చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’? | Sakshi
Sakshi News home page

Funday Story: చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?

Published Sun, Apr 28 2024 11:25 AM

Funday Book Sunday Weekly Chinnamma Katha Written By Uma Mahesh Achalla

పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.

‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ.  ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి.
      ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ.

      అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్‌ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి,  చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్‌ కొట్టి వచ్చింది చిన్న.

‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. 
       ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్‌ లాగింది లక్ష్మి కూర్చోమని.
 ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి  కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. 
      ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’
‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. 
      ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె  వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా.

      ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. 
‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ.
      ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్‌’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.
‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.

గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె  ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. 
      ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి.  ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి  వెళ్ళింది.

      ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. 
‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు.
      ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.
‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా.
      ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్‌ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.
‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్‌’అన్నాడు ఉక్రోషంగా.
      ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి  ప్రేమగా చూస్తూ. 
‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. 
      ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్‌ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్‌ స్టడీస్‌కి’ అంది.

‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’
      ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్‌లో ఏదో డౌట్‌ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’
‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్‌ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. 
      ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. 
‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. 
      ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్‌. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా.  
‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా.
      ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.

‘ష్‌! మీ అమ్మగారు వింటారు..’
‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ 
ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న.
      ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.
‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది.
      ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.

‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు.
      ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్‌ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు.
      ‘గవర్నమెంట్‌ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్‌ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.

అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు.
      సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. 
‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ.
      ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.

‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, 
‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్‌ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.

అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్‌ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.

‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని  ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.

‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్‌ హ్యాండ్‌ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు.
      ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ!

      ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.
‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న.
      ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్‌ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్‌ ఆఫ్‌ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.
ఉసూరుమంటూ ఫోన్‌ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్‌ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న.
      ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.
‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్‌ కదా!’ అడిగింది  చిన్న. 
      ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. 
‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.

ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది.
      ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.
‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ.
      ‘హా’ అంటూ నంబర్‌ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్‌లో షేర్‌ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.

‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ.
      మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్‌ ముక్క, ఓ యాపిల్‌ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి  ఫోను
       ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.

అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం  ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్‌ పెళ్ళి.

మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి  నేను ఫోన్‌ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్‌ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్‌ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.
అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి  కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్‌ ఆచాళ్ళ

Advertisement
Advertisement