మార్స్‌పైన ఉన్న ‘పెర్సీ’ రోవర్ నుంచి ‘ఇన్‌జెన్యూటీ’ హెలికాప్టర్ విడివడితే... (ఊహాచిత్రం) ఇన్‌సెట్‌లో బాబ్ బలరామ్ : ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ సృష్టికర్త
‘పెర్సీ’ రోవర్ మార్స్ పైన దిగి వారం అయింది. ఇప్పుడేం చేస్తూ ఉంటుంది? ఏం చేయడం లేదు. ఉన్న చోటే ఉండి భూమి పైకి ఫొటోలు పంపుతూ ఉంది. పెర్సీ ఒక్కటే లేదు అక్కడ. తల్లి ఒడిలో బిడ్డలా (కంగారూ తల్లీబిడ్డల్ని ఊహించండి) పెర్సీ పొదుగు కింద ‘ఇంజిన్యూటీ’ అనే హెలికాఫ్టర్ కూడా ఉంది. ఆ బిడ్డకు తల్లి పాలిస్తూ ఉంది. 30 పర్సెంట్ ఛార్జింగ్ అయింది ఇప్పటికి. పాలివ్వడం పూర్తవగానే బిడ్డకు రెక్కలొచ్చి మార్స్ పై ఎగురుకుంటూ తిరుగుతుంది. అదలా ఎగరగానే పెర్సీ కూడా మెల్లిగా కదలడం, ముందుకీ వెనక్కూ అడుగులు వేయడం మొదలు పెడుతుంది. మార్స్ పై నున్న తల్లీబిడ్డల్ని యాక్టివేట్ చేయించే పని.. కింద కన్సోల్ లో ఉన్న ‘నాసా’ టీమ్ ది. టీమ్ లో 12 మంది భారత సంతతి సైంటిస్టులుగా కాగా.. వారిలో 8 మంది మహిళలే!
నాసా పంపిన ‘పెర్సీ’ రోవర్ ఈ నెల 18 న అంగారకుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. అక్కడే ఏడాది పాటు ఉండి మానవ నివాస యోగ్యమైన వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నదీ లేనిదీ పెర్సీ కనిపెట్టి చెబుతుంది. భూమికి, అంగారకుడికి మధ్య దూరం సుమారు 21 కోట్ల 80 లక్షల కిలోమీటర్లు. పెర్సీ అంతదూరం నిరంతరాయంగా ప్రయాణించి మార్స్ పైకి చేరడమే గొప్ప ‘భూవిశేషం’ అని చెప్పాలి! మానవ నిర్మితం కనుక. యూఎస్‌లోని ఫ్లోరిడా నుంచి ‘అట్లాస్’ అనే రాకెట్ ‘పెర్సీ’ రోవర్‌ని, పెర్సీకి తగిలించిన ‘ఇన్‌జెన్యూటీ’ హెలికాప్టర్‌ని భద్రంగా మోసుకెళ్లి పైన వదిలి పెట్టింది. ఇక తర్వాతిదంతా భూమి మీద ఫ్లారిడాలోని పెర్సీ ప్రాజెక్ట్ నాసా శాస్త్రవేత్తల పనే. పెర్సీని రాకెట్‌లో ఉంచి మార్స్ పైకి పంపిన ఈ బృందం చేతుల్లోనే.. పెర్సీ అక్కడ తన పని ప్రారంభించడానికి, కొనసాగించడానికి, పూర్తి చేయడానికి ఆదేశాలిచ్చే ముఖ్యమైన మీటలన్నీ ఉంటాయి. టీమ్ మొత్తంలో కనీసం 12 మంది భారత సంతతి శాస్త్రవేత్తలు ఉన్నారు. వారిలో 8 మంది మహిళలే. నేడు భారత్ ‘నేషనల్ సైన్స్ డే’ కనుక.. ఈ సందర్భంగా పెర్సీ ‘కన్సోల్’ రూమ్‌లో కూర్చొని ఉన్న మన సైంటిస్టులు ఎవరెవరు ఏయే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో తెలుసుకుందాం.
మొదట బాబ్ బలరామ్ గురించైతే తప్పక చెప్పుకోవాలి. ఈ క్షణాన అంగారక గ్రహంలో రోవర్ పొదుగున చార్జ్ అవుతున్న ‘ఇన్‌జెన్యూటీ’ అనే ఆ హెలికాప్టర్‌ని కనిపెట్టింది ఆయనే. బాబ్ 1990 లలోనే ఇలాంటి మార్స్ హెలికాప్టర్ ఆలోచన చేశారు. అయితే అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు. ‘అసాధ్యం’ అన్నారంతా. బాబ్ మెడ్రాస్ ఐ.ఐ.టి విద్యార్థి. నాసాలో అధ్యయనం చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం మళ్లీ మార్స్ హెలికాప్టర్ టాపిక్ వచ్చింది. నాసా ‘జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ’ (జె.పి.ఎల్) డైరెక్టర్ తన ప్రసంగంలో.. మార్స్‌పై ఎగిరే హెలికాప్టర్‌ను తయారు చేయలేమా? అనే ప్రశ్న సంధించినప్పుడు సమావేశంలో ఉన్న కొందరు అప్పటికి దశాబ్దం క్రితమే జరిగిన బాబ్ బలరామ్ ప్రయత్నాల గురించి చెప్పారు. వెంటనే ఆ డైరెక్టర్ నుంచి బాబ్‌కు పిలుపు వెళ్లింది. బాబ్, ఆయన బృందం ఎనిమిది వారాలు కష్టించి మార్స్ హెలికాప్టర్‌ను కనిపెట్టేందుకు పట్టే సమయం, అయ్యే ఖర్చుపై అంచనాలు వేసి ఇచ్చారు. ఆ క్రమంలో ఏడేళ్ల నిర్విరామ కృషితో తయారైనదే ఇప్పుడు మార్స్ పైన ఛార్జింగ్ అవుతూ ఉన్న ‘ఇన్‌జెన్యూటీ’ హెలికాప్టర్. అంటే నాసా తొలి మార్స్ హెలికాప్టర్ ఆలోచన కర్త, సృష్టికర్త మన భారతీయుడే. అందుకే ఈ ఏడాది నేషనల్ డే మనకు ప్రత్యేకమైనది.
ఈ ప్రతిష్టాత్మకమైన ‘మార్స్ 2020 మిషన్’ లో బాబ్ బలరామ్‌తో పాటు మహిళా సైంటిస్టులు స్వాతి మోహన్, వందనా వర్మ, నాగిన్ కాక్స్, యోగితా షా, ఉషా గూడూరి, కవితా కౌర్, ప్రియాంక శ్రీవాత్సవ, శివాలీ రెడ్డి; మిగతా సైంటిస్టులు విష్ణుశ్రీధర్, సౌమ్యోదత్తా, నీల్ పటేల్ పాలు పంచుకున్నారు. పెర్సీ ప్రాజెక్టులో ప్రతిదీ కీలకమైన ప్రాజెక్టే అయినప్పటికీ.. ప్రధానమైన బాధ్యతలన్నిటినీ స్వాతీ మోహన్ నిర్వర్తిస్తున్నారు. రోవర్‌కి గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ లీడ్ ఆమె విధులు. రోవర్‌ని కదిలించే బాధ్యత వందనా వర్మది. అంగారకుడిపై ఉన్న రోవర్ ప్రస్తుతం ‘వామింగ్ అప్’ మోడ్‌లో స్థిరంగా ఉంది. ఇకపై ఆమే రోవర్‌కి నడకలు నేర్పించాలి. నాగిన్ కాక్స్ డిప్యూటీ టీమ్ చీఫ్. ఆమె ఆధ్వర్యంలోనే పెర్సీ ఇంజినీరింగ్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. నాగిన్ బెంగళూరు అమ్మాయి. గతంలో యు.ఎస్. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పని చేశారు. ఆమె పెరిగిందంతా మలేషియా, అమెరికాలలో. నాగిన్‌కు నాసా, నాసా వారి జె.పి.ఎల్.లో స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్ ఇంజినీర్ గా 20 ఏళ్ల అనుభవం ఉంది.
ఇక యోగితా షా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరు. కమ్యూనికేషన్, నేవిగేషన్‌లకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. ఆమెది మహారాష్ట్రలోని ఔరంగాబాద్. జె.పి.ఎల్.లో ఫ్లయిట్ సిస్టమ్స్ ఇంజినీరుగా శిక్షణ పొందారు. ఉషా గూడూరి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. యాక్టివిటీ ప్లానింగ్, సబ్‌సిస్టమ్ సీక్వెన్సింగ్‌లకు సాఫ్ట్‌వేర్‌ను కనిపెట్టడం ఆమె వంతు. బిట్స్ పిలానీలో చదివారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఉషకు 18 ఏళ్ల అనుభవం ఉంది. ‘కాస్సినీ’ ప్రాజెక్టులోనూ కీలక పాత్ర పోషించారు. శనిగ్రహంపై పరిశోధనలకు నాసా రూపొందించిన నాలుగో ప్రాజెక్టే కాస్సినీ. అలాగే ‘డాన్’ అనే మరొక ఉపగ్రహ పరిశోధన ప్రాజక్టుకు కూడా. ఇక కవితా కౌర్ గ్రౌండ్ డేటా సిస్టమ్స్ నిపుణురాలు. ఆమెది చండీఘడ్. ప్రియాంక శ్రీవాత్సవ సిస్టమ్స్ ఇంజినీరు. లక్నో, పంజాబ్‌లలో చదువుకున్నారు. నాసా ఫ్లయిట్ మిషన్‌లలో పని చేశారు. ఇప్పుడీ మార్స్ మిషన్‌లో మోటార్ కంట్రోల్ అసెంబ్లీలో బాధ్యత ప్రియాంకదే. ఆమెకు సహాయంగా శివాలీ రెడ్డి ఉంటారు. వీరు కాక.. మిగిలిన ముగ్గురిలో విష్ణు శ్రీధర్ అంగారకుడిపై రాళ్లు, రప్పల్ని విశ్లేషిస్తారు. సౌమ్యోదత్తా రోవర్ కదలికల్ని స్టడీ చేస్తారు. నీల్ పటేల్ అంతరిక్ష పదార్థాలను సేకరించేందుకు రోవర్‌కి ఆటోమేటెడ్ సిస్టమ్‌ని అందజేస్తారు.
శాస్త్ర సాంకేతిక రంగాలు మహిళలవి కావు అన్నట్లు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మహిళలు లేకుండా సైన్స్ ముందుకు సాగలేని పరిస్థితి! ప్రతిభకు, నైపుణ్యానికీ స్త్రీ, పురుష భేదం ఉండదని అనేక మిషన్‌లు నిరూపించాయి. ఇప్పుడీ మార్స్ 2020 మిషన్ కూడా. నేటి ‘నేషనల్ సైన్స్ డే’ని భారత్ సగర్వంగా జరుపుకోడానికి కారణమైన మన ‘అంగారక’ సైంటిస్టులకు, ముఖ్యంగా మహిళా సైంటిస్టులకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే అభినందనలు.
Comments
Please login to add a commentAdd a comment