ఉత్తర భాగంలో మార్చాలంటూ కేంద్రమంత్రి గడ్కరీపై ఒత్తిళ్లు
కొన్నిచోట్ల స్థానికుల వ్యతిరేకతను ఆసరాగా తీసుకుని పావులు
తమకు అనుకూలురైన వారికి ప్రయోజనం చేకూర్చే యత్నాలు
మూడు ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లను మరోచోట ఖరారు చేయాలంటూ నేతల ప్రతిపాదనలు
టెండర్లు సైతం ఖరారైన దశలో పెరుగుతున్న ఒత్తిళ్లతో ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగాన్ని ఓపక్క రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, మరోపక్క ఉత్తర భాగం అలైన్‌మెంటులో మార్పులు చేయాలనే ఒత్తిడి మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజల వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని కొందరు నేతలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజలకు మద్దతు ముసుగులో తమకు అనుకూలమైనవారి కోసం పావులు కదుపుతున్నారు. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారు.
ఉత్తర భాగానికి సంబంధించి అన్ని రకాల గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయి, భూ పరిహారానికి అవార్డులు పాస్ చేసే సమయంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అలైన్‌మెంటు ఖరారై, టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నందున మార్పులు సాధ్యం కాదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతుండగా, కొందరు నేతలు ఈ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం.
ఎక్కడెక్కడ మార్పులు
– సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద ట్రిపుల్ ఆర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ జాతీయ రహదారి మీద భారీ ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు నిరాకరిస్తున్నారు. గతంలో పబ్లిక్ హియరింగ్, సర్వే జరగకుండా అడ్డుకున్నారు. ఇదే ప్రాంతంలో దక్షిణ రింగు ప్రారంభం కావాల్సి ఉంటుంది. దాన్ని ఉత్తర రింగులో భాగంగా నిర్మించే ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్‌తో అనుసంధానించాల్సి ఉంది.
దక్షిణ రింగును మరింత దూరంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, కొందరు నేతలు దీన్ని ఆసరా చేసుకుని ఉత్తర రింగు కూడలిని మరోచోట నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. రైతుల వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తమకు అనుకూల ప్రాంతానికి చేరువగా రింగురోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో కొందరు నేతలు మార్పు కోరుతుండగా, ప్రస్తుత అలైన్‌మెంటు తమకు చెందినవారి భూముల్లోంచి ఉండటంతో వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా కొందరు మార్పు కోరుతున్నారు.
– యాదాద్రి జిల్లాలో రింగురోడ్డు విషయంలో స్థానికుల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. గతంలో జాతీయ రహదారి కోసం కొందరు, సాగునీటి ప్రాజెక్టు కాలువల కోసం కొందరు.. ఇలా పలు సందర్భాల్లో భూములు కోల్పోయారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం మరోసారి భూసేకరణ జరగటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కొందరు వ్యాపారుల భూములు కూడా అలైన్‌మెంటు పరిధిలో ఉన్నాయి. దీంతో వారు బడా నేతలను ఆశ్రయించారు. స్థానికుల అభ్యర్థనలను ఆసరాగా తీసుకుని అలైన్‌మెంటును మార్చాలని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ రాయగిరి హైవే వద్ద కాకుండా ఎగువన నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు.
– ఉత్తర రింగు చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. చౌటుప్పల్ పట్టణ శివారులోనే ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ నిర్మించాల్సి ఉంది. ఇది పట్టణానికి మరీ చేరువగా ఉందని, దీనివల్ల విలువైన భూములును స్థానికులు కోల్పోవాల్సి వస్తుందని, పరిహారంగా వారికి న్యాయమైన మొత్తం దక్కదంటూ కొందరు నేతలు వకాల్తా పుచ్చుకుని గడ్కరీ కార్యాలయంలో ఒత్తిడి పెంచారు. పట్టణానికి దూరంగా ఉండేలా అలైన్‌మెంటు మార్చాలని కోరుతున్నారు.
ఇతర ప్రాంతాల రైతుల్లో ఆందోళన
అలైన్‌మెంటు మారుస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభమైంది. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్ల వల్ల రింగురోడ్డును ప్రస్తుత ప్రాంతానికి దూరంగా మారుస్తున్నారంటూ స్థానికుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇతర ప్రాంతాల్లోని రైతుల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. తమ భూములకు ఎక్కడ ఇబ్బంది కలుతుందోనన్న భయంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతుండటంతో ..ఏది నిజమో తెలియని అయోమయంలో ఉన్నారు.
చిన్న మార్పుతో భారీ తేడా!
రింగురోడ్డు అలైన్‌మెంటులో ఓ ప్రాంతంలో చిన్న మార్పు చేస్తే దాని ప్రభావం ఇటు రెండు కిలోమీటర్లు, అటు రెండు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఎక్స్‌ప్రెస్ వే అయినందున ఉన్నఫళంగా రోడ్డును మలుపు తిప్పే వీలుండదు. రెండు కిలోమీటర్ల దూరం నుంచి మొదలుపెట్టి క్రమంగా మలుపు తిప్పాల్సి ఉంటుంది. ఇక మార్పు ఎక్కువగా ఉంటే, అలైన్‌మెంటులో కూడా భారీ మార్పు చోటు చేసుకుంటుంది.
ప్రస్తుతం ఊరికి ఒకవైపు ఉందనుకుంటే, మార్పు వల్ల మరో వైపునకు మారే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ప్రజల్లో తీవ్ర అలజడికి కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి మార్పులకు అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు. అయితే నేతలు మాత్రం ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment