స్పూర్తిదాయకమైన కథ
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు.
నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు.
ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు.
పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు.
‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ
Comments
Please login to add a commentAdd a comment