
‘అంగారకుడి’ తొడ ఎముక కాదది.. రాయే!
న్యూయార్క్: అరుణగ్రహంపై జీవం ఆనవాళ్ల అన్వేషణలో బిజీగా ఉన్న క్యూరియాసిటీ రోవర్ ఇటీవల తీసిన ఫొటో ఇది. ఈ ఫొటోలో రాళ్లతో పాటు కనిపిస్తున్నది అంగారక మనిషి తొడ ఎముకేనని... ఒకప్పుడు మార్స్‌పై మనుషులు ఉండేవారనడానికి ఇదే ఆధారమంటూ నెట్టింట్లో ప్రచారం జోరందుకుంది. దీంతో దీనిని నిశితంగా పరిశీలించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు.. ఇది తొడ ఎముక కాదని, అలాంటి ఆకారంలోకి మారిన ఓ రాయేనని స్పష్టంచేశారు.
గాలి లేదా నీటి వల్ల క్రమక్షయానికి గురైన శిల ఇలా తొడ ఎముక ఆకారంలోకి మారి ఉంటుందని వారు వెల్లడించారు. అంగారకుడిపై ఒకప్పుడు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల మనుగడకు మాత్రమే అనుకూలమైన వాతావరణం ఉండేదని, సంక్లిష్ట నిర్మాణంతో కూడిన జీవుల మనుగడకు అవసరమైన వాతావరణం అక్కడ ఎప్పుడూ ఏర్పడలేదని స్పష్టం చేశారు.