
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురిసింది బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్‌ఆర్ నగర్, మాదాపూర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, కోఠి, నాంపల్లి, అబిడ్స్ దిల్‌సుఖ్‌నగర్, రాజేంద్రనగర్, అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది. లంగర్‌హౌస్‌లో విద్యుత్ తీగలపై భారీ వృక్షం పడింది. నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌పై భారీ వృక్షం పడిపోయింది. కంచన్‌బాగ్ 8, బహదూర్‌పురాలో 7.8 సెం.మీ, యాకూత్‌పురాలో 7.6, బేగంబజార్‌లో 6.9 సెం.మీ, సంతోష్‌నగర్ 6.9, దబీర్‌పురాలో 6.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఎండలు, సాయంత్రానికి వర్షాలు.. ఈదురుగాలులు, వడగడ్ల వానలతో జనం పరేషాన్ అవుతున్నారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి మరత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీయ, తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టం మీదగా ద్రోణి కొనసాగుతోంది. రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీతో వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసి అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే మూడు, నాలుగు రోజులు అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని పలు ఉత్తర, ఈశాన్య జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
