
హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న దృశ్యం
ఈ నెల 16 వరకు అమలు
మరోపక్క క్యాంపస్‌లో విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ
వర్సిటీ హాస్టళ్ల వద్ద కుక్కల దాడిలో దుప్పి మృతి
గోపన్‌పల్లిలో పరుగులు తీసిన మరో జింక
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి/రాయదుర్గం: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. సుప్రీంకోర్టు, కేంద్ర సాధికార కమిటీ ఆదేశాల మేరకు ప్రశాంతతకు భంగం కలగకుండా, అల్లర్లు జరగకుండా నిరోధించేందుకు మాదాపూర్ డీసీపీ వినీత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తుల ప్రవేశానికి అనుమతులు లేవని తెలిపారు.
నిషేధాజ్ఞలు శుక్రవారం నుంచి ఈనెల 16 వరకూ అమలులో ఉంటాయని తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, సెంట్రల్ వర్సిటీతో పాటు కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. గురువారం నాటి సుప్రీంకోర్టు స్టేతో ధర్నాలు, ఆందోళనలు ఆగిపోయాయి.
సదరు 400 ఎకరాల్లో పనులను నిలిపివేశారు. క్యాంపస్‌తో పాటు వివాదాస్పద భూముల్లో పోలీసు లు బందోబస్తు నిర్వహిస్తున్నారు. క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద వాహనాలను తనిఖీలు చేసి, ఐడీ కార్డులున్న సిబ్బంది, విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.
విద్యార్థుల భారీ ర్యాలీ
శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హెచ్‌సీయూలో వివిధ విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. ‘ప్రతిఘటన, విజయోత్సవ ర్యాలీ’పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీచర్స్ అసోసియేసన్, వర్కర్స్ అసోసియేషన్ సహా పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థులు, ఫ్యాకలీ్ట, నాన్‌టీచింగ్, వర్కర్స్ ఐక్యత వర్ధిల్లాలి, హెచ్‌సీయూ భూములను కాపాడుతాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
అరెస్టయిన, కస్టడీలో ఉన్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు, సివిల్ సొసైటీ గ్రూప్‌లు, ఇతరులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, క్యాంపస్ నుంచి పోలీస్ క్యాంప్‌లను ఎత్తివేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
కుక్కల దాడిలో గాయపడి.. దుప్పి మృతి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన దుప్పి (మచ్చల జింక).. మృగవనికి తరలిస్తుండగా మృతిచెందింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల హెచ్‌సీయూ క్యాంపస్‌లో చెట్లు, పొదలను తొలగించడంతో స్థావరాలను కోల్పోయిన వన్యప్రాణులు క్యాంపస్‌లోని హాస్టళ్ల వైపు వస్తున్నాయి.
శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఒక దుప్పి రాగా కుక్కలు వెంటపడి గాయపరిచాయి. విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది కుక్కలను తరిమివేసి గాయపడిన దుప్పికి ప్రాథమిక చికిత్స అందించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వారు దానిని మృగవనికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో మృగవనిలో పోస్టుమార్టమ్ నిర్వహించి అక్కడే ఖననం చేశారు.

గోపన్‌పల్లిలో ఇళ్ల మధ్య జింక పరుగులు..
శుక్రవారం హెచ్‌సీయూ అటవీ ప్రాంతం సమీపంలోని గోప న్‌పల్లి ఎన్‌టీఆర్‌నగర్‌లో ఓ జింక రోడ్లపై పరుగులు తీసింది. అటూఇటూ తిరుగుతూ ఓ ఇంట్లోకి వెళ్లగా, స్థానికులు గమ నించి తలుపులు మూసివేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు. అటవీ శాఖ అధికారులు అక్కడకు వచ్చి జింకను పట్టుకుని జూపార్కుకు తరలించారు.
అవన్నీ ఏఐ చిత్రాలే
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ పరిధిలో చెట్ల తొలగింపుతో వన్యప్రాణులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న రీతిలో.. సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారమంతా కల్పితమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కొన్ని జేసీబీలతో చెట్లను నరికివేయడం వల్ల అక్కడున్న నెమళ్లు, జింకలు పరుగెత్తుకుంటూ పారిపోతున్న రీతిలో రూపొందించిన చిత్రం పూర్తిగా ఏఐ(ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారితమని తేల్చిచెప్పింది.
బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో క్రిషాంక్ ఎక్స్ ఖాతాలో జింక కాళ్లు కట్టేసి చంపినట్లు చూపిన చిత్రం కూడా తప్పుడు చిత్రమని తేల్చింది. ఈ చిత్రం ఓ సోషల్ మీడియా జర్నలిస్టు పొరపాటున పోస్టు చేశారని, ఆ తర్వాత సదరు రిపోర్టర్ తన తప్పిదాన్ని ఒప్పుకుని తొలగించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారని వివరించింది.