aruna planet
-
సౌర వలయాలు
ఫొటోల్లో కన్పిస్తున్నది సూర్యుని చుట్టూ ఏర్పడ్డ వెలుతురు వలయం (సన్ హాలో). రెండో ఫొటోలోది భూమ్మీద నుంచి కన్పిస్తున్నది కాగా, మొదటి ఫొటోలోనిదేమో అంగారకునిపై నుంచి కన్పించిన సన్ హాలో. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను అన్వేషించే క్రమంలో పెర్సెవరెన్స్ రోవర్ ఈ అరుదైన దృగ్విషయాన్ని గత డిసెంబర్లో అనుకోకుండా క్లిక్‌మనిపించింది. 2021 డిసెంబర్ 15న వాటిని నాసాకు పంపింది. సన్ హాలో భూమి పై నుంచి తరచూ కనిపిస్తూనే ఉంటుంది గానీ అంగారకునిపై నుంచి కంటబడటం ఇదే తొలిసారని స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్లానెటరీ సైంటిస్టు మార్క్ లేమన్ చెప్పారు. 2020లో నాసా ఈ రోవర్‌ను అంగారకునిపైకి పంపించడం తెలిసిందే. ఏమిటీ సన్ హాలో...? మేఘాల్లో అసంఖ్యాకమైన సూక్ష్మ మంచు స్ఫటికాలుంటాయి. కాంతి వాటి గుండా సాగే క్రమంలో అప్పడప్పుడూ విడిపోవడంతో పాటు వక్రీభవనం కూడా చెందుతుంటుంది. ఫలితంగా ఒక్కోసారి ఇంద్రధనుస్సును తలపించే కాంతి వలయాలు ఏర్పడతాయి. నిర్దిష్ట కోణం నుంచి చూసినప్పుడు ఇవి వృత్తాకారంలో కనువిందు చేస్తాయి. వాటిని సన్ హాలోగా పిలుస్తారు. ఇలా భూమ్మీది నుంచి కన్పించే వలయాలు సాధారణంగా 22 డిగ్రీల కోణంలో ఏర్పడేవి అయుంటాయని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అయితే భూమితో పోలిస్తే అంగారకునిపై నీటి శాతం అత్యల్పం. అక్కడ అత్యధికంగా ఉండేది కార్బన్ డయాక్సైడే. కాబట్టి పెర్సెవరెన్స్ రోవర్ అందించిన ఫొటోలు నిజంగా సన్ హాలోకు సంబంధించినవేనా అని శాస్త్రవేత్తలు మీమాంసలో పడ్డారు. బహుశా రోవర్ తాలూకు కెమెరా కోణం వల్ల అలాంటి వెలుతురు వలయం ఏర్పడి ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే చివరికి ఇది దుమ్మూ ధూళి వల్ల ఏర్పడ్డది కాదని, సన్ హాలోయేనని తేల్చారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
తొలి అంతరిక్ష హెలికాప్టర్ ‘ఇంజెన్యూటీ’
వాషింగ్టన్: అరుణగ్రహంపైకి తాము పంపించే తొలి హెలికాప్టర్‌కు భారత సంతతికి చెందిన పదిహేడేళ్ళ బాలిక వనీజా రూపానీ సూచించిన పేరును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సెలక్ట్చేసింది. ఈ హెలికాప్టర్ అంతరిక్ష నౌక తో పాటు ప్రయాణం చేస్తుంది అని నాసా ట్వీట్ చేసింది. అంతరిక్ష నౌక పర్సెవరెన్స్, ఇంజెన్యూటీలను జూలైలో నాసా అంతరిక్షంలోకి పంపనుంది. చిన్నప్పటినుంచి రూపానీకి అంతరిక్ష శాస్త్రం పై ప్రత్యేక ఆసక్తి ఉండేదని ఆమె తల్లి నౌషీన్ రూపానీ చెప్పారు. -
అరుణగ్రహంపై జీవం కోసం...
పాసడీనా (అమెరికా): వచ్చే ఏడాది అరుణగ్రహంపైకి పంపనున్న ‘ది మార్స్ 2020 మిషన్’అంతరిక్ష నౌక (రోవర్) ద్వారా నాసా ఆ గ్రహంపై ఇప్పటివరకు ఏమైనా జీవం ఉందా అన్న అంశాన్ని పరిశోధించనుంది. అంతేకాదు భవిష్యత్తులో మానవుని మనుగడ సాధ్యమవుతుందా అనేది కూడా తెలుసుకోనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అరుణగ్రహంపైకి పంపనున్న అంతరిక్ష నౌకను శుక్రవారం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్ పాసడీనాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో ఈ నౌకను శాస్త్రవేత్తలు రూపొందించారు. గత వారమే ఈ నౌకను విజయవంతంగా పరీక్షించారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష నౌకను తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. ఈ నౌక 2020 జూలైలో ఫ్లోరిడాలోని కేప్ కెనవరెల్ నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోయి 2021 ఫిబ్రవరిలో అరుణగ్రహంపై ల్యాండ్ కానుంది. ఈ రోవర్‌పై 23 కెమెరాలు, మార్స్‌పై గాలి శబ్దాలు వినేందుకు రెండు రిసీవర్లు, రసాయనిక చర్యలను విశ్లేషించేందుకు లేజర్లను వాడినట్లు డిప్యూటీ మిషన్ లీడర్ మట్ వాలేస్ తెలిపారు. క్యూరియాసిటీ రోవర్ మాదిరిగానే 6 చక్రాలను అమర్చారు. ఈ రోవర్ దాదాపు కారు పరిమాణంలో ఉంటుంది. అక్కడి ఒక్క రోజులో పూర్తిస్థాయిలో 200 గజాల స్థలాన్ని తూర్పారా పట్టే పనిని రోవర్‌కు అప్పగించారు. దీనికి చేతులు, నేలను తవ్వేందుకు డ్రిల్ అమర్చారు. ఒకప్పుడు అరుణగ్రహంపై వెచ్చటి ఉపరితల జలం, చిక్కటి వాతావరణం, దీని చుట్టూ అయస్కాంత శక్తి ఉండేదని వివరించారు. దీన్ని బట్టి ఏకకణ జీవం ఉండేదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. రోవర్ దిగే స్థలంపై పరిశోధన చేశాక ఎంపికచేశారు. ఈ స్థలంలో ఒకప్పుడు సరస్సు ఉండేదని తెలిపారు. 350 కోట్ల ఏళ్ల ఇది నదీ వ్యవస్థతో అనుసంధానమై ఉండొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ఈ రోవర్ ప్రయోగం తర్వాత ప్రతిష్టాత్మకమైన అరుణగ్రహంపైకి మానవసహిత అంతరిక్ష నౌకను పంపనున్నారు. అరుణ గ్రహంపై పరిశోధనలు చేయనున్న రోవర్ ఇదే -
అంగారకుడిపై నీటి సరస్సు
టాంపా (అమెరికా): అంగారకుడిపై తొలిసారి నీటి సరస్సు బయటపడింది. మంచు పొర కింద ఉన్న ఈ సరస్సు సుమారు 20 కి.మీ మేర విస్తరించి ఉన్నట్లు ఇటలీ పరిశోధకులు గుర్తించారు. అంగారకుడిపై నీటి జాడలు ఉన్నట్లు ఇది వరకే పలు పరిశోధనల్లో తేలినా, ఇంత పెద్ద సరస్సును కనుగొనడం ఇదే తొలిసారి. దీంతో అరుణ గ్రహంపై జీవం ఉండేందుకు అవకాశాలున్నాయన్న వాదనలకు బలం చేకూరింది. అయితే ఈ సరస్సు నీరు తాగడానికి అనుకూలం కాదని, అది మంచు పొరకింద సుమారు 1.5 కి.మీ. లోతులో ఉందని అధ్యయనకారుల బృందం వెల్లడించింది. ఈ నీటిలో జీవం ఉందా అన్నదానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
‘మామ్’కు అంతరిక్షంలో 300 రోజులు
చెన్నై: అరుణగ్రహం దిశగా నిరంతరం దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(మంగళ్యాన్-మామ్) ఉపగ్రహం అంతరిక్షంలో 300 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మామ్ అంగారకుడి కక్ష్యను చేరేందుకు మరో 22 రోజులే మిగిలి ఉంది. ప్రస్తుతం భూమికి 19.90 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న మామ్ సెకనుకు 22.33 కి.మీ. వేగంతో దూసుకెళుతోందని, ఇప్పటిదాకా మొత్తం 62.20 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. ఉపగ్రహం అన్ని రకాలుగా బాగుందని, సెప్టెంబర్ 24న మార్స్ కక్ష్యను చేరనుందని తెలిపింది. -
‘అంగారకుడి’ తొడ ఎముక కాదది.. రాయే!
న్యూయార్క్: అరుణగ్రహంపై జీవం ఆనవాళ్ల అన్వేషణలో బిజీగా ఉన్న క్యూరియాసిటీ రోవర్ ఇటీవల తీసిన ఫొటో ఇది. ఈ ఫొటోలో రాళ్లతో పాటు కనిపిస్తున్నది అంగారక మనిషి తొడ ఎముకేనని... ఒకప్పుడు మార్స్‌పై మనుషులు ఉండేవారనడానికి ఇదే ఆధారమంటూ నెట్టింట్లో ప్రచారం జోరందుకుంది. దీంతో దీనిని నిశితంగా పరిశీలించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు.. ఇది తొడ ఎముక కాదని, అలాంటి ఆకారంలోకి మారిన ఓ రాయేనని స్పష్టంచేశారు. గాలి లేదా నీటి వల్ల క్రమక్షయానికి గురైన శిల ఇలా తొడ ఎముక ఆకారంలోకి మారి ఉంటుందని వారు వెల్లడించారు. అంగారకుడిపై ఒకప్పుడు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల మనుగడకు మాత్రమే అనుకూలమైన వాతావరణం ఉండేదని, సంక్లిష్ట నిర్మాణంతో కూడిన జీవుల మనుగడకు అవసరమైన వాతావరణం అక్కడ ఎప్పుడూ ఏర్పడలేదని స్పష్టం చేశారు.