‘రింగు’ 6 వరుసలు! | Indian Govt changed strategy on Regional Ring Road | Sakshi
Sakshi News home page

‘రింగు’ 6 వరుసలు!

Published Sun, Apr 6 2025 12:47 AM | Last Updated on Sun, Apr 6 2025 12:47 AM

Indian Govt changed strategy on Regional Ring Road

రీజినల్‌ రింగురోడ్డు విషయంలో మారిన కేంద్రం వ్యూహం

ప్రతిపాదిత 4 వరుసల రోడ్డుపై ఐదేళ్లలోనే వాహనాల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా.. ఆ పరిస్థితి నివారణకు ఆరు వరుసలు నిర్మిస్తే 

15 ఏళ్ల వరకు సరిపోతుందని కేంద్రం యోచన

అందుకు అనుగుణంగా 6 వరుసల రోడ్డుకు డిజైన్లు రూపొందిస్తున్న అధికారులు.. తుది దశకు చేరిన ట్రాఫిక్‌ అధ్యయనం.. దాని ఆధారంగా త్వరలో తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిదశలో నాలుగు వరుసలుగానే నిర్మించాలని నిర్ణయించి అందుకు వీలుగా ఇటీవల టెండర్లు పిలిచిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పుడు మనసు మార్చుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఏకకాలంలో ఆరు వరుసలుగా నిర్మించాలనుకుంటోంది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు ప్రారంభించి డిజైన్లు మారుస్తోంది. 

ప్రస్తుతం ప్రతిపాదిత అలైన్‌మెంట్‌ను ఆనుకొని ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులపై రోజుకు ఎన్ని వాహనాలు తిరుగుతు న్నాయో తేల్చే వాహన అధ్యయనం పూర్తిచేసి ఎన్‌హెచ్‌ఏఐ కేంద్రానికి నివేదించనుంది. దీని ఆధా రంగా ఆర్‌ఆర్‌ఆర్‌పై రానున్న 20 ఏళ్లలో వాహనాల సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో అంచనా వేసి కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. 

ఆరు వరుసలుగా రోడ్డు నిర్మాణంతో ప్రధాన క్యారేజ్‌ వే మాత్రమే కాకుండా జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేసే 11 ప్రాంతాల్లో నిర్మించనున్న ఇంటర్‌ఛేంజ్‌ స్ట్రక్చర్ల డిజైన్లను కూడా ఎన్‌హెచ్‌ఏఐ మారుస్తోంది. దీంతో ఇంటర్‌ఛేంజ్‌ కూడళ్లను మరింత భారీగా నిర్మించాల్సి రానుంది. ఫలితంగా రోడ్డు నిర్మాణ వ్యయం సుమారు రూ. 2,500 కోట్ల మేర పెరగనుంది. ఒక్క ఉత్తరభాగం నిర్మాణానికే దాదాపు రూ. 19 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వెంటనే విస్తరణ పరిస్థితి రావద్దని..
ఏడేళ్ల క్రితం రీజినల్‌ రింగురోడ్డును ప్రతిపాదించాక దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2008లో ఔటర్‌ రింగురోడ్డు నిర్మించాక హైదరాబాద్‌ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. పురోగతి వేగం పుంజుకుంది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ అంతకు మించిన ప్రభావం చూపుతుందన్న అంచనా నెలకొంది. దీంతో రీజినల్‌ రింగురోడ్డు అలైన్‌మెంట్‌ను ఆసరాగా చేసుకొని ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజెడ్‌), శాటిలైట్‌ టౌన్‌షిష్‌ల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 

అక్కడ పెట్టుబడులకు బహుళ జాతి సంస్థలు ముందుకొస్తున్నాయి. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ జనావాసాలు, సంస్థలు పెరిగి వాహనాల రద్దీ తీవ్రమవుతుందని కేంద్రం తాజాగా అంచనాకొచ్చింది. 2021–22లో ప్రతిపాదిత రింగు ప్రాంతంలోని రోడ్లపై నిత్యం సగటున 14,850 ప్యాసింజర్‌ కార్‌ యూనిట్ల (పీసీయూ) చొప్పున వాహనాలు తిరుగుతున్నాయని తేలింది. 

తాజాగా ఓ ప్రైవేటు సంస్థతో నిర్వహిస్తున్న అధ్యయనంలో ఇందులో పెరుగుదల నమోదైంది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి ముందున్న అంచనాకు.. రోడ్డు నిర్మించాక వాస్తవంగా తిరుగుతున్న వాహనాల సంఖ్యకు పొంతన లేకుండా పోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ను నాలుగు వరుసల్లో నిర్మించి మరో 15–20 ఏళ్ల తర్వాత దాన్ని 8 వరుసలకు విస్తరించాలనేది ఇప్పటివరకు ఉన్న ప్రణాళిక. కానీ కేవలం ఐదేళ్లలోనే ఆర్‌ఆర్‌ఆర్‌పై రద్దీ రెట్టింపై నాలుగు వరుసల రోడ్డు ఇరుకుగా మారి దాన్ని వెంటనే విస్తరించాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయం నెలకొంది. 

ఒకవేళ ఐదేళ్లలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ను విస్తరించాల్సి వస్తే నిర్మాణ వ్యయం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి 6 వరుసలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మిస్తే కనీసం 15 ఏళ్ల వరకు దాన్ని విస్తరించాల్సిన అవసరం ఉండదన్నది కేంద్రం ఆలోచన. వాహనాల రాకపోకలు 30 వేల పీసీయూల లోపు ఉంటే 4 వరుసలు సరిపోతాయని... అంతకంటే పెరిగితే రోడ్డు ఇరుకు అవుతుందని నిర్ధారిత ప్రమాణాలు చెబుతున్నాయి. కానీ ఐదేళ్లలోనే ఈ సంఖ్య 40 వేలను మించుతుందని కేంద్రం తాజాగా అంచనా వేసింది.

రోడ్డు నిర్మాణానికి రూ. 8,800 కోట్లు!
నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి రూ. 6,300 కోట్ల వరకు ఖర్చవుతుందని టెండర్‌ నోటిఫికేషన్‌లో ఎన్‌హెచ్‌ఏఐ అంచనా వేసింది. ఇప్పుడు దాన్ని 6 వరుసలుగా నిర్మిస్తే ఆ మొత్తం రూ. 8,800 కోట్ల వరకు అవుతుందని భావిస్తోంది. అయితే ఒకేసారి 8 వరుసలకు సరిపడా భూసేకరణ జరుగుతున్నందున దాని వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు.

తొలుత రెండు వరుసలు చాలనుకొని..
రీజనల్‌ రింగురోడ్డును ప్రతిపాదించాక నాలుగు వరుసల రోడ్డుకు సరిపడా ట్రాఫిక్‌ ఉండదని భావించి కేంద్రం తొలుత రెండు వరుసలకే పరిమితమవుదామని పేర్కొంది. కానీ కనీసం నాలుగు వరుసలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించింది. అయినప్పటికీ ఈ విషయంలో అనుమానం తీరకపోవడంతో ఉత్తర–దక్షిణ భాగాలను ఏకకాలంలో చేపట్టకుండా తొలుత ఉత్తర భాగాన్ని నిర్మించి తర్వాత దక్షిణ భాగం సంగతి చూద్దామనుకుంది. 

అలాంటి స్థితి నుంచి కేంద్రం ఏకకాలంలో ఆరు వరుసలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా తాజాగా ఆదేశించడం విశేషం. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ట్రాఫిక్‌ స్టడీ నివేదిక అందాక దాన్ని నిపుణుల సమక్షంలో విశ్లేషించి కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. తుది నిర్ణయం ఆధారంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అప్పటికప్పుడు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలిచిన టెండర్లను త్వరలో తెరిచి నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement