
ఫొటోల్లో కన్పిస్తున్నది సూర్యుని చుట్టూ ఏర్పడ్డ వెలుతురు వలయం (సన్ హాలో). రెండో ఫొటోలోది భూమ్మీద నుంచి కన్పిస్తున్నది కాగా, మొదటి ఫొటోలోనిదేమో అంగారకునిపై నుంచి కన్పించిన సన్ హాలో. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను అన్వేషించే క్రమంలో పెర్సెవరెన్స్ రోవర్ ఈ అరుదైన దృగ్విషయాన్ని గత డిసెంబర్లో అనుకోకుండా క్లిక్‌మనిపించింది. 2021 డిసెంబర్ 15న వాటిని నాసాకు పంపింది. సన్ హాలో భూమి పై నుంచి తరచూ కనిపిస్తూనే ఉంటుంది గానీ అంగారకునిపై నుంచి కంటబడటం ఇదే తొలిసారని స్పేస్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్లానెటరీ సైంటిస్టు మార్క్ లేమన్ చెప్పారు. 2020లో నాసా ఈ రోవర్‌ను అంగారకునిపైకి పంపించడం తెలిసిందే.
ఏమిటీ సన్ హాలో...?
మేఘాల్లో అసంఖ్యాకమైన సూక్ష్మ మంచు స్ఫటికాలుంటాయి. కాంతి వాటి గుండా సాగే క్రమంలో అప్పడప్పుడూ విడిపోవడంతో పాటు వక్రీభవనం కూడా చెందుతుంటుంది. ఫలితంగా ఒక్కోసారి ఇంద్రధనుస్సును తలపించే కాంతి వలయాలు ఏర్పడతాయి. నిర్దిష్ట కోణం నుంచి చూసినప్పుడు ఇవి వృత్తాకారంలో కనువిందు చేస్తాయి. వాటిని సన్ హాలోగా పిలుస్తారు. ఇలా భూమ్మీది నుంచి కన్పించే వలయాలు సాధారణంగా 22 డిగ్రీల కోణంలో ఏర్పడేవి అయుంటాయని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అయితే భూమితో పోలిస్తే అంగారకునిపై నీటి శాతం అత్యల్పం. అక్కడ అత్యధికంగా ఉండేది కార్బన్ డయాక్సైడే. కాబట్టి పెర్సెవరెన్స్ రోవర్ అందించిన ఫొటోలు నిజంగా సన్ హాలోకు సంబంధించినవేనా అని శాస్త్రవేత్తలు మీమాంసలో పడ్డారు. బహుశా రోవర్ తాలూకు కెమెరా కోణం వల్ల అలాంటి వెలుతురు వలయం ఏర్పడి ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే చివరికి ఇది దుమ్మూ ధూళి వల్ల ఏర్పడ్డది కాదని, సన్ హాలోయేనని తేల్చారు.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment