శాస్త్ర సాంకేతిక రంగాలే ప్రపంచ పురోగతికి ఆధారాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి మాత్రం జనాభా నిష్పత్తికి తగినంతగా ఉండటం లేదు. నవ సహస్రాబ్దిలో శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం కొంత పుంజుకున్నా, ఇదివరకటి శతాబ్దాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. మన దేశంలోనైతే మహిళా శాస్త్రవేత్తల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉండేది. మహిళలు చదువుకోవడమే అరుదైన ఆ కాలంలో సైతం కొందరు మహిళలు పరిస్థితులకు ఎదురీది మరీ శాస్త్రవేత్తలుగా తమ సత్తా చాటుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో వారు మైలురాళ్లలా నిలిచిపోయే విజయాలను సాధించారు. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన దేశానికి చెందిన కొందరు తొలితరం మహిళా శాస్త్రవేత్తల గురించి... ఈ ఏడాది థీమ్ విమెన్ ఇన్ సైన్స్
వైద్యంలో పట్టా సాధించిన తొలి భారతీయురాలు ఆనందీబాయి జోషి
మన దేశంలో పాశ్చాత్య విద్య ప్రాచుర్యంలోకి వస్తున్న తొలి రోజుల్లోనే వైద్యశాస్త్రంలో పట్టా సాధించిన తొలి మహిళ ఆనందీబాయి జోషి. అప్పటి బాంబే ప్రెసిడెన్సీలోని (ఇప్పటి మహారాష్ట్ర) కల్యాణ్ పట్టణంలో 1865 మార్చి 31న బతికి చెడిన భూస్వాముల కుటుంబంలో జన్మించారామె. ఆనాటి పద్ధతుల ప్రకారం ఆమెకు తొమ్మిదేళ్ల వయసులోనే తపాలా గుమస్తాగా పనిచేసే గోపాలరావు జోషితో పెళ్లి జరిగింది. గోపాలరావు జోషి మొదటి భార్య అప్పటికే మరణించింది. ఇద్దరికీ వయసులో ఇరవయ్యేళ్లకు పైనే తేడా. గోపాలరావు జోషి కొంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి కావడంతో భార్యకు చదువు చెప్పించారు. గోపాలరావు జోషికి కలకత్తా బదిలీ కావడంతో కుటుంబం అక్కడకు చేరుకుంది. పద్నాలుగేళ్ల వయసులో ఆనందీబాయి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. తగిన వైద్యం అందనందున ఆ బిడ్డ పట్టుమని పదిరోజుల్లోనే కన్నుమూయడం ఆనందీబాయిని తీవ్రంగా కలచివేసింది.
మహిళలకు ఇలాంటి దుస్థితి నుంచి తప్పించడానికి తానే స్వయంగా వైద్యశాస్త్రం అభ్యసించాలని నిశ్చయించుకుంది. ఆ కృతనిశ్చయమే ఆమెను వైద్యశాస్త్రంలో పట్టభద్రురాలైన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిపింది. ఆనందీబాయి నిశ్చయానికి భర్త ప్రోత్సాహం తోడైంది. తన భార్య వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటోందని, అందుకు తగిన సహాయం చేయమని కోరుతూ ప్రముఖ అమెరికన్ మిషనరీ రాయల్ వైల్డర్‌కు గోపాలరావు జోషి లేఖ రాశారు. వైల్డర్ ఆ లేఖను తాను నడిపే ‘ప్రిన్స్‌టన్స్ మిషనరీ రివ్యూ’ పత్రికలో ప్రచురించారు. దానిని చూసిన థియోడిషియా కార్పెంటర్ అనే సంపన్నురాలు ఆనందీబాయికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చింది. కలకత్తాలో ఉంటున్న ఆనందీబాయికి నేరుగా లేఖ రాసింది. అప్పటికి ఆనందీబాయి అనారోగ్యంతో బాధపడుతుండేది. థియోడిషియా ఆమెకు అమెరికా నుంచి మందులు కూడా పంపేది. ఈలోగా గోపాలరావుకు బెంగాల్‌లోని సీరమ్‌పూర్ బదిలీ అయింది.
పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజీకి దరఖాస్తు చేసుకోమని థియోడిషియా సూచించడంతో ఆనందీబాయి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఒక సందర్భంలో ఆనందీబాయి సీరమ్‌పూర్ కాలేజీలో ప్రసంగం చేసింది. అమెరికాలో వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటున్నానంటూ ఆమె చేసిన ప్రసంగానికి విపరీతమైన ప్రచారం వచ్చింది. ఆమె చదువు కోసం సంపన్నుల నుంచి విరాళాలు వచ్చాయి. పెన్సిల్వేనియా లోని విమెన్స్ మెడికల్ కాలేజీలో సీటు కూడా వచ్చింది. కలకత్తా నుంచి ఆనందీబాయి ఓడలో ప్రయాణించి అమెరికా చేరుకుంది. పెన్సిల్వేనియా విమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి 1886లో విజయవంతంగా ఎండీ పూర్తి చేసింది. అకుంఠిత దీక్షలో చదువులో మునిగి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఆనందీబాయికి క్షయ సోకింది. పట్టాపుచ్చుకుని ఏడాదైనా గడవక ముందే 1886 ఫిబ్రవరి 26న కన్నుమూసింది.
అమెరికా నుంచి వృక్షశాస్త్రంలో పీహెచ్‌డీ పొందిన తొలి మహిళ జానకి అమ్మాళ్
వృక్షశాస్త్రంలో చిరస్మరణీయమైన పరిశోధనలు సాగించిన జానకి అమ్మాళ్ 1897 నవంబరు 4న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలిచెర్రిలో జన్మించారు. ఆమె తండ్రి దివాన్ బహదూర్ ఇ.కె.కృష్ణన్ సబ్‌జడ్జిగా పనిచేసేవారు. తండ్రి ప్రోత్సాహంతో ఆమె ఉన్నత చదువులను కొనసాగించగలిగారు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1924లో బోటనీలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం మిషిగాన్ వెళ్లారు. అక్కడ బార్బర్ స్కాలర్‌షిప్ పొంది 1926లో బోటనీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి, మద్రాసులోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకురాలిగా పనిచేసి, పరిశోధనల కోసం మళ్లీ మిషిగాన్ చేరుకున్నారు. మిషిగాన్ వర్సిటీ నుంచి 1931లో పీహెచ్‌డీ పొందారు. అమెరికాలోనే వృక్షశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
చెరకు, వంకాయలు వంటి పంటల కణనిర్మాణంపై ఆమె చేసిన పరిశోధనలకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. తోటల్లో పెంచుకునే మొక్కలు, వర్షారణ్య వృక్షాలపై ఆమె విస్తృతంగా పరిశోధనలు సాగించి, అంతర్జాతీయంగా మన్ననలు పొందారు. మిషిగాన్ వర్సిటీ ఆమెకు 1956లో ఎల్‌ఎల్‌డీ గౌరవ పట్టాను ఇచ్చింది. భారత ప్రభుత్వం 1977లో జానకి అమ్మాళ్‌ను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. జమ్ములోని రీజియనల్ రీసెర్చ్ లాబొరేటరీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన కాలంలో 3,254 వృక్షజాతులకు చెందిన 21,500 నమూనాలపై పరిశోధనలు సాగించారు. ఆమె పరిశోధనలు జన్యుశాస్త్రం అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డాయి. ఇండియన్ సొసైటీ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాండ్ బ్రీడింగ్, బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్సెస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు అధ్యక్ష పదవిలో కొనసాగిన తొలి మహిళగా కూడా జానకి అమ్మాళ్ అరుదైన చరిత్ర సృష్టించారు. అనారోగ్యంతో ఆమె 1984 ఫిబ్రవరి 7న మద్రాసులో కన్నుమూశారు.
సైన్స్‌లో డాక్టరేట్ సాధించిన తొలి భారతీయురాలు అసీమా ఛటర్జీ
బ్రిటిష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ అసీమా ఛటర్జీ. ఆమె కలకత్తాలో 1917 సెప్టెంబరు 23న జన్మించారు. ఆమె తండ్రి నారాయణ ముఖర్జీ కలకత్తాలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేసేవారు. ఆధునిక భావాలు గల ఆయన కుమార్తెను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో అసీమా కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీ నుంచి 1936లో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ సాధించారు. తర్వాత 1938లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ‘ఫైటోమెడిసిన్స్’పై ఆమె సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి కలకత్తా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. ఆమె పరిశోధన ఫలితంగా మూర్ఛ వ్యాధిని, మలేరియాను నయం చేసే మందుల తయారీకి, కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమోథెరపీ మందుల తయారీకి మార్గం సుగమమైంది.
కలకత్తా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తయ్యాక ఆమె అమెరికా వెళ్లి విస్కాన్సిన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో పరిశోధనలు సాగించారు. కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని లేడీ బ్రాబర్న్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగాన్ని స్థాపించిన ఘనత అసీమాకే దక్కుతుంది. పలు శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహించిన అసీమా, 1982–90 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా కూడా కొనసాగారు. భారత ప్రభుత్వం ఆమె విశిష్ట సేవలకు గుర్తింపుగా 1975లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళా శాస్త్రవేత్తగా ఆమె సాధించిన ఘనత చరిత్రలో నిలిచిపోతుంది.
రామన్‌పైనే సత్యాగ్రహం ప్రకటించిన ధీర కమలా సోహనీ
శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళల పట్ల వివక్ష ఈనాటిది కాదు. తొలి రోజుల్లో వివక్ష మరింత ఎక్కువగా ఉండేది. కేవలం మహిళ అయిన కారణంగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుకు నిరాకరణ ఎదురైంది. ఆమె దరఖాస్తును తోసిపుచ్చినది ఎవరో కాదు, అప్పట్లో ఆ సంస్థ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ‘నోబెల్’ గ్రహీత సీవీ రామన్. మహిళలు శాస్త్ర పరిశోధనను కొనసాగించలేరంటూ ఆమె దరఖాస్తును రామన్ తోసిపుచ్చారు. పరిశోధన సాగించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలా సోహనీ ఈ తిరస్కారాన్ని తేలికగా తీసుకోలేదు. రామన్ నిర్ణయానికి నిరసనగా సత్యగ్రాహం చేపట్టింది. దెబ్బకు రామన్ దిగివచ్చి, ఆమెను రీసెర్చ్ ఫెలోగా చేర్చుకోక తప్పలేదు. కమలా సోహనీ మధ్యప్రదేశ్‌లోని (అప్పటి సెంట్రల్ ప్రావిన్స్) ఇండోర్‌లో 1912 సెప్టెంబర్ 14న జన్మించారు.
ఆమె తండ్రి నారాయణరావు భగవత్, పినతండ్రి మాధవరావు భగవత్– ఇద్దరూ రసాయనిక శాస్త్రవేత్తలే! వారిద్దరూ బెంగళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పట్టభద్రులు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్స్ తర్వాతి కాలంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌గా (ఐఐఎస్సీ) మారింది. ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు కమలా సోహనీ బాంబే యూనివర్సిటీ నుంచి 1933లో కెమిస్ట్రీ ప్రధానాంశంగా, ఫిజిక్స్ ద్వితీయాంశంగా బీఎస్సీ, 1936లో కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ డిస్టింక్షన్‌తో పూర్తి చేశారు. కమలా సోహనీ పోరాట ఫలితంగా ఐఐఎస్సీలో మహిళల ప్రవేశానికి 1937 నుంచి మార్గం ఏర్పడింది. ఐఐఎస్సీలో శ్రీనివాసయ్య మార్గదర్శకత్వంలో కమలా సోహనీ పాలు, పప్పుధాన్యాలు, గింజధాన్యాల్లోని ప్రొటీన్లపై పరిశోధన సాగించారు. ఆమె పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో కేంబ్రిడ్జి వర్సిటీ పరిశోధనలు కొనసాగించడానికి ఆమెను ఆహ్వానించింది.
అక్కడ ఆమె ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ హిల్ నేతృత్వంలో పద్నాలుగు నెలల్లో పరిశోధన పూర్తి చేసి, సమర్పించిన కేవలం 40 పేజీల సిద్ధాంత వ్యాసానికి పీహెచ్‌డీ లభించింది. డాక్టరేట్ పూర్తయిన వెంటనే 1939లో ఆమె స్వదేశానికి వచ్చారు. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగా నియమితులయ్యారు. తాజా తాటికల్లు (నీరా) పోషక విలువలపై ఆమె జరిపిన పరిశోధన భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు నీరా ఇవ్వవచ్చని, నీరాను తాటిబెల్లంగా తయారు చేసినట్లయితే, పోషక విలువలను ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చని ఆమె నిరూపించారు. ‘నీరా’పై పరిశోధన చేసినందుకు ఆమెకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 1998లో ఆమెను ఘనంగా సత్కరిస్తుండగా వేదికపైనే కుప్పకూలిపోయిన ఆమె కొద్ది రోజుల్లోనే కన్ను మూశారు.
దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి
దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్తగా ఉన్నత స్థాయికి చేరుకున్న అన్నా మణి మద్రాసు ప్రెసిడెన్సీలోని రామనాథపురం జిల్లా పారంకుడిలో 1918 ఆగస్టు 23న జన్మించారు. ఆమె తండ్రి సివిల్ ఇంజనీరు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు, కళలపై అన్నా మణికి విపరీతమైన ఆసక్తి ఉండేది. ఎనిమిదో పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆమెకు వజ్రాల చెవిరింగులు బహుమతిగా కొని తేవడానికి తండ్రి బజారుకు వెళ్లడానికి సిద్ధపడుతుంటే, తనకు వజ్రాల రింగులు వద్దని, వాటికి బదులు ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా’ కావాలని కోరింది. బాల్యంలో ఆమెకు నాట్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. నర్తకి కావాలనుకుంది కూడా. కాలేజీలో చేరిన తర్వాత మాత్రం నాట్యం బదులు పరిశోధనల్లోనే తన భవితవ్యాన్ని తీర్చిదిద్దుకుంది. మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజీ నుంచి 1939లో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేసింది.
మరుసటి ఏడాదే ఆమెకు పరిశోధనలు కొనసాగించడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్కాలర్‌షిప్ లభించింది. అక్కడ ప్రొఫెసర్ సాల్మన్ పాపయ్య మార్గదర్శకత్వంలో వజ్రాలు, కెంపులకు గల కాంతిపరావర్తన లక్షణాలపై పరిశోధన సాగించి, పీహెచ్‌డీ కోసం సిద్ధాంత వ్యాసం సమర్పించారు. అయితే, ఆమె అప్పటికి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయనందున ఆమెకు పీహెచ్‌డీ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం ఆమె లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చేరారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు సాగించాలనే లక్ష్యంతో వెళ్లిన ఆమె చివరకు వాతావరణ శాస్త్ర పరిశోధకురాలిగా తేలారు. స్వదేశానికి 1948లో తిరిగి వచ్చాక, పుణేలోని వాతావరణ శాఖ కార్యాలయంలో చేరారు. వాతావరణ పరికరాలపై ఆమె అసంఖ్యాకమైన పరిశోధన పత్రాలను సమర్పించారు.
చాలా పరికరాలను ఆమె ప్రామాణీకరించారు. పుణేలో ఆమె ఐదేళ్ల వ్యవధిలోనే వాతావరణ విభాగాధిపతి స్థాయికి ఎదిగారు. ఆమె కింద 121 మంది పురుషులు సిబ్బందిగా పనిచేసేవారు. తర్వాత ఆమె 1968లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతిపై ఢిల్లీ బదిలీ అయ్యారు. కొంతకాలం ఈజిప్టులో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) కన్సల్టంట్‌గా పనిచేశారు. జీవితాంతం పరిశోధనలకే అంకితమైన ఆమె వివాహం చేసుకోలేదు. 1994లో పక్షవాతం బారినపడిన ఆమె 2001లో కన్నుమూశారు. సూర్యరశ్మి నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావంపై ఆమె జరిపిన పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు దక్కాయి. ఆమె శత జయంతి సందర్భంగా 2018లో డబ్ల్యూఎంవో తన జర్నల్‌లో ఆమె సంక్షిప్త జీవిత చరిత్రను, ఇంటర్వ్యూను ప్రచురించింది.
ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టు రూపాబాయి ఫర్దూన్జీ
రూపాబాయి ఫర్దూన్జీ హైదరాబాద్‌లోని ఒక పార్శీ కుటుంబంలో పుట్టారు. ఆమె జనన మరణ వివరాలేవీ తెలియవు గాని, నాటి హైదరాబాద్ మెడికల్ కాలేజీలో (ఇప్పటి ఉస్మానియా మెడికల్ కాలేజీ) 1885లో చేరిన ఐదుగురు మహిళా విద్యార్థుల్లో ఆమె ఒకరు. హైదరాబాద్ మెడికల్ కాలేజీ నుంచి ‘హకీం’ పట్టా తీసుకున్నాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ హాస్పిటల్‌లో పాశ్చాత్య వైద్యంలో డిగ్రీ కోసం చేరారు. అప్పట్లో అమెరికా, ఇంగ్లాండ్‌లలో సైతం చాలా వైద్య కళాశాలలు మహిళలకు ప్రవేశం కల్పించేవి కావు. మహిళలకు ప్రవేశం కల్పించే అతి కొద్ది సంస్థల్లో బాల్టిమోర్‌లోని జాన్స్‌హాప్‌కిన్స్ హాస్పిటల్ ఒకటి. బాల్టిమోర్‌లో చదువు పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని తొలి రెండు క్లోరోఫామ్ కమిషన్లలో (1888, 1891) కీలక పాత్ర పోషించారు.
తర్వాత 1909లో స్కాట్లాండ్ వెళ్లి, అక్కడ ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో చేరారు. అప్పటికి అనెస్థీషియాలో ఏ యూనివర్సిటీలోనూ స్పెషలైజేషన్ కోర్సులు లేవు. అయినా ఆమె ఒకవైపు అనెస్థెటిక్స్‌లో పరిశోధనలు సాగిస్తూనే, మరోవైపు ఎడిన్‌బర్గ్ వర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీలలో డిప్లొమాలు పూర్తి చేశారు. అనెస్థెటిక్స్‌లో అనుభవజ్ఞానం ఉన్నవారి సేవలను శస్త్రవైద్యులు తమకు అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకునేవారు. అలా రూపాబాయి ఫర్దూన్జీ కూడా పలువురు శస్త్రవైద్యులకు అనెస్థటిస్టుగా సేవలందించారు. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టుగా గుర్తింపు పొందారు. ఎడిన్‌బర్గ్‌లో పరిశోధనలు పూర్తయ్యాక ఆమె స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి, 1920లో రిటైరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment