటల కణనిర్మాణంపై ఆమె చేసిన పరిశోధనలకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. తోటల్లో పెంచుకునే మొక్కలు, వర్షారణ్య వృక్షాలపై ఆమె విస్తృతంగా పరిశోధనలు సాగించి, అంతర్జాతీయంగా మన్ననలు పొందారు. మిషిగాన్ వర్సిటీ ఆమెకు 1956లో ఎల్ఎల్డీ గౌరవ పట్టాను ఇచ్చింది. భారత ప్రభుత్వం 1977లో జానకి అమ్మాళ్‌ను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. జమ్ములోని రీజియనల్ రీసెర్చ్ లాబొరేటరీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన కాలంలో 3,254 వృక్షజాతులకు చెందిన 21,500 నమూనాలపై పరిశోధనలు సాగించారు. ఆమె పరిశోధనలు జన్యుశాస్త్రం అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డాయి. ఇండియన్ సొసైటీ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాండ్ బ్రీడింగ్, బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు అధ్యక్ష పదవిలో కొనసాగిన తొలి మహిళగా కూడా జానకి అమ్మాళ్ అరుదైన చరిత్ర సృష్టించారు. అనారోగ్యంతో ఆమె 1984 ఫిబ్రవరి 7న మద్రాసులో కన్నుమూశారు. సైన్స్‌లో డాక్టరేట్ సాధించిన తొలి భారతీయురాలు అసీమా ఛటర్జీ బ్రిటిష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ అసీమా ఛటర్జీ. ఆమె కలకత్తాలో 1917 సెప్టెంబరు 23న జన్మించారు. ఆమె తండ్రి నారాయణ ముఖర్జీ కలకత్తాలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేసేవారు. ఆధునిక భావాలు గల ఆయన కుమార్తెను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో అసీమా కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీ నుంచి 1936లో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ సాధించారు. తర్వాత 1938లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ‘ఫైటోమెడిసిన్స్’పై ఆమె సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి కలకత్తా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. ఆమె పరిశోధన ఫలితంగా మూర్ఛ వ్యాధిని, మలేరియాను నయం చేసే మందుల తయారీకి, కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమోథెరపీ మందుల తయారీకి మార్గం సుగమమైంది. కలకత్తా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తయ్యాక ఆమె అమెరికా వెళ్లి విస్కాన్సిన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో పరిశోధనలు సాగించారు. కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని లేడీ బ్రాబర్న్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగాన్ని స్థాపించిన ఘనత అసీమాకే దక్కుతుంది. పలు శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహించిన అసీమా, 1982–90 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా కూడా కొనసాగారు. భారత ప్రభుత్వం ఆమె విశిష్ట సేవలకు గుర్తింపుగా 1975లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళా శాస్త్రవేత్తగా ఆమె సాధించిన ఘనత చరిత్రలో నిలిచిపోతుంది. రామన్పైనే సత్యాగ్రహం ప్రకటించిన ధీర కమలా సోహనీ శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళల పట్ల వివక్ష ఈనాటిది కాదు. తొలి రోజుల్లో వివక్ష మరింత ఎక్కువగా ఉండేది. కేవలం మహిళ అయిన కారణంగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుకు నిరాకరణ ఎదురైంది. ఆమె దరఖాస్తును తోసిపుచ్చినది ఎవరో కాదు, అప్పట్లో ఆ సంస్థ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ‘నోబెల్’ గ్రహీత సీవీ రామన్. మహిళలు శాస్త్ర పరిశోధనను కొనసాగించలేరంటూ ఆమె దరఖాస్తును రామన్ తోసిపుచ్చారు. పరిశోధన సాగించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలా సోహనీ ఈ తిరస్కారాన్ని తేలికగా తీసుకోలేదు. రామన్ నిర్ణయానికి నిరసనగా సత్యగ్రాహం చేపట్టింది. దెబ్బకు రామన్ దిగివచ్చి, ఆమెను రీసెర్చ్ ఫెలోగా చేర్చుకోక తప్పలేదు. కమలా సోహనీ మధ్యప్రదేశ్‌లోని (అప్పటి సెంట్రల్ ప్రావిన్స్) ఇండోర్‌లో 1912 సెప్టెంబర్ 14న జన్మించారు. ఆమె తండ్రి నారాయణరావు భగవత్, పినతండ్రి మాధవరావు భగవత్– ఇద్దరూ రసాయనిక శాస్త్రవేత్తలే! వారిద్దరూ బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పట్టభద్రులు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్స్ తర్వాతి కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌గా (ఐఐఎస్సీ) మారింది. ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు కమలా సోహనీ బాంబే యూనివర్సిటీ నుంచి 1933లో కెమిస్ట్రీ ప్రధానాంశంగా, ఫిజిక్స్ ద్వితీయాంశంగా బీఎస్సీ, 1936లో కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ డిస్టింక్షన్‌తో పూర్తి చేశారు. కమలా సోహనీ పోరాట ఫలితంగా ఐఐఎస్సీలో మహిళల ప్రవేశానికి 1937 నుంచి మార్గం ఏర్పడింది. ఐఐఎస్సీలో శ్రీనివాసయ్య మార్గదర్శకత్వంలో కమలా సోహనీ పాలు, పప్పుధాన్యాలు, గింజధాన్యాల్లోని ప్రొటీన్లపై పరిశోధన సాగించారు. ఆమె పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో కేంబ్రిడ్జి వర్సిటీ పరిశోధనలు కొనసాగించడానికి ఆమెను ఆహ్వానించింది. అక్కడ ఆమె ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ హిల్ నేతృత్వంలో పద్నాలుగు నెలల్లో పరిశోధన పూర్తి చేసి, సమర్పించిన కేవలం 40 పేజీల సిద్ధాంత వ్యాసానికి పీహెచ్డీ లభించింది. డాక్టరేట్ పూర్తయిన వెంటనే 1939లో ఆమె స్వదేశానికి వచ్చారు. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగా నియమితులయ్యారు. తాజా తాటికల్లు (నీరా) పోషక విలువలపై ఆమె జరిపిన పరిశోధన భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు నీరా ఇవ్వవచ్చని, నీరాను తాటిబెల్లంగా తయారు చేసినట్లయితే, పోషక విలువలను ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చని ఆమె నిరూపించారు. ‘నీరా’పై పరిశోధన చేసినందుకు ఆమెకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 1998లో ఆమెను ఘనంగా సత్కరిస్తుండగా వేదికపైనే కుప్పకూలిపోయిన ఆమె కొద్ది రోజుల్లోనే కన్ను మూశారు. దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్తగా ఉన్నత స్థాయికి చేరుకున్న అన్నా మణి మద్రాసు ప్రెసిడెన్సీలోని రామనాథపురం జిల్లా పారంకుడిలో 1918 ఆగస్టు 23న జన్మించారు. ఆమె తండ్రి సివిల్ ఇంజనీరు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు, కళలపై అన్నా మణికి విపరీతమైన ఆసక్తి ఉండేది. ఎనిమిదో పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆమెకు వజ్రాల చెవిరింగులు బహుమతిగా కొని తేవడానికి తండ్రి బజారుకు వెళ్లడానికి సిద్ధపడుతుంటే, తనకు వజ్రాల రింగులు వద్దని, వాటికి బదులు ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా’ కావాలని కోరింది. బాల్యంలో ఆమెకు నాట్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. నర్తకి కావాలనుకుంది కూడా. కాలేజీలో చేరిన తర్వాత మాత్రం నాట్యం బదులు పరిశోధనల్లోనే తన భవితవ్యాన్ని తీర్చిదిద్దుకుంది. మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజీ నుంచి 1939లో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేసింది. మరుసటి ఏడాదే ఆమెకు పరిశోధనలు కొనసాగించడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్కాలర్షిప్ లభించింది. అక్కడ ప్రొఫెసర్ సాల్మన్ పాపయ్య మార్గదర్శకత్వంలో వజ్రాలు, కెంపులకు గల కాంతిపరావర్తన లక్షణాలపై పరిశోధన సాగించి, పీహెచ్డీ కోసం సిద్ధాంత వ్యాసం సమర్పించారు. అయితే, ఆమె అప్పటికి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయనందున ఆమెకు పీహెచ్డీ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం ఆమె లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చేరారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు సాగించాలనే లక్ష్యంతో వెళ్లిన ఆమె చివరకు వాతావరణ శాస్త్ర పరిశోధకురాలిగా తేలారు. స్వదేశానికి 1948లో తిరిగి వచ్చాక, పుణేలోని వాతావరణ శాఖ కార్యాలయంలో చేరారు. వాతావరణ పరికరాలపై ఆమె అసంఖ్యాకమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. చాలా పరికరాలను ఆమె ప్రామాణీకరించారు. పుణేలో ఆమె ఐదేళ్ల వ్యవధిలోనే వాతావరణ విభాగాధిపతి స్థాయికి ఎదిగారు. ఆమె కింద 121 మంది పురుషులు సిబ్బందిగా పనిచేసేవారు. తర్వాత ఆమె 1968లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతిపై ఢిల్లీ బదిలీ అయ్యారు. కొంతకాలం ఈజిప్టులో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) కన్సల్టంట్గా పనిచేశారు. జీవితాంతం పరిశోధనలకే అంకితమైన ఆమె వివాహం చేసుకోలేదు. 1994లో పక్షవాతం బారినపడిన ఆమె 2001లో కన్నుమూశారు. సూర్యరశ్మి నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావంపై ఆమె జరిపిన పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు దక్కాయి. ఆమె శత జయంతి సందర్భంగా 2018లో డబ్ల్యూఎంవో తన జర్నల్‌లో ఆమె సంక్షిప్త జీవిత చరిత్రను, ఇంటర్వ్యూను ప్రచురించింది. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టు రూపాబాయి ఫర్దూన్జీ రూపాబాయి ఫర్దూన్జీ హైదరాబాద్‌లోని ఒక పార్శీ కుటుంబంలో పుట్టారు. ఆమె జనన మరణ వివరాలేవీ తెలియవు గాని, నాటి హైదరాబాద్ మెడికల్ కాలేజీలో (ఇప్పటి ఉస్మానియా మెడికల్ కాలేజీ) 1885లో చేరిన ఐదుగురు మహిళా విద్యార్థుల్లో ఆమె ఒకరు. హైదరాబాద్ మెడికల్ కాలేజీ నుంచి ‘హకీం’ పట్టా తీసుకున్నాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో పాశ్చాత్య వైద్యంలో డిగ్రీ కోసం చేరారు. అప్పట్లో అమెరికా, ఇంగ్లాండ్‌లలో సైతం చాలా వైద్య కళాశాలలు మహిళలకు ప్రవేశం కల్పించేవి కావు. మహిళలకు ప్రవేశం కల్పించే అతి కొద్ది సంస్థల్లో బాల్టిమోర్‌లోని జాన్స్హాప్కిన్స్ హాస్పిటల్ ఒకటి. బాల్టిమోర్‌లో చదువు పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని తొలి రెండు క్లోరోఫామ్ కమిషన్లలో (1888, 1891) కీలక పాత్ర పోషించారు. తర్వాత 1909లో స్కాట్లాండ్ వెళ్లి, అక్కడ ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో చేరారు. అప్పటికి అనెస్థీషియాలో ఏ యూనివర్సిటీలోనూ స్పెషలైజేషన్ కోర్సులు లేవు. అయినా ఆమె ఒకవైపు అనెస్థెటిక్స్లో పరిశోధనలు సాగిస్తూనే, మరోవైపు ఎడిన్బర్గ్ వర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీలలో డిప్లొమాలు పూర్తి చేశారు. అనెస్థెటిక్స్లో అనుభవజ్ఞానం ఉన్నవారి సేవలను శస్త్రవైద్యులు తమకు అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకునేవారు. అలా రూపాబాయి ఫర్దూన్జీ కూడా పలువురు శస్త్రవైద్యులకు అనెస్థటిస్టుగా సేవలందించారు. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టుగా గుర్తింపు పొందారు. ఎడిన్బర్గ్లో పరిశోధనలు పూర్తయ్యాక ఆమె స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి, 1920లో రిటైరయ్యారు. -
కాలేజ్ సీటు కోసం సత్యాగ్రహం
శాస్త్రీయ విజ్ఞానాన్ని వినువీధిలో విహరింపజేయాలనే అభిలాషతో నిరంతరం శ్రమించి.. ఆ క్రమంలో లైంగిక వివక్షకు గురై అనేక అవమానాలు,అడ్డంకులు దాటుకుని గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన మహిళ కమలా సోహాని.బ్రిటీష్ కాలంలోనే నాటి లింగ వివక్షను ఆత్మస్థయిర్యంతో ఒంటరిగాఎదుర్కొని శాస్త్రీయ విజ్ఞాన శాస్త్రంలో వినూత్న పరిశోధనలతో రాణించిన ఆ ధీశాలిని ఈ ‘సైన్స్ డే’రోజు తప్పక స్మరించుకోవాలి. మహిళల ఉన్నతవిద్యకు అవకాశాలు అంతంత మాత్రం కూడా లేని కాలంలో 1912 సెప్టెంబర్ 14న మధ్యప్రదేశ్‌ని ఇండోర్‌లో జన్మించారు కమలా సోహాని. ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన కమల చదువులో ముందునుంచి విశేష ప్రతిభ కనబరిచారు. ఆమె తండ్రి నారాయణ, బంధువు మాధవరావ్ భగవత్ ఇద్దరూ కూడా బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్)లో రసాయన శాస్త్రంలో పట్టాపొందినవారే. వారిని ఆదర్శంగా తీసుకున్న కమల.. జీవ రసాయన శాస్త్రంలో రాణించాలని నిర్ణయించుకున్నారు. పాఠశాల విద్య అనంతరం బాంబే ప్రెసిడెన్సీ కాలే జీలో బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) డిగ్రీ చదివారు. డిగ్రీలో తన సహచరుల కంటే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. సీవీ రామన్ అభ్యంతరం! మాస్టర్స్ డిగ్రీ చేయాలని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) లో సీటు కోసం కమల ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలో నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ ఐఐఎస్సీ సంస్థ డైరెక్టర్‌గా ఉన్నారు. తన ప్రవేశాన్ని ఆయన నిరాకరించడంతో కమల దిగ్భ్రాంతికి గురయ్యారు. డిగ్రీలో మంచి ] ూర్కులు సంపాదించినప్పటికీ, కేవలం మహిళ అనే కారణంగా ఆమె సీటు సంపాదించుకోలేక పోయింది! కమల తండ్రి, బంధువు సీవీ రామన్ దగ్గరకు వెళ్లి ప్రవేశం కల్పించాలని అభ్యర్థించినా కూడా ఆయన నిరాకరించారు. బాలికలకు ఐఐఎస్సీలో ప్రవేశంలేదని, మహిళలు పరిశోధనలలో పురుషులతో సమానంగా పోటీపడలేరని తేల్చి చెప్పారు. కమల పట్టు వదలక ఎలాగైనా ఐఐఎస్సీలో చేరడం కోసం దృఢ సంకల్పంతో పోరాడాలని నిశ్చయించుకున్నారు. సీవీ రామన్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహం చేశారు. దీంతో దిగివచ్చిన రామన్ కొన్ని షరతులతో ఆమెను ఐఐఎస్సీలో ప్రవేశానికి అంగీకరించారు. ఇవే ఆ షరతులు! ఒకటి.. రెగ్యులర్ అభ్యర్ధిగా కాకుండా సంవత్సరకాలం ప్రొబేషన్‌లో ఉండాలి. రెండు.. గైడ్ సూచనల మేరకు రాత్రులలో కూడా పనిచేయాలి. మూడు.. పురుషుల చదువు ధ్యాస మళ్లకుండా ల్యాబ్స్‌లో మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఈ మూడు షరతులను కావాలనే తనను నిరుత్సాహ పరిచేందుకే విధించారని గ్రహించినప్పటికీ కమల ఆ షరతులను అంగీకరించి సీటు సంపాదించారు. దీంతో ఐఐఎస్సీలో ప్రవేశం పొందిన తొలి మహిళగా (1933) గుర్తింపు పొందారు. ‘‘రామన్ గొప్ప వ్యక్తి కావచ్చుగాని ఆయనకు స్త్రీల ప్రతిభ, పట్టుదలలపై నమ్మకం లేదు. ఇది చాలా బాధాకరం’ అని ఒకానొక సందర్భంలో ఆమె వాపోయారు. ప్రొటీన్లపై పరిశోధన ఐఐఎస్సీలో చేరాక పాలు, పప్పు దినుసులు, మొక్కలలో ఉండే ప్రొటీన్లపై పరిశోధనలను ప్రారంభించారు కమల. ఆమె అంకిత భావాన్ని చూశాక గానీ, శాస్త్రీయ పరిశోధనల్లో మహిళలు రాణిస్తారన్న నమ్మకం సీవీరామన్కు కలగలేదు. 1936లో ఆమె తన పరిశోధనలను సమర్పించి ఎంఎస్సీ డిగ్రీని పూర్తి చేశారు. వెంటనే యూకేలోని సుప్రసిద్ధ కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి ఆహ్వానం లభించింది. ఆమె సత్తాను గమనించిన సీవీరామన్ మరుసటి ఏడాదే ఐఐఎస్సీలో మహిళలకు ప్రవేశాన్ని కల్పించారు! అలా ఆమె ఒక మార్పునకు నాంది అయ్యారు. పేదల కోసం పానీయం కేంబ్రిడ్జిలో కమల బంగాళదుంపలపై పరిశోధన జరిపి సైటోక్రోమ్–సీ అనే ఎంజైమ్‌ను కనుగొన్నారు. ఈ ఎంజైమ్ జీవులు, మొక్కలు, జంతువులు, మనుషులలో శక్తిని ఉత్పత్తి చేస్తుందని వివరిస్తూ రెండు వారాలలో నలభై పేజీల సిద్ధాంత పత్రాన్ని సమర్పించారు. అలా పీహెచ్డీ పట్టా పొంది భారతదేశంలోనే తొలి మహిళా శాస్త్రవేత్తగా కమలా సోహాని గుర్తింపు పొందారు. ఆ సమయంలోనే యు.ఎస్.లోని కెమికల్ కంపెనీ నుంచి ఆమెకు అవకాశాలు లభించాయి. అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీతో కలిసి జాతీయోద్యమంలో పాల్గొనాలని భావించి 1939లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాలలో బయో కెమిస్ట్రీ అధిపతిగా పని చేశారు. అనంతరం నేషనల్ రిసెర్చ్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అక్కడే విటమిన్లు, పోషణ, వాటి ప్రభావంపై పరిశోధనలు జరిపారు. ఆ సమయంలోనే ఎంవీ.సోహానీని వివాహం చేసుకొని 1947లో ముంబాయి వెళ్లారు. బాంబే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ సలహాపై ‘నీరా’ అనే పానియాన్ని పేదల పోషణావసరాల కోసం తయారు చేశారు. నీరాలోని విటమిన్ ఏ, విటమిన్ సి.. పిల్లలు, గర్భిణులకు పోషకాలుగా, గిరిజన ప్రాంత పిల్లల్లో ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సప్లిమెంటుగా వాడొచ్చని నిరూపించారు. శాస్త్ర విజ్ఞానంలో సమాజానికి ఇలా ఎంతో సేవ చేసిన కమలా సోహాని 1998లో ఓ సంస్థ ఏర్పాటు చేసిన సన్మానసభలో అకస్మాత్తుగా మరణించారు. తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో నేటితో ముగుస్తున్న ‘నేషనల్ సైన్స్ డే’ వారోత్సవాలు ఈ తొలి మహిళా శాస్త్రవేత్తకు ఘనమైన నివాళిని ఇవ్వనున్నాయి. పోగూరి చంద్రబాబు, సాక్షి, తిరుపతి ఆదర్శ మహిళ కమలా సోహాని ఆంగ్లేయుల పాలనలో మహిళలపై వివక్షకు ఎదురొడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించిన కమలా సోహాని మహిళా లోకానికే ఆదర్శనీయం. అయితే ఆమెకు తగినంత గుర్తింపు దక్కలేదనే భావించాలి. యండ్రపల్లి దుర్గయ్య, ఎడ్యుకేషనల్ ఆఫీసర్, తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం -
విజ్ఞానశాస్త్రంపై గాంధీ దార్శనికత
గాంధీజీ సైన్స్ అనే పదాల కలయిక చూడగానే చాలామంది మొహాలు ప్రశ్నార్థకమవుతాయి. ఆ విషయాలు పూర్తిగా ప్రచారంలో లేకపోవడమే అసలు కారణం. గాంధీ 150వ జయంతి సంవత్సరంలో, జాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యంలో కొన్ని కొత్త సంగతులు తప్పక తెలుసుకోవాలి. తన ఆత్మకథకు ఎక్స్పెరిమెంట్స్ అనే పదం శీర్షికలో ఉంచుకున్న ప్రయోగవాది ఆయన. గాంధీజీ పూర్తి రచనలు పరిశీలిస్తే చాలా చోట్ల తన దృష్టి, దృక్పథం, కృషి – ఈ దిశలో తారసపడతాయి. 1904లో దక్షిణాఫ్రికాను బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ సంస్థ సభ్యులు సందర్శించారు. వారితో చర్చిస్తూ గాంధీ సైన్స్‌ను ప్రాచుర్యం చేసి, బ్రిటన్ తన వలస దేశాలను కలుపుకోవాలని కోరారు. బ్రిటిష్ ఎంపైర్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్‌గా ఆ సంస్థ పేరును మార్చుకోమని సూచించారు. అంతేకాదు, భారతదేశంలో ఒక సమావేశం ఏర్పరచమని, దాని వల్ల భారతదేశం మాత్రమే కాక మొత్తం అసోసియేషన్ లబ్ధిపొందుతుందని కూడా వివరించారు. సైన్స్ ఒక సామూహిక ప్రయత్నం. తద్వారా ఆ సమాజాలే కాదు, సైన్స్ కూడా లబ్ధి పొందుతుందని వేరొక సందర్భంలో అన్నారు. వీలయినచోట్ల శాస్త్ర దృష్టిని పెంపొందించే రచనలు తన ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికలో ఇచ్చారు గాంధీ. సైన్స్ పరిమితులను గుర్తిస్తూనే, ఆ అభినివేశం వ్యాప్తి చెందాలని వాంఛించారు. వెసువియస్ అగ్నిపర్వతం బద్దలయినపుడు, విపత్కర పరిస్థితుల్లో సైతం శాస్త్రవేత్త మెటుస్సీ సమాచారాన్ని సేకరించడం అభినందనీయమని రాశారు. 1919–1920 ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమ సమయంలో యంత్రాల గురించి గాంధీ ఏమంటారని చాలామంది ప్రశ్నించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారు గాంధీని ఈ విషయంలో విమర్శించారు కూడా. తను యాంత్రీకరణకు వ్యతి రేకం కాదనీ, కానీ ఆ యంత్రాలను వాడే మనుషుల బుద్ధిని దారిలో పెట్టాలని చాలా స్పష్టంగా వివరిస్తారు (కంప్లీట్ వర్క్స్ 19వ సంపుటం) జగదీశ్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్ర రే దేశభక్తిపరులైన శాస్త్రవేత్తల దృష్టినీ, ప్రతిభను గాంధీ పలుసార్లు కొనియాడారు. శాస్త్ర పురోభివృద్ధికోసం ప్రాణులను వాడటం గురించి గాంధీ చాలా లోతుగా, స్పష్టంగా విభేదిం చారు. శరీరకోత లేకుండా రక్తప్రసరణ సిద్ధాంతం ప్రతిపాదించడం సాధ్యమైనపుడు, చీటికిమాటికి ప్రయోగాలకు ప్రాణులను బలిచేయడం అర్థరహితమని వాదించారు గాంధీ. ఈ ప్రయోగాల వల్ల ఆధునిక వైద్య శాస్త్రం మతం అసలు స్ఫూర్తిని వదిలివేయడమే కాదు, దాని శరీరం నుంచి ఆత్మను కూడా తొలగించిందని అంటారు. సైన్స్ విషయంలో ఒక్క సిద్ధాంత విభాగం మాత్రమే చేయగలిగేది ఏమీ లేదు. పని మన మనసు, మెదడుతో కలిసి సాగితేనే అది అర్థవంతం అని కూడా చెబుతారు గాంధీ. అదే సమయంలో ఆధునిక శాస్త్రవేత్తల నమ్రత, శాస్త్ర అభినివేశం వంటివి మన సంప్రదాయ వైద్య మహనీయులలో లేవని కూడా ప్రకటిస్తారు. 1921లో ఢిల్లీలోని టిబ్బా కళాశాలని ప్రారంభిస్తూ ఆయుర్వేదం, యునాని పాటించే సైన్సులో శాస్త్రీయ అభినివేశం లేదని విమర్శించారు. ఎంతమాత్రం పరిశోధన చేయకుండానే సాగే ఈ భారతీయ వైద్య విధానాలు అగౌరవస్థాయిలోకి దిగజారిపోయాయని ఖండిస్తారు. మద్రాసు ఆయుర్వేద ఫార్మసి, కలకత్తా అష్టాంగ ఆయుర్వేద విద్యాలయ సమావేశాలలో – రెండూ 1925లోనే – లైంగిక సామర్థ్యాన్ని పెంచే రీతిలో ఆయుర్వేద ఔషధాలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడాన్ని గట్టిగా ఖండించారు. కలకత్తా ప్రసంగం ఆయుర్వేద వైద్యులకు కోపం తెప్పించింది. కవిరాజ్ గణనాథ్ సేన్ అనే ఆయుర్వేద ప్రముఖుడు విభేదిస్తూ గాంధీని వివరించమని కోరారు. జవాబుగా చాలామంది ఆయుర్వేద వైద్యులు సర్వరోగాలను నయం చేస్తామని చెప్పుకునే దొంగవైద్యులనీ, వారిలో వినయంగానీ, ఆయుర్వేదం పట్ల గౌరవం గానీ, ఎటువంటి క్రమశిక్షణ గానీ లేవని గాంధీ ఢంకా బజాయించినట్టు ప్రకటించారు. ఆయుర్వేద వైద్యం చౌక కానీ, సరళం గానీ, ఫలవంతం గానీ కాదని విమర్శిస్తూ, ఆయుర్వేద విధానాలు సంక్లిష్టమని ఖండిస్తారు. మలేరియాకు క్వినైన్, నొప్పులకు ఐయోడిన్ వంటి ఔషధాలు ఆయుర్వేదంలో చూపమని కోరుతారు గాంధీ. సేవాగ్రామ్‌లో కలరా సోకినప్పుడు, దీనికి సంబంధించి ఆయుర్వేదం, హోమియోపతిలో పరిశోధనలు సాగాలని కోరారు. ‘హరిజన్’ పత్రికలో ఒకసారి గాంధీ ఇలా రాశారు: Everything could be turned into a science or romance if there was a scientific or a romantic spirit behind it. వ్యాసకర్త : డా. నాగసూరి వేణుగోపాల్, డైరెక్టర్, ప్రసారభారతి, రీజినల్ అకాడమి, ఆకాశవాణి, హైదరాబాద్ మొబైల్ : 94407 32392 -
మాస్టర్ సైంటిస్ట్
అవసరాలే ఆవిష్కరణలకు మూలం అనేది అనాది సత్యం. ఆవిష్కరణలు చేయాలంటే ఏళ్ల తరబడి పరిశోధనల్లో తలలు పండిన శాస్త్రవేత్తలే ప్రతిసారీ దిగిరానక్కర్లేదు. ఒక్కోసారి చిన్న వయసులోనే కొందరు చిచ్చర పిడుగులు వినూత్న ఆవిష్కరణలతో, అద్భుత విజయాలతో అబ్బురపరుస్తుంటారు. చాలా చిన్న వయసులోనే శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలలో ప్రతిభ చూపిన కొందరు తర్వాతి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మక విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. అలా చిన్న వయసులోనే ప్రతిభ చూపిన వారు కొద్దిమంది మాత్రమే. ఏళ్ల తరబడి అకుంఠిత దీక్షతో పరిశోధనలు సాగించి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించిన వారే ఎక్కువ మంది. చిన్న వయసులోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో ఇటీవలి కాలంలో ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకున్న వారిలో కొందరు మన దేశంలోనూ ఉన్నారు. వారిలో కొందరి విజయగాథలు ఫిబ్రవరి 28 ‘నేషనల్ సైన్స్ డే’ సందర్భంగా.. చిన్నారి శస్త్రవైద్యుడు ఏడేళ్ల వయసులోనే ఆ పసివాడు విజయవంతంగా తొలి శస్త్రచికిత్స చేశాడు. తన కంటే ఏడాది పెద్ద అయిన బాలిక అగ్ని ప్రమాదానికి గురైంది. చర్మం బాగా కాలిపోవడంతో చేతి వేళ్లు ఒకదానికొకటి అతుక్కుపోయాయి. ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు. శస్త్రచికిత్స చేయించే స్తోమత లేనివారు. తోటి బాలిక పరిస్థితిని గమనించిన ఆ బాలుడు చలించిపోయి, శస్త్రచికిత్స చేయడానికి ముందుకొచ్చాడు. దాదాపు గంటసేపు శ్రమించి, చాకచక్యంగా శస్త్రచికిత్స చేసి, అతుక్కుపోయిన వేళ్లను వేరు చేశాడు. ఆ బాలుడి పేరు ఆకృత్ జస్వాల్. ఆకృత్ శస్త్రచికిత్స చేస్తుండగా, అతడి తల్లిదండ్రులు ఆ దృశ్యాలను వీడియో తీశారు. తర్వాత ఆన్లైన్లో పెట్టారు. ఆకృత్ పేరు ప్రపంచమంతా మార్మోగింది. ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన శస్త్రవైద్యుడిగా ఆకృత్ పేరు రికార్డులకెక్కింది. తొలి శస్త్రచికిత్స చేసిన నాలుగేళ్లకు ఆకృత్ తన పదకొండేళ్ల వయసులోనే పంజాబ్ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. అక్కడ చదువుకుంటున్న కాలంలోనే ప్రత్యేక ప్రసంగం కోసం లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ నుంచి ఆహ్వానం పొందాడు. శరీర నిర్మాణ శాస్త్రంపైన, శస్త్రచికిత్సలపైన ఆకృత్ ఆసక్తిని గమనించిన చండీగఢ్ స్థానిక వైద్యులు తాము శస్త్రచికిత్సలు చేసే సమయంలో దగ్గర ఉంటూ పరిశీలించేందుకు అతడిని అనుమతించేవారు. వారు చేసే శస్త్రచికిత్సలను చూస్తూ ఆకృత్ తన బాల్యంలోనే శస్త్రచికిత్సల్లోని మెలకువలను వంటబట్టించుకున్నాడు. వైద్య పరిశోధనల్లోని అధునాతన పరిణామాలపై అతడు చేసిన ప్రసంగానికి లండన్ మేధావులు మంత్రముగ్ధులయ్యారు. ఓప్రా విన్ఫ్రే షోలో కూడా మాట్లాడాడు. ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్యాన్సర్‌ను నయం చేసే మార్గం కనుగొనడమే తన లక్ష్యమని చెప్పాడు. జన్యులోపాలను సరిదిద్దేందుకు నోటి ద్వారా తీసుకునే మందులను తయారు చేయడం సాధ్యమవుతుందని, దీనికి తన వద్ద ఒక సిద్ధాంతం ఉందని, ఏదో ఒకనాటికి తాను దీనిని సాధిస్తానని ఆత్మవిశ్వాసం ప్రకటించాడు. ఇదే గనుక నిజమైతే వైద్యరంగంలో ఆకృత్ ఒక ఘనమైన మైలురాయిని చేరుకున్నట్లే అవుతుంది. ఆకృత్ ప్రస్తుతం ఐఐటీ కాన్పూర్‌లో బయో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. తేనెటీగలను కాపాడే రోబో ప్రకృతిని, పర్యావరణాన్ని బాగా అర్థం చేసుకున్నవారికి తేనెటీగల ప్రాధాన్యం తెలిసినంతగా మామూలు జనాలకు తెలియదు. అందుకే ఇళ్లల్లో ఎక్కడ తేనెపట్టు కనిపించినా, అర్జంటుగా పురుగుమందులు చల్లి వాటిని అక్కడికక్కడే నాశనం చేసేస్తారు. తేనెపట్టులు కనిపించినప్పుడల్లా పురుగు మందులు చల్లి వాటిని నాశనం చేస్తూ పోతే భవిష్యత్తులో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లగలదని, వాటిని కాపాడటానికి ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా ఆలోచించింది కావ్యా విఘ్నేశ్. న్యూఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇప్పుడామె ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. తేనెటీగలను కాపాడటానికి గత ఏడాది ఆమె రూపొందించిన రోబో అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంది. డెన్మార్క్‌లో జరిగిన బాలల రోబోటిక్స్ పోటీలో బహుమతిని సాధించింది. ఆ పోటీలో అరవై దేశాల నుంచి దాదాపు రెండు లక్షల మంది బాల శాస్త్రవేత్తలు పాల్గొనడం విశేషం. కావ్యా విఘ్నేశ్ పూర్తిగా పర్యావరణ అనుకూలంగా, మట్టిలో కలిసిపోయే పదార్థాలతో ఈ రోబోను రూపొందించింది. ఈ రోబో నిజానికి ఒక ద్రోన్. ఇందులో త్రీడీ కెమెరా, సాఫ్ట్వేర్, భుజాల్లా పనిచేసే నాలుగు రెక్కలు ఉంటాయి. ఇళ్లలో ఉండే తేనెపట్టులను త్రీడీ కెమెరా ఫొటో తీస్తుంది. ఇందులోని సాఫ్ట్వేర్ తేనెపట్టు కొలతలను కచ్చితంగా అంచనా వేస్తుంది. ఆ అంచనా ప్రకారం ద్రోన్లోని రెండు భుజాలు తేనెపట్టును పూర్తిగా కప్పివేసేలా జాగ్రత్తగా చేజిక్కించుకుంటాయి. మూడో భుజానికి ఉన్న బ్లేడ్ తేనెపట్టును అది అంటిపెట్టుకుని ఉన్న గోడ నుంచి సురక్షితంగా వేరు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో తేనెపట్టుకు గాని, అందులోని తేనెటీగలకు గాని ఎలాంటి హాని జరగదు. గోడ నుంచి వేరు చేసిన తేనెపట్టును తేనె సేకరణ కేంద్రాలకు చెందిన వాహనంలోకి చేరుస్తుంది. మనం తినే ఆహారంలో దాదాపు 85 శాతం ఆహార పదార్థాలను అందించే వృక్షజాతులన్నీ తేనెటీగల సహకారంతో జరిగే పరపరాగ సంపర్కం వల్లనే మనుగడ సాగించగలుగుతున్నాయని, తేనెటీగలను చంపేస్తూ పోతే పాడిపంటల మనుగడకు ముప్పు వాటిల్లి కరువు కాటకాలు ఏర్పడగలవని, చివరకు మానవాళి మనుగడకే ప్రమాదం కలుగుతుందని కావ్యా విఘ్నేశ్ చెబుతుంది. మానవాళి మనుగడకు ముప్పు నివారించడానికే తనవంతుగా ఈ రోబోకు రూపకల్పన చేశానని ఆమె వివరిస్తుంది. తక్కువ ఇంధనం.. ఎక్కువ మైలేజీ ఇప్పటి ప్రపంచాన్ని చూస్తే ఇం‘ధన’మేరా అన్నిటికీ మూలం అనుకోక తప్పదు. ఆర్థిక వ్యవస్థను చాలా వరకు శాసించేది ఇంధనమే. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ విమెన్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఇరవైమంది యువతులు ఇంధన సమస్యకు తమదైన శైలిలో ఒక పరిష్కారాన్ని ఆవిష్కరించగలిగారు. ప్రపంచంలోనే అత్యధిక మైలేజీ ఇవ్వగల కారును రూపొందించారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎలాంటి కార్లయినా వాటి గరిష్ఠ మైలేజీ ఇరవై, పాతిక కిలోమీటర్లకు మించదు. అలాంటిది వీరు రూపొందించిన కారు ఏకంగా మూడువందల కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అంటే లీటరు పెట్రోలు పోస్తే, ఏకంగా మూడువందల కిలోమీటర్లు ప్రయాణించగలదు. సింగపూర్‌లో రెండేళ్ల కిందట జరిగిన షెల్ ఎకో మారథాన్, ఆసియా ప్రదర్శనలో ‘టీమ్ పాంథేరా’ పేరుతో బృందంగా వెళ్లిన ఈ యువతులు తాము రూపొందించిన కారును ప్రదర్శించారు. ఈ వాహనానికి వారు గ్రీకుదేవత పేరిట ‘ఐరిస్ 2.0’గా నామకరణం చేశారు. ఇది గంటకు 55 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో ప్రయాణించగలదు. దీనికంటే ముందు ఈ బృందం ప్రయోగాత్మకంగా తయారు చేసిన కారు లీటరు పెట్రోలుతో 177 కిలోమీటర్లు ప్రయాణించగలిగేది. మరింత మెరుగైన మైలేజీ గల వాహనాన్ని రూపొందించాలనే సంకల్పంతో వారు ‘ఐరిస్ 2.0’ కారును రూపొందించారు. దీని తయారీకి వారు ఉక్కు, అల్యూమినియం, కార్బన్ ఫైబర్ ఉపయోగించారు. ‘ఐరిస్ 2.0’ తయారీలో కీలక పాత్ర పోషించిన వారిలో మృణాలీ పాండే, మోనా, కీర్తి, శివానీ రావల్, ఆంచల్ సక్సేనా, అదితి ఝా, శ్రుతి శ్రీవాస్తవ, కౌమోది శిరోహి, వంశిక పుందిర్, ప్రకృతి సైనీ, ఓజస్వినీ సరాఫ్, ఆరుషి సింగ్, కోమల్ మోర్, ఆరుషి సింగ్, కశికా త్రిపాఠి తదితరులు ఉన్నారు. ఈ బృందంలోని వివిధ విభాగాలకు మనుప్రియ వత్స్, పన్యా రావత్, దివ్యా ధన్‌ఖార్, శ్రేయా బగౌలీ నాయకత్వం వహించారు. అంధులకు దారిచూపే కళ్లద్దాలు అంధుల అవస్థలను చూసినప్పుడల్లా వారికి దారి చూపేందుకు ఏదైనా చేయాలనుకున్నాడు ఆ బాలుడు. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే ఆ దిశగా రకరకాల ప్రయోగాలు సాగించేవాడు. పదకొండో తరగతిలో ఉన్నప్పుడు అంధులకు దారి చూపే కళ్లద్దాలను రూపొందించాడతడు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆ బాలుడి పేరు అనంగ్ టాడర్. అంధులకు ఉపయోగపడేలా అతడు రూపొందించిన కళ్లద్దాలకు గబ్బిలాలే స్ఫూర్తి. కారుచీకటిలో పరిసరాలను గబ్బిలాలు ఎలా గుర్తిస్తాయో, దాదాపు అదే తీరులో పనిచేసే ‘ఎకో లొకేషన్ టెక్నాలజీ’ పరిజ్ఞానంతో అనంగ్ ఈ కళ్లద్దాలను రూపొందించాడు. వీటిని ధరిస్తే, పరిసరాల్లోని రెండు మీటర్ల దూరంలో ఉన్న అవరోధాలను గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. ఈ కళ్లద్దాల్లో ఉన్న సౌలభ్యం వల్ల వీటిని ధరించే అంధులు ఎక్కడికైనా నిరాటంకంగా నడిచి వెళ్లేందుకు వీలవుతుంది. ఈ కళ్లద్దాలు రూపొందించినందుకు అనంగ్కు ‘దీనానాథ్ పాండే స్మార్ట్ ఐడియా ఇన్నోవేషన్’ అవార్డు లభించింది. అంతేకాదు, అనంగ్ రూపొందించిన ఈ కళ్లద్దాలను నమూనాకు మరింత మెరుగులు దిద్ది, మార్కెట్లోకి విడుదల చేసేలా రూపొందించడానికి యూనిసెఫ్ సంసిద్ధత ప్రకటించడం విశేషం. ‘నాసా’కెక్కిన ఘనత అంతరిక్ష పరిశోధనల్లో అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ. అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలంతా కొమ్ములు తిరిగిన మేధావులు. తమిళనాడుకు చెందిన పద్దెనిమిదేళ్ల రిఫత్ షారుక్ సాధించిన ఘనతకు ‘నాసా’ శాస్త్రవేత్తలే ప్రశంసలు కురిపించారు. ఇంతకీ రిఫత్ ఏం సాధించాడంటారా? ప్రపంచంలోనే అత్యంత చిన్న ఉపగ్రహానికి రూపకల్పన చేశాడు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాం గౌరవార్థం దీనికి ‘కలామ్‌శాట్’ అని నామకరణం చేశాడు. ఎంత చిన్న ఉపగ్రహమైనా కనీసం ఒక గ్లోబ్ సైజులోనైనా ఉండదా అనుకుంటారా? అంత కూడా ఉండదు. కేవలం మునివేళ్ల మధ్య ఈజీగా ఇమిడిపోతుంది. దీని బరువు కేవలం 64 గ్రాములు, ఘన పరిమాణం 3.8 ఘనపు సెంటీమీటర్లు మాత్రమే. ‘నాసా’ రిఫత్ ఘనతను గుర్తించింది. అందుకే వాలప్స్ ఐలాండ్‌లోని ‘నాసా’ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి అతడు రూపొందించిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ముందుకొచ్చింది. ఒక భారతీయ విద్యార్థి రూపొందించిన ఉపగ్రహాన్ని ‘నాసా’ ప్రయోగించడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘స్పేస్ కిడ్స్ ఇండియా’ సౌజన్యంతో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా రిఫత్ దీనికి రూపకల్పన చేశాడు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రీఇన్ఫోర్స్డ్ కార్బన్ ఫైబర్ పాలిమర్‌ను ఉపయోగించి, అరచేతిలో ఇమిడిపోయే ఈ ఉపగ్రహాన్ని తయారు చేశాడు. రిఫత్ రూపొందించిన ‘కలామ్‌శాట్’ ఉపగ్రహం ప్రపంచంలోనే అత్యంత తేలికైన, అత్యంత చిన్నదైన ఉపగ్రహంగా రికార్డులకెక్కింది. నానో టెక్నాలజీతో రూపొందించిన ‘కలామ్‌శాట్’ అంతరిక్షంలోని రేడియేషన్ పరిమాణాన్ని కొలవగలుగుతుంది. గుండెపోటు గుర్తించే స్కిన్‌ప్యాచ్ ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు దారితీసే కారణాల్లో గుండెపోటుదే మొదటి స్థానం. గుండెపోటు లక్షణాలు బయటకు కనిపిస్తే, తగిన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కొంత వీలు ఉంటుంది. కొన్నిసార్లు బయటకు ఎలాంటి లక్షణాలు లేకుండానే, అకస్మాత్తుగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించి, నివారించే మార్గమేదీ ఇంతవరకు అందుబాటులో లేకపోవడం ఆ పన్నెండో తరగతి కుర్రాడిని కుదురుగా ఉండనివ్వలేదు. గుండెపోటును ముందుగానే గుర్తించే అవకాశం ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్ని మరణాలనో నివారించవచ్చు కదా అని ఆలోచించాడు. తమిళనాడుకు చెందిన ఆకాశ్ మనోజ్ ఇదే దిశగా ప్రయోగాలు సాగించి, ముందస్తు సూచనలు లేకుండా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించగల స్కిన్ప్యాచ్కు రూపకల్పన చేశాడు. దీనిని అమర్చుకోవడంలో ఎలాంటి నొప్పి, ఇబ్బంది ఉండదు. ఈ ప్యాచ్‌ను మణికట్టుకు లేదా చెవితమ్మ వెనుక వైపు అతికించుకుంటే చాలు. గుండెపోటుకు కారణమయ్యే ‘ఎఫ్‌ఏబీపీ3’ ప్రొటీన్ మోతాదుకు మించి ఉన్నట్లయితే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అలాంటప్పుడు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లి వైద్య సహాయం పొందినట్లయితే ప్రాణాలు దక్కించుకోవడానికి వీలు ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగా తన తాత కుటుంబ సభ్యుల కళ్లెదుటే పోయారని, అందుకే గుండెపోటు కారణంగా సంభవించే ఆకస్మిక మరణాలను వీలైనంత మేరకు నివారించడానికి ఏదైనా చేయాలనుకున్నానని చెబుతాడు ఆకాశ్ మనోజ్. తాను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచే కార్డియాలజీ అధ్యయనం ప్రారంభించానని, ఇందుకోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) లైబ్రరీలో గంటల కొద్దీ గడిపేవాడినని చెబుతాడు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చదువుకుని, అక్కడ పరిశోధనలు సాగించాలనేదే తన ఆశయమని చెబుతాడు ఆకాశ్. అతడు రూపొందించిన ఈ స్కిన్ ప్యాచ్‌పై వైద్య నిపుణులు క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షల్లో ఆమోదం పొందితే ఇది త్వరలోనే అందుబాటులోకి రాగలదు. దీని ధర దాదాపు రూ.900 వరకు మాత్రమే ఉంటుంది. అంటే, సుగర్ టెస్ట్ కోసం ఉపయోగించే గ్లూకోమీటర్ కంటే చాలా చౌక. – పన్యాల జగన్నాథదాసు -
సైన్స్ ప్రేమికులు, శాస్త్రవేత్తలకు మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రం మోదీ బుధవారం సైన్స్ ప్రేమికులకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ప్రేమికులందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా. వారందరూ తమ శాస్త్రీయ ఉత్సుకతను పెంపొందించుకునేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను. భారత్ తన శాస్త్రవేత్తల పట్ల చాలా గర్విస్తోంది’అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. -
మంత్రాల్లోనే న్యూటన్ నియమాలు!
న్యూఢిల్లీ: డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం తప్పని వాదించిన కేంద్ర మానవవనరులశాఖ సహాయమంత్రి సత్యపాల్ సింగ్.. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన గమన నియమాలు(లాస్ ఆఫ్ మోషన్) మన మంత్రాల్లో ఎప్పటినుంచో ఉన్నాయని సత్యపాల్ సింగ్ తెలిపారు. గత జనవరిలో హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన 65వ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ) భేటీలో సత్యపాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కాబట్టి సంప్రదాయ జ్ఞానాన్ని కచ్చితంగా మన పాఠ్యాంశాల్లో చేర్చాలని సత్యపాల్ సూచించారు. అంతేకాకుండా పాఠశాల భవనాలు పూర్తి వాస్తుతో ఉండాలనీ.. అప్పుడే విద్యార్థులకు చదువు అబ్బుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా న్యూటన్ మంత్రాల విషయమై మీడియా ఆయన్ను బుధవారం ప్రశ్నించగా.. సత్యపాల్ జవాబు దాటవేశారు. అంతేకాకుండా డార్విన్ విషయంలో తాను చెప్పింది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేననీ, దానికి ప్రభుత్వం, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చారు. -
శాస్త్రీయ దృక్పథంతోనే స్వావలంబన
సందర్భం ఆధునిక సమాజాలను శాస్త్ర, సాం కేతిక రంగాలు లేకుండా ఊహించ లేం. మరో మాటలో చెప్పాలంటే ఆధునిక మానవ అభివృద్ధికి దినది నాభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ పరిజ్ఞానమే మూలం. అందుకే ఎంతో ముందు చూపుతో డాక్టర్ అంబేడ్కర్ ప్రజలలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, దృక్పథాన్ని పెంపొం దించాల్సిన బాధ్యత ప్రభుత్వా లదని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఎ (హెచ్) ద్వారా స్పష్టం చేశారు. నేడు జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం. ఈ రోజు దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు విశ్వ విద్యాలయాలలోని విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, శాస్త్ర, విద్యా రంగ, వైద్య, సాంకేతిక, పరిశోధనా సంస్థలతోపాటు అన్ని విద్యా సంస్థలూ నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాయి. రామన్ ఎఫెక్ట్ (కాంతి వక్రీభవనం) ఆవిష్కరణ ద్వారా భారతీయ శాస్త్ర పరిశో ధనా రంగ చరిత్రను కొత్త పుంతలు తొక్కించిన డాక్టర్ సీవీ రామన్ గౌరవార్థం ప్రతి ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రజల దైనందిన వ్యవహారాల్లో శాస్త్రీయ ఆవిష్కరణల అన్వ యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తింప జేయడం మానవ సంక్షేమం కోసం శాస్త్ర రంగంలో జరుగుతున్న అన్ని ప్రయత్నాలను, సాధిం చిన విజయాలను ప్రచారం చేయడం, దేశ ప్రజల్లో శాస్త్రీయ భావా లను పెంపొందింపజేయడం, శాస్త్ర, సాంకేతిక రంగాలను జనరం జీకరించి మూఢనమ్మకాలను పోగొట్టడం ‘నేషనల్ సైన్స్ డే’ లక్ష్యాలు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశంలో ప్రస్తుతం అనేక పెడ ధోరణులు, అశాస్త్రీయ పోకడలు చోటుచేసుకున్నాయి. వాస్తు, ముహూర్తం, యాగాల పేరు మీద ప్రజల బలహీనతలను వాడు కుంటున్నారు. శోచనీయమైన విషయం ఏమిటంటే రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటామని ప్రమాణం చేసిన వారే దానికి తూట్లు పొడుస్తున్నారు. విద్య, వైద్యం అన్ని రంగాల్లో అశాస్త్రీయ భావాలను ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేసిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పరిహసిస్తున్నారు. ఛాందస వాదానికి బలం చేకూరుస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా అనేక పెడధోరణులు, అశాస్త్రీయ పోకడలు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా పాలకవర్గాలు అనుసరిస్తున్నాయి. రచయితలు, కళాకారులు, విద్యార్థులు, ప్రజాస్వామిక శక్తుల మీద దాడులు తీవ్రమయ్యాయి. ప్రశ్నించే తత్వాన్నే కాదు, మాట్లాడే స్వాతం త్య్రాన్ని కూడా హరించే స్థితి ఈ రోజు ఏర్పడింది. ప్రజాస్వామ్య విలువలు అడుగంటుతున్నాయి. సమాజంలో అసహనం రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రజలు అభద్రతకు గురవుతున్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, దేశ స్వావలంబన కోసం సైన్స్ అనే నినాదాలతో సామాన్య ప్రజలకు చేరినప్పుడే సైన్సుకు సార్థకత ఉంటుంది. ఈ లక్ష్యంతోనే జాతీయ సైన్స్ దినోత్సవమైన 28 ఫిబ్రవరి 1988 రోజున విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జన విజ్ఞాన వేదిక (జేవీవీ)ను ఏర్పాటైంది. వివిధ రకాల కళా జాతలు నిర్వహించి ప్రజలలో సైన్సు గురించి, శాస్త్రీయ పరిజ్ఞానం గురించి విస్తృత ప్రచారం చేశారు. ఒక రకంగా చెప్పా లంటే కళా జాత పక్రియను పరిచయం చేసింది జేవీవీయే. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, తొంబైలలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో జేవీవీ కార్య కర్తలు, ఉపాధ్యాయులు వేలాదిగా పాల్గొనడం, ఆ అక్షరాస్యత ఉద్యమం నుంచి వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమం తదనంతరం సంపూర్ణ మద్యనిషేధాన్ని రాష్ట్రంలో విధించడాన్ని చరిత్రలో గుర్తుంచుకునే కొన్ని అంశాలు. విద్యా ఆరోగ్య రంగాల్లో తమదైన శైలిలో పనిచేసిన సంస్థ జేవీవీ. విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మూఢనమ్మకాలు వంటి అంశాలపై పలు కార్యక్రమాలద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత 2014 జూన్ 1న జేవీవీ తన పేరు మార్చుకుని ఉభయ రాష్ట్రాలలో ‘ప్రజా సైన్సు వేదిక’గా పనిచేయడం మొదలు పెట్టింది. ఉభయ రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఏ రాజకీయ పార్టీలకు అను బంధం లేకుండా మెరుగైన శాస్త్రీయ సమాజం కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ ప్రజా సైన్స్ ఉద్యమ వేదిక. వర్తమాన సమాజంలో సంక్షోభానికి కారణమవుతున్న అంశా లను సమీక్షించుకుని భవిష్యత్తు ప్రణాళికలను, కార్యక్రమాలను నిర్ణయించడం కోసం ప్రజాసైన్సు వేదిక ఉభయ రాష్ట్రాల ప్రథమ మహాసభలు ఈ నెల 28 (ఆదివారం)న హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా ‘వర్తమాన సమాజం: అవాంఛిత, అశాస్త్రీయ పోకడలు’ అనే అంశం మీద ఉదయం పది గంటలకు సదస్సు ఉంటుంది. ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సీసీఎంబీ వ్యవస్థాపక అధ్యక్షులు డా. పీఎం భార్గవ, జస్టిస్ చంద్రకుమార్, గోరేటి వెంకన్న, ఆచార్య జయధీర్ తిరుమలరావు, డా. చందనా చక్రవర్తి, డా. కె.బాబూ రావు, డా. ఎం. చెన్న బసవయ్య తదితరులు పాల్గొంటారు. ఈ మహాసభల్లో ఉభయ రాష్ట్రాల నుంచి సంస్థ ప్రతినిధులు పాల్గొంటారు. ప్రధానంగా అశాస్త్రీయ పోకడలపై చర్చ సాగే ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. (నేడు నేషనల్ సైన్స్ డే ... హైదరాబాద్‌లో ప్రజా సైన్సు వేదిక ప్రథమ మహా సభ) (వ్యాసకర్త : ప్రొ.వి.కృష్ణ అధ్యక్షులు, ప్రజా సైన్సు వేదిక మొబైల్: 9849603071)