హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్‌ వీడియోలపై సీఎం రేవంత్‌ సీరియస్‌ | Cm Revanth Reddy Is Serious About Ai Fake Videos | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్‌ వీడియోలపై సీఎం రేవంత్‌ సీరియస్‌

Published Sat, Apr 5 2025 7:37 PM | Last Updated on Sat, Apr 5 2025 8:11 PM

Cm Revanth Reddy Is Serious About Ai Fake Videos

కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రేవంత్‌ సర్కార్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

కంచ గచ్చిబౌలి లోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్ లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్‌లను నిర్మించారని.. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకు వచ్చారు.

అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని సమావేశంలో చర్చ జరిగింది. అర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు  సీఎంకి వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు. వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నారు.

ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వాళ్లందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి  సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. ఈ భూములపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. కంచె గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఇదే తీరుగా ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే ప్రమాదముంటుందని చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన మహమ్మారిలాంటివని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.

సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్  కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సీఎం సూచించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement