
సాక్షి, గచ్చిబౌలి: కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ సైన్స్‌డే సందర్భంగా తాను కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా పనిచేసినట్టు చెప్పుకొచ్చారు. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలని కోరారు. మరోవైపు.. దేశ రక్షణ బాధ్యత యువతీయువకులపైన ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జాతీయ సైన్స్‌డే సందర్భంగా డీఆర్‌డీవో విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శన జరుగుతోంది. ఈ ప్రదర్శనకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సర్ సీవీరామన్.. ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. నోబెల్ గ్రహీత రామన్ గౌరవార్థం ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. నేను కూడా సైన్స్ విద్యార్థినే.. కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశాను. ఇంతటి విద్యార్థి సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉంది. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిపై విద్యార్థులు అధ్యయనం చేయాలి. రక్షణ రంగంలో కూడా అనేక మార్పులు. మన జీవితంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణ బాధ్యత యువతీయువకులపైన ఉంది. దేశ రక్షణలో హైదరాబాద్ దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోంది. బీడీఎల్, హెచ్‌ఏఎల్, మిధాని వంటి కీలక సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. ఈ సైన్స్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు దేశ రక్షణ పట్ల అవగాహన కలుగుతుంది. ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు చూపుతోంది. సంప్రదాయ ఇంజినీరింగ్ విద్యపై కూడా విద్యార్థులకు అవగాహన పెంచాలి అంటూ కామెంట్స్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment