Restrict
-
పాక్‌లో 24 గంటల పాటు‘ఎక్స్’ బంద్.. ‘నెట్ బ్లాక్స్’ వెల్లడి!
ఇటీవలే పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంతో ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపించాయి. పలు పార్టీలు ఇవి రిగ్గింగ్ ఫలితాలని ఆరోపణలు చేశాయి. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ‘ఎక్స్’ ను పాకిస్తాన్లో 24 గంటల పాటు నిలిపి వేశారనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. పాకిస్తాన్లో స్థానిక అధికారులు ఎన్నికల్లో అవకతవకలు బయటపడకుండా ఉండేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ను 24 గంటలు నిలిపివేశారని ఇంటర్నెట్ మానిటర్ నెట్‌బ్లాక్స్ ఆరోపించింది. తొలిసారిగా ‘ఎక్స్’పై ఇంత కాలం నిషేధం కొనసాగినట్లు నెట్బ్లాక్స్పేర్కొంది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పాకిస్తాన్‌లోని రావల్పిండి మాజీ కమిషనర్ లియాఖత్ అలీ చత్తా ఆరోపించారు. ఈ నేపధ్యంలో వారు ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు ‘నెట్బ్లాక్’ దేశవ్యాప్తంగా ‘ఎక్స్’కు ఎదురైన అంతరాయాలను నివేదించింది. పలువురు వీపీఎన్ల సాయంతో తప్ప ‘ఎక్స్’ని యాక్సెస్ చేయలేకపోయారని డిజిటల్ హక్కుల పోరాట న్యాయవాద వేదిక ‘బోలో భీ’ డైరెక్టర్ ఉసామా ఖిల్జీ తెలిపారు. పలువురు వినియోగదారులు ‘ఎక్స్’ను వినియోగించలేకపోతున్నామంటూ ఫిర్యాదులు చేశారని తెలిపారు. అయితే దీనిపై టెలికాం అథారిటీ లేదా ఐటి మంత్రి నుండి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదని ఉసామా ఖిల్జీ పేర్కొన్నారు. ⚠ Update: Metrics show that X/Twitter has now been restricted in #Pakistan for 24 hours, the latest and longest in a series of nation-scale internet censorship measures imposed by authorities as reports of election fraud emerge 📉 https://t.co/XAsM39sBb5 pic.twitter.com/ZKIhINj3Pc — NetBlocks (@netblocks) February 18, 2024 -
ల్యాప్‌టాప్ ధరలు పెరగనున్నాయా? కేంద్రం ఏం చెప్పిందంటే
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
సేవ్ వాటర్
చేతులు కడగడానికి ట్యాప్ తిప్పుతాం. చేతిలో పట్టేటంతటి ధారతో సంతృప్తి చెందం. పూర్తిగా ఓపెన్ చేస్తాం. ఒక్కసారిగా నీరు ధారాపాతంగా వచ్చి దోసిట్లోకి పడిపోవాలన్నంత ఆత్రం. చేతులు కడుక్కోవడం పూర్తయ్యే సరికి కనీసంగా ఇరవై సెకన్ల సేపు ట్యాప్ రన్నింగ్‌లో ఉంటుంది. అంత సమయంలో సింక్‌లోకి జారిపోయే నీరెంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాలుగు లీటర్లకు తక్కువ ఉండదు. ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది నిజం. ‘ట్యాప్ పూర్తిగా తిప్పవద్దు. ఎంత కావాలో అంతవరకే ఓపెన్ చేయండి’ అని ఇంట్లో వాళ్లకు చెప్పి చెప్పి విసిగిపోయింది లలితాంబ విశ్వనాథయ్య. అందుకే ఓ చిన్న సాధనంతో నీరు తగినంత మాత్రమే వచ్చేటట్లు ట్యాప్‌కు ఉచ్చు బిగించింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ నివాసి లలితాంబ. నీటివృథాను అరికట్టడానికి ఆమె వాటర్ ఏరియేటర్, వాటర్ రిస్ట్రిక్టర్లకు రూపకల్పన చేసింది. వీటిని అమర్చడం ద్వారా నీటి వాడకం మూడవ వంతుకు తగ్గిపోతుంది. సాధారణంగా ఓ కొత్త ఆవిష్కరణ మనిషి