దేశంలోని ఊళ్లన్నీ కాస్త హెచ్చుతగ్గులుగా దాదాపు ఒకేలా ఉంటాయి. ఇళ్లూ వాకిళ్లూ పొలాలూ పశువులూ, అరకొర సౌకర్యాలు, ఇక్కట్లతో ఈదులాడే జనాలు దాదాపు అన్ని ఊళ్లలోనూ ఉంటారు. అరుదుగా కొన్ని ఊళ్లు మాత్రం మిగిలిన ఊళ్లకు భిన్నంగా ఉంటాయి. కొన్ని ఊళ్లు వాటి వింతలు విడ్డూరాలతో మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉంటాయి.
ఇంకొన్ని ఊళ్లు పట్టణాలను తలదన్నే అభివృద్ధి సాధించి, అందరినీ అవాక్కయ్యేలా చేస్తాయి. ఏదో ఒక రీతిలో ప్రత్యేకత నిలుపుకొనే ఇలాంటి ఊళ్లే వార్తలకెక్కి, విస్తృత ప్రచారం పొందుతాయి. ఇలాంటి ఊళ్లు ప్రపంచంలోని అక్కడక్కడా ఉన్నాయి. అలాగే మన దేశంలోనూ కొన్ని వింత వింతల ఊళ్లు ఉన్నాయి. మన దేశంలో ఉన్న కొన్ని వింత వింతల ఊళ్ల కథా కమామిషూ తెలుసుకుందాం...
ప్రాచీన జీవనశైలి
కాలంతో పాటే లోకం ముందుకు పోతుంది. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వసతులను అందిపుచ్చుకుంటుంది. కాల గమనంలో ఇది సహజ పరిణామం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కొత్త కొత్త ఆవిష్కరణలను మానవాళికి అందిస్తూనే ఉంటుంది. శాస్త్ర సాంకేతిక పురోగతి ఫలితంగా కొత్త కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక, పాతవాటి వినియోగం క్రమంగా కనుమరుగవుతుంది. కాలంతో కలసి ముందుకు పయనించడమే మానవ స్వభావం.
అందుకు భిన్నంగా వెనుకటి కాలానికి వెళ్లి ఎవరైనా జీవించాలనుకుంటే, అది కచ్చితంగా విడ్డూరమే! అలాంటి విడ్డూరం కారణంగానే శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం ఇటీవల విస్తృతంగా వార్తలకెక్కింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ గ్రామం గురించి, అక్కడి జనాలు స్వచ్ఛందంగా అనుసరిస్తున్న ప్రాచీన జీవనశైలి గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఫలితంగా దేశ విదేశాలకు చెందిన కొందరు సంపన్నులు కూర్మ గ్రామంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎగబడుతున్నారు.
కూర్మ గ్రామంలో ఇళ్ల నిర్మాణం కూడా ప్రాచీన పద్ధతిలోనే ఉంటుంది. ఈ ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, కాంక్రీటు వాడరు. ఇక్కడివన్నీ సున్నం, బెల్లం, మినుములు, మెంతులు, కరక్కాయలు, గుగ్గిలం మిశ్రమంతో నిర్మించుకున్న మట్టి ఇళ్లే! ఈ గ్రామంలో విద్యుత్తు ఉండదు. విద్యుత్తుతో పనిచేసే ఏ వస్తువూ ఇక్కడ కనిపించదు. ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్‌నెస్’ (ఇస్కాన్) ఆధ్వర్యంలో దాదాపు ఐదేళ్ల కిందట ఇక్కడ గ్రామాన్ని నెలకొల్పుకున్నారు.
వేకువ జామున నాలుగు గంటలకే నిద్రలేవడం, ‘హరేకృష్ణ’ నామ కీర్తన సాగిస్తూ ఊరంతా పదహారుసార్లు తిరగడం, ఆధ్యాత్మిక సాధన, వేదాధ్యయనం చేయడం, పాత పద్ధతుల్లోనే వ్యవసాయం ద్వారా గ్రామానికి అవసరమైన పంటలు పండించు కోవడం వంటి జీవనశైలి ఈ గ్రామాన్ని వార్తల్లో నిలిపింది. ఇక్కడ పన్నెండు కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ నడిపే గురుకులంలో పదహారుమంది విద్యార్థులు వేదాభ్యాసం చేస్తున్నారు.
