అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ!
మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు!
దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి.
ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్.
ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు.
అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది.
ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన!
జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు!
∙∙
మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!!
రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు.
‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్‌కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం.
అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు.
‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్‌కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు.
ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు.
ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి.
ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది.
‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు.
∙∙
మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది.
తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు.
మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది.
జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా.
చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్‌కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది.
‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా!
అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు.
చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు.
అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్.
కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే!
∙∙
ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు.
అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు.
గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు.
ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి!
అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ..
‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు!
ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు!
ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి.
ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్‌కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ
‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు!
మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ!
∙∙
ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు.
అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు.
వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు.
∙∙
రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు.
ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు.
ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా.
∙∙
అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్‌కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని.
‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు.
‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్.
‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’
‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’
‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’
‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’
‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’
‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’
‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’
∙∙
సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు.
∙∙
స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్‌ను.
‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా.
‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’
ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్.
‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’
‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’
‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’
‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’
‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’
‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’
‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’
అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది.
ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది.
("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!)
— కృపాకర్ పోతుల
Comments
Please login to add a commentAdd a comment