జీవనశైలిని ఆధునీకరించడం కోసమే ఉంటుంది. వాటికి మార్కెట్లో మంచి ఆదరణ కూడా లభిస్తుంది. లలితాంబ రూపొందించిన సాధనాలు సామాజిక ప్రయోజనార్థం పని చేస్తాయి. ప్రకృతి పరిరక్షణ, వనరుల సంరక్షణలో కీలకమైన పాత్ర వహిస్తాయి. వాటర్ బాటిల్ లేదు! ‘నీరు అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. నదుల సంరక్షణ, పరిశుభ్రతనే ప్రధానంగా చూస్తాం, కానీ పర్యావరణ పరిరక్షణ నుంచి దైనందిన జీవనం వరకు అడుగడుగునా అది కీలకమైన అంశమే’ అంటారు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి. ‘‘నాకు ఎనభై ఏళ్లు. నా బాల్యంలో స్కూలుకెళ్లేటప్పుడు నీటిసీసా తీసుకెళ్లడం మాకు తెలియదు. దారిలో రోడ్డు పక్కన కనిపించిన నల్లా తిప్పి చేయి పట్టి దాహం తీరే వరకు తాగేవాళ్లం. ఎంతో ఆరోగ్యంగా పెరిగాం. నీటి కాలుష్యం అనే పదమే తెలియదప్పట్లో. మా ఇంట్లో బావి ఉండేది. వర్షాకాలంలో అయితే బకెట్‌కు తాడు కట్టి మూడు– నాలుగు అడుగుల లోతులో ఉన్న నీటిని ముంచుకోవడమే. ఎండాకాలంలో అదే బావిలో నీరు ఇరవై అడుగుల లోతుకి వెళ్లేది. భూగర్భ జలాల కనీస స్థాయులంటే ఇరవై అడుగులే. హైదరాబాద్ చుట్టూ వందల చెరువులు, కుంటలు ఉండేవి. క్రమంగా ఒక్కొక్కటీ మాయమవుతున్నాయి. నీటిచుక్క పాతాళానికి పోయింది. నీటి జాడ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నారు. నీటిని అవసరానికి మించి వాడడం అంటే సహజ వనరులను వృథా చేయడమే. ఈ మధ్య ప్రభుత్వం జారీ చేసిన 111 జీవో మీద కూడా మేము అభ్యంతరం తెలియచేశాం. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ మంచి నీటి రిజర్వాయర్లు కూడా ఈ జీవో ఫలితంగా హుస్సేన్‌సాగర్ లాగానే మారిపోతాయని హెచ్చరించాం. భావి తరాలకు అందాల్సిన సహజ వనరులను విచక్షణ రహితంగా వాడేసే హక్కు ఎవరికీ ఉండదు. మనదేశంలో జలకాలుష్యనిరోధానికి ‘వాటర్ యాక్ట్ ఆఫ్ 1974’ అనే చట్టం ఉంది. దానిని అమలు చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏర్పాటైంది. ఎన్ని చట్టాలున్నా సరే... మన దగ్గర నీటి సంరక్షణ విషయంలో సమన్వయలోపంతోనే పనులు జరుగుతున్నాయి. ఫ్యాషన్ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లోకి రాగానే కొనేస్తారు. కాని, ఇలాంటి సమాజహితమైన, పర్యావరణ పరిరక్షణ సహితమైన వాటర్ రిస్ట్రిక్టర్లను వాడమని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది’’ అని ఆవేదనగా అన్నారాయన. ప్రతిజ్ఞ చేద్దాం! నీటి వనరులను పరిరక్షించుకోవడం అనగానే భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బావుల్లోకి నీరు చేరడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి పెద్ద విషయాల మీదనే చర్చ జరుగుతుంటుంది. కానీ... ఇంట్లో మనం వాడే ప్రతి నీటి చుక్కనూ గౌరవించుకోవాలి. ‘ఆహారాన్ని వృథా చేయము’ అని ప్రతిన పూనుతున్నాం. అలాగే నీటిని వృథా చేయను అని కూడా ఎవరికి వాళ్లు మనసులోనే ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడు లీకవుతున్న ట్యాప్‌ను చూసినప్పుడు దానిని కట్టేసేవరకు మనసు ఊరుకోదు. ట్యాప్ లీకవుతుంటే ఒక్కో చుక్కే కదా అని తేలిగ్గా తీసుకోవడం జరగదు. గమనించిన తక్షణమే ట్యాప్ మారుస్తాం. ఒక్కో చుక్క నీరు కారుతున్న ట్యాప్ నుంచి ఇరవై నాలుగ్గంటల్లో ఎనభై లీటర్ల నీరు వృథా అవుతుంది తెలుసా! ఇది నిజం... నమ్మండి! వాటర్ రిస్ట్రిక్టర్ ధర వంద రూపాయలకు మించదు. దీని ద్వారా నీటి వృథాను అరికట్టగలుగుతాం. నిమిషానికి నాలుగు లీటర్ల చొప్పున ఆదా చేయగలుగుతాం. కాలేజ్‌లు, కల్యాణమండపాల వంటి చోట నెలకు సరాసరిన పదిహేను వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది. – లలితాంబ, వాటర్ రిస్ట్రిక్టర్ రూపకర్త మహిళలే సంరక్షకులు మహిళలు స్వచ్ఛందంగా స్పందిస్తేనే నీటి సమస్య అదుపులో ఉంటుంది. మన కిచెన్‌లో ట్యాప్ తిప్పగానే నీరు ధారగా ప్రవహిస్తోందంటే... దాని వెనుక కనిపించని శ్రమ ఎంతో ఉంటుంది. నదుల జన్మస్థానాలైన కొండల మీద నుంచి మన ఇంటికి వస్తున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. కొండ శిఖరం నుంచి మన ఇంటి ట్యాప్‌కు చేరడానికి మధ్య ఎంత మెకానిజం పని చేస్తోందో గమనించాలి. మీ పిల్లల కోసం ఎన్నెన్నో ఆస్తులను కూడబెడుతుంటారు, అంతకంటే విలువైన ఆస్తి నీరు. ఆ నీటిని వృథా చేయకండి. ఎండిన భూమిని కాదు, చల్లని భూమిని భావితరాలకు వారసత్వంగా ఇవ్వండి. – ప్రొ‘‘ కె. పురుషోత్తమ్‌రెడ్డి, పర్యావరణవేత్త – వాకా మంజులారెడ్డి -
ఏరియా-51
-
పోలీసుల సమ్మెతో ప్రభుత్వం కూలుతుందా?
బెంగళూరు: ‘పోలీసులు సమ్మె చేస్తేనే ప్రభుత్వం కూలిపోతుందా? అసలు ఏ ఆధారాలతో శశిధర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు?’ అని హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ బైరారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వివరాలు....పోలీసుల డిమాండ్ల పరిష్కారానికి గతంలో పోలీసుల సమ్మెకు కర్ణాటక పోలీసు మహా సంఘం అధ్యక్షుడు శశిధర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసును నమోదు చేసింది. దీంతో శశిధర్ జామీను కోసం హైకోర్టును ఆశ్రయించగా గురువారం వాదనలు జరిగాయి. శశిధర్ తరఫున న్యాయవాది అశోక్ హార్నల్లి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నణ్ణ వాదనలను వినిపించారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి ఆనంద్ బైరారెడ్డి ...... ‘శశిధర్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను ఇవ్వడం మీకు సమ్మతమేనా, ఫేస్బుక్, ట్విట్టర్ల వంటి సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషేధంతో పాటు ఇంటర్వూలు ఇవ్వరాదనే నిర్భంధనలతో బెయిల్‌ను మంజూరు చేస్తే మీకెలాంటి అభ్యంతరం లేదు కదా?’ అని శశిధర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. తమకెలాంటి అభ్యంతరం లేదని అశోక్ హార్నల్లి పేర్కొన్నారు. దీంతో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నణ్ణ కలగజేసుకుంటూ....‘శశిధర్ పోలీసులను రెచ్చగొట్టి సమ్మె చేయించాలనుకున్నారు? ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్నారు? అందువల్ల అతనికి బెయిల్‌ను మంజూరు చేయవద్దు’ అని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.... ‘పోలీసుల సమ్మెతో ప్రభుత్వం కూలిపోతుందా? ఏ ఆధారాలతో శశిధర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించంతో పొణ్ణన్న మిన్నకుండిపోయారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన తర్వాత శశిధర్ జామీనుకు సంబంధించిన తీర్పును న్యాయమూర్తి రిజర్వ్‌లో ఉంచారు. -
మళ్లీ విఘ్న వివాదం