మరో ఆరుగురు బ్రహ్మచారులను కలుపు కొని ఈ గ్రామ జనాభా యాభైఆరు మంది. వీరంతా తమ ఇళ్లను తామే స్వయంగా నిర్మించుకుంటారు. తమ దుస్తులను తామే నేసుకుంటారు. ఈ గ్రామాన్ని తిలకించడానికి విదేశీయులు కూడా వస్తుంటారు. జీవితాలను యాంత్రికంగా మార్చేసిన అధునాతన సాంకేతికత కంటే, ఇక్కడి ప్రాచీనమైన గ్రామీణ జీవనశైలి ఎంతో హాయిగా ఉంటుందని పలువురు చెబుతుండటం విశేషం.
సంస్కృతమే వారి భాష
ప్రాచీన భాష అయిన సంస్కృతం మృతభాషగా మారిందని ఆధునికులు చాలామంది తీసిపారేస్తున్నా, ఆ గ్రామ ప్రజలు మాత్రం సంస్కృతాన్ని ఇప్పటికీ సజీవంగా బతికించుకుంటున్నారు. దేశంలోనే ఏకైక సంస్కృత గ్రామంగా పేరుపొందిన మత్తూరు గ్రామం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంది. ఇక్కడి ప్రజలు సంస్కృతాన్ని తమ మాతృభాషగా మార్చుకుని, ఇప్పటికీ దాన్ని కాపాడుకుంటున్నారు. పిల్లలూ పెద్దలూ అందరూ ఇక్కడ సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. మత్తూరు సంస్కృత గ్రామంగా మారడానికి వెనుక నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది.
‘సంస్కృత భారతి’ సంస్థ ఈ గ్రామంలో 1981లో సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించింది. దీనికి హాజరైన ఉడిపి పెజావర మఠాధిపతి సంస్కృతం పట్ల గ్రామస్థుల ఆసక్తిని గమనించి, ఈ గ్రామాన్ని సంస్కృత గ్రామంగా తీర్చిదిద్దితే బాగుంటుందని చెప్పడంతో గ్రామస్థులు ఆ ఆలోచనను స్వాగతించారు. నాటి నుంచి సంస్కృతాన్ని తమ మాతృభాషగా మార్చుకున్నారు. సంస్కృతాన్ని మాతృభాషగా చేసుకున్నప్పటికీ ఈ గ్రామస్థులు ఆధునికతకేమీ దూరం కాలేదు. ఇక్కడి నుంచి ఉన్నత చదువులు చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడినవారూ ఉన్నారు. సంస్కృతంపై ఆసక్తిగల వారెవరికైనా ఆ భాషను నేర్పడానికి వీరు నిత్యం సంసిద్ధంగా ఉంటారు.
పక్షులే నేస్తాలు
ఆ ఊరి ప్రజలకు పక్షులే నేస్తాలు. ఏటా నవంబర్ నుంచి జూలై మధ్య కాలంలో ఆ ఊళ్లో పక్షుల సందడి కనిపిస్తుంది. దేశ దేశాలు దాటి వచ్చే పక్షులు చనువుగా మనుషుల భుజాల మీద వాలే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ ఊరు కొక్కరెబెళ్లూరు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. వలసపక్షుల సీజన్‌లో ఇక్కడకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. శతాబ్దాలుగా ఇక్కడకు వలస పక్షులు వస్తున్నా, ఇక్కడి మనుషులు వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు.
సీజన్‌లో వచ్చే వలస పక్షులు యథేచ్ఛగా చెట్లపై గూళ్లు పెట్టుకునేవి. ఒక్కోసారి వేగంగా గాలులు వీచేటప్పుడు గూళ్లు నేల రాలేవి. వాటిలో పక్షులు పెట్టుకున్న గుడ్లు పగిలిపోయేవి. ఇంకా రెక్కలురాని పక్షిపిల్లలు పిల్లులకు, కుక్కలకు ఆహారంగా మారేవి. ‘మైసూర్ అమెచ్యూర్ నేచురలిస్ట్స్’ వ్యవస్థాపకుడు మను 1994లో ఇక్కడకు వచ్చినప్పుడు ఈ దయనీయమైన పరిస్థితిని గమనించారు.
పక్షుల రక్షణ కోసం గ్రామస్థులు చొరవ తీసుకుంటే బాగుంటుందనుకుని, వారితో చర్చించారు. గ్రామంలో ‘హెజ్జర్లె బళిగె’ (కొంగలతో నేస్తం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థులంతా ఇందులో భాగస్వాములయ్యారు. అప్పటి నుంచి ఈ గ్రామస్థులకు ఇక్కడకు వచ్చే వలసపక్షులతో స్నేహం మొదలైంది. అవి ఇక్కడ పెట్టుకునే గూళ్లు, వాటిలోని గుడ్లు, పక్షిపిల్లలు సురక్షితంగా ఉండేందుకు అన్ని సేవలూ చేస్తారు. అందుకే వలసపక్షులు ఈ గ్రామస్థులతో చాలా చనువుగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment