ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి జాలి, కరుణ, దయ అనేవి లేవు. చిన్న చిన్న శాకాహార జంతువులను సైతం చంపి తినేది. పులికి బద్ధకం కూడా ఎక్కువే. ఆహారం కోసం పెద్ద పెద్ద జంతువులను వేటాడి చంపి తినటం దానికి అంతగా ఇష్టంలేదు. సులువుగా దొరికే కుందేళ్లను చంపి తినేది. దాంతో.. ఆ అడవిలో కుందేళ్ల సంఖ్య తగ్గిపోసాగింది. ఆ అడవిలో కుందేళ్లన్నీ వాటి నాయకుడిని కలిసి పులి బారి నుంచి కాపాడమన్నాయి. కుందేళ్ల నాయకుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ‘మనం నీడని చూసి భయపడకూడదు. దగ్గరలో వెలుగుంటేనే నీడలుంటాయి.
పులి ఇలా రెచ్చిపోయి మన సంతతిని నాశనం చేస్తుందంటే దానికి పోయేకాలం దగ్గర పడిందని నాకనిపిస్తోంది’ అంటూ ధైర్యం చెప్పాడు.
మరుసటి రోజు ఆ అడవి మార్గం గుండా ఒక ఇంద్రజాలికుడు గుర్రపు బండిలో ప్రయాణించసాగాడు. గుర్రాన్ని చూసి పులి దూరం నుంచి∙పెద్దగా గాండ్రించింది. దాంతో.. ఆ గుర్రం అడ్డదిడ్డంగా అడవిలో పరుగు లంకించుకుంది. బండి నుంచి గుర్రం విడిపోయింది. ఇంద్రజాలికుడు ప్రాణ భయంతో ఎటో పరుగుతీశాడు. అతడు ప్రదర్శనకు ఉపయోగించే సామాగ్రిలోంచి ఒక కుందేలు పిల్ల బయటకు వచ్చింది. అది భయంతో తుర్రున పొదల్లోకి దూరింది.
పొదల్లో భయంతో వణుకుతున్న కుందేలును కుందేళ్ల నాయకుడు చేరదీశాడు. ‘నాయకా! నేను ఎంతో కాలంగా ఇంద్రజాలికుడి వద్ద ఉండటంతో నాకు ఇంద్రజాల విద్యంతా తెలుసు. అతడు తన శిష్యులకు ఇంద్రజాల విద్య నేర్పించేటప్పుడు నేను చూసి కొంత నేర్చుకున్నాను. నన్ను మీ జట్టులో చేర్చుకోండి. నా మంత్ర విద్యతో మిమ్మల్ని వినోదపరుస్తాను’ అంది కుందేలు పిల్ల.
‘అయ్యో! వినోదం సంగతి దేముడెరుగు! అసలు క్షణక్షణం భయంతో కాలం గడుపుతున్నాము. పులి సంగతి నీకు తెలీదు. అది చిన్ని చిన్ని పసికూనలను సైతం మింగేసి ఆకలి తీర్చుకుంటోంది. దాంతో మనజాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. నువ్వు ఈ అడవిలో ఉండటం ప్రమాదం!’ అన్నాడు కుందేళ్ల నాయకుడు. కానీ కుందేలు పిల్ల అక్కడి నుంచి కదలలేదు. తన జాతి సంతతిని అంతం చేస్తున్న పులిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఆ పులిని తను అంతం చేస్తానని నాయకుడికి చెప్పింది.
మరుసటిరోజు ఉదయం కుందేలు పిల్ల తనకు తెలిసిన ఇంద్రజాల విద్యలను తన మిత్రుల ముందు ప్రదర్శిస్తూ వాటిని వినోదపరిచింది. ఇంతలో వాటికి దూరంగా పులి గాడ్రింపు వినిపించింది. ‘బాబోయ్! పులి వస్తుంది! పారిపోయి దాక్కోండి!’ పెద్దగా అరిచింది ఒక కుందేలు. వెంటనే మిగిలిన కుందేళ్లన్నీ పొదల్లో దాక్కున్నాయి. కానీ ఈ కుందేలు పిల్ల మాత్రం ధైర్యంగా అక్కడే నిలుచుంది.
‘మిత్రమా! ఆ పులి సంగతి నీకు తెలీదు. పారిపో!’ అంటూ అరిచాయి. కుందేళ్లన్నీ. అయినా అది కదలలేదు. ‘ఓసేయ్.. నీకెంత ధైర్యమే! నేను వస్తున్నా పారిపోలేదు. ఇదిగో నిన్ను ఇప్పుడే లటుక్కున చప్పరిస్తా!’ అంటూ చెయ్యి ముందుకు చాపింది పులి.
‘ఆగక్కడ! నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ అడవిని వదలి పారిపో!’ అని అరిచింది కుందేలు పిల్ల. ఆ మాటకు పులి బిత్తరపోయింది. కుందేలు తన మంత్రదండం తీసుకుంది. కుందేలు ఏం చేస్తుందో పులికి అర్థం కాలేదు. పులి తిరిగి పెద్దగా గాండ్రించింది. ‘ఛూ.. మంతర్’ అంటూ మంత్ర దండాన్ని పులి ముఖం చుట్టూ తిప్పింది. ‘నువ్వు నన్నేమీ చేయలేవు. నీకు శక్తి లేదు. నువ్వు గాఢంగా నిద్ర పోతున్నావ్.. నిద్ర పోతున్నావ్.. పోతున్నావ్!’ అంది కుందేలు పిల్ల. కండ్లు తిరిగి పులి కింద పడిపోయింది.
వెంటనే కుందేళ్లన్నీ పులిని మర్రి ఊడలతో బంధించి చెట్టుకు కట్టేశాయి. కొంతసేపటికి పులి తేరుకుంది. కండ్లు తెరిచి చూసి భయపడింది. ఏం జరిగిందో దానికి అర్థంకాలేదు. దాని కాళ్ళు, చేతులు మర్రి ఊడలతో కట్టేసి ఉండటంతో అది ఆహారం తెచ్చుకోలేకపోయింది. తిండి తిప్పలు లేక నీరసించి పోయింది. అటుగా వెళుతున్న నక్క, తోడేలు నీరసించి ఉన్న పులిని చూసి లొట్టలేశాయి, నాలుక చప్పరించాయి. ఇక ఆ అడవిలో పులిబాధ తప్పింది. కుందేలు పిల్లను జంతువులన్నీ అభినందించాయి. –పైడిమర్రి రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment