కేంద్రం, రాష్ట్రం సమాంతర కసరత్తులు
డీపీఆర్, అలైన్‌మెంటును రూపొందించే పనిలో రాష్ట్ర సర్కారు.. కానీ ఆది నుంచి కేంద్రం అధీనంలోనే ప్రాజెక్టు
ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ పరిశీలనలో కేంద్ర కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్‌మెంటు
రాష్ట్రం, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గందరగోళంగా మారింది. జాతీయ రహదారిగా నిర్మిస్తున్నందున, ఆ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ రెండు భాగాలూ ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం నేషనల్ హైవేస్ (ఒరిజినల్) జాబితాలో ఉత్తర భాగం ఉండగా, విజన్ 2047 పార్ట్ 2 జాబితాలో దక్షిణ భాగం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగానికి డీపీఆర్‌ను రూపొందించే పనిలో ఉంది.
గతంలో పిలిచిన టెండర్లకు స్పందన లేకపోవటంతో దాని గడువును పెంచింది. మరోవైపు దాని అలైన్‌మెంటును ఖరారు చేసేందుకు అధికారులతో గతంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టే ప్రాజెక్టులకు అలైన్‌మెంట్లు, డీపీఆర్‌లను అదే సొంతంగా ఖరారు చేసుకుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై కసరత్తు చేస్తుండటం అయోమయానికి కారణమవుతోంది.
సీఎం సమీక్షలు, కమిటీలు
ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో అధికారులు ట్రాఫిక్ సర్వే నిర్వహించినప్పుడు దక్షిణ భాగం పరిధిలో వాహనాల రద్దీ అంత ఎక్కువగా ఉండదని తేలింది. టోల్ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండే రోడ్లపై భారీ వ్యయం చేయటం సబబు కాదన్న ఉద్దేశంతో కేంద్రం అంత ఆసక్తి చూపలేదు. చివరకు రాష్టప్రభుత్వ ఒత్తిడితో సరేనంది. తొలుత ఉత్తర భాగాన్ని చేపట్టి ఆ తర్వాత దక్షిణ భాగంపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర భాగాన్ని భారత్‌మాల పరియోజనలో చేర్చింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాలతో జాప్యం జరిగి, భారత్‌మాల పరియోజన గడువు తీరిపోయింది.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ దాన్ని చేపట్టేందుకు నిర్ణయించి నిధులు, టెండర్ల ప్రక్రియ చేపట్టింది. దక్షిణ భాగాన్ని మాత్రం భవిష్యత్తులో చేపట్టేలా విజన్–2047 రెండో జాబితాలో చేర్చింది. అయితే ఆ భాగాన్ని తానే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సొంతంగా అలైన్‌మెంటు రూపొందించటంతో పాటు డీపీఆర్ కూడా సిద్ధం చేయాలని భావించి సీఎం పలుదఫాలు సమీక్షలు నిర్వహించారు. అధికారులతో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు.
ఎవరి పనిలో వారు..!
దక్షిణ భాగం నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో మనసు మార్చుకుని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులు కూడా ప్రారంభించాలని కేంద్రాన్ని లిఖి తపూర్వకంగా కోరింది. కానీ ఆ భాగం ఎన్‌హెచ్‌ఏఐ అధీనంలోనే ఉన్నందున కేంద్రం తన పనితాను చేసుకుపోతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం డీపీఆర్ తయారీ కసరత్తును కొనసాగిస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వం ఈ భాగానికి సంబంధించి ఓ డ్రాఫ్ట్ అలైన్‌మెంటును రూపొందించి ఎన్‌హెచ్‌ఏఐకి అందించింది.
అయితే అది అనుకూలంగా లేదని కేంద్రం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ వేరే అలైన్‌మెంటును తయారు చేసి ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పించింది. అది ఖరారైతే ఆ కన్సల్టెన్సీ డీపీఆర్‌ను రూపొందిస్తుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డీపీఆర్ తయారీకి టెండర్లు కొనసాగిస్తుండటం ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం, అటు కేంద్రం అధీనంలోని ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల్లో అయోమయానికి కారణమవుతోంది.
మేమే కసరత్తు చేస్తాం: ఎన్‌హెచ్‌ఏఐ
‘దక్షిణ భాగం ముందునుంచీ మా అధీనంలోనే ఉంది. దా నిపై మేమే కసరత్తు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చే స్తోందో మాకు తెలియదు. తానే సొంతంగా నిర్మిస్తానంటూ మాకు అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. ఉత్తర భాగంతోపాటు దక్షిణ భాగాన్ని కూడా పూర్తి చేయాలన్న లేఖ మాత్రం వచ్చింది. ఇలాంటప్పుడు అలైన్‌మెంటు, డీపీఆర్ తదితరాలు మేమే పూర్తి చేయాల్సి ఉంటుంది..’ అని ఎన్‌హెచ్‌ఏఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment