ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించిన అలైన్‌మెంట్ బుట్టదాఖలు
ఇక సొంతంగా వేరే అలైన్‌మెంట్‌కు రూపకల్పన
12 మందితో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని సొంతంగానే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచి్చంది. గతంలో ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్‌మెంట్‌ను పక్కన పెట్టనుంది. కొత్త అలైన్‌మెంట్ రూపొందించడానికి 12 మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ట్రిపుల్ ఆర్‌ను జాతీయ రహదారిగా నిర్ధారించి కేంద్రమే చేపట్టేందుకు గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో ఉత్తరభాగానికి భూసేకరణ ప్రక్రియ నిర్వహిస్తున్న సంగతి విదితమే.
అదేక్రమంలో దక్షిణభాగాన్ని కూడా కేంద్రమే చేపట్టాల్సి ఉంది. ఉత్తర–దక్షిణ భాగాల నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాల్సి ఉంది. భూసేకరణలో సగం వ్యయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించాలంటే, అలైన్‌మెంట్ ప్రక్రియను కూడా కేంద్రమే నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు అలా కాదని, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అలైన్‌మెంట్ రూపొందించనున్నందున.. రోడ్డు నిర్మాణ బాధ్యతను ఇక కేంద్రం తీసుకోదని దాదాపు తేలిపోయింది.
అంటే రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దక్షిణ భాగానికి దాదాపు రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు కానుంది. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం భరించాల్సిన అవసరం లేకుండా, తానే భరిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రంతో సంబంధం లేకుండా, తనకు నచ్చిన ప్రాంతాల మీదుగా, నచి్చనట్టుగా రోడ్డు నిర్మాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసుకునే అలైన్‌మెంట్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఆ అలైన్‌మెంట్ ఖరారుకే ఏడాది సమయం
ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది. ఆ సంస్థ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ..వాగులు, వంకలు, గుట్టలుమిట్టలను పరిగణనలోకి తీసుకుని అలైన్‌మెంట్‌ను రూపొందించారు. జల వనరులు, భవిష్యత్‌లో నిర్మించే ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అలైన్‌మెంట్ రూపొందించారు. మూడు అలైన్‌మెంట్లు సిద్ధం చేయగా, వాటిల్లో 189,25 కి.మీ. నిడివి గల అలైన్‌మెంట్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు దఫాలుగా అధికారులు సమావేశమై ఈ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందిన అలైన్‌మెంట్...తాము ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీకి అనుకూలంగా లేదని, అందులో చాలా మార్పులు చేయాల్సి ఉందని తేల్చారు.
దానిని అలాగే వదిలేసి పూర్తి కొత్త అలైన్‌మెంట్ ను రూపొందించటమే మేలని సూత్రప్రాయంగా తేల్చారు. ఈ మేరకు గూగుల్ మ్యాపు సహాయంతో ఓ తాత్కాలిక అలైన్‌మెంట్‌ను అధికారులు తయారుచేసి ప్రభుత్వానికి సమరి్పంచారు. దాదాపు 194 కి.మీ. నిడివితో దీనిని రూపొందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్‌మెంట్‌గా మార్చేందుకు 12 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కనీ్వనర్‌గా ఉండే ఆ కమిటీలో పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, రోడ్లు భవనాల శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. త్వరలో ఈ కమిటీ ఆధ్వర్యంలో అలైన్‌మెంట్ ఖరారు ప్రక్రియ